Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
పదమూడవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - కవి.
పవస్వ వృష్టిమా సు నో2పాముర్మిం దివస్పరి |
అయక్ష్మా బృహతీరిషః ||
1. సోమమా! మా కొరకు దివి నుండి సువృష్టి కలిగించుము. జలమును తరంగములుగా కురిపించుము. రోగరహిత బహు అన్నములను వర్షించుము.
2. సోమమా! ధారలుగా వర్షించుము. ఆ ధారలు అన్యదేశపు శత్రువుల గోవులు మా దేశమునకు మా ఇంటికి తరలి వచ్చునట్లు చేయును గాత.
3. సోమమా! యజ్ఞమునందు దేవతలు నిన్ను ఎంతో అభిలషించుచున్నారు. మా కొరకు ఘ్రుతమును ధారలుగా కురిపించుము. 'వృష్టిమాపవ' - వర్షము కురిపించుము.
4. నీవు మాకు అన్నము కలిగించుటకు ఉన్ని గల పాత్రలలోనికి ధారగా పడుము. ఆ శబ్దమును దేవతలు విందురు గాక.
5. సోమము రాక్షస నాశము చేయుచు తన సనాతన దీప్తులను ప్రకాశింపచేయుచు రాలుచున్నది.
రెండవ తృచ : ఋషి - భరద్వాజుడు.
1. ఇంద్రుడు విశ్వజ్ఞుడు. శీఘ్రగామి. అగ్రగామి. నరులారా! అట్టి ఇంద్రుని పానమునకు సోమము సమర్పించండి.
2. ఇంద్రుడు శత్రుబలగ్రాహి. అభిషుత సోమయుక్తుడు. మిక్కిలి సోమపనము చేయువాడు. అట్టి ఇంద్రుని ఎదుట నిలిచి ప్రార్దించండి.
3. అభిషుత, దీప్త సోమము సమర్పించి ఇంద్రుని శరణు వేడండి. అతడు మీ మనోరథములు గ్రహించగలడు. శత్రుభయంకరుడగుచు ఇంద్రుడు మీ కోరికలు తీర్చగలడు.
4. మన ఇంద్రునకే అన్నరూప సోమరసమును అర్పించండి. అతడు ఉరుకులు పెట్టు పగతురను ఓడించి మమ్ము భద్రుముగా రక్షించును గాత.
రెండవ ఖండము.
మొదటి తృచ : ఋషి - అసితుడు లేక దేవలుడు.
1. సోమము బభ్రువర్ణ. స్వబల ఒకప్పుడు అరుణవర్ణ. ద్యులోకస్పృశ అట్టి సోమపు స్తుతులు పాడండి.
2. చేతులందు పట్టిన పాషాణములతో సోమమును అభిషవించండి. పవిత్రమున శుద్దిచేయండి. మాదక సోమమున గోదుగ్ధమును చేర్చండి.
3. నమస్కరించి సోమమును చేరండి. సోమమున పెరుగు కలపండి. ఇంద్రునకు సోమము సమర్పించండి.
4. శత్రునాశక, విశేషద్రష్ట, దవతల అభీష్టకార్యకర్త సోమము మా గోవులకు శుభము, సుఖములు కలిగించును గాత.
5. సోమమా! నీవు అన్సును ఎరిగిన దానవు. మనసునకు ప్రభువవు. ఇంద్రుని పానమునకును, ఆనందము కలిగించుటకును పాత్రలందు నిండుము.
6. పవమాన సోమమా! వీరత్వయుక్త ధనమును మా సహాయకుడగు ఇంద్రుని ద్వారా మాకు అందించుము.
రెండవ తృచ : ఋషి - సుకక్షి.
1. సూర్యదేవా! నీవు ప్రసిద్ద ధనవంతుడవు. అర్ధించువారికి వరదుడవు. దాతలగు స్తోతల కొరకు ఉదయించుచున్నావు.
2. ఇంద్రుడు తన భుజబలమున తొంబది తొమ్మిది పురములను భగ్నము చేసినవాడు. అవధ్యుడగు వృత్రుని వధించినాడు.
3. అతడు, ఆ ఇంద్రుడు కళ్యాణమూర్తి మాకు మిత్రుడు అతడు మాకు గోవు పాలధారలు కురిపించినట్లు అశ్వములు, గోవులు, అన్నముతో కూడిన ధనము ఇచ్చును గాత.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - విభ్రాట్ సౌర్యుడు
1. సూర్యుడు దేదీప్యమానుడు. అతడు యజ్ఞపతికి ఆయువు నిచ్చుచు మరింత సోమ మధువును త్రాగును గాత. అతడు వాయు ప్రేరణ గలవాడు. స్వయముగనే జగములను పాలించుచున్నాడు. ప్రజలను రక్షించుచున్నాడు. బహుధా విరాజతి బహువిధముల విరాజిల్లుచున్నాడు.
