Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


 

2.    బలశాలి ఇంద్రా! నీవు అట్టి గుణగణములు కలవాడవు. తండ్రి నుంచి ధన భాగము కోరినట్లు నిన్ను ధనము కొరకు అర్ధించుచున్నాము. యశస్సు వంటి నీ నివాసము ద్యులోకమున ఉన్నది. నీ వంటి సుఖములు మాకు కలుగును గాత.
   
                                            నాలుగవ తృచ : ఋషి - సౌభరి.
   
1.    అగ్నీ! నీవు దేవతలందు అధికదాతవు. హోతవు. అవినాశ్యుడవు. ఈ యజ్ఞనిర్వహకుడవు. యష్టవు. మేము నిన్ను భజించుచున్నాము.
   
2.    అగ్ని జలముల పౌత్రుడు. సుభగుడు. సుదీప్తుడు. జ్వాలావంతుడు. అట్టి అగ్ని దేవయజన భూమియందు మిత్రావరుణుల సుఖము కొరకు యజించునుగాక జలములకు సుఖము కలుగునట్లు యజించునుగాత.
   
                                              అయిదవ ఖండము
                                 మొదటి తృచ : ఋషి - శునశ్శేపుడు.

   
1.    అగ్నిదేవా! నీచేత రక్షించబడువాడును, నీచేత యుద్దములకు ప్రోత్సహించబడినవాడును నిత్యాన్నవంతుడు అగుచున్నాడు.
   
2.    శత్రువులను లక్ష్యపెట్టని అగ్నీ! నిన్ను అర్చించు వానిని గెలువ గలవాడు లేడు. అతని బలములు అందరు వినదగినవై యుండును.
   
3.    సమస్త మానవులందున్న అగ్ని అశ్వములచే యుద్దములను గెలుచునుగాక. అగ్ని ఋత్విజు  సహితుడై ప్రసన్నుడగును గాత.
   
                                           రెండవ తృచ : ఋషి - నోధ.
   
1.    కలసి పనిచేయునవియు, పనిచేయుటకు అటునిటు కదలునవియునగు అంగుళులు సోమమును శుద్ది చేయును. దశాంగుళులు సోమ ప్రేరకములు అగును. హరిత వర్ణ సోమము సూర్యజాతుల వంటి దిశలకు చేరును. సోమము అశ్వ వేగమున ద్రోణ కలశమున వ్యాపించును.
   
2.    సోమము దేవతలచే కోరబడునది. కోరికలు తీర్చునది. అనేకులు అభిలషించునది. తల్లిదండ్రులు శిశువును వలె సోమమును జలములు ఎత్తుకొనుచున్నవి. యువకుడు యువతిని చేరినట్లు అభిషుత సోమము ద్రోణ కలశమున గోఘ్రుతాదులచే కలియుచున్నది.
   
3.    ఆవులు మేయునట్టి గడ్డి మున్నగు వాణిలో ప్రవేశించిన సోమము ఆవు పొదుగును పరిపూర్ణము చేయును. బిందు రూప సోమము ధారలందు కలియును. పాత్రలందున్న సోమమును ఆవులు శుభ్ర వస్త్రముచే వలె తమ పాలచే ఆచ్చాదించును.
   
                                మూడవ తృచ : ఋషి - మేధాతిథి.
   
1.    ఇంద్రా! ఈ సోమము రసమయము. గోఘ్రుతాది యుక్తము. మాచేత అభిషుతము. దీనిని సేవించుము తృప్తుడవగుము. కలిసి పానము చేయు మమ్ము బంధువులను చేసికొనుము. మమ్ము వర్ధిల్లచేయుము. "అవన్తు తే ధియా" నీ అనుగ్రహము మమ్ము రక్షించునుగాక.
   
2.    ఇంద్రా! నీ అనుగ్రహమున మేము అన్నము గలవారలము అగుదుము గాక నీ శత్రువును వేధించుటకు మమ్ము బాధించకుము. నీ రక్షణలు విచిత్రములు. అర్ధించదగినవి. వానితో మమ్ము రక్షింపుము. మమ్ము నిత్యసుఖులను చేయుము.
   
                                  నాలుగవ తృచ : ఋషి - రేణుః.
   
