Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
పన్నెండవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - గోతముడు లేక వసిష్ఠుడు.
ఉప ప్రయన్తో అధ్వరం మన్త్రం వోచే మాగ్నయే |
ఆరే ఆస్మే చ శృణ్వతే ||
1. మేము అధ్వరము అనుష్టించువారలము. మేము అగ్నిని మంత్ర రూపమున స్తుతింతుము గాక. అగ్ని దూరము నుండి సహితము వీనిని వినగలవాడు.
2. అగ్ని అనాది కాలపు వాడు. హతమార్చు శత్రువులు గుమికూడినపుడు హవిస్సులర్పించు వారి ధనములను అగ్ని రక్షించుచున్నాడు.
3. అగ్ని పరమ కళ్యాణ స్వరూపి. అతడు మా ధనములను శత్రువుల నుండి రక్షించునుగాత. మమ్ము పాపముల నుండి రక్షించును గాక.
4. అగ్ని శత్రునాశకుడు. రణ, రణమున ధనంజయుడు. అగ్ని అరణ్యములందు వెలువడినాడు. నరులు అట్టి అగ్నిని స్తుతింతురుగాత.
రెండవ తృచ : ఋషి - భరద్వాజుడు.
1. అగ్ని దేవా! నీ అశ్వములు సాధువులు. వేగవంతులు. సావధనముగా నీ రథమును చేర్చగలవి. వానినే నీ రథమునకు కట్టుము.
2. అగ్నీ! మా ఎదుటికి రమ్ము. హవిని ఆరగించుటకు, సోమపానము చేయుటకు హవిస్సులు అందుకొనుటకు దేవతలను ఆహ్వానించుము.
3. యజ్ఞములను భరించు అగ్నీ! ఉన్నతుడవై ప్రజ్వరిల్లుము. జరా రహిత. ద్యోతమాన అగ్నీ! నీ అవిచ్చిన్న తేజమున సకల లోకములను ప్రకాశింపచేయుము.
మూడవ తృచ : ఋషి - వాశ్య ప్రజాపతి.
1. సోమము అభిషుతము. భోజనయోగ్యము. యజ్ఞవిఘ్నకారి శునకము అభిషవధ్వని వినకుండును గాక. భ్రుగువులు యజ్ఞవిఘ్నకారులను చేసినట్లు శునకమును తొలగించండి.
2. సోమము దేవతల బంధువు. తల్లిదండ్రుల చేతులలో బిడ్డవలె సోమము దశాపవిత్రమున నిలిచి ఉన్నది. జారుడు వ్యభిచారిణి కొరకు, వరుడు కన్య కొరకు వలె సోమము స్వస్థానమగు కలశమునకు చేరుచున్నది.
3. సోమము బలసాధనము. శక్తిమంతము. సోమము ద్యావాపృథ్వులను తన తేజమున నింపుచున్నది. యజమాని ఇంటికి చేరినట్లు సోమము దశాపవిత్రము నుండి కలశమునకు చేరుచున్నది.
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషి - సౌభరి.
1. ఇంద్రా! నీవు పుట్టుకతోనే శత్రు రహితుడవు. అనాదిగా నిన్ను నియంత్రించువారు లేనే లేరు. నీవు స్నేహము కోరినపుడు యుద్దము చేయుచునే స్తోతలకు మిత్రుడవగుదువు.
2. ఇంద్రా! కేవలము ధనవంతునితో యజ్ఞయాగాదులు చేయనివానితో, నీవు స్నేహము చేయవు. సుర త్రాగువారు నిన్ను ప్రసన్నుని చేయజాలరు. నిన్ను స్తుతించు వారిని నీకు ఆత్మీయులనుగా చేసికొన్నప్పుడు వారికి ధనాదులు ప్రసాదింతువు. తదుపరి అతనిచే తన తండ్రిని వలె ఆహ్వానించ బడుదువు.
