Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
18. బ్రాహ్మణుడు పాపబుద్ధితో ఎవని ఇంట రాత్రి నివసించునో అట్టివాని ఇంట కళ్యాణకర గోవు, బరువులు మోయు ఎద్దు ఉండవు.
(బ్రహ్మజాయ యజ్ఞమూలము - గోవు బ్రాహ్మణ స్త్రీ అగుచున్నవి. పౌరాణిక అర్ధమున సరస్వతి కావచ్చును.)
మూడవ సూక్తము - 18
వినియోగము :- గోహరణ, మారణ, ఛేదన, అధిశ్రయన పచన, భక్షణాది కర్మలందు అభిచారకామియైన బ్రహ్మచారి 18,19 సూక్తములను 12వ కాండ 5వ అనువాకమును శత్రువును దృష్టిలో ఉంచుకొని జపించునది.
1. నృపతీ! గోవును నీకు దేవతలు తినుటకుగాను ప్రసాదించలేదు. రాజన్యా! గోవు బ్రాహ్మణుడు తినునదికాదు. కావున దానిని భుజించ నిచ్చగించకు.
2. ద్రోహము చేయువాడు, అతఃమ పరాజితుడు, పాపి యగు రాజు మాత్రమే బ్రాహ్మణుని గోవును తినుచున్నాడు. వాడు ఈ రోజునేగాని రేపటిని చూడకుండును గాక.
3. బ్రాహ్మణుని గోవు వధరూప పాపము, విషపూరిత చర్మము, పగ పట్టిన పాము వంటిది. కావున రాజా! దనిని భుజించరాదు.
4. బ్రాహ్మణునకు సంబంధించిన దానిని హరించిన వాడు - 'తైమాత' విషమును త్రాగినవాడు, తనక్షాత్ర తేజమును విసరి వేసినవాడు, మండుచున్న మంటలలో తన సర్వస్వము వేసి ధ్వంసము చేసుకున్నవాడు సంతప్తుడు అగుచున్నాడు.
5. ధనాశతో, బ్రాహ్మణునకు మెత్తని వాడను తలంపుతో, బ్రాహ్మణుని ధ్వంసము చేయ దలచినవాడు దేవతలను హింసించిన వాడగుచున్నాడు. ఇంద్రుడు అట్టి పాపి హృదయమున చిచ్చు పెట్టుచున్నాడు. ద్యావాపృథ్వులు అట్టి విశృంఖలుని ద్వేషించుచున్నవి.
6. బ్రాహ్మణుడు అగ్ని స్వరూపుడు దేహమందున్న ప్రాణరోప అగ్నిని నాశనము చేయువాడు ఉండడు కదా! అట్లే బ్రాహ్మణుని నాశము కోరరాదు. బ్రాహ్మణునకు సోముడు జ్ఞాతి - ఇంద్రుడు బ్రాహ్మణ శాపమును అమలు పరచువాడు అగుచున్నారు.
7. ఏ మలినుడు బ్రాహ్మణుని అన్నము రుచి కరమని భావించి భుజించ దలచునో వాడు వందల ఆపదలను తిన్నవాడగు చున్నాడు. వాటిని నివారించ ప్రయత్నించినను నివారించజాలడు.
8. బ్రాహ్మణుని జిహ్వ నారి - వాక్కు ధనుస్సు - తపమున గట్టి పడిన దంతములు శరములు అగుచున్నవి. అట్టి ధనుస్సుతో బ్రాహ్మణుడు దేవతలను వధించు వారిని బంధించుచున్నాడు.
9. ఆయుధధారి బ్రాహ్మణుడు తన తపోబలమున, క్రోధమున వెంటపడి విడిచిన బాణము ఎంత దూరమున ఉన్నవానికైన తాకి తీరును.
10. వీత హవ్య వంశపు రాజులు వేలమంది రాజ్యములనేలినారు. వారు బ్రాహ్మణుని గోవును గుంజుకొని పరాజితులైనారు.
11. కేసర ప్రాబంధా, చరమాజాన వండిత వీత హవ్యులను దెబ్బతిన్న గోవు ఛిన్నా భిన్నము చేసినది.
