Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
2. జలమును యజ్ఞములకు తాకించుచు, యజమానులను రక్షించుచు, ద్రోహము నెరుగని మిత్రావరుణులు వర్ధిల్లుచున్నారు.
3. ఎవరు వృష్టి కొరకు స్తుతించబడుచున్నారో - ఎవరికీ కోరినవి లభ్యమగుచున్నవో - ఎవరు దానయోగ్య అన్నములకు స్వాములో - అట్టి మిత్రావరుణులు బృహద్రథము మీద ఆశీనులు అగుచున్నారు.
ఐదవ తృచ : ఋషి - మధుచ్చందుడు.
1. ఇంద్రుడు ఆదిత్యరూపమున ఉన్నాడు. రోషరహిత అగ్ని రూపమున ఉన్నాడు. వాయు రూపమున సర్వత్ర సంచరించుచున్నాడు. ముల్లోకములు అతనిని భజించుచున్నవి. అతని వెలుగే ఆకసమున ప్రకాశించుచున్నది.
2. ఇతని రథమునకు అభిలషణీయ, శోణవర్ణ, ప్రగల్భ హర్యశ్వములు సారథిచే కట్టబడును.
3. నరులారా! చూసినారా చిత్రము! సూర్య రూప ఇంద్రుడు ఉషః కాలమున ఉదయించి వెలుగులేని రాత్రికి వెలుగును, రాత్రులందు రూపము కనిపించని వానికి రూపమును కలిగించుచున్నాడు!!
ఐదవ ఖండము
మొదటి తృచ : ఋషి - ఉశనుడు.
1. "అయం సోమ ఇన్ధ్ర తుభ్యం సున్వే" - ఈ సోమము, ఇంద్రా! నీ కొరకు సంస్కరించబడినది. ఇది నీ కొరకే పవిత్రమైనది. నీవు దీనిని త్రాగుము.
ఇంద్రా! నీవే కదా సోమమును చేసినావు! నీవే దానిని మాదకముగను, సహాయకముగను వరించినావు.
2. ఇంద్రుడు మహామహుడు. మరిన్ని బరువులు మోయు రథము వలె ఇంద్రుడు మాకు మరింత ధనము కలుగ జేయుటకు యజ్ఞమున చేరును గాక. తదుపరి మాకు విరోధులుగా పుట్టిన వారు ఊర్ధ్వముఖులై యుద్దములకు పోవుదురు గాక.
3. సోమమా! నీవు బలశాలివి. మరుత్తుల వంటి పవిత్రమగుము. దివ్య ప్రజ నిందలు లేనివారై అట్లే పవిత్రులగుదురు కదా! జలము వంటి వేగము గల నీవు మా విషయమున మంచి మనసు కల దానవగుము. అనేక రూపములు గల నీవు సేనలను నిర్లక్ష్యము చేయు ఇంద్రుని వంటి పూజనీయవు.
రెండవ తృచ : ఋషి - భరద్వాజుడు.
1. అగ్నిదేవా! నీవు సమస్త యజ్ఞములకు హోతవు. ఏలననగా దేవతలు నిన్ను మానవహితము కొరకు నియమించినారు కదా!
2. అట్టి అగ్నిదేవా! మా యజ్ఞములందు - స్తుతి యోగ్యుడవై - ప్రజ్వరిల్లుము. దేవతలను యజించుము. దేవతలను ఆహ్వానించుము. వారికి తృప్తి కలిగించుము.
3. అగ్నిదేవా! నీవు విధాతవు. సుక్రతువవు. యజ్ఞపు మహా మార్గములను, అల్పమార్గములను ఎరుగుదువు. కావున యజమానికి చక్కని మార్గము చూపుము.
మూడవ తృచ : ఋషి - దేవశ్రవుడు లేక దేవవీతుడు.
1. అగ్ని హోత అమరుడు. ప్రకాశవంతుడు. కర్మలకు ప్రేరణ కలిగించువాడు. అతడు జ్ఞాన సహితుడై కర్మ ఆరంభమునకు ముందే మా వద్దకు విచ్చేయును.
2. బలశాలి అగ్నిని విజయము కొరకు యుద్దములందు ప్రతిష్టించుచున్నారు. అధ్వరములందు స్థాపించుచున్నారు. అందుకే విప్రుడగు అగ్ని యజ్ఞసాధకుడు అగుచున్నాడు.
3. అగ్ని ఆహవనీయుడు అగుచున్నాడు. వరేణ్యుడు అగుచున్నాడు. సకల భూతముల గర్భము లందున్నారు. అట్టి అగ్నిని దక్షపుత్రి వేది రూప భూమి మీద ధరించుచున్నది.
(భూమేర్దక్షదుహితృత్వే మన్త్రవర్ణః - భూమియే దక్షపుత్రియని మంత్రభావము.)
ఆరవ ఖండము
మొదటి తృచ : ఋషి - ప్రగాథ.
1. అధ్వర్యులారా! అవు పాలలో ద్యావాపృథ్వులను ఆశ్రయించి ఉన్న మేక యొక్క పాలను కలపండి. అట్లు కలిపినా మేక పాలలో అగ్నిని స్థాపించండి.
