Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
3. దేవతలారా! హింసకుల ఆయుధములను వాళ్ళ తోళ్ళు వలిచినట్లు విడగొట్టండి. నరుడు బంగారమునకు మోహ వశుడై పట్టినట్లు ఈ కృత్య ప్రయోగించు వానిని పట్టును గాక.
4. ఓషధీ! కృత్యను ప్రయోగించు వాని మీదకే చేయిపట్టి గుంజుకొని పొమ్ము. కృత్యముందు కృత్యను ప్రయోగించు వానిని నిలబెట్టుము. అప్పుడు కృత్య కృత్యను ప్రయోగించు వానిని హతమార్చును గాక.
5. కృత్య కృత్యను ప్రయోగించువాని మీదకు పోవును గాక. శాపము శాపము పెట్టిన వాణి మీదకు పోవును గాక. సమతల ప్రదేశమున రథము తిరిగినట్లు కృత్య కృత్యను ప్రయోగించు వాని చుట్టు తిరుగును గాక.
6. కృత్యను ప్రయోగించిన వాడు స్త్రీ గాని, పురుషుడు గాని - గుర్రమును గుర్రముతో కట్టినట్లు - కృత్యను కృత్యాప్రయోగితో కలిపి కట్టి వేయుదుము.
7. కృత్యా! నిన్ను దేవతలు ప్రయోగించినను, నరులు ప్రయోగించినను ఇంద్రుని తో స్నేహము గల మేము నిన్ను త్రిప్పి పంపగలము.
8. అగ్నీ! నీవు సేనలు గలవాడవు. కృత్యల సేనలను ఎదిరించుము. ఈ ప్రతిహరణ కర్మచే కృత్యను ప్రయోగించిన వాని మీదకు తోలుచున్నాము.
9. వధించు ఆయుధము నెత్తిన కృత్యా! ఎవడు నిన్ను ప్రయోగించినాడో వానిని కట్టు కొట్టు. నిన్ను ప్రయోగించిన వానిని చంపుటకు నిన్ను శక్తివంతను చేయము.
10. కృత్యా! బిడ్డ తండ్రి వద్దకు వలే నీవు నిన్ను ప్రయోగించు వానిని చేరుకొనుము. తోక తొక్కిన పాము తొక్కిన వానిని కాటు వేసినట్లు ప్రయోగించిన వానిని కాటువేయుము. కట్టు మధ్యకు తెగి తననే చుట్టుకున్నట్లు ప్రయోగించిన వానిని చుట్టు కొనుము.
11. గజము మృగము మీద - ఏణి జంతువు మీదకు దూకి పట్టినట్లు కృత్య, ప్రయోగించిన వానిమీదకు దూకును గాక.
12. ద్యావాపృథ్వులారా! కృత్య - ప్రయోగించిన బాణము వలె - కృత్యను ప్రయోగించు వానిని తాకును గాక. కృత్య - మృగము వలె - ప్రయోగించు వాని మీద పడును గాక.
13. అగ్ని వాయువునకు ప్రతి కూలముగ నీరు పల్లమునకు అనుకూలముగ సాగుచున్నది. సమతలమున రథము తిరిగినట్లు కృత్య, ప్రయోగించు వాని చుట్టు తిరుగును గాక.
అయిదవ సూక్తము - 15
వినియోగము -
1) గోవుల రోగశాంతి, పుష్టి, సంతాన వృద్దికి ఉప్పు కలిపిన, తేనె కలుపని నీటిని ఈ సూక్తముచే అభిమంత్రించి గోవులకు త్రాగించునది.
2) దుష్టవక్త నోరు కట్టుటకు 15, 16 సూక్తములచే 'జలతుల' పర్ణిని తేనెలో ముంచి సత్తువులందు జర్జరించి అభిమంత్రించి త్రాగించునది.
3) శాప విమోచనమునాకు అన్నమును 16వ సూక్తముచే అభిమంత్రించి భుజించునది. ఈ కర్మమునందే గృహద్వారమున దీనిచే అభిమంత్రించి మూయునది.
1. ఋతజాత, ఋతావరీఓషధీ! నన్ను నిందించువారు ఒక్కరుగాని పదుగురు గాని
మధుమే మధులాకరః - నీవు తీయని దానవు. నా మాట తీపిచేయుము.
మిగిలిన మంత్రములందు సంఖ్య మాత్రము మారును. అర్ధము చేసి కొనునది.
2. ద్వేచమే వింశతిశ్చ - 2 - 20
3. తిస్రశ్చమే త్రింశచ్చ - 3 - 30
4. చతుస్రశ్చమే చత్వారింశచ్చ - 4 - 40
5. పంచచమే పంచాశచ్చ - 5 - 50
6. షట్ చమే షష్టీశ్చ - 6 - 60
7. సప్తచమే సప్తతిశ్చ - 7 - 70
8. అష్టచమే శీతిశ్చ - 8 - 80
9. నవచమే నవతిశ్చ - 9 - 90
10. దశచమే శతంచ - 10 -100
11. శతంచమే సహస్రంచ - 100 - 1000
నాలుగవ అనువాకము
మొదటి సూక్తము - 16
వినియోగము :- 15వ సూక్తమున చెప్పబడినది.
1. యద్యేక వృషో2సి సృజారసో2సి||
లవణమా! నీవు ఏక వృషభ శక్తి గల దానవు. గోవునకు సంతానము కలిగించుము. కాకున్న నీవు శక్తి హీనవగుదువు.
(నేడు మనము శక్తిని అశ్వముతో లెక్కించుచున్నాము. అదియే అశ్వశక్తి. ఆకాలమున శక్తికి వృషభము కొలమానమైనది. సంఖ్య తప్ప మంత్రార్ధము ఇదియే యని గమనించునది.)