12. వంద మంది భూమిని గడగడలాడించిన వారు బ్రాహ్మణ ప్రజను వధించి పుట్టుక లేక పరాజితులైనారు.
13. దేవతలను వధించిన వాడు విషము తాగి విషము సోకినా ఎముకలు కలవాడై జీవించ వచ్చును. దేవ బంధువులగు బ్రాహ్మణులను హింసించిన వారు పిత్రు యానమున కలుగు లోకములకు చేరుకొనజాలరు.
14. అగ్ని మా మాటలు గ్రహించువాడు. సోముడు మాకు జ్ఞాతి. ఇంద్రుడు మా పక్షమున కొట్టువాడు చీల్చువాడు అగుచున్నారు. విద్వాంసులు ఈ విషయము ఎరిగి ఉన్నారు.
15. బ్రాహ్మణుని శరము విషమున మునిగినట్టిది. సర్పము వంటిది. బ్రాహ్మణులు ఆ బాణముచే తనను బాధించు వానిని కొట్టుచున్నారు.
నాలుగవ సూక్తము - 19
వినియోగము :- పూర్వ సూక్తమున చెప్పబడినది.
1. సృంజయులు ఎంతో ఎదిగినారు. ఆ వీతహవ్య గోత్ర సృంజయులు భ్రుగు వంశీయులను వధించినారు. కావున వారు పరాజితులు అయినారు. స్వర్గమును తాక లేక పోయినారు.
2. బృహత్సామ వంతులగు భ్రుగు వంశ బ్రాహ్మణులను ఆపదపాలు చేసినవారు ఉభయ లోకములందు గతి రహితులైనారు. వారి సంతానము నష్టపడినది.
3. బ్రాహ్మణుల మీద ఉమ్మి వేసినవాడు వారి నుండి పన్నులు అడిగినవాడు, రక్తపు నదిలో వెంట్రుకలు తినుచు జీవించును.
4. గోవు మాంసము ఉడికిన రాజ్యమున తేజస్సు నశించును. వర్షము కలిగించు మొనగాడు పుట్టడు.
5. గోవధ క్రూరము. దీనిని తిన్నవాడు దాహార్తుడగును. వధించనున్న గోవు పాలు త్రాగినవాడు పితరులకు పాపము కలిగించిన వాడగుచున్నాడు.
6. ఏ రాజు తాను ఉగ్రుడనని భావించి బ్రాహ్మణుని తినుచో, ఎచట బ్రాహ్మణుడు దుఃఖితుడగునో ఆ రాజ్యము కొట్టుకొని పోవును.
7. బ్రాహ్మణుని బాధించునట్టి రాజ్యమును ఎనిమిదికాళ్ళు, నాలుగు కనులు, నాలుగు చెవులు, నాలుగు గద్దువలు, రెండు ముఖములు, రెండునాల్కలు కలది గడగడలాడించుచున్నది.
8. బ్రాహ్మణులను బాధించిన రాజ్యము రంద్రము పడిన నావ వలె మునిగి పోవును. రాజ్యము ఆపదలందు పడి నష్ట పోవును.
9. నారదా! బ్రాహ్మణుని సద్దనమును తనదని కాజేసిన వానిని చెట్టు సహితము తన నీడకు రానీయదు.
10. రాజా వరుణుడు ఇట్లన్నాడు :-
బ్రాహ్మణుని సద్దనాపహరణము దేవకృతమగు విషమగుచున్నది. బ్రాహ్మణుని గోవును హరించిన రాజ్యమున ఏ ఒక్కడు మేల్కొని ఉండడు.
11. భూమిని గడగడలాడించిన ఎనిమిది వందల పదిమంది మొనగాళ్ళు బ్రాహ్మణ ప్రజను సంహరించి సంతతి లేకుండ ధ్వంసమైనారు.
12. బ్రాహ్మణులకు హాని కలిగించు వారికి దేవతలు పీనుగలు కట్టు త్రాటిని పడకగా ఏర్పరచినారు.
13. దయచూప వలసిన బ్రాహ్మణుని కంటి కన్నీరు తెప్పించిన వానికి దేవతలు అంతమాత్రమే త్రాగునీరు ఏర్పరచినారు.
14. బ్రహ్మజ్యా! శవమును కడిగినన్ని, మీసాలు తడిచేయు నంత నీరుమాత్రమే దేవతలు నీకు వ్రాసిపెట్టినారు.
