Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
పదునాలుగవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - ప్రియమేధ.
అభిప్ర గోపతిం గిరేన్ధ్రమర్చ యథావిదే|
సూనుం సత్యస్య సత్సతిం ||
1. ఇంద్రుడు సత్యపుత్రుడు. సజ్జన పాలకుడు. గోవులకు ప్రభువు. అట్టి ఇంద్రుని చక్కగా అర్చించండి. అతడు వినునట్లుగా స్తుతించండి.
2. ఇంద్రుని అశ్వములు మెరుపులు మెరయుచు కుశలపై నిలుచును గాక. ఆ కుశలపై నిలిచియే గదా మేము ఇంద్రుని స్తుతించుచున్నాము!
3. ఇంద్రుడు సమీపము నందలి సోమమును సకల దిశలందు పానము చేసినపుడు గోవులు వజ్రి కొరకు మధుర దుగ్ధములను అందించుచున్నవి.
రెండవ తృచ : ఋషి - నృమేధ.
1. సకల అసుర యుద్దములందు తమను రక్షించుమని ఆహ్వానించ దగినవాడు ఇంద్రుడు. అతడు వృత్రహంత. పరమ పూజ్యుడు. స్తుతులకు ప్రత్యక్షమగువాడు. అట్టి ఇంద్రుని యజ్ఞ సంబంధ క్రతువులందు విరాజిల్లు చేయండి.
2. ఇంద్రదేవా! ధన దాతలందరిలో ప్రథముడవు. సత్యమును ఐశ్వర్యవంతము చేసిన వాడవు. ధనవంతుడవు. బలవంతుడవు. బలముల పుత్రుడవు. మహానుడవు. నిన్ను దాహ్నములు అర్ధించుచున్నాము.
మూడవ తృచ : ఋషి - త్రసదస్యుడు.
1. ఇది సోమము. స్వర్గవాసుల పీయూషము. పురాతనము. ప్రశంసనీయము. ఈ పురాతన సోమమును గాయకులూ దివి నుండి ఆహ్వానించుచున్నారు. తదుపరి ఇంద్రునికై పుట్టిన సొమ్మును స్తుతించుచున్నారు.
2. తదుపరి ద్యులోకవాసులగు 'వసురుచి' అనువారు సోమమును దర్శించినారు. బాంధవ్య యోగ్యమగు సోమమును స్తుతించుచున్నారు. సూర్యుని కన్న మున్నే సోమమును ఆరాధించుచున్నారు.
3. తదుపరి సోమము ద్యావాపృథ్వులందును, సకల ప్రాణులందును, బలములందును విరాజిల్లుచున్నది. గోసమూహములందు వృషభసమమై ఉన్నది.
నాలుగవ తృచ : ఋషి - శునశ్శేపుడు.
1. అగ్నీ! నీవు మాతో సమానుడవు. అట్లయ్యు మేము సమర్పించు హవిస్సులను గురించియు, ఉచ్చరించు నవీన స్తుతులను గురించియు దేవతలకు విశేషముగ వివరింపుము.
2. అగ్నిదేవా! నీ కిరణములు విచిత్రములు. నీవు విశిష్ట ధనదాతవు. నదీ తరంగములు తీరమున గుంటలు ఏర్పరచినట్లు హవి సమర్పించు వారికి వెంటనే ఫలములు కలిగించుచున్నావు.
(నది వరకు పోకముందే గుంతలలో నీరు దొరికినట్లు.)
3. అగ్నిదేవా! మమ్ము ఉత్తమ ద్యులోక భోగములకు చేర్చుము. అంతరిక్ష భోగములకు చేర్చుము. భూలోక ధనములను ప్రసాదించుము.
(భూమి మీద ధనమే భోగమని.)
అయిదవ తృచ : ఋషి - వత్సుడు.
1. నేను సత్యమునకు తండ్రి వంటి ఇంద్రుని అనుగ్రహమున చేరినాను. అహం సూర్య ఇవాజని - నేను సూర్యుని వలె ప్రకాశించుచున్నాను.
(1. ఇంద్రుని అనుగ్రహము కలవాడు సూర్యుని వలె ప్రకాశించునని 2. ఇంద్రుని అనుగ్రహముననే సూర్యుడు ప్రకాశించుచున్నాడని.)
2. నేను సహితము కణ్వుని వలెనే సనాతనుడనై ఇంద్రునకు శత్రునాశక బలము కలిగించు స్తుతులను వచించుచున్నాను.
3. ఇంద్రా! నిన్ను స్తుతించని వారు ఉన్నారు. స్తుతించిన ఋషులున్నారు. వారందరిలో నా స్తుతులే ఉత్తమములు, బుద్దివర్ధకములు అగును గాత.
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషి - అగ్ని.
