Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
2. సర్వద్రష్ట, పాపహారి సోమము అందరిని భరించుచు దశా పవిత్రమునకు చేరును. అందునుంచి అరచుచు ద్రోణ కలశమున చేరును.
3. సోమము వేగవతి. ద్యులోక దీపిక. రాక్షస నాశక. అది అభిషుతమై, ఉన్నిగల పవిత్రమున జల్లించబడి అనేక ధారలుగా సాగును.
4. సోమము త్రితుని మహాయజ్ఞమున అభిషుతమై తన దివ్యకాంతులచే సూర్యుని ప్రకాశింపచేయుచున్నది.
5. శత్రునాశక, వర్షక, అభిషుత, ధనదాత, అహింస్య సోమము అశ్వము వలె వేగముగ కలశమున ప్రవేశించును.
6. దివ్యము, పలుచని సోమము అనుభవజ్ఞులగు అధ్వర్యుల ప్రేరణ కలిగి తన రసమున ఇంద్రుని పూజించుచు కలశముల వైపు సాగుచున్నది.
ఏడవ ఖండము
తొలి తృచ : ఋషి - పవిత్రుడు.
1. ఋషులచే సముపార్జించబడిన, వేదసార భూత పవమాన దేవతాసహిత మంత్రములను ఉచ్చరించువాడు వాయు దేవతచే రుచి పుట్టించబడిన పవిత్రమగు భోజనము చేయుచున్నాడు.
2. ఋషులచే సముపార్జించబడిన, వేదసారభూత పవమాన దేవతా సహిత మంత్రములను ఉచ్చరించువానికి సరస్వతి స్వయముగా పాలు, నేయి, బలము కలుగజేయు నీరు ప్రసాదించుచున్నది.
3. పవమాన దేవతా సహిత ఋక్కులు శుభములు కలిగించునని, ఫలప్రధములు. అనుగ్రహరూప ఘ్రుతవర్షకములు. అవి ఋషుల చేత రసరూపమున కూర్చబడినవి కదా! అవి మంత్ర పాఠకులకు అమృతములు. హితకరములు అగుచున్నవి.
4. ఇంద్రాది దేవతలచే సముపార్జించబడిన పవమాన మంత్రముల అధిష్టాత్రి దేవేరులు మాకు ఇహ, పర ఉభయలోకములను ప్రసాదింతురుగాక. మా మనోరథములను ఉభయలోకములందును ఫలింపచేయుదురు గాక.
5. ఇంద్రాదులు ఏ పవిత్ర సాధనమున నిత్యము తమను పావనము చేసికొందురో, అట్టి సహస్రధారల పవమాన దేవతా సహిత ఋక్కులు మమ్ము పావనులను చేయునుగాత.
6. పవమాన దేవతా సహిత మంత్రములు శుభప్రదములు. అవి స్వర్గము కలిగించును. ఇహమున పుణ్యము అన్నపానములు కలిగించును. అమృతత్వము కలిగించును.
ఎనిమిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. అగ్ని ఆహవనీయ స్థానమున సమిధలచే ప్రజ్వరిల్లువాడు. అగ్ని ద్యావాపృథ్వుల మధ్య విచిత్ర కిరణములచే ప్రకాశించువాడు. అగ్ని ఆహుతులు అందుకొని సర్వత్ర సంచరించువాడు. అట్టి అగ్నికి మహా ప్రణామము చేయుచున్నాము. శరణు వేడుచున్నాము.
2. అగ్ని తన ప్రభావమున సకల దురితములను దూరము చేయువాడు. ధనాగారము కలవాడు. అట్టి అగ్నిని మేము స్తుతించుచున్నాము. అతడు మమ్ము పాపములు, దుష్కర్మల నుండి కాపాడును గాక. హవి సమర్పించు మమ్ము రక్షించును గాక.
3. అగ్నీ! త్వం వరుణః త్వం మిత్రః వసిష్ఠులు నిన్ను స్తుతించుచున్నారు. వర్ధిల్ల చేయుచున్నారు. నీ వద్ద ఉన్న ధనము మా అనుభవమునకు వచ్చునుగాత. "యూయంపాత స్వస్తిభిః సదానః" మీ దేవతలందరు మాకు శుభములు కూర్చి, మమ్ము రక్షింతురుగాక.
రెండవ తృచ : ఋషి - వత్సుడు
1. ఇంద్రుడు పర్జన్యుని వలె వృష్టి కలిగించువాడు. తన మహిమతోనే అందరిని మించినవాడు. స్తోతలు అతనికి బిడ్డలవంటివారు. వారి స్తుతులచే అతడు వర్ధిల్లును. "స్తోమైర్వత్సస్య వావృధే"
2. స్తోతలు ఇంద్రుని స్తుతించి అతనిని యజ్ఞాధిష్టాతను చేయుచున్నారు. అప్పుడు ఆయుధములు నిరర్ధకములే కదా!
(ఇంద్రుడే రక్షకుడైనపుడు ఆయుధములేలా? అని.)
