Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

3.    ఇచటికి మూడవ లోకమగు స్వర్గమందలి దేవతలు కూర్చుండు అశ్వత్థము ఉన్నది. అక్కడి దేవతలు అమృత సమమగు కుష్ఠ ఓషధిని కనుగొన్నారు.
   
4.    స్వర్గమున హిరణ్యబంధనముల హిరణ్య నౌక విహరించుచుండును. అచట దేవతలు అమృతపుష్పము వంటి కుష్ఠ ఓషధిని కనుగొన్నారు.
   
5.    బాట బంగారపుది. చెక్క బంగారపుది. నావ బంగారపుది. దాని మీద కుష్ఠ ఓషధిని తెచ్చినారు.
   
6.    కుష్ఠ ఓషధీ! నీవు నన్ను ఆవహించుము. రోగ రహితుని చేయుము. నన్ను ఆరోగ్యవంతుని చేయుము.
   
7.    కుష్ఠమా! నీవు దేవతల ఆధిపత్యమున పుట్టినావు. సోమునకు హితము కూర్చు మిత్రమవు. నా ప్రాణ, వ్యాన, నేత్రములకు సుఖము కలిగించుము.
   
8.    కుష్టము హిమవంతపు ఉత్తర దిశన ఉత్పన్నమైనది. అది తూర్పునందలి జనుల వద్దకు తేబడినది. అక్కడ జనులు కుష్ఠమును ఉత్తమ నామములచే అలంకరించినారు.
   
9.    కుష్ఠమా! నీ పేరు ఉత్తమము. నీవు పుట్టిన హిమవంతము ఉత్తమము. సమస్త వ్యాధులను నాశనము చేయుము. బాధించు వ్యాధులను నిర్వీర్యములను చేయుము.
   
10.    శిరోవ్యాధి, నేత్రబాధ, దేహమున వ్యాధులు పుట్టించు పాపములు - వీటి నన్నింటిని దివ్యబలము గల కుష్ఠము నిర్మూలించును గాక.
   
                                                 అయిదవ సూక్తము - 5
   
వినియోగము :-

   
    శస్త్రాదుల వలన గాయమైనపుడు పాలలో లక్క కలిపి, ఈ సూక్తముచే అభిమంత్రించి, గాయపడిన వానికి         త్రాగించునది.
   
1.    లక్కా! రాత్రి నీకు తల్లి. పగలు తండ్రి. సూర్యుడు పితామహుడు. నీ పేరు సిలాచి. నీవు దేవతలకు భగినివి.
   
2.    లక్కా! నిన్ను త్రాగిన వాడు జీవించుచున్నాడు. నీవు నరులను రక్షించుచున్నావు. ఊపిరి పీల్చు ప్రాణులను పోషించుచున్నావు. ప్రాణుల గాయములను మాన్పుచున్నావు.
   
3.    "వృషణయన్తీవ కన్యలా" నీవు ఒక విశేష వృక్షమును ఎక్కుచున్నావు. గెలుచుట, నిలుచుట చేత నీకు 'స్పరణి' అను పేరు కలిగినది.
   
4.    క్రోధమున దండము లేక బాణముచే గాయము చేసినపుడు లక్కా! నీవు దానిని మాన్పుచున్నావు. కావున వీనిని ఆరోగ్యవంతుని చేయుము.
   
5.    లక్కా! నీవు ప్లక్ష, నిప్తిష్ఠ, అశ్వత్థ, ఖాదిర, న్యగ్రోధ, పర్ణముల నుండి వెడలుదానవు. అట్టి నీవు గాయము మాన్పుటకు మా వద్దకు రమ్ము.
   
6.    సుభగే! నీవు హిరణ్య వర్ణవు, సూర్యవర్ణవు కాంతివంతవు. నీవు వ్యాధులను నిర్మూలించుదానవు, గాయములు మాన్పుదానవు అయినందున 'నిష్క్పతి' యను పేరుగల దానవు అయినావు.
   
7.    సుభగే! నీవు హిరణ్యవర్ణవు. బలకారిణివి. రోమనాశనివి. నీవు జలములకు భగినివి. వాయువు నీ ఆత్మ అగుచున్నది.
   
8.    నీ పేరు సిలాచి - కానీన మేకల కాపరి నీ తండ్రి. యముని పసుపు, నలుపు రంగు అశ్వమున్నదే దాని రక్తములో నిన్ను ముంచినారు.
   
9.    గాయము మాన్పు లాక్షా! నీవు అశ్వ రక్తమును పోలి ఉందువు. వృక్షములను తడిపెదవు. చలనశీలా! పతత్రిణి వంటి దానివై మా వద్దకు రమ్ము.
   
                                            రెండవ అనువాకము
                                             మొదటి సూక్తము - 6
   

వినియోగము :-

   
      1) రోగి ఆరోగ్యము తెలుయుటకు మూడు స్నావ రజ్జువులను ఈ సూక్తముచే అభిమంత్రించి నిప్పుల మీద  పెట్టునది. రజ్జువులు పైకి పోయిన జీవించనని తెలియునది.
   