1. బలములందు పుట్టిన అగ్నిదేవా! సమస్త అర్చనీయ అగ్ని సహితుడవై హవిస్సులు సేవించుము. దేవతలందున్న అగ్నియు, మానవులందున్న అగ్నియు, ఇతర అగ్నులతో కలిసి మా స్తుతులు ఆలకించును గాక.
2. ఏ అగ్నికి హవిస్సులు అర్పించువారు అనేకులు ఉన్నారో ఆ అగ్ని సమస్త అర్చనీయ అగ్నుల సహితుడై మాకు అన్నములు అందించుటకు సరియైన సమయమునాకు విచ్చేయును గాత. ఆ అగ్ని మా పుత్ర పౌత్రుదుల వద్దకు కూడ చేరునుగాక.
3. అగ్నిదేవా! నీవు సకల అగ్నులతో కూడిన వాడవై మా స్తుతులను, యజ్ఞములను వర్ధిల్లచేయుము. దేవకార్యములకు గాను మాకు ధనము లిమ్మని దేవతలకు ప్రేరణ కలిగించుము.
రెండవ తృచ : ఋషి - అసదస్యుడు
1. సోమమా! నీవు సర్వ ప్రథమవు. కుశచ్చేదవు. అన్నవంతవు. మహా బుద్దిశాలివి. వీరుడవు.
మాకు బాల పరాక్రమములు కలిగింపుము.
2. గుండమందు నీరు నింపుటకు నీటి కట్టను తెంపినట్లు - నీరు నింపువాడు జలాశయపు అడ్డు తొలగించినట్లు - సోమము అన్నము కొరకని పవిత్రమును తెంపుచున్నది.
3. సోమమా! నీవు అమృతమవు. ఋతమును, అమృతమును ధరించు అంతరిక్షమున నరుల కొరకని సూర్యుని సృష్టించినావు. దేవతలను సేవించుచున్నావు. నిత్యము సంగ్రామములకు సాగుచున్నావు.
మూడవ తృచ : ఋషి - విశ్వమనువు.
1. సోమమును ఇంద్రుని కొరకు సిద్దము చేయండి. సోమపు మధుర రసమును ఇంద్రుడు పానము చేయును గాత. ఇంద్రుడు తన మహిమచే ధనములు ఇచ్చును గాక.
2. హర్యశ్వ స్వామియు ధన ప్రదాతయునగు ఇంద్రుని నేను స్తుతించుచున్నాను. అశ్వర్షి పుత్రుడనగు నా స్తుతులను ఇంద్రుడు ఆలకించును గాత.
3. ఇంద్రదేవా! నీ కన్న ముందు పుట్టినవాడు లేడు. సమర్ధ ఇంద్రా! నిన్ను మించిన వీరుడు మరొకడు లేడు. యుద్దములందు దండెత్తుటలో కూడా నిన్ను మించిన వాడు మరొకడు లేడు. స్తుతి యోగ్యతలో కూడ నిన్ను మించిన వాడు లేకున్నాడు.
నాలుగవ తృచ : ఋషి - ప్రియమేధ.
1. ఇంద్రుడు ఆదిత్యరూప ఉషస్సుల ఉత్పాదకుడు. అట్టి ఇంద్రుని మీ కొరకు ఆహ్వానించుచున్నాను. ఇంద్రుడు చంద్ర కిరణముల ఉత్పాదకుడు. అట్టి వానిని నీ కొరకు ఆహ్వానించుచున్నాను. ఇంద్రుడు గోవులకు ప్రభువు. అతనిని నీ కొరకు ఆహ్వానించుచున్నాను. నీవు గోవుల పాలరూప అన్నమును అర్ధించువాడవు కదా!
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. అగ్ని ధనదాతయగు దేవత. అతనిని హవి నిండిన స్రుక్కుతో అర్చించండి. మరింత సోమము సమర్పించండి. పాత్రలను హవి పూర్ణము చేయండి. తదుపరి అగ్నిదేవుడు మిమ్ము పరిపూర్ణులను చేయును.
2. దేవతలు అగ్నిని జ్ఞానవంతుని, హవ్యా వాహనుని చేసినారు. అట్టి అగ్ని ఉపాసకులకు సువీర్యము, రమణీయమగు ధనమును ఇచ్చుచున్నాడు.
రెండవ తృచ : ఋషి - సౌభరి.
1. ఏ వ్రతమున కర్మలు అర్చించ బడినవో అచట సకల మార్గ జ్ఞాతయగు అగ్ని ప్రత్యక్షమగుచున్నాడు. సుజాతయు, ఆర్య వర్ధనుడు అగ్ని మా వాగ్రూప స్తుతులను ఆలకించును గాత.
2. కర్మలు నిర్వహించు నరునకు మరొక మానవుడు సాయపడిన రీతి - వేలగోవులు, ధనములను ఇచ్చునట్టి అగ్నిని యజ్ఞము, కర్మలు నిర్వహించుచు స్వయముగా ప్రణమిల్లండి.