రెండవ తృచ : ఋషి -మేధాతిథి లేక మేధ్యాతిథి.
1. ఇంద్రా! నీ అశ్వములు హవిసహితములు. కేశములు కలవి. సువర్ణ రథమునకు పూన్చబడినవి. వందలు, వేల ధనములు కలవి. ఆ అశ్వములు నిన్ను సోమపానమునకు తీసికొని వచ్చునుగాత.
2. ఇంద్రా! నీది బంగరురథము. దానికి కట్టిన గుర్రముల వీపులు తెల్లనివి. వాటి తోకలు నెమలి పించముల వంటివి. అవి నిన్ను మధుర రస, స్తుతి యోగ్య సోమపానమునకు యజ్ఞ భూమికి చేర్చునుగాత.
3. వేదస్తుత్య ఇంద్రా! ఈ సోమము అభిషవాదులచే సంస్కరించబడినది. రసయుక్తముగ సిద్దమై ఉన్నది. వాయువు దేవతలందరి కన్న ముందు సోమపానము చేసినట్లు నీవు ఆ సోమమును పానము చేయుము. ఇది సురుచిర హర్షదాయక సోమమగును.
మూడవ తృచ : ఋషి - ఋజిశ్వ.
1. ఋత్విజులారా! అశ్వమువలె వేగవంతము, స్తుతియోగ్యము. జలముల, వెలుగుల ప్రేరకము. ద్రవము. నీటిలో తేలియాడు సోమమును శుద్దిచేయండి. తడపండి.
2. సోమము సహస్ర ధారలది. దుగ్ధము వలె ప్రియము. దానిని దేవతల కొరకు అభిషవించండి దివ్యము, సత్య స్వరూపము, మహత్తరము, జలోత్పన్న సోమము వసతీవరీ నామక జలమున పెరుగును.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - భరద్వాజుడు.
1. అగ్ని చక్కగ ప్రజ్వలించువాడు. శ్వేతవర్ణుడు. హవిస్సులు అందుకొనువాడు. స్తుతి యోగ్యుడు. స్తోతలకు ధనప్రదుడు. అట్టి అగ్ని శత్రువులను సంహరించుచున్నాడు.
2. అగ్ని ద్యావాపృథ్వులు తండ్రి తల్లులుగా అక్షయుడై విద్యుద్రూపమున ఆవిర్భవించినవాడు. అతడు యజ్ఞపు ఉత్తరవేది యందు ఆసీనుడు అయినాడు.
3. విజ్ఞుడవు, ద్రష్టవగు అగ్నీ! దేవతల వద్ద ఉన్న దివ్యాన్నము వంటి పుత్ర, పౌత్రాదులతో కూడిన ధనమును మాకు ప్రసాదించుము.
రెండవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. ఈ సోమమునకు హిరణ్యము ప్రేరకము. ఇది పవిత్రము. దీప్తము. దేవతలకు చేరునది. హోత పశుమంతమగు యజ్ఞశాలకు చేరినట్లు, ఈ అభిషుతసోమము శబ్దము చేయుచు పవిత్రమున చేరుచున్నది.
2. సోమమా! నీవు శుభప్రదవు. సంగ్రామ యోగ్యవు. తేజోమూర్తివి. మహా కవులు, అనుభవజ్ఞులగు స్తోతలను ప్రశంసించుదానవు. ద్రష్టవు. అప్రమత్తవు. అభిషుతమగు నీవు యజ్ఞ పాత్రలందు ప్రవేశించుము.
3. సోమము యశోవంతులందు యశస్వి. భూమి మీద పుట్టినది. తృప్తినిచ్చునది. ఉన్నిగల పాత్రలందు వడకట్టబడినది. పవిత్రము. అట్టి సోమమా! నీవు అంతరిక్షమున నినదించుము. "యూయం పాతస్వస్తిభిః సదానః" మీరు మాకు నిత్యము శుభములు కలిగించుచు పోషించండి.
