Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

4.    దేవతల యజ్ఞము లందు దేవతలను ప్రసన్నులను చేయుటకు మధు మధుర వాక్కులను ఉచ్చరించుచున్నాను.
   
    'సరస్వతీ మనుమతీం భగం యన్తో హవామహే'
   
5.    మనసున సరస్వతి వలన పుట్టిన మాటతో నేను దేనిని యాచించుచున్నానో పోషకుడగు సోమదేవత దాని విషయమున నాకు శ్రద్ద కలిగించును గాక.
   
6.    అరాతే! మా భక్తి శ్రద్దలకు నీవు ఆటంకము కలిగించకుము. ఇంద్రాగ్నులు మాకు నలుదిశల నుండి ధనములు నింపుదురు గాక. నేడు అందరును మాకు ఇచ్చెడి వారలగుదురు గాక. మా శత్రువునాకు ప్రతికూలురు అగుదురు గాక.
   
7.    అరాతి దేవతా! నీవు లేమిని కలిగించుదానవు. కృశింప చేయుదానవు, పీడించు దానవని మేము ఎరుంగుదుము. దూరము జరుగుము నీ నాశక శక్తిని పారద్రోలుచున్నాము.
   
8.    అరాతే! నీవు నరుల సంకల్పములను అసమృద్దములను, అసఫలములను చేయుచు దిగంబరముగా అలసత్వ రూపమున వారిని ఆవహించుచున్నావు.
   
9.    మహోన్నతములగు మా సమస్త ఆశలను నష్టపరచినావు. హిరణ్యకేశియగు అసమృద్దికి నమస్కరించుచున్నాను.
   
10.    భూమి హిరణ్య వర్ణ. సుభగ అది హిరణ్యకశిపు వశమైనది. అట్టి రమణీయ ధరిత్రికి దుర్గతి కలిగించిన అరాతికి ప్రణమిల్లుచున్నాను.
   
    (దివో హిరణ్య కశిపు అని తైత్తిరీయము. భూమి వర్షము లేక దుర్గతి పాలైనదని కావచ్చును. కశిపు అనిన అన్నవస్త్రము శయ్య. హిరణకశిపు అన్నవస్త్రాదులు బంగారపునే అయినందుకు దుర్గతి కావచ్చును. అచ్చము ధనము మీద ఆధారపడిన నేటి సామాజిక స్థితి.)
   
                                              మూడవ సూక్తము - 8
   
వినియోగము :- అభిచార కర్మమున ఈ సూక్తముచే ఆహుతులిచ్చునది.
   
1.    అగ్నీ! పరమ శక్తి వంతములగు ఓషధుల ఇంధనములచే దేవతలకు ఆజ్యము చేర్చుము. ఈ కర్మమునందు నీవు దేవతలనందరను ప్రసన్నులను చేయుము. నా ఆహ్వానములు విని దేవతలు నా యజ్ఞములకు / యుద్దములకు విచ్చేయుదురు గాక.
   
2.    ఇంద్రదేవా! విచ్చేయుము. నిన్ను స్తుతించుచున్నాము. ఆలకించుము. నిన్ను యజించు ఋత్విజులు నా సంకల్పమునకు అనుకూలురు అగుదురు గాక. ఆ ఋత్విజుల వలన మేము వీరులము - శూరులము అగుదుము గాక.
   
3.    అగ్నిదేవా! దేవతలను యజించక కర్మములు చేయు వారి హవిస్సులను దేవతలకు చేర్చకుము. దేవతలు అట్టి వారి యజ్ఞములకు / యుద్దములకు రాకుందురు గాక. మమైవ హవమేతన మా యజ్ఞమునకే వచ్చెదరు గాక.
   
4.    యోధులారా! ఇంద్రుని ఆదేశమున ఉరకండి - ముందడుగు వేయండి. శత్రువును సంహరించండి. మగ తోడేలు ఆడతోడేలును నలిపినట్లు శత్రువును నలిపి వేయండి. శత్రువు బతికి బయట పడరాదు. వారి ప్రాణములను గుప్పిట పట్టండి.
   
