Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

4.    స్వధావంత వరుణా! నీ వంటి విద్వాంసుడు గాని, మేథావి గాని, ధీరుడు గాని లేకున్నాడు. నీవు సమస్త లోకములు తెలిసిన వాడవు. అందుకే ఈ మాయల మనిషికి నీ వన్న భయము.
   
    (జ్ఞానము మాయలను మించినది.)
   
5.    వరుణదేవా! నీవు స్వధావంతుడవు. సద్గుణ సంపన్నుడవు. ప్రాణ సమస్త జన్మలు తెలిసినవాడవు.
   
    రజస్సును మించినది ఏది? దానిని మించినది ఉన్నదా? విశాల అంతరిక్షమేది?
   
6.    రజోగుణమును మించినది సత్వగుణము. దానిని మించినది అవినాశ్యము.
   
    వరుణదేవా! నేను ఇది తెలిసిన వాడను. నీకు విశ్వాసముతో చెప్పుచున్నాను. నా ముందు పణులు తల వంచెదరు గాక. దాసులు నేలవాలుదురు గాక.
   
7.    వరుణదేవా! నీవు మరల మరల లభించు ధనమును గురించి అనేక రహస్యములు వివరించుచున్నావు. నీవు పణులకు అని చెప్పుకున్న వారు నిన్ను 'ధనహీనుడు' అన వచ్చును.
   
8.    స్తోతా! నీకు కొద్ది దక్షిణ ఇచ్చుచున్నాను. అట్లని జనులు నన్ను ధనహీనుడు అనకుందురు గాక. నా స్తుతులు విశ్వము వినును గాక. దిక్కులు వినును గాక. జనులు విందురు గాక.
   
    (అంత గొప్పగా స్తుతించమని.)
   
9.    వరుణదేవా! నీ స్తుతులు సమస్త దిశలందు, లోకములందు, మానవులందు పరివ్యాప్తములగును గాక. నీవు ఇవ్వని వానిని నాకు ప్రసాదించుము. మే సప్తపదా సఖాసి - నీవు నాకు ఏడు అడుగులమిత్రుడవు.
   
    ("స్నేహంసాప్త పదీన ముచ్యతే" అన్నాడు కాళిదాసు. ఏడడుగులు నడిచినను, ఏడు మాటలు మాట్లాడినను స్నేహమగుచున్నది అని అర్ధము. వివాహము ఏడడుగుల బంధమగుచున్నది. స్నేహము వివాహము వంటి విడువరానిది.)
   
10.    వరుణదేవా! మనము సమాన బంధువులము నీ సంతానము నా సంతానము. నా సంతానము నీ సంతానము అట్లు బిడ్డలు మన ఇద్దరి వారు అగుచున్నారు. ఆ విషయము నాకు తెలియును. నీకు ఇవ్వని వానిని ఇచ్చుచున్నాను. "తేసప్త పదః సఖాస్మి".
   
11.    దేవతలు దేవతలను స్తుతించుచున్నారు. మేధావులగు విప్రులు విప్రులను స్తుతించుచున్నారు.
   
    స్వధావంత వరుణదేవా! నీవు అట్లు కాదు. దేవతల బంధువులు, మాకు తండ్రి వంటి వారగు అథర్వ వేత్తలను మాకు తెలియ పరచినావు.
   
                                            రెండవ సూక్తము - 12
   
వినియోగము :- వశాశమన కర్మమున వపను నాలుగు ముక్కలు చేయునది. ఒక ముక్కను ఈ సూక్తముచే, రెండవ దానిని 27వ సూక్తముచే, మూడవ దానిని ఈ రెండు సూక్తములచే నాలుగవ దానిని 'అనుమతయే స్వాహా' చే హోమము చేయవలెను.
   
1.    జాతవేదాగ్నీ! నీవు దేవతవు. ప్రస్తుతము మానవుల యజ్ఞ గృహమున ప్రదీప్తుడవగుచున్నావు. దేవతలను కలసి కొనుచున్నావు. నీవు మిత్రులను ఆదరించువాడవు. జ్ఞానివి. దేవతలను ఆహ్వానించుము. నీవు దేవదూతవు. కవివి. విజ్ఞానివి.
   
2.    అగ్నీ! నీవు దేహములను రక్షించు సుజిహ్వుడవు. సత్యలోక మార్గమును మధుఉతో తడిపి ఆస్వాదించుము. నీవు సదాలోచనలను, యజ్ఞములను వర్ధిల్ల జేయుచు మా యజ్ఞమును దేవతలకు చేర్చుము.
   