2. సూర్యుడు దేదీప్యమానుడు. అన్నదాత. వాయువును ధరించు ద్యులోకమున ఉన్నవాడు. సత్యస్వరూపుడు. అమిత్రహంత. దస్యు, అసుర సంహారి. బంధురూప శత్రుహంత. అట్టి మహాజ్యోతి వెలువడినాడు.
3. సూర్యుడు శ్రేష్ఠుడు, జ్యోతులకే జ్యోతి, ఉత్తముడు, విశ్వజిత్తు, ధనజిత్తు, మహామహుడని చెప్పుచున్నారు. స్వయంప్రకాశుడగు, విశ్వప్రకాశక మహా సూర్యుని దృష్టి వలన అంధకారము నశించుచున్నది. సూర్యుడు అవినాశ్యమగు తేజస్సును వ్యాపింప చేయుచున్నాడు.
రెండవ తృచ : ఋషి - శక్తి.
1. ఇంద్రా! మా క్రతువును పూర్తి చేయించుము. తండ్రి పుత్రులకు ధనము నిచ్చినట్లు మాకు ధనము నిమ్ము. యజ్ఞమున మేము నిత్యము సూర్యుని దర్శింతుము గాక.
2. అజ్ఞాతులు, పాపచరిత్రులు, దుష్టబుద్ధులు, అశుభులు మమ్ము గెలువకుందురు గాక. శూర ఇంద్రా! నీ వలన మేము రక్షించ బడుచున్నాము. మేము మహా జలములను దాటగలుగుదుము గాక.
మూడవ తృచ : ఋషి - భర్గుడు.
1. ఇంద్రదేవా! నేడు నేడు, రేపు రేపు ఆపైన కూడ మమ్ము రక్షించుము. సజ్జనపాలకా! అన్నిరోజులందు రాత్రింబవళ్ళు మమ్ము - స్తోతలను రక్షించుము.
2. ఈ ఇంద్రుడు ధనవంతుడు. వీర్యవంతుడు. శత్రువును దెబ్బకొట్టగల పరాక్రమశాలి. అపార సంపన్నుడు. అందరితో కలసి పోవువాడు. శతక్రతు ఇంద్రా! నీ ఉభయ బాహువులు వజ్రము ధరించి యున్నవి. రెండు చేతులు అర్ధించువారికి దానవృష్టి కలిగించుచున్నవి.
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - వసిష్ఠుడు
1. మేము భార్యార్ధులము. పుత్రార్దులము. దాతల శరణు వేడుచు నేడు సరస్వతిని ఆహ్వానించుచున్నాము.
రెండవ తృచ : ఋషి - భరద్వాజుడు.
1. సరస్వతి మాకు ప్రియాతి ప్రియ. సప్తఛందస్సులు - సప్తనదుల సోదరి. సనాతన. 'స్తోమ్యాభూత్' స్తుతి యోగ్య అయిఉన్నది.
మూడవ తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి |
ధియో యోనః ప్రచోదయాత్ ||
1. యః = ఎవడు, నః ధియః ప్రచోదయాత్ = మమ్ము కర్మలకు ప్రోత్సహించుచున్నాడో, దేవస్యసవితుః = అట్టి సవితా దేవతను, వరేణ్యం భర్గః = వరేణ్యుడగు భర్గుని, ధీమహి = ధ్యానించుచున్నాము.
(భర్గుడనగా - అయంవైలోకోభర్గః. 2. పృథివ్యేవ భర్గః. 3. ఋగ్వేదోవైభర్గః. 4. హోతైవభర్గః. 5. అగ్నిర్వై భర్గః. 6. వసవ ఏష భర్గః. 7. వాగ్వై భర్గః. 8. వసన్త ఏవ భర్గః. 9. గాయత్రేవ భర్గః. 10. ఆదిత్యోవై భర్గః. 11. చంద్రమావై భర్గః. 12. వీర్యంవై భార్గ ఏష విష్ణుర్యజ్ఞః.)
2. సోమానాం స్వరణం కృణుహి బ్రాహ్మణస్పతే |
కక్షీవన్తం య ఔశిజః ||
పూర్వార్చిక, ఐన్ధ్రపర్వపు మూడవ ఖండమున అయిదవ మంత్రము తెనిగించబడినది.
3. అగ్నీ! మా ఆయువులను పవిత్రము చేయుము. మా వద్దకు అన్నమును, బలమును చేర్చుము. కుక్కల వంటి రక్కసులను బాధించుము.
నాలుగవ తృచ : ఋషి - యజతుడు.
1. మిత్రావరుణులు మాకు భూలోక, ద్యులోకములందలి బహు ధనములను ఇవ్వగల శక్తి మంతులు. దేవతలందు ప్రసిద్దమైన మిత్రావరుణుల బలమును స్తుతించుచున్నాము.