      2) సాంగ్రామికి విజ్ఞాన కర్మయందు మూడు స్నాన రజ్జువులను దీనిచే అభిమంత్రించునది. ఒకటి హన సేన,  మధ్యది మృత్యువు, మూడవది శత్రుసేన అనుకొనునది. వానిని నిప్పుల మీద వేయునది. మృత్యువు మీదకు పోయిన దానికి గెలుపు - దేని మీదకు మృత్యువు పోవునో దానికి ఓటమి. ఎదుటపడినను  గెలుపని తెలియునది.
   
      3) సలిల గణమున ఈ సూక్త పాఠము వచ్చును.
   
      4) ఎక్కువ కాలము ఒకేచోట ఉండగోరిన వాడు ఈ సూక్తముచే హవిస్సు ఆహుతులిచ్చునది.
   
      5) స్త్రీ ప్రసవమున, సూతికా రోగమున అన్నమును ఈ సూక్తముచే అభిమంత్రించి తినిపించునది.  సక్తుమంథను అభిమంత్రణ చేసి త్రాగించునది. ఆదిత్యుని ఉప స్థానము చేయించునది.
   
1.    తొలుత బ్రహ్మ ఆవిర్భవించినాడు. అతడే తూర్పున వెలుగులు గల వేనుడు అయినాడు. ఆ వేనుడు - ఆదిత్యుడు దిశల అంచులు మొదలుగా సమస్త లోకములందు వ్యాపించినాడు. అతడు 'సత్' 'అసత్' సమస్త సృష్టికి కారణభూతుడు అగుచున్నాడు.
   
2.    నరులారా! మీకు వ్యతిరేకులగు శత్రువులు కొన్ని అనర్ధకర్మలు ఆచరించినపుడు అవి పుత్ర పౌత్రులను, శూర వీరులను నష్టపరచకుండు గాక. అట్లని వానిని మీ ముందు ఉంచుచున్నాను.
   
3.    స్వర్గమునకు వేల మార్గములున్నవి. నాకమునందున్న తేనె మాటల వారు ఇట్లని ప్రకటించినారు:-
   
    యుద్దమునకు వెళ్ళని వారిని పట్టుటకు యమభటులు పాశములను పట్టి అడుగడుగున నిలిచి ఉన్నారు. వారు రెప్పలు వాల్చరు.
   
4.    సూర్యదేవా! అన్నము కలుగుటకు నీవు మేఘముల నంపుచున్నావు. సముద్రము నుండి మేఘములను తెచ్చి వానిని శత్రువును వలె దెబ్బ తీయుచున్నావు. వర్షము కలిగించు వాడవైనందున నీకు 'సవిస్రస' నామము సార్ధకమైనది. పదమూడవ నెల సహితము ఇంద్రునిదే!
   
    (అప్పుడు కూడ వర్షించుము అని అర్ధము.)
   
5.    దీని వలననే అతనికి సిద్ది కలిగినది - స్వాహా.
   
    పరమసుఖులు, తీక్ష్ణ అస్త్ర శస్త్రములు గల సోమ రుద్రులారా! ఈ యుద్దమున మాకు సుఖములు కలిగించండి.
   
6.    దీని వలననే అతడు శత్రువును నిగ్రహించ గలిగినాడు - స్వాహా.
   
    పరమ సుఖులు, తీక్ష్ణ అస్త్ర శస్త్రవంతులగు సోమ రుద్రులారా! ఈ యుద్దమున మాకు సుఖములు కలిగించండి.

7.    దీని వలననే అతనికి విజయము కలిగినది స్వాహా.
   
    పరమ సుఖులు, తీక్ష్ణ అస్త్రశస్త్రవంతులగు సోమ రుద్రులారా! ఈ సంగ్రామమున మాకు సుఖములు కలుగజేయండి.
   
8.    సోమరుద్రులారా! చెప్పరాని పాపముల నుండి మమ్ము విముక్తులను చేయండి. ఈ యజ్ఞమును అనుభవించండి. మా యందు అమృతత్వమును చేర్చండి.
   
9.    కంటి యందలి సంహారశక్తీ! మనసు నందలి సంహార శక్తీ! మంత్రములందలి సంహార శక్తీ! తపస్సు నందలి సంహార శక్తీ! మీరు ఆయుధములను మించిన ఆయుధములు మమ్ము దెబ్బతీయ దలచిన వారు ఆయుధ హీనులు అగుదురు గాక.
   
10.    అగ్నిదేవా! మమ్ము కంటి శక్తి, మనసు, బలము, చిత్తవృత్తి ప్రభావమున నష్టపరచు వారిని భస్మము చేముము - స్వాహా.
   
11.    నీవు ఇంద్రుని గృహము వంటి వాడవు. సర్వగామివి. సర్వాత్మవు. సర్వదేహమవు. సర్వ పూరుషుడవు. నాకు ఉన్న సర్వస్వసహితముగ నీ శరణువేడుచున్నాను. నీలో ప్రవేశించుచున్నాను.
   
12.    నీవు ఇంద్రుని సుఖ స్వరూపమవు.
   
13.    నీవు ఇంద్రుని కవచ రూపమవు.
   
14.    ఇంద్రస్య వరూథమసి.
   
    11 వ మంత్రము నందలి 'సర్వగామివి' నుంచి ప్రవేశించుచున్నాను వరకు 12, 13, 14 మంత్రములకు చేర్చునది.
   
                                               రెండవ సూక్తము - 7
   

వినియోగము :-

   
      1) నిర్రుతి కర