Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    కాంగ్రెసువారు ప్రభుత్వపు దమన నీతిని ఎదిరించడానికి నిర్ణయించారు. ఒక నెల తరువాత ప్రొవిజనల్ కమిటీని రద్దు చేసి ఆక్షన్ కమిటీ ఏర్పరచారు. కార్యాచరణ  సమితివారు ప్రభుత్వాన్ని సత్యాగ్రహం ద్వారా ఎదిరించాలని నిర్ణయించారు. తొలి బృందంలో 1. రావి నారాయణరెడ్డి , 2. బూర్గుల రామకృష్ణరావు, 3. కాశీనాథరావు వైద్య, 4. జనార్ధనరావు దేశాయ్, 5. సిరాజుల్ హసన్ తిరంజీ, 6. రామకృష్ణధూత్, 7. గోవిందరావు నానల్ ను పంపడానికి నిశ్చయించారు.

 

    వయోవృద్ధుడు గోవిందరావు నానల్ ను తొలి కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.

 

    చివరి నిముషంలో కుటుంబ కారణాల వల్ల సిరాజుల్ హసన్ తిరంజీ విరమించుకున్నారు.

 

    24 అక్టోబర్ 1938న గోవిందరావు నానల్ నాయకత్వాన అయిదుగురు సత్యాగ్రహుల బృందం - వేలమంది ప్రజల ఎదుట అరెస్టయింది.

 

    రామానంద తీర్థ డిక్టేటర్ గా మరొక బృందం సత్యాగ్రహం చేసింది. ఈ బృందంలో వందల మంది పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలు రెపరెపలాడగా - వందేమాతరం నినాదాలు ప్రతిధ్వనించగా అశేష ప్రజానీకంముందు సత్యాగ్రహులు అరెస్టయ్యారు.

 

    "యువకులారా! నిరంకుశత్వాన్ని ఎదిరించడం భగవదారాధనతో సమానం. ఈ జ్వాలను ఆరనివ్వద్దు. మేము తరలినంతమాత్రాన ఈ పని ఆగరాదు" అని రామానంద తీర్థ ఆవేశపూరితమైన ఉపన్యాసం ఇచ్చారు.

 

    అది నిప్పురవ్వలా పని చేసింది. జనం చేసిన వందేమాతరం నినాదంతో దిక్కులు పిక్కటిల్లాయి. నిజాం పోలీసు - తొలిసారి - ప్రజా సందోహంమీద విరుచుకు పడక, మిన్నకున్నది!

 

    ఇది ప్రజల్లో చైతన్యాన్నీ - ప్రభుత్వానికి నిరాశనూ కలిగించాయి.

 

    రాజ్యం నలుమూలలనుండీ ప్రతిరోజూ సత్యాగ్రహులు అరెస్టు కావడం ప్రారంభం అయింది. ప్రభుత్వం బెంబేలెత్తుతున్న సమయంలో ఆర్యసమాజం - హిందూమహసభ గారి చర్య నిజాం ప్రభుత్వానికి తోడ్పడింది.

 

    జరిగిందేమంటే కాంగ్రెస్ సత్యాగ్రహం ఊపందుకొంటున్న వేళ ఆర్యసమాజం - హిందూమహసభ కూడా సత్యాగ్రహానికి పూనుకున్నాయి. వారు సత్యాగ్రహులను బయటనుంచి తెచ్చారు. ఆ విధంగా చేసి - ప్రభుత్వం దీనికి మతపు రంగు పులుమడానికి అవకాశం కలిగించారు.

 

    హైదరాబాదు రాజకీయాలు అంటరానివిగా భావించిన హైదరాబాదు నివాసి - జాతీయ నాయకురాలు సరోజినీ నాయడుకు ప్రధాని సర్ అక్బర్ హైదరీతో సన్నిహిత పరిచయాలున్నాయి. ప్రధాని ఆ పరిచయాలను వాడుకున్నారు. సరోజినీదేవి ద్వారా గాంధీజీకి సత్యాగ్రహం మతపరమవుతున్న విషయం తెలియపరచారు. సహజంగా మతపర ఉద్యమాన్ని మహాత్ముడు సహించరు. అదీకాక సాక్షాత్తు సరోజినీదేవి తెలియపరచడం దానికి మరింత బలం చేకూరింది. అదీకాక అక్బర్ హైదరీకి మహాత్మునితో పరిచయాలున్నాయి.

 

    వీటిని అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మహాత్ముడు కాంగ్రెస్ నాయకులను వార్ధాకు పిలిపించారు. సత్యాగ్రహం మతపరం కావడాన్ని సహించని మహాత్ముడు హైదరాబాదులో సత్యాగ్రహం విరమించవలసిందిగా ఆదేశించారు!

