Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

11.    దుందుభీ! శత్రువును ఎదిరించగలదానవు. ఎదుర్కొన గల దానవు. అభిమానుల అభ్యర్ధనల కొరకు అన్వేషించు దానవు. శబ్దమును పైకి పంపి పేల్చుదానవు. విద్వాంసుని మంత్రము వలె సంగ్రామ విజయమునకు మహాధ్వనులు చేయుము.
   
12.    నీవు నిలువని వానిని నిలుపు దానవు. ఉత్సాహము నింపు దానవు. యోధులను నడిపించు దానవు. యుద్దములు గెలిపించు దానవు. ఎదుట నిలుచుదానవు. అపరాజితవు. ఇంద్ర రక్షితవు. హృదయాకాశమును హెచ్చరించుచు, శత్రువులకు హృదయ క్షోభ కలిగించుచు, శత్రుసేనలో దూరుము.
   
                                                 ఆరవ సూక్తము - 21
   
వినియోగము :
- పూర్వ సూక్తము వలె.
   
    ఇంకను సోమాంకురమును జింక చర్మములో కట్టి దానిని సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టునది.
   
1.    దుందుభీ! శత్రులందు విహ్రుదయము, వైమనస్యము కలిగించుము. మేము శత్రువులందు విద్వేషము కశ్మలము కలిగించ దలచినాము. నీవు శత్రువును హతమార్చుము.
   
2.    ఘ్రుతాహుతులు ఇచ్చినంత శత్రువు కంపించును గాక. వారి మనసులందు, నేత్రములందు, హృదయములందు భయము నిండును గాక. వారు భయపడి పారిపోవుదురు గాక.
   
3.    దుందుభీ! నీవు వనస్పతులచే చేయబడిన దానవు. చర్మముచే కుట్టబడిన దానవు. మేఘ గర్జన వంటి ధ్వని చేయగల దానవు. ఘ్రుతము పూయబడిన దానవు. శత్రువుల గుండెలందు గుబులు పుట్టించుము.
   
4.    దుందుభీ! వేటగాని చూచి అడవి జంతువులు భయ కంపితులైనట్లు నీవుగర్జించి శత్రువు గుండెలో రాళ్ళు కురిపించుము. భయ మోహితులను చేయుము.
   
5.    తోడేలును చూచి మేకలు, గొర్రెలు పారి పోయిన రీతి నీవుగర్జించి శత్రువుల గుండెలందు రాళ్ళు కురిపించుము. భయ మోహితులను చేయుము.
   
6.    గరుడుని చూచి పక్షులు భయపడినట్లు, రాత్రి గాని పగలుగాని సింహగర్జనకు జంతువులు బెదరినట్లు, నీవు గర్జించి శత్రువు గుండెలందు రాళ్ళు కురిపించుము. భయ మోహితులను చేయుము.
   
7.    సంగ్రామ అధిపతులగు దేవతలు జింక చర్మము మరియు దుందుభిచే శత్రువులను భయపెట్టి పరాజితులను చేయుచున్నారు.
   
8.    ఇంద్రుడు పదఘోషచే చాయన ఆడిన రీతి అతడు సేనా బద్దమై సాగు శత్రువునకు దడపుట్టించును గాక.
       
9.    శత్రుసేనలు పరాజితులై పారిపోవు దిశ యందే మా దుందుభులు, వింటినారులు ఘోషించునుగాక.
   
10.    ఆదిత్యా! నీవు శత్రువుల నేత్ర శక్తినిక్షీణింప చేయుము. కిరణములారా! శత్రువుల వీపులను మండించండి పారిపోవునపుడు కాళ్ళు  వ్రేలాడినంత పాదరక్షలు ఊడి పోవును గాక.
   
11.    పృశ్ని మాతృక మరుత్తులారా! మీరు భీషణులు రాజాసోముడు, రాజా వరుణుడు, మహాదేవ మృత్యువు, ఇంద్రునితో కలసి శత్రువులను కాలరాయండి.
   
12.    ఏతా దేవసేనాః సూర్య కేతవః సచేసః |
    అమిత్రాన్ నో జయన్తు స్వాహా ||

   
    ఇవి దేవసేనలు. సూర్యకేతనములు కలవి. సావధానములు. అవి మా శత్రుసేనలను జయించును గాత - స్వాహా.
   
                                           అయిదవ అనువాకము
                                     మొదటి సూక్తము - 22
   
వినియోగము :-

   
      1) జ్వరచికిత్స యందు ఈ సూక్తముచే లాజలను త్రాగించునది. ఈ కర్మమునందే 'దావాగ్ని ప్రణయనం  కృత్వా' తామ్ర స్రవము ఈ సూక్తముచే తలమీదికి సంపాతములు తెచ్చునది.
   
1.    అగ్ని, సోముడు, మేఘాధిపతి ఇంద్రుడు, పవిత్ర కేశవంత వరుణుడు వేదబర్హి, సమిధలను ప్రదీప్తము చేసి జ్వరమును బాధింతురు గాక. మా శత్రువులు తొలగి పోవుదురు గాక.
   
2.    జ్వరమా! నీవు జీవితమును దుర్భరము చేయుదానవు. నరులను ఏడిపించుదానవు. అగ్ని వలె మండించుదానవు. అట్టి నీవు నీరసపడుము. తిరస్కృత వగుము. దిగువ కన్న దిగువ స్థానమునకు వెళ్ళిపొమ్ము.
   
3.    కఠోరము - క్రూరముగ ధ్వంసముచేయు, అరుణ వర్ణ సర్వ శక్తిమంతా! ఈ జ్వరమును వదిలించుము. దూరమునకు పంపుము.
   