2. దూడలు తల్లి ఆవులను చేరినట్లు గోవులు తమ స్థానమునకు బందువుల సహితముగా చేరును గాక.
3. అగ్ని తన జ్వాలా రూపమున ఆరగించు ఆవు పాలకు ఇంద్రుడు అగ్ని చేత ధరించబడు మేక పాలను అంతరిక్షమున అర్పించుచున్నాడు. అట్టి ఇంద్రాగ్నులకు ఆవు పాలు, మేకపాల రూపమగు అన్నమును అర్పించుచున్నాము.
రెండవ తృచ : ఋషి - బృహద్దివుడు.
1. అతడు ఆద్యుడు. అతడు సకల లోకములందు ప్రదీప్తుడైనాడు. అతడే ఉగ్రుడగు సూర్యునిగ ఉదయించినాడు. అతడు ఉదయించినంతనే ఉపాసకుల శత్రువులను పరిమార్చుచున్నాడు. ఇతడు తమ మేలుకే ఉదయించినాడని సకల ప్రాణులు సంబరపడుచున్నవి.
2. ఇంద్రుడు పుట్టినదే బలములందు. అందుకే బలశాలి, శత్రుహంత అయినాడు. దస్యులకు భయంకరుడు అయినాడు. అతడు శ్వాసించు శ్వాసించని ప్రాణులను పరిశుద్దులను చేయుచున్నాడు. వారు అట్టి ఇంద్రుని స్తుతించుటకును, హవి అర్పించుటకును కూడుచున్నారు.
3. ఇంద్రదేవా! సకల కర్మలు నీ కొరకే సంపూర్ణములు అగుచున్నవి. సకల భూతముల మనస్సులందు నీవే నిండి యున్నావు.
ఇంద్రదేవా! నిన్ను అర్చించువారు తొలుత ఒకరుగా ఉండి, భార్యతో కూడి ఇద్దరై, పుత్రునితో కూడ ముగ్గురు అగుచున్నారు. ప్రియమగు గృహము, ధనము మున్నగు వానికన్న ప్రియమగు సంతానమును ఎంతో ప్రేమించు తల్లిదండ్రులతో చేర్చుము. ఈ మధుర సంతానమును పౌత్రులతో ఆడుకొను నట్లు చేయుము.
మూడవ తృచ : ఋషి - గృత్సమదుడు.
1. ఇంద్రుడు పూజనీయుడు. బలవంతుడు. సంత్రుప్తుడు. అతడు జ్యోతి, గోవు, ఆయువు అను అభిప్లవ దినములందు అభిషుతమును యువసత్తుచే కలసినది యగు సోమమును విష్ణువుతో కూడి యథేచ్చగా పానము చేయుచున్నాడు.
ఆ సోమము గొప్పది. విశాల తేజోవంతము. ఇంద్రుడు ఘన కార్యములు చేయుటకు హర్షము కలిగించునది. సత్యస్వరూప, భిందువులుగా రాలు, ద్యోతమాన సోమము సత్య స్వరూపుడగు ఇంద్రుని యందు వ్యాపించుచున్నది.
2. ఇంద్రదేవా! నీవు ప్రజ్ఞాసహితుడవై ఆవిర్భవించినావు. బలశాలివై విశ్వభారమును వహించదలచినావు. జ్ఞానవాన్ ఇంద్రా! నీవు శౌర్య, పరాక్రమములచే వర్ధిల్లినావు. యుద్దములను లక్ష్య పెట్టని వాడవు అగుచున్నావు.
ఇంద్రా! నిన్ను స్తుతించు వారికీ ఇష్ట కామ్య సాధకమగు ధనమును ఇచ్చుచున్నావు. సత్య స్వరూప, బిందువులుగా రాలు, ద్యోతమాన సోమము సత్య స్వరూపుడగు ఇంద్రుని యందు వ్యాపించుచున్నది.
3. ఇంద్రుడు సోమపానము చేసినాడు. ప్రదీప్తుడైనాడు. బలము పెంచుకున్నాడు. 'కృని' నామక అసురుని యుద్దమున గెలిచినాడు. తన తేజస్సుతో ద్యావాపృథ్వులను నింపినాడు. ఇప్పుడు త్రావిన సోమముచే ఇంద్రుడు తన బుద్దిబలమును పెంచుకున్నాడు. అతడు సోమమును రెండు భాగములు చేసినాడు. ఒక భాగమును పొట్టలో పోసుకున్నాడు. రెండవ భాగమును దేవతల కొరకు మిగిల్చినాడు.
ఇంద్రా! ఆ దేవతలను సోమపానమునకు ప్రోత్సహించుము.
సత్యస్వరూప, బిందువులుగా రాలు, ద్యోతమాన సోమము సత్యస్వరూపుడగు ఇంద్రుని యందు వ్యాపించుచున్నది.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
ఉత్తరార్చిక యందలి పదమూడవ
అధ్యాయము సమాప్తము.