 

    మహాత్ముని ఆదేశానుసారం 24 డిసెంబరు 1938న సత్యాగ్రహం విరమించడం జరిగింది.

 

    "గాంధీజీ ఆదేశం యువకులమైన మాకేమాత్రం నచ్చలేదు. సత్యాగ్రహాన్ని మేము విరమిస్తే, అస్త్రసన్యాసం చేసి ఉద్యమాన్ని మతతత్వవాదుల చేతపెట్టినట్లవుతుందని మేమంతా అభిప్రాయపడ్డాము. కానీ గాంధీజీ ఆదేశాన్ని ఎదిరించే ధైర్యం ఆ రోజుల్లో ఎవరికున్నది?" అన్నారు రావి నారాయణరెడ్డిగారు.

 

    మహాత్మునిమీద అచంచల విశ్వాసంగలవాళ్లలో నేనొకణ్ణి. అయితే వాల్మీకి అన్నట్లు "వ కశ్చిన్నాపరాధ్యతి?" - తప్పు చేయనివాడెవడు? మహాత్ముడే తాను హిమాలయం అంత తప్పు చేశానని అంగీకరించారు.

 

    నావరకు సత్యాగ్రహం విరమింప చేయడంలో గాంధీజీ నిజాం ప్రభుత్వ కుట్రను గమనించలేకపోయారని అనిపిస్తుంది. అది వాస్తవం కాకపోవచ్చు. కాని, ఎదుగుతున్న పోరాటాన్ని నిలిపినందుకు అలా అనిపిస్తుంది. చౌరా చౌరీ ఉదంతం తరువాత మహాత్ముడు సరిగ్గా ఇలాగే ఉద్యమం విరమించారు. అప్పుడు మోతీలాల్ నెహ్రూ చాల కటువుగా మహాత్మునికి వ్రాశారు.

 

    ఇది పోరాటం నిలిచిపోయిందని బాధ మాత్రమే! మహాత్ముని నిర్ణయాన్ని సంశయించడం - శంకించడం మాత్రం కాదు. మహాత్ముని వంటివారు ధరిత్రిమీద అరుదుగా అవతరిస్తారు.

 

    స్టేట్ కాంగ్రెస్ నిషేధం విషయంలో మహాత్మునికీ అక్బర్ హైదరీకి సుదీర్ఘం అయిన పత్రవ్యవహారం జరిగింది. కాంగ్రెస్ మీద నిషేధం తొలగలేదు. కాని, కాంగ్రెస్ సత్యాగ్రహులను 10 ఏప్రెల్ 1939లో బేషరతుగా విడుదల చేయడం జరిగింది.

 

    ఇది నిజాం రాజ్యంలో తొలి రాజకీయపోరాటం.   

 

    వందేమాతరం:

 

    బ్రిటిషువారు భారతదేశంలో కలకత్తాను రాజధానిగా చేసుకున్నారు. పాశ్చాత్యుల ఉదారవాద విధానంవల్ల సంస్కారవాదం, ప్రజాస్వామ్యం, విప్లవవాదం తొలిసారిగా బెంగాల్లో మొదలయినాయి. ఉద్యమాలు సాగాయి.

 

    స్వాతంత్ర్యకాంక్ష బెంగాలు రచయితల్లోకూడా పెల్లుబికింది. బంకించంద్ర చటోపాధ్యాయ "ఆనందమఠం" అనే నవల వ్రాశాడు. అందులో "వందేమాతరం" గీతం ఉంది. దాని అర్థం మాతృభూమికి వందనం మాత్రమే! కాని, అది దేశభక్తి చిహ్నంగా - చైతన్యానికి గుర్తుగా - విప్లవానికి సంకేతంగా పరిణమించింది. వందేమాతరం ఆధారంగా ఈ శతాబ్దపు ఆదిలో అనేక విప్లవోద్యమాలు రగులుకున్నాయి.

 

    "వందేమాతరం" బ్రిటిషు ప్రభుత్వపు గుండెల్లో తుపాకులు పేల్చింది. "వందేమాతరం" బ్రిటిషు ప్రభుత్వ వ్యతిరేక నినాదం అయింది. "వందేమాతరం" స్వేచ్ఛకు సంకేతం - స్వాతంత్ర్య పోరాట నినాదం అయింది. ఆంగ్లప్రభుత్వం "వందేమాతరం" ఆర్పడానికి తన పశుబలాన్ని సాంతం ప్రయోగించింది. అప్పుడు వందేమాతరం  దావానలం అయింది. బడ బానలం అయింది. మహాశివుని ముక్కంటి మంట అయింది!    