2. యది ద్వి వృషో2సి సృజారసో2సి ||
3. యది త్రి వృషో2సి సృజారసో2సి ||
4. యది చతుర్వుషో2సి సృజారసో2సి ||
5. యది పంచ వృషో2సి సృజారసో2సి ||
6. యది షడ్ వృషో2సి సృజారసో2సి ||
7. యది సప్త వృషో2సి సృజారసో2సి ||
8. యద్వష్ట వృషో2సి సృజారసో2సి ||
9. యది నవ వృషో2సి సృజారసో2సి ||
10. యది దశ వృషో2సి సృజారసో2సి ||
11. యద్యే కాదశో2సి సో2పోదకో2సి ||
లవణమా! నీవు పదకొండవ దానవైన నిర్వీర్యవు అగుచున్నావు.
(దశ శక్తిహీనవైన నిర్వీర్యవు అని. పది వృషభ శక్తి కలిగి పనిచేయకున్న పనికిరాని అగుచున్నది.)
రెండవ సూక్తము -17
వినియోగము :- గోహరణపు అభిచార కర్మమున ఈ సూక్తముచే నేతల పదములు ఖండించున 'నేత్ర్రూణాం పధం వృశ్చతి" దీనిని దొంగల వెనుక చదువునది.
1. బ్రహ్మ కిల్బిషే - బ్రహ్మాపరాధ విషయమున సూర్యచంద్రులు - జలదేవత వరుణు జలదేవి, ఋతము కన్న ముందు పుట్టిన దేవతలు వచించియున్నారు.
2. ప్రథమ రాజగు సోముడు కోపము లేనివాడై బ్రహ్మ జాయను ఇచ్చినాడు. అప్పవరుణుడు సూర్యుడు అతని వెంట ఉన్నారు. అగ్నిహోత అయినాడు. చేయి పట్టుకొని తీసికు వెళ్ళినాడు.
3. ఈమె బ్రహ్మజాయ అని తెలిసినపుడు స్వయముగ తోడ్కొని పోవలెను. దూతను పంపరా స్వయముగ తోడ్కొని పోయినచో క్షత్రియ రాజ్యమునకు రక్షణ కలుగును.
4. దేనిని తారక అందురో, ఏది వికేశియగునో, ఏది దుర్గతికి కారణమగునో అట్టి ఉల్క గ్రామము మీద పడినపుడు రాజ్యమునకు హాని కలుగుచున్నది. అట్లే బ్రహ్మజాయ సహితము ఆ రాజ్యమును నష్టపరచును.
5. బ్రహ్మచారి పరివ్యాప్తి చెందుచు ప్రజలందు తిరుగునపుడు దేవతల ఒక అంగము అగుచున్నాడు. సోమపు చమసమును దేవతలు అందుకున్నట్లు బ్రహ్మచారి ద్వారా బృహస్పతి జాయను పొందినాడు.
6. స్వర్గమందు తపమాచరించు సప్తర్షులు, దేవతలు పూర్వము ఇట్లన్నారు.
బ్రాహ్మణ భార్యను లేవదీసుకొని పోయిన అది స్వర్గమునకు భయంకరము అగుచున్నది. దుస్థితి కలిగించుచున్నది.
7. గర్భ పాతములకు, లోకము తలక్రిందులగుటకు, వీరులు కొట్టుకొని చచ్చుటకు బ్రహ్మజాయకు అపచారమే కారణమగుచున్నది. ఆమె వీరందరను హతమార్చుచున్నది.
8. ఒక స్త్రీకి అబ్రహ్మణ పతులు పదిమంది ఉన్నను విధివిహితముగ పాణి గ్రహణము చేసిన బ్రాహ్మణుడు ఒక్కడే ఆమెకు భర్తయగుచున్నాడు.
9. క్షత్రియుడు, వైశ్యుడు కాదు - బ్రాహ్మణుడు మాత్రమే పతియగుచున్నాడు. ఈ విషయమును సూర్యుడు పంచ జనులకు చెప్పుచు సాగుచున్నాడు.
10. సత్యము గ్రహించిన రాజన్యులు, మానవులు, దేవతలు బ్రహ్మజాయను పునః పునః ఇచ్చినారు.
11. బ్రహ్మజాయను తిరిగి ఇచ్చినవారు దేవతల వలన దోష రహితులు అగుచున్నారు. వారు భూమికి బలము కలిగించు అన్నమును విభజించి కీర్తిమంతులై ఉపాసించుచున్నారు.
12. ఏ రాజ్యమున మోహపరవశులు బ్రహ్మజాయను పట్టుచున్నారో ఆ రాజ్యమునకు వందలశుభములు కలిగించు స్త్రీలు తల్పమున శయనించకుందురుగాక.
13. ఏ రాజ్యమున మోహపరవశులు బ్రహ్మజాయను పట్టుచున్నారో ఆ రాజ్యమున ఏ ఇంటను విశాల కర్ణుడు, మేధావులు జన్మించకున్నారు.
14. ఆ రాజ్యపు రాజు క్షాత్రము మెడలో నిష్కములు ధరించి 'సూన'కు ముందు నడువజాలదు.
15. ఆ రాజు యొక్క నల్లని చెవుల అశ్వము రథము నందు శోభిల్లదు.
16. ఆ క్షాత్రమున పుష్కరిణులు, తామరలు పుట్టవు.
17. అచటి ఆవుల పాలుపితుకు వారికి ఏ మాత్రము పాలురావు.