1.    అంతరిక్షమున ఉన్న సోమమునకు ఇరువది యొక్క గోవులు వాస్తవముగా పాలిచ్చును. ఈ సోమము యజ్ఞములందు పెరుగును. తదుపరి ఆ సోమము అన్య నాలుగు జలములందు చేరి పరిశుద్దమగును. ఆ జలములకు కళ్యాణ రూపము కలిగించును.
   
2.    జలములకు కళ్యాణ రూపము కలిగించిన సోమము - స్తుతులచే - ద్యావాపృథ్వులను జలపూర్ణములను చేయును. అత్యంత దీప్త జలములను సోమము ఆచ్చాదించుకొనును. అప్పుడు ఋత్విజులు సోమమును హవియుక్తము చేసి యజ్ఞ సదనమున నిలుపుదురు.
   
                                               ఆరవ ఖండము
                                  మొదటి తృచ : ఋషి - కుత్సుడు   

   
1.    సోమమా! నీవు స్తుతించబడుచున్నావు. పానమునకు వాయువును చేరుము. పవమానవై మిత్రావరుణులను చేరుము. అందరి నేతలు, మనోవేగము గల రథము గల అశ్వినులను చేరుము. వజ్రధారి, వరములిచ్చు ఇంద్రుని చేరుము.
   
2.    దేవసోమమా! నీవు మాకు వస్త్రయుక్తమును, రక్షణలు కలిగించు ధనమును ప్రసాదించుము. పవమాన సోమమా! మంచి పాలిచ్చు ధేనువులను ప్రసాదించుము. మా పోషణ కొరకు ఆనందదాయక సువర్ణనిమ్ము. అశ్వయుక్త రథములనిమ్ము.
   
3.    పావన సోమమా! మాకు ద్యులోక ధనములనిమ్ము. భూలోక ఐశ్వర్యములనిమ్ము. వానిని అనుభవించ దగిన సామర్ధ్యము నిమ్ము. జమదగ్నికి ఇచ్చినటు వంటి ఋషి యోగ్య ధనము నిమ్ము.
   
                                రెండవ తృచ : ఋషి - ప్రియమేథ.
   
1.    ఆది పురుషుడవు, ధనశాలివి అయిన ఇంద్రా! శత్రువును హతమార్చుటకు నీవు వెడలినపుడే భూమండలమును స్థిరపరచినావు. ద్యులోకమునకు ఉన్నత స్థానము కల్పించినావు.
   
2.    అప్పుడే యజ్ఞము ఆవిర్భవించినది. పగటిని కలిగించు సూర్యుడు అవతరించినాడు. ఇంద్రా! పుట్టినవానిని, పుట్టనున్నవానిని నీవు లక్ష్యపెట్టకున్నావు.
   
3.    ఇంద్రా! అపక్వ గోవులందు పక్వ దుగ్ధములు కలిగించినావు. అంతరిక్షమున సూర్యుని స్థాపించినావు.
   
    స్తోతలారా! ప్రవర్గములచే సామమును వెచ్చ చేసినట్లు - స్తోత్రములచే ఇంద్రుని కవోష్ణుని చేయండి. ఇంద్రుని ప్రసన్నుని చేయుటకు బృహత్సామము ఉచ్చరించండి.
   
                                    మూడవ తృచ : ఋషి - అగస్త్యుడు.
   
1.    ఇంద్రా! ఈ మహా సోమము ఎంత తానున్న పాత్రకు చెందునో, అంత నీకు సహితము చెందును. ఈ సోమము మాధకము తృప్తిదము. వృష ద్రవము అన్నవంతము. వేల దానము లిచ్చునది. వరదఇంద్రా! అట్టి సోమమును నీ కొరకు సముపార్జించినాము. దీనిని సేవించుము. ప్రసన్నుడవగుము.
   
2.    ఈ సోమము వరేణ్యము. సహాయకము. సేవన యోగ్యము. శత్రునాశకము అవినాశ్య. ఇంద్రదేవా! అట్టి సోమము నీకు అందునుగాక.
   
3.    ఇంద్రదేవా! నీవు నిక్కముగ శూరుడవు. దాతవు. నేను నరుడను. నా మనోరథము తీర్చుము. అగ్ని తనకు ఆధార భూతమగు పాత్రను కాల్చినట్లు యజ్ఞములు చేయని దస్యులను భస్మము చేయుము.
   
                        

                             దాశరథి రంగాచార్య విరచిత
                          శ్రీమదాంధ్రవచన సామవేద సంహిత
              ఉత్తరార్చిక యందలి పన్నెండవ అధ్యాయము సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.