3. ఇంద్రుడు యజ్ఞమున ప్రత్యక్షమైనాడు. ఆకాశమును నింపునట్టి అశ్వములు ఇంద్రుని వేగముగా తీసికొని వెళ్ళుచున్నవి. అట్టి ఇంద్రుని ఋత్విజులు కీర్తించుచున్నారు. "విప్రా ఋతస్య వాహసా"
తొమ్మిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - వైఖానసుడు.
1. మరల మరల తిమిరాములను ధ్వంసము చేయు సర్వత్రగామి హరిత వర్ణ సోమము దేవతలకు ఆనందము కలిగించుటకుగాను కలశములకు పారుచున్నది.
2. పవమానము గొప్ప రథము కలది. తేజస్సులను మించిన తేజస్సు గలది. హరిత ధారలది. డానికి మరుత్తులు సహాయకులు అగుచున్నారు.
3. పవమానమా! నీవు అన్నము, బలము ఇచ్చుదానవు. స్తోతలకు వీర పుత్రులనిమ్ము. నీ వెలుగులను జగములందు నింపుము.
రెండవ తృచ : ఋషి - భరద్వాజుడు.
1. సోమము హవిస్సులందు విశిష్టము. మానవ హితకారి. జలములందు వసించునది. రాళ్ళచే దంచబడునట్టిది. అట్టి సోమమును ఇచట చల్లండి.
2. సోమమా! నీవు ఎంతటి వానికిని లొంగవు. ఎంతో పరిమళము కలదానవు. శుద్ది చేయబడుచున్న నీవు ఉన్ని పాత్రలకు ప్రవహింపుము. అభిషుతమైనంత నీయందు గోఘ్రుతాదులను కలుపుదుము. జలములందు నిన్ను ప్రసన్నను చేయుదుము.
3. దేవతలకు తృప్తి కలిగించు, యజ్ఞ సాధక, సర్వద్రష్ట సోమము అభిషుతమై ద్రోణ కలశము చేరుచున్నది. దర్శించుకొనండి.
పదవ ఖండము
మొదటి తృచ : ఋషి - నృమేధ.
1. సకల కిరణములు సూర్యుని సేవించుచున్నవి సకల ధనములు ఇంద్రుని సేవించుచున్నవి. ఇంద్రుడు తన బలమున సృష్టించిన ధనములకు మమ్ము- పితరుల ధనమునకు వంటి భాగస్వాములను చేయునుగాత.
2. "భద్రా ఇంద్రస్య దాతయః" ఇంద్రుని దానములు శుభప్రధములు. ఇంద్రుని మనసు దానములకు ప్రేరణ కలిగించును. ఇంద్రుని ఆరాధించు వారి కోరికలు నిష్ఫలములు కావు.
స్తోతలారా! దాతయు, పుణ్య కర్ములకు ధనము నిచ్చు ఇంద్రుని స్తుతించండి.
రెండవ తృచ : ఋషి - భర్గుడు.
1. 'యత ఇంన్ద్ర భయామహే తతోనో అభయం కృధి' ఇంద్రా! ఎచట మాకు భయము కలుగుచున్నదో అచట మమ్ము నిర్భయులను చేయుము.
ఇంద్రదేవా! మాకు నీ రక్షణలు కలిగించుము. మమ్ము ద్వేషించు వైర్ని భంగపరచుము. మమ్ము హింసించు వైర్ని భంగపరచుము.
2. ఇంద్రా! నీవు ధనపతివి. మా కిచ్చుటకు నీ వద్ద అపార ధనమున్నది. భూములున్నవి. నీవు స్తుతి యోగ్యుడవు ధనవంతుడవు. మేము నిన్ను అభిషుత సోమము అర్పించి ఆహ్వానించుచున్నాము.
పదకొండవ ఖండము
మొదటి తృచ : ఋషి - భరద్వాజుడు.
1. సోమమా! నీవు పరమానందప్రదవు. మహాశక్తి ప్రదవు. ఆధ్వరమున ధారవగుము. స్తోత్ర యుక్తవై ద్రోణ కలశమున పరిశుద్దవగుము.
2. సోమమా! నీవు అత్యంత మదయుక్తవు. యజ్ఞమును భరించుదానవు. బలయుతవు. దీప్తవు శత్రుంజయవు.
3. సోమమా! నీవు పాషాణములచే అభిషుతవగుము. నినదించుము. ద్రోణ కలశమున చేరుము.
రెండవ తృచ : ఋషి - మనువు.
1. సోమమా! నీవు దేవతలకు ఆహారమవు. శక్తివంతవై ధారగా ప్రవాహింపుము. మాదక రసవంతవై ద్రోణ కలశమున స్థిరపడుము.
2. సోమమా! జలమునకు చేరునట్టి వేగవంతమగు నీ యొక్క రసము బలము కలిగించి ఇంద్రుని వర్ధిల్ల చేయును. దేవతలు నిన్ను అమృతత్వమునకు సేవింతురు.
3. సోమము ద్యులోకమున వృష్టి కలిగించునది. స్వర్గప్రద. భూమి మీద వర్షము కలిగించునది. అభిషుతము, పవిత్రము. అట్టి సోమము మాకు ధనము ప్రసాదించునుగాత.
