Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
పదకొండవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - మేధాతిథి.
సుషమిద్దో న ఆ వహ దేవాం అగ్నే హవిష్మతే| హోతః పావక యక్షిచ |
1. అగ్నీ ఉజ్జ్వలముగ ప్రజ్వరిల్లుము. మా యజమాని కొరకు దేవతలను ఆహ్వానించుము. పావకుడవు. హోతవగు అగ్నీ! ఆ దేవతలను నీవే యజించుము.
2. కవీ! నీవు తనూనపాత అగ్నివి. మమ్ము రక్షించుటకు గాను నేడు మధుమన్తమగు మా యజ్ఞమును దేవతలకు చేర్చుము.
3. అగ్నీ! నీవు ప్రేమగలవాడవు. తీయని పలుకుల వాడవు. నరాశంస నామకుడవు. ఇప్పటి ఈ యజ్ఞమందలి హవిస్సులను దేవతలకు అందించుమని నిన్ను ఆహ్వానించుచున్నాము.
4. అగ్నీ! నీవు మానవులకు హితకరుడవు. హోతవు. సుఖతమ రథమున దేవతలను యజ్ఞ భూమికి తీసికొని రమ్ము.
రెండవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. పాప నాశకులగు మిత్రుడు, ఆర్యమ, భగుడు, సవిత నేటి సూర్యోదయమున మాకు ధనము ప్రసాదింతురు గాక.
2. మిత్రాది దేవతలారా! మీరు విచ్చేసినంత మాకు రక్షణలు కలుగును గాక. మమ్ము పాపముల నుండి తరింప చేయుదురు గాక.
3. మిత్రాది దేవతలు, అదితి మాత సురక్షితములగు మా కర్మములకు ప్రభువులు అగుచున్నారు. వారు మాకు ప్రభువులు, మాకు ధనము ప్రసాదించగల శక్తి గలవారలు అగుచున్నారు.
మూడవ తృచ : ఋషి - ప్రగాథుడు.
1. "ఉత్త్వా మదస్తు సోమాః" ఇంద్రదేవా! సోమములు నీకు మరింత ఆనందము కలిగించునుగాక. వజ్రాయుధధారీ! మాకు అన్నము కలిగించుము. వేదవిద్వేషులను హతమార్చుము.
2. ఇంద్రా! నీవు మహానుడవు. నీకు సరివచ్చు వారు లేరు. యజ్ఞములందు ధనదానము చేయని లోభులను కాలి క్రింద నలిచివేయుము.
3. ఇంద్రా! నీవు సంస్కరించబడిన, సంస్కరించబడని సోమములకు అధిపతివి. త్వం రాజా జనానామ్ - నీవు జనులకు రాజువు.
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషి - పరాశరుడు.
1. సోమము అప్రమత్త, సత్య స్వరూప స్తుతల ప్రజ్ఞాత. అది అభిషుతమగుచు పాత్రలందు ప్రవేశించును.
అధ్వర్యుల హస్తములు పరస్పరము సహకరించుకొనునవి. కోరికలు కలవి. యజ్ఞములను నిర్వహించునవి. అవి సోమమును తాకుచున్నవి.
2. సోమము అభిషుత యజ్ఞసాధక. అది ప్రేరణ కలిగించు ఇంద్రుని చేరుచున్నది. ద్యావాపృథ్వులను తన మహిమచే నింపుచున్నది.
సోమము ప్రియ పదార్ధములను ఇచ్చునది. అత్యంత ప్రియధారల సోమము మమ్ము రక్షించుచున్నది. నేను సోమ భ్రుత్యుడను. సోమము మాకు ధనములు ప్రసాదించునుగాత.
3. సోమము వర్ధిల్లునది. వర్ధిల్ల చేయునది. దశా పవిత్రమున పరిశుద్దమగునది. అది తన తేజో రూపమున మమ్ము రక్షించునుగాత.
సోమము ప్రసన్నమైనంత స్థానజ్ఞులు, సర్వ విదులైన మా పూర్వ పితరులను గ్రోగ్రహణమునకు గాను పర్వతముల వైపు సాగుచున్నారు.
రెండవ తృచ : ఋషి - ప్రగాథుడు.
1. మిత్రులారా! ఇంద్రుని తప్ప ఇతఃరులను స్తుతించకండి. బలహీనులు కాకండి. సోమము అభిషుతమైనంత వరదుడగు ఇంద్రుని సామూహికముగ స్తుతించండి. ఇంద్రుని గూర్చిన మంత్రములను మరి మరి ఉచ్చరించండి.
2. ఇంద్రుడు వృషభము రీతి శత్రువును దెబ్బతీయువాడు. గోవు వంటి వేగవంతుడు. శత్రు పుత్రులను తరిమి కొట్టువాడు. శత్రు ద్వేషి. ఆరాధనీయుడు. ఆగ్రహానుగ్రహ సమర్ధుడు. పరమదాత. ఇహ పర ఐశ్వర్యవంతుడు. అట్టి ఇంద్రునే స్తుతించండి.
మూడవ తృచ : ఋషి - మేధాతిథి.