మూడవ తృచ : ఋషి - తిరశ్చి.
ఋషులు తమలోతాము అనుకొనుచున్నారు:-
1. రండి - రండి. త్వరగా రండి. సామ మంత్రములు పరిశుద్దము. ఆ మంత్రములచే ఇంద్రుని స్తుతింతము. వర్ధిల్లచేయుదము. పరిశుద్దము, గోఘ్రుతాది మిశ్రిత సోమము ఇంద్రుని ప్రసన్నుని చేయునుగాత.
2. పరిశుద్దుడవైన ఇంద్రా! మా వద్దకు విచ్చేయుము. పరిశుద్ద మరుత్తులచే పాపరహితునిగా చేయబడిన ఇంద్రా! విచ్చేయుము. పరిశుద్దుడవైన ఇంద్రా! మమ్ము ధనములందు నిలుపుము. సోమము నీకు ఆనందము కలిగించును గాత.
3. పరిశుద్ద ఇంద్రా! మాకు ధనము ప్రసాదించుము. పరిశుద్దుడవగు నీవు రత్నములనిమ్ము. పరిశుద్దుడవై యజ్ఞ విఘ్నకారులను హతమార్చుము. మాకు అన్నము కలిగించుము.
(ఇంద్రుడు వృత్రాదులను సంహరించుట వలన అతనికి పాపము కలిగినది. ఋషులు అతనికి పాప పరిహారము చేసి పరిశుద్దుని చేసినారను వృత్తాంత సందర్భము.)
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - సుతంభరుడు.
1. అగ్ని సూర్యరూపి. ఆకసమున ప్రకాశించువాడు. మేము ధనము కోరువారలము. అగ్నిని గూర్చి సాధక స్తుతులు ఉచ్చరించుచున్నాము.
2. మానవులందు హోమ సంబంధమై, సిద్ది కలిగించు అగ్ని ఉన్నది. అతడు మా స్తుతులను సేవించును గాత. దేవ సంబంధులను యజించునుగాక.
3. అగ్నీ! నీవు నిత్య ప్రసన్నుడవు. వరేణ్యుడవు. హోమసాధకుడవు. అందరిని మించినవాడవు. యజమానులందరు నీ ద్వారానే యజ్ఞామష్టానము చేయుచున్నారు.
రెండవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. సోమము మూడు స్తోత్రములది. కోరికలు తీర్చునది. అన్నదాత. ధ్వనించునది. స్తోతల వాక్ శబ్దములు సోమము వైపు సాగుచున్నవి.
సోమము వరణుని వలె జలములను ఆచ్చాదన చేసికొనునది. ప్రవహించునది. రత్నదాత. అది స్తోతలకు ధనము నిచ్చుచున్నది.
2. సోమము శూర సమూహము గలది. అనేక మంది వీరులు కలది. సహనశీల. శత్రుంజయ. ధనదాత. పదనైన ఆయుధములు కలది. వేగవంత ధనువు కలది. యుద్దమందు ఎదురులేనిది. శత్రువును లక్ష్య పెట్టనిధి. అట్టి సోమమా! నీవు కలశము వర్షించుము.
3. సోమమా! నీ మార్గములు విశాలములు. నీవు స్తోతలకు అభయము ఇచ్చుదానవు. ద్యావాపృథ్వులను కలుపుచు వర్ణించుము. జలము, ఉష, సూర్యుడు, కిరణములకు పుష్టి కలిగించుము. నినదించుము. మాకు అనేక అన్నములను ప్రసాదించుము.
మూడవ తృచ : ఋషి - నృమేధ లేక పురుమేధ.
1. ఇంద్రా! నీవు అన్నమును, బలమును రక్షించువాడవు. సోమమునకు స్వామివి. యశశ్వివి. తలవంచనివాడవు. యజమానులను కాపాడువాడవు. వంటరిగా అప్రతిహత వీరులను హతమార్చువాడవు.