15. బ్రహ్మజ్యుని మీద మిత్రావరుణులు వర్షించకున్నారు. అతని వద్ద సభా సమర్దులుండరు. మిత్రులు అతని వశమున ఉండరు.
అయిదవ సూక్తము - 20
వినియోగము :-
1. శత్రుసేనలో భయము ద్వేషము కలిగించుటకు భేరి మున్నగు వాద్యములను కడిగి 'తగరోశీరేణ' లేపనము చేసి, సంపాతించి మూడు మారులు వాయించి పురోహితుడు వాదకునకు ఇచ్చునది.
2. మహా వ్రతమున దీనిచే భూమి దుందుభిని మ్రోగించునది.
1. దుందుభీ!మహితముగా ఘోషించుము - బలవంతుని వలె ఘోషించుము. నీవు కర్రతో చేయబడిన దానివి. నీ యందు గోసంబంధమున్నది. నీ ధ్వనిచే శత్రువులను అణచుము. విజయేచ్చ కలిగి నలువైపుల సింహము వలె గర్జించుము.
2. దుందుభీ! నీది వృక్షదశ. కట్టి ఉంచబడిన దానవు. సింహము వలెను - ఎదకు వచ్చిన ఆవు మీదకు పోవు ఆబోతువలెను గర్జించుము. నీవు వృషవు. వర్షము కలిగింతువు. నీ శత్రువులు నిర్వీర్యులు అగుచున్నారు. ఇంద్రునితో సమాన బలము గల దానవు. అభిమానులను భరించ గలదానవు.
3. గోవుల గుంపులో దూరిన ఆబోతును గుర్తించినట్లు - ధనము జయించు కోరిక గలవారు నీ ధ్వనిని గుర్తింతురు. శత్రుహృదయములను దుఃఖపూర్ణములు చేయుము. శత్రువు గ్రామములు వదలి పారిపోవును గాక.
4. మహా ధ్వని చేసి యుద్దములను జయించుము. దండెత్త నున్న సేనను పట్టి మహారావము చేయుము. నీవు దేవ వాణిని వేధించు దానవు. శత్రువుల ధనము తెచ్చి నాకు ఇమ్ము.
5. దందుభి ధ్వనులు విని సచేతనలైన సేనలు జరుపు మారణ కాండను చూచి శత్రుస్త్రీలు బెదరి, తమ పిల్లల చేతులు పట్టుకొని, బిచ్చమెత్తు కొనుచు పారి పోవుదురు గాక.
6. దుందుభీ! తొలుత ధ్వనించుము. శత్రుసేనను నష్ట పరచుము. భూమి వెన్నున కాంతిమయ సత్య వాక్యము నినదించుము.
7. నీ ధ్వని ద్యావాపృథ్వుల నడుమ మ్రోగును గాక. అది గబగబ నలుదిశల వ్యాపించును గాక పైకి ఎగయుచు ప్రశంసనీయ శబ్దసంపన్నవగు నీవు మిత్రులను తొందర పెట్టుటకు బిగుసుకొని నినదించుము.
8. నిపుణులు చేసిన దుందుభి మహాధ్వనులు చేయును. దుందుభీ! బలశాలి చేతులు పైకెత్తినపుడు వానిని ప్రసన్నుని చేయుము. ఇంద్రుడు నీ మిత్రుడు. నీవు శూరులను పిలువుము. మా మిత్రులచే శత్రువులను సంహరింప చేయుము.
9. దుందుభీ! నీవు గర్జింతువు. సేనలను సచేతనులను చేతువు. ధనము తెత్తువు. శుభకార్యములు చేయుదువు. విద్వాంసులను గుర్తింతువు. ఉభయ రాజుల బహు యోధులకు కీర్తి కలిగించుము.
10. దుందుభీ! నీవు శుభంకరివి. ధన విజేతవు. బలవతివి. యుద్దవిజేతవు. మంత్ర ప్రభావవు. పర్వతములు అధిషవణ సమయమున చిన్న చిన్న రాళ్ళను ఆటలాడించినట్లు - శత్రువుల ధనములు హరించి నాట్యము చేయుము.