5.    ఇంద్రా! శత్రువులు మాకు దుర్గతి కలిగించుటకు నియమించిన బ్రాహ్మణుని అధః పాతాళమున పడవేయుము. నేను వానిని చావునోట పడవేయుచున్నాను.       
   
6.    దేవా! ఆ శత్రువులు 'తనూనపాన' 'పరిపాణము' లు చేయునపుడు మంత్రపు కవచములు ధరించి ఉండినచో నీవు ఆ మంత్రములను నిర్వీర్యము చేయుము.
   
7.    వృత్రహంత ఇంద్రా! మా శత్రువు ఏ యోధులను ముందు నడుపుచున్నాడో, ఎవరిని అందుకు సిద్దపరచుచున్నాడో వారందరను వెనుకకు నెట్టుము. అప్పుడు నేను ఆ సేనా వాహినిని హతమార్చుచున్నాను.
   
8.    ఇంద్రుడు మహా స్తుతులు విని శత్రువులను కాళ్ళ కింద నలిచివేసినాడు. అట్లే నేను శత్రువులను అనంత వర్షముల వరకు లేవకుండ చేయుచున్నాను.
   
9.    వృత్రహంత ఇంద్రా! నీవు యుద్దమున ఉగ్రరూపము దాల్చుము. శత్రువు మర్మములను భేదించుము. నేను మీతో స్నేహము చేయుచున్నాను. కావున ఇచటనే శత్రువు ఎదుట కొండవలె నిలువుము. మేము ముందే పనులు ప్రారంభించు వారలము అగుచున్నాము. నీ హృదయమున మాకు చోటు కల్పించుము.
   
                                                నాలుగవ సూక్తము -9
   
వినియోగము :- సర్వరోగ చికిత్సకు ఈ సూక్తముచే ఘ్రుతాహుతులు ఇచ్చునది. యవ సహిత లేక రహిత జలపూర్ణ పాత్రలో నాలుగు సంపాతములను నేలలో రెండు సంపాతములు తెచ్చి ఈ సూక్తముచే అభిమంత్రిత సంపాతిత మట్టి గల నీటితో తడుపునది.
   
1.    దివే స్వాహా - దివికి స్వాహా.
   
2.    పృథివ్యై స్వాహా - భూమికి స్వాహా
   
3.    అంతరిక్షాయస్వాహా.
   
4.    దివే స్వాహా.
   
5.    పృథివ్యై స్వాహా.
   
6.    సూర్యుడు నా నేత్రములు వాయువు నా ప్రాణము. అంతరిక్షము ఆత్మ పృథ్వి శరీరము. నేను అనాచ్చాదిత నామము వాడను. నన్ను రక్షించుమని ద్యావాపృథ్వులను శరణు వేడుచున్నాను.
   
7.    ద్యావాపృథ్వులారా! నా ఆయువును ఉత్కృష్టము చేయండి. బలమును ఉత్కృష్టము చేయండి. కృత్యను ఉత్కృష్టము చేయండి. ఇంద్రియములను ఉత్కృష్టములు చేయండి. మీరు ఆయువును పెంచువారు, రక్షించువారు. మీరు నాలో ఉండండి. రక్షించండి. నన్ను నష్టపరచకండి.
   
                                               అయిదవ సూక్తము - 10

వినియోగము :-
గృహ, గ్రామ, నగర స్వస్త్యయనమునకు ఆరు రాళ్ళను సంపాతన, అభిమంత్రణములు చేసి నాలుగు రాళ్ళను నలువైపుల, ఒకటి మధ్యన, ఒకటి పునాది వద్ద పెట్టునది.
   
1.    అశ్మవర్మ మేసి యోమా ప్రాచ్యా దిశో ధాయురభిదాసాద్ |
    ఏతత్ స ఋచ్చాత్ ||

   
    శిలాకవచమా! నీవు నాదానవు. వధించు పాపము తలపెట్టిన వాడు తూర్పున మాకు హాని కలిగించదలచినాడు. నీవు వానిని హతమార్చుము.
       