3.    అగ్నిదేవా! నీవు పూజనీయుడవు. విశ్వములకు వందనీయుడవు. మేము ఆహ్వానించినపుడు వసువులతో కూడి సమాన ప్రీతి గలవాడవై విచ్చేయుము. నీవు దేవతల ఆహ్వాతవు. మా ప్రేరణ కలిగి దేవతలను యజింపుము. నీవు మానవులకు పరమ పూజ్యుడవు కదా!
   
4.    ఆహవనీయ అగ్ని సామిదేని ఘ్రుతభాగము ఆధారముగ పూర్వాహ్నమున బహువిధముల వ్యాపించుచున్నది. ఇది అన్యజ్యోతుల కన్న విశిష్టము, మహత్వమయము. ఇది యజమానికి, భూమికి సుఖము కలిగించుచున్నది.
   
5.    అగ్ని జ్వాలలు హవ్యావాహకములు. కరిగించునవి. రాక్షసులను నిలిపి ఉంచునవి. అందువలన అవి ద్వారరూపలు. వాటి మార్గములు అనేకములు. పతిని చేరు పత్నుల వలె ఆ జ్వాలలు దేవతల వైపు సాగుచున్నవి. అవి సుఖ ప్రదలు అగును గాక.
   
6.    ఉషస్సు, రాత్రి యజ్ఞ సంపాదికలు. అవి రెండు కలిసిఉండునవి. మందహాసమున దేవతలను కూడునవి. ఇవి దివ్యములు. మహత్వము కలవి. శుక్లదీప్తములు యజమానికి శుభ్ర సంపదలు కలిగించుచున్నవి.
   
7.    అగ్ని వాయువులు దేవ హోతలు. వారు మానవ హోతల కన్నా విశిష్టులు. మధుర భాషణులు. మానవులను యజ్ఞములకు ప్రోత్సహించువారు. యజ్ఞ నిర్మాతలు. వీరి కాంతి ప్రాచీనము. అది దిశలను కాంతివంతము చేయుచున్నది.
   
8.    అగ్నియొక్క కాంతి పృథ్విని, సరస్వతిని సచేథానము చేయున్నది. మానవులు ఆహ్వానించినంత మనిషి ఆరాటముగా భోజనమునాకు చేరినట్లు - అగ్ని విచ్చేయును గాక. సత్కర్మల ఇడ, భారతి, సరస్వతి విచ్చేసి కుశాసనములపై ఆసీనులు అగుదురు గాక.
   
9.    ద్యావాపృథ్వులు సమస్త భూత ఉత్పాదకులు. త్వష్ట వారికి అనేక రూపములు కలిగించుచున్నాడు. యజనీయ అగ్నీ! మా ప్రార్దనల నాలకించి అట్టి త్వష్టను ఆరాధించుము.
   
10.    దేవా! స్వాధికారమును ప్రకటించుము. దేవతల భాగమగు హవిస్సులను ఋతువులను అనుసరించి అందించుము. వనస్పతి, శమిత, అగ్ని ఘ్రుత, జలములచే ఈ హవిస్సును రుచికరము చేయుదురుగాక.
   
    ("మృత్యుః శమితా" అని తాండ్ర్యము. హవిస్సు జీవముండగా సాధ్యపడదు.)
   
11.    అగ్ని సద్యోజాతుడు. పుట్టగనే యజ్ఞకారకుడు అగుచున్నాడు. అగ్ని దేవతలకు పురోగామి అగుచున్నాడు. దేవతల ఆహ్వాత అగ్ని ఉత్తర వేది యందు ఆసీనుడై ఉన్నాడు. అతనియందు స్వాహాకృత హవిని దేవతలు ఆరగింతురుగాక.
   
                                                మూడవ సూక్తము -13
   
వినియోగము :- విషచికిత్స యందు.
   
    మొదటి ఋక్కు అన్ని విష చికిత్సలందు - తక్షక విష చికిత్స యందు.
   
    రెండవ ఋక్కుచే కట్టు కట్టునది. మూడవ దానిచే కాటువేసిన చోట వత్తునది. నాలుగవదానిచే గురు ప్రదక్షిణ చేయునది. ఇంటిగడ్డితో నీరు కాచి 5వ ఋక్కుచే అభిమంత్రించి కాటు తిన్న మనిషికి త్రాగించునది - మీద చల్లునది. అవ దానిచే వింటవారిని అభిమంత్రించి కట్టునది. 7,8 మంత్రములచే తేనెటీగ గూటి మట్టిని, మధువృక్ష మృత్తికను అభిమంత్రించి త్రాగించునది.
   