3. ప్రదైవోదాసో అగ్ని ర్దేవ ఇంద్రోన మజ్మనా|
అను మాతారం పృథివీం వి వావృతే తస్త్దౌ నాకస్య శర్మణి ||
పూర్వార్చిక 1వ అధ్యయము 5వ ఖండము 9వ మంత్రము పునరావృతము. అనువాదము అక్కడ చూడండి.
మూడవ తృచ : ఋషి - వైఖానసుడు.
1. అనువాదమునకు 13వ అధ్యాయము 4వ ఖండము 3వ తృచ 3వ మంత్రము చూడండి.
2. పంచ జనులకు ఫలప్రదాత, సర్వద్రష్టయగు అగ్నిని పురోహితువిగా ఏర్పరచినాము. మహా మహుడగు ఆ అగ్నిని యజ్ఞశాల యందు అర్చించుచున్నాము.
3. అగ్నీ! నీవు శ్రేష్ఠ కర్మల వాడవు. మాకు వర్చస్సు ప్రసాదించుము. మాకు ధనము, బలిష్టములగు గోవులను ప్రసాదించుము.
నాలుగవ తృచ : ఋషి - వసూయవుడు.
1. పావక అగ్నీ! నీవు దీప్తిమంతుడవు. హర్షము కలిగించు మాటల వాడవు. వానితో దేవతలను ఆహ్వానించుము. యజింపుము.
2. నేతిలో పుట్టిన, వింత వెలుగుల అగ్నిదేవా! హవిస్సులు అందుకొనుటకు దేవతలను ఆహ్వానించుమని సర్వద్రష్టవగు నిన్ను అర్ధించుచున్నాము.
3. అగ్నిదేవా! నీవు కవివి. యజ్ఞప్రేమివి. దీప్తిమంతుడవు. మహానుడవు. నిన్ను యజ్ఞమున ప్రజ్వరిల్లచేయుచున్నాము.
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి గోతముడు.
1. అగ్నీ! నీవు సకల కర్మములందు వందనీయుడవు. గాయత్రి ఛందమున నుతించుచున్నాము. మమ్ము నీ ఆయుధములచే రక్షింపుము.
2. అగ్నిదేవా! వెంటనే దరిద్రమును దూరము చేయునట్టియు, వరణీయమును, యుద్దములందు శత్రువులకు దుస్తరమునగు ధనమును ప్రసాదించుము.
3. అగ్నిదేవా! మా జీవితమునకు గాను చక్కని జ్ఞానయుక్తము, జీవితాంతము దేహపోషకము, సుఖప్రదయగు ధనమును ప్రసాదించుము.
రెండవ తృచ : ఋషి - కేతువు.
1. మా స్తుతులు, కర్మలు అగ్నిని యుద్దమునకు అశ్వమును ఉద్యమింప చేసినట్లు యజ్ఞమునకు ఉద్యమింప చేయును గాత. అగ్ని మూలమున మేము ధనములను జయింతుము గాత.
2. అగ్నిదేవా! నీ సేవలచే గోవులను రక్షించినట్లు ఆ రక్షణలతోనే మాకు ధనము కలుగు ప్రేరణ కలిగించుము.
3. అగ్నిదేవా! అనేక గోవులు, అనేక అశ్వములు గల ధనము నిమ్ము. ఆకసమున వెలుగులు నింపుము. నీ ఆయుధములను మా శత్రువుల మీద ప్రయోగింపుము.
4. అగ్నిదేవా! సమస్త ప్రాణులకు వెలుగు ప్రసాదించువాడును. నిరంతర గమనుడును, జరా రహితుడగు సూర్యుని ఆకాశమున స్థాపించినావు.
5. అగ్నిదేవా! నీవు యజమానులకు జ్ఞానదాతవు. ఇష్టుడవు. శ్రేష్ఠతముడవు. యజ్ఞశాలకు విచ్చేసి ఉన్నావు మాస్తోత్రములను వినుము. మాకు అన్నము నిమ్ము.
మూడవ తృచ : ఋషి - విరూపుడు.
1. అగ్ని దేవతలందు శ్రేష్ఠుడు పృథివీపతి. అగ్ని జలములకు బీజరూపమగు సకల స్థావర జంగమ ప్రాణులకు ప్రేరణ కలిగించుచున్నాడు.
2. అగ్ని స్వర్గపతి. వరణీయ, దానయోగ్య ధనస్వామి సుఖములు కలుగుటకు గాను నేను అగ్నికి స్తోతను అగుదును గాక.
3. అగ్నిదేవా! పరిశుద్ద, శ్వేతవర్ణ, దీప్యమాన కాంతులు నీ తేజస్సునాకు ప్రేరణ కలిగించుచున్నవి.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
ఉత్తరార్చిక యందలి పదునాలుగవ
అధ్యాయము సమాప్తము.