1. అత్యంత మధురములగు వేదస్తుతుల ఉచ్చారణ స్వరములు పైపైకి వ్యాపించుచున్నవి. అప్పుడే శత్రువులను జయించుచు, ధనములు సంగ్రహించుచు పటిష్ఠ రక్షణలు గల అన్నము కోరు రథములు భువి మీద సంచరించుచున్నవి.
2. స్తోతలు కణ్వుల వలె స్తుతించుచు, ధ్యానించుచు సూర్యుని వలె ఇంద్రునకు వ్యాప్తి కలిగించుచున్నారు. యజ్ఞమును ఆరాధించు ఋత్విజులు ఇంద్రుని అర్చించుచున్నారు. స్తుతులచే ప్రశంసించుచున్నారు.
నాలుగవ తృచ : ఋషి - రుణ లేక త్రసదస్యు.
1. సోమమా! మాకు అన్నము అందించుటకు అన్నివైపుల నుండి చేరుకొనుము. నీవు సహన శీలవు. శత్రువులను ప్రతిఘటించుము. మా రుణములను తీర్చుము. మా శత్రువులను దెబ్బతీయుటకు రమ్ము.
2. పవమానమా! జలములు ధరించు అంతరిక్షమున నీ స్వశక్తితో సూర్యుని సృష్టించినావు. ఇది నిజము.
సోమమా! నీవు స్తోతలకు గవాది పశువులను ఇచ్చుదానవు. జ్ఞానివి. వేగవంతవు. నీవే సూర్యుని సృష్టించినావు.
3. సోమమా! నీవు అభిషుతవైనావు. మాదకమవు అయినావు.
ఐదవ తృచ : - ఋషి - ఋణ లేక అసదస్యు
1. సోమమా! చక్కగా ప్రవహింపుము.
2. సోమమా! నీవు దీప్తవు. దివ్యవు. పానయోగ్యవు. అమృతత్వము కొరకును, మహాపదము కొరకును వర్షించుము.
3. సోమమా! క్రతువు కొరకును, సాహసము కొరకును ఇంద్రుడు నిన్ను పానము చేయును గాక సకల దేవతలు నీ యొక్క రసమును పానము చేయుదురుగాక.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - హిరణ్య స్తూపుడు.
1. సోమము సూర్యుని వలె సర్వవ్యాప్తమై ద్రవించునది. మదకారి. అభిషుతము. పాత్రలందు నిలుచునది. అది పరివ్యాప్తమగు దశా పవిత్రమునకు ఒకేసారి చేరును. సోమము ఇంద్రుని తప్ప అన్య దేవతలను చేరుకొనదు.
2. స్తుతులు ఇంద్రుని చేరును. మధుర సోమము జలములకు చేరును. మాదక రసమును కురిపించు సోమధారలు ఇంద్రుని నోటికి చేరును. పాత్రలందుండి, యజమానులచే శుద్దము చేయబడిన సోమము త్వరత్వరగ ఉన్ని పాత్రలందు జల్లించబడి వెడలుచున్నది.
3. సోమము వృషభము వలె ధ్వని చేయును. స్తుతులు - గోవును వృషభము వలె సోమమును అనుసరించును. సోమము దివ్యమై అభిషుతమగును. తెల్లని ఉన్ని పాత్రలందు జల్లించబడి వెడలును. అది కవచము వంటి ఉజ్వల పదార్ధములను కప్పుకొనును.
రెండవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. అగ్ని ప్రశస్తుడు. దూరము నుంచి దర్శనమిచ్చువాడు. గృహపతి ఆగమ్యుడు.
నరులారా! అగ్ని అరణ్యములందు అస్తమించినపుడు అంగుళులతో వెలిగించండి.
2. అగ్ని ఇంటింట పూజనీయుడు. నిత్యుడు. సుందరుడు. దర్శనీయుడు. సమస్త భయముల నుండి రక్షణ పొందుటకు స్తోతలు అగ్నిని శాలయందు ప్రతిష్టింతురు.
3. యువతమ అగ్నీ! నీవు పూర్తిగా ప్రజ్వరిల్లినావు. నిరంతర జ్వాలా రూపుడవై మా కొరకు ఆహవనీయ స్థానమున నిలువుము.
మూడవ తృచ : ఋషి - సర్పరాజ్ఞి.
1. సూర్యుడు గమనశీలుడు. అతని తేజము పరివ్యాప్తము. అతడు ఉదయాచలమున చేరి సకల ప్రాణులకు తల్లియైన భూమికి చేరుచున్నాడు. పిదప తండ్రియైన ద్యులోకమునకు చేరుచున్నాడు.
2. ఈ సూర్యుని వెలుగులు అస్తమించును. అయినను నడుచును. మహాన్ అంతరిక్షమును ప్రకాశింపచేయును.
3. పగటి ముప్పది గడియలు సూర్యుడు దేదీప్యమానుడై ప్రకాశించును. అప్పుడు సకల వాక్కులు సూర్యునే నుతించుచున్నవి.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత ఉత్తరార్చిక యందలి
పదకొండవ అధ్యాయము సమాప్తము