    నవమ్యాశ్వావిత్పురీషమ్. త్రిశుక్లయా మాంసం ప్రాశయతి. దశమ్యా లాబూనాచమయతి. ఏకాదశ్యా నాభిం బధ్నాతి.
   
    అభిచారక కర్మయందు కూడ దీని వినియోగము.
   
1.    వరుణుడు దేవత కవి. అతడు నాకు ఉపదేశించినాడు. అట్టి భీషణ వాక్కుచే నీ విషమును విరుచుచున్నాను.
   
    కండలోనికి దిగిన దిగని - పైన గల విషమును మట్టిలో పడిన అన్నము వలె వ్యర్ధము చేయుచున్నాడు. ఇప్పుడు నీ విషము విరిగి పోయినది.
   
2.    దేహమందలి తేమను, ఎండగొట్టు విషమును నాడులందు పట్టి నిలిపివేసినాను. నీలోని ఉత్తమ, మధ్యమ, అధమ రసములను పిండి వేసినాను. భయపడి విషము దిగి పోవునుగాక.
   
3.    నా పలుకు అమృతవర్షిణి. నా మాట మేఘ గర్జన. అట్టి వాక్కుచే సర్పమును బాధలు పెట్టుచున్నాను. అంధకారమునుండి సూర్యుడు ఉదయించినట్లు నరుని యందలి విషమును హరించినాను.
   
4.    సర్పమా! నా నేత్ర శక్తిచే నీ కంటిని పొడుచుచున్నాను. విషమున నీ విషమును విరుచుచున్నాను. చావుము. బ్రతుకకుము. నీ విషము నీలోనికే మరలునుగాక.
   
5.    కిరాతకులు తిరుగు అడవియందు పుట్టిన తుచ్చ సర్పములారా! గడ్డిలో ఉండు నీచ సర్పములారా! న శాపము వినండి. నా మిత్రుల స్థానములందు ఉండకండి. ఈ శాపమును ఇతర సర్పములకు వినిపించండి. మీ విషము నందు మీరే రమించండి.
   
6.    నల్లని పాముల, చేమ నేల పాముల, ఎరుపు పాముల, పొడి నేలలందున్న పాముల, సాత్రాసహ పాముల క్రోధమును వింటి నారిని దించినట్లు, మరుభూమిలో రథమును దించినట్లు దించుచున్నాను.
   
7.    సర్పములారా! మీ తల్లిదండ్రులను, అలగి విలుగులను, బంధువులను బాగుగా ఎరుగుదును. అరసాః కిం కరిష్యథ? నీరసపడిన మీరు ఏమి చేయగలరు?
   
8.    భూరి గూలా వృక్షమున పుట్టినందున దానికి పుత్రికయైన సర్పము కృష్ణ సర్పిణికి దాసి యగుచున్నది. కోరలలో విషముండి క్రోధించు సకల సర్పిణుల విషము నిర్వీర్యమగునుగాక.
   
9.    గిరులందు సంచరించు చెవులు గల 'శ్వావిత్' ఇట్లు అన్నది.
   
    త్రవ్విన గుంతలందున్న సర్పిణుల రసము నిర్వీర్యము అగునుగాక.
   
10.    నీవు తాబువవు కావు. తాబువవు కానే కావు. నీవు తాబువవు అగుట లేదు. తాబువముచే విషము దిగిపోవును.
   
    తస్తువంత తస్తువం న ఘేత్ త్వమసి తస్తువమ్ |
    తస్తువే నారసం విషమ్ ||

   
    పై మంత్రపు 'తాబువ' స్థానమున 'తస్తువ' చేరినది.
   
                                           నాలుగవ సూక్తము - 14
   
వినియోగము :- కృత్యా ప్రతిహరణమున ఈ సూక్త పాఠము ఉన్నందున కృత్యా ప్రతిహరణ గణము నందెల్ల దీని వినియోగము.
   
1.    ఓషధీ! వరాహము తన ముట్టెతో త్రవ్వగా తొలుత గరుత్మంతుడు నిన్ను కనుగొన్నాడు. నీవు కృత్యవై మమ్ము వధించ దలచు వారిని వధించుము.
   
2.    ఓషధీ! యాతు ధాను యాతనలు కలిగించు వారలను వధించుము. కృత్యను ప్రయోగించు వారిని వధించుము. మమ్ము బాధించ దలచిన వారినెల్ల వధించుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.