2.    అశ్మవర్మ మేసి యోమా దక్షిణాయా దిశః ధాయురభి దాసాత్ |
    ఏతత్ సఋచ్చాత్ ||
   

    దిశ దక్షిణము మిగిలినది పూర్వము వలె.
   
3.    అశ్మవర్మ మేసి యోమా ప్రతీచ్యాదిశః ధాయురభిదాసాత్ |
    ఏతత్ స ఋచ్చాత్ ||
   

    పడమటి దిక్కు.
   
4.    అశ్మవర్మ మేసి యోమా మోదీచ్యాదిశః ధాయురభి దాసాత్ |
    ఏతత్ స ఋచ్చాత్ ||

   
    ఉత్తర దిశ.
   
5.    అశ్మవర్మ మేసి యోమా ధ్రువాయా దిశః | ధాయురభి దాసాత్ ||
    ఏతత్ స ఋచ్చాత్ ||

   
    ధ్రువదిశ.
   
6.    అశ్మవర్మ మేసి యో మోర్ధ్వాయాదిశో ధాయురభి దాసాత్ |
    ఏతత్ స ఋచ్చాత్ ||
   

    ఊర్ధ్వ దిశ.
   
7.    అశ్మవర్మ మేసి యోమా దిశా మన్తర్ధిశేభ్యో ధాయురభిదాసాత్ |
    ఏతత్ స ఋచ్చాత్ ||

   
    దిశలు, అంతర్దిశలు.
   
8.    మహా ప్రకాశవంత చంద్రుని మనసా ఆహ్వానించుచున్నాను. వాయువును ప్రాణాపానములు ప్రార్ధించుచున్నాను. సూర్యుని నేత్రములకు, అంతరిక్షమును చెవులకు, పృథ్విని శరీరము కొరకు ప్రార్దించుచున్నాను. మనసునందున్న సరస్వతిని వాక్కు కొరకు ప్రార్దించుచున్నాను.
   
                                             మూడవ అనువాకము
                                         మొదటి సూక్తము - 11
   

వినియోగము :- 1) సర్వ సంపత్కర్మలందు మాదానక పుల్లలచే క్షీరాన్నము వండి ఈ సూక్తముచే సంపాతన అభిమంత్రణములు చేసి భుజించునది.
   
    చమసమందు తల్లి రూపము గల దూడగల ఆవు పాలలో వరి, యవల పిండి కలిపి తేనె చల్లి భుజించునది.
   
1.    మహా ధనవంత, బలవంత వరుణదేవా! ప్రాణదాతయు, ప్రశంసనీయ పాలకుడగు సూర్యదేవునితో ఏమేమి చెప్పినావు? మరల మరల ధనములు ప్రసాదించు వరుణదేవా! నీవు సూర్యునకు జల రూపవు దక్షిణలు ఇచ్చుచున్నావు. మరియు మనసు పెట్టి చికిత్స చేయుచున్నావు.
   
2.    నేను కోరినంత మాత్రమున మరల మరల ధనికుడను కాకున్నాను. సుఖములు ప్రసాదించుమని సూర్యుని ప్రార్ధించియే సుఖవంతుడను అగుచున్నాను.
   
    అథర్వవేద ఋత్విజా! ఏ కార్యమున, ఏ జన్మ వలన నీవు అగ్ని అంతటి వాడవు కాగలిగినావు?
   
3.    ఋత్విజుడు అనుచున్నాడు:-
   
    సత్యమహం గంభీరః - నేను సత్యమును. గంభీరుడను. వేద కార్యమున, వేద జన్మమున అగ్నిని అయినాను. నేను ప్రారంభించిన సత్కార్యమును ఆర్యులు గాని దస్యులు గాని ఆటంక పరచజాలకున్నారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.