మూడవ తృచ : ఋషి - అంబరీషుడు.
1. అందరు అభిలషించునట్టి పాపహారి బభ్రువర్ణ సోమము దశా పవిత్రమున శోధితమగును. సోమము మాదక రసమై సకల దేవతల వద్దకు చేరును.
2. సోమము స్వంత కీర్తిగలది. పాషాణ పీడిత. ఇంద్ర ప్రియ. తరంగవంత. అట్టి సోమమును దశాంగుళులు జలములందు శుభ్రము చేయును.
3. సోమమా! వృత్రఘ్న ఇంద్రుని కొరకును దక్షిణ లిచ్చునట్టి యజ్ఞము కొరకును, అనేక యజ్ఞములు చేయు నరుల కొరకును పాత్రలందు ప్రవేశించుము.
నాలుగవ తృచ : ఋషి - త్రసదస్యు.
1. సోమమా! నీవు అశ్వమును వలె శుభ్రము చేయబడినదానవు. వేగవంతవు. మాకు గొప్ప ధనము, బలము కలుగుటకు పాత్రలందు చేరుము.
2. సోమరసము మాదకమగుటకు ఋత్విజులు దానిని పవిత్రము చేయుదురు. తమకు మహా యశస్సు, అన్నము కలుగుటకు సోమమును ద్యుమంతమును చేయుదురు.
3. దేవతలకు శిశువు వలె పుట్టిన హరిత వర్ణ సోమమును ఋత్విజులు దేవతల కొరకు పరిశుద్దము చేయుచున్నారు.
ఐదవ తృచ : ఋషి - అమహీయుడు.
1. పుట్టినది జలమున చేరినది. శత్రునాశక, గోఘ్రుతాది మిశ్రిత సోమము వద్దకు దేవతలు చేరుచున్నారు.
2. ఇంద్రుని హృదయమును సేవించు సోమమునే మా యొక్క స్తుతిరూపవాణి - పిల్లలను పాలుగల తల్లి వలె - వర్ధిల్ల చేయుచున్నది.
3. సోమమా! మా గోవులకు సుఖములు కలిగించుము. మా గృహములను అన్నములతో నింపుము. ద్రోణ కలశ జలమును వర్ధిల్ల చేయుము.
పన్నెండవ ఖండము
మొదటి తృచ : ఋషి - త్రిశోకుడు.
1. ఏ ఋషులు అభిముఖులై అగ్నిని ప్రజ్వరిల్ల చేయుదురో, ఎవరికీ యువతమ ఇంద్రుడు మిత్రుడగునో అట్టి వారు దర్భలను పరచుచున్నారు.
2. ఏషా మిన్ద్రో యువాసఖా - యువక ఇంద్రుడు, ఎవరికి మిత్రుడగుచున్నాడో వారి సమిధలు గొప్పవి, స్తుతులు గొప్పవి, శస్త్రములు గొప్పవి అగుచున్నవి.
3. ఏషా మిన్ద్రోయువా సఖా అట్టివాడు యోద్ధ, సేనాపరి వేష్టితుడు, స్వబలమున శత్రువులను జయించువాడు అగుచున్నాడు.
రెండవ తృచ : ఋషి - గోతముడు.
1. ఇంద్రుడు ఒక్కడే హవిసమర్పించు నరులకు ధనమును ఇచ్చుచున్నాడు. అప్రతిహతుడగు ఇంద్రుడు లోకములకు ప్రభువగుచున్నాడు.
2. అనేకమందిచే సోమమును సిద్దము చేయించి, ఇంద్రుని ఆరాధించువారికి ఇంద్రుడు మహా బలమును ఇచ్చుచున్నాడు.
3. దేవతలకు హవి అర్పించని నరులను ఇంద్రుడు ఎప్పుడు కాలితో పూవును నలిచినట్లు నలిపివేయును? ఇంద్రుడు ఎప్పుడు వేగముగా వచ్చి మా స్తుతులను వినగలడు?
మూడవ తృచ : ఋషి - మధుచ్చందుడు.
1. శతక్రతు ఇంద్రా! ఉద్గాతలు నీ గుణగానము చేయుచున్నారు. అర్చకులు నిన్ను అర్చించుచున్నారు. బ్రాహ్మణులు తమ వంశమును వలె నిన్ను వర్ధిల్ల చేయుచున్నారు.
2. యజమాని సోమవల్లి కొరకు కొండలు ఎక్కినప్పుడు అనేక కర్మలు గల యజ్ఞమును అనుష్టించినపుడు ఇంద్రుడు యజమాని కార్యమును తెలిసికొనుచున్నాడు. వరదుడగుచు దేవగణ సహితుడై యజ్ఞమునకు వచ్చుచున్నాడు.
3. సోమపాయి ఇంద్రా! కేశగ్రీవ, యువ, పరిపుష్టలగు నీ అశ్వములను రథమునకు కట్టుము. మా స్తుతులు ఆలకించుటకు మా వద్దకు విచ్చేయుము.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర సామవేద సంహిత
ఉత్తరార్చిక యందలి పదవ అధ్యాయము సమాప్తము.