4.    నేను జ్వరమునకు ప్రణమిల్లి దానిని పాతాళమునకు పంపుచున్నాను. బలాఢ్యుని సహితము పిడికిటితో పొడుచు జ్వరమా! "పునరేతు మహా వృషాన్" మహా వీరులను మరల చేరుకొనుము.
   
5.    ఈ జ్వరపు ఇల్లు ముంజవంతము. మహా వీర్యవంతము. జ్వరమా! నీవు ఎంతటి దానవో అంత 'బల్హికేషు' నిత్యము సంచరించుము.
   
6.    జ్వరమా! నీవు సర్పరూపమవు. అవయవములను బాధించు దానవు. విశిష్ట రోగరూప జ్వరమా! నీవు మా నుండి దూరమగుము. దొంగతనము చేయు దాసిని వజ్రాయుధము వలె పట్టుకొనుము. విడువకుము.
   
7.    జ్వరమా! తుంగవైపు, బల్హికమువైపు, అంతకన్న దూరము వెళ్ళిపొమ్ము. తొలి పరువపు శూద్రను కోరుకొనుము. ఆమెను ఎంతో వడకించుము.
   
8.    నీవు తుంగగల మహా వృష్టి స్థానమునకు చేరికొనుము. అక్కడ బందువులను తినుము. ఈ స్థలములు గాని ఇతర స్థలములు గాని జ్వరము కొరకు ఏర్పరచుచున్నాము.
   
9.    నీవు అన్యక్షేత్రములందు రమించకుము. నీవు 'వశి' వి. మాకు సుఖములు కలిగించుము. జ్వరము మాలో సఫలమైనది. ఇప్పుడది బల్హికములకు పోవుచున్నది.
   
10.    నీవు చలి జ్వరమవు. చలి తరువాత వచ్చు జ్వరమవు. దగ్గుతో వడకించుదానవు. ఇవే నీ ఆయుధములు వాని సహితముగ మమ్ము విడిచి పొమ్ము.
   
11.    జ్వరమా! బలక్షయమును, దగ్గును మాకు మిత్రులను చేయకుము. ఇచట తలవంచినావు. తిరిగి రాబోకుము. ఇదే మాట నీతో పదేపదే అనుచున్నాను.
   
12.    నీ సోదరుడు బలక్షయ కారకుడు. సోదరి దగ్గు. భ్రాత్రువ్యుడు పాపము. వీటినన్నింటితో అసభ్య వ్యక్తిని చేరుకొనుము.
   
13.    దేవా! మూడు నాళ్ళకు వచ్చు, నాలుగు నాళ్ళకు వచ్చు, ఎప్పుడు వంటిని పిండు శరదృతు, వర్షర్తు, గ్రీష్మరుతువులందు వచ్చు జ్వరములను, శీతజ్వరము, 'రూర' జ్వరమును ధ్వంసము చేయుము.
   
14.    గంధార, ముంజవంత, అంగ, మగధ దేశములకు కష్టదాయక వ్యాధినంపి మా ప్రజకు సుఖములు కలిగించుచున్నాము.
   
                                                రెండవ సూక్తము - 23
   
వినియోగము :-

   
    క్రిమిచికిత్స యందు కరీరపు వేరును ఈ సూక్తముచే సంపాతిత అభిమంత్రణములు చేసి కట్టునది.
   
    గోవాలముచే కరీరపు చెక్కను చుట్టి రాతితో దంచి పొడిచేసి ఈ సూక్తముచే అగ్నిమీద వేసి కట్టునది.
   
    గ్రామ ధూళిని అభిమంత్రించి దక్షిణమునకు తిరిగి ఎడమ చేతితో ధూళిని చల్లునది.
   
     దీనిచే ధూళి కణములను అభిమంత్రించి చేతిలో నలిపి క్రిమి మీద వేయునది.
   
    దీనిచే శాంతి వృక్షసమిధలను వేసిన క్రిమి సంహారకమగుచున్నది.
   
    తల్లి వడిలో బిడ్డనుంచి వెన్నను వేడిచేసి ఈ సూక్తముచే బిడ్డ దవడను కాపునది. అట్లు మూడు మారులు  చేయునది.
   
    సిగృ గింజలను వెన్నలో కలిపి దీనితో అభిమంత్రించి వ్యాధిగల చోట పూయునది.
   
    ఇరువది యొక్క వట్టి వేళ్ళను అభిమంత్రించి రాతితో దంచి ఈ సూక్తము జపించుచు కాల్చి అభిమంత్రించి వ్యాధిగ్రస్తుని మీద చల్లునది.
   
    ఇరువది యొక్క పిడికళ్ళ వట్టి వేళ్ళను నీటికుండలో వేసి అభిమంత్రణ సంపాతనములు చేసి రోగి మీద చల్లునది.
   
1.    ద్యావాపృథ్వులు, సరస్వతి, అగ్ని నన్ను అనుగ్రహించినారు. వారు క్రిములను నాశము చేయుదురు గాక.
   
2.    ధనపతి ఇంద్రా! ఈ కుమారుని క్రిములను హతమార్చుము. నా భీషణ వాక్కున సమస్త శత్రువులు హతులైనారు.
   
3.    నేత్రములందుండు, నాసికా రంద్రములందు ఉండు, దంతముల మధ్య మసలు క్రిములను నాశనము చేయుచున్నాము.
   
4.    ఒకే రూపపువి రెండు, వేరు రూపము లవి రెండు, నలుపువి రెండు, ఎరుపువి రెండు బభ్రువర్ణపు, బభ్రుకర్ణములవి, గృధ్ర, కోక నామములు మున్నగు క్రిములన్నియు ధ్వంసమైనవి.
   
5.    శితి కక్షలు, కృష్ణలు, శ్వేత బాహువులు, అనేక రూపములు గల అన్ని క్రిములను హతమార్చుచున్నాము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.