 

    1939లో "వందేమాతరం" చిచ్చు ఉస్మానియా యూనివర్సిటీలో అంటుకుంది. అంతకుముందు విద్యార్థులు తమ తమ గదుల్లో వందేమాతరం పఠించారు. అది ప్రభుత్వ దృష్టికి రాలేదు. తరువాత విద్యార్థులు హాస్టలులో ఉమ్మడిగా వందేమాతరం ఆలపించారు. ఒక్కరోజు కాదు, ప్రతిరోజూ ప్రార్థనలు చేశారు.

 

    "వందేమాతరం" నిజాం గుండెల్లో పిడుగుల వర్షం కురిపించింది. "వందేమాతరం" ప్రార్థించరాదని ఉత్తరువు జారీ అయింది. ఆ ఉత్తరువు విద్యార్థులలో చిచ్చు రగిలించింది. వారు మరింత ధృడనిశ్చయంతో ప్రార్థనలు జరిపారు. ప్రార్థన సమయంలోనే కాదు, వందేమాతరం సర్వత్ర నినాదం అయింది.

 

    వందేమాతరం జామే ఉస్మానియానుంచి నగరంలో ఇతర విద్యాలయాలకు పాకింది. నగరంలోని విద్యాలయాలన్నీ వందేమాతరంతో ప్రతిధ్వనించాయి. ఈ ఉద్యమం క్రమంగా రాజ్యమంతటికీ పాకింది. ప్రతి విద్యార్థి నోటా వందేమాతర మంత్ర జపం వినిపించింది.

 

    నిజాం బిత్తరపోయాడు. తనను చుట్టుకున్న అగ్నిని ఆర్పడానికి సర్వశక్తులు వినియోగించాడు. హాస్టలు విద్యార్థులను ఖాళీ చేయమని ఫర్మాను విసిరాడు. విద్యార్థులు వినలేదు. హాస్టళ్లను వదలలేదు. మరింత ఆవేశంతో - ఉత్సాహంతో - ఉద్రేకంగా వందేమాతరం చదివి, ఉస్మానియా రాతిగోడలను గడగడలాడించారు.

 

    నిజాంలో వందేమాతరం ఉద్యమవార్త భారతదేశంలో కార్చిచ్చులా పాకింది. గాంధీజీ స్పందించారు. "వందేమాతరం చదివేహక్కు విద్యార్థులకు ఉంది" అన్నారు. లొంగకండి. పోరాటం కొనసాగించండి. ప్రభుత్వమే లొంగి వస్తుంది. అన్నాడు సుభాస్ చంద్ర బోస్. సావర్కర్ - నెహ్రూ ఉద్యమాన్ని బలపరచాడు.

 

    నిజాం ఉస్మానియాకు సాయుధ దళాలను రప్పించాడు. విద్యార్థులు వారిముందే 'వందేమాతరం' ఆలపించారు. ప్రభుత్వానికి తోచలేదు. విశ్వవిద్యాలయం సహితంగా విద్యాసంస్థలన్నింటిని రాజ్యవ్యాప్తంగా మూసివేయించింది.

 

    ఉస్మానియా విద్యార్థులు కేంపస్ వదలలేదు. నినాదాలు మానలేదు. మరింత ఉత్సాహంతో ఉద్యమం సాగించారు. 'క్షమాపణ చెప్పండి. లేకుంటే తొలగిస్తాం' అని ప్రభుత్వం ప్రకటించింది. తల్లిదండ్రులు బలవంతంవల్ల ఏ కొద్దిమందో తప్ప క్షమార్పణలు చెప్పలేదు.

 

    నిజాం రాజు నిషేధాస్త్రం ప్రయోగించాడు. పన్నెండు వందలమంది విద్యార్థులను యూనివర్సిటీనుంచి తొలగించాడు. తొలగించిన విద్యార్థులు అడ్మిషన్లకోసం ఇతర యూనివర్సిటీలకు ఉరికారు. దానితో నిజాం రాజ్యంలో అప్పటికా ఉద్యమం తెల్లారింది అనలేం - నివురు కప్పింది.

 

    రెండోసారి ఆంధ్రవిశ్వవిద్యాలయం నిజామాంధ్రులకు సహాయం నిరాకరించింది. మొదటిసారి మహిళా విద్యార్థినులకు మెట్రిక్యులేషను అడ్మిషను నిరాకరించింది. ఇప్పుడు ఉస్మానియా బహిష్కరించిన విద్యార్థులను చేర్చుకోవడానికి నిరాకరించింది.

 

    నిజాం రాజు సి. ఆర్. రెడ్డిగారికి - ఆంధ్ర విశ్వవిద్యాలయం కొరకు లక్ష రూపాయలు విరాళం ఇచ్చాడని ఆంధ్రపితామహులు నాతోనూ మరికొందరితోనూ - వ్యధగా వ్యక్తీకరించారు.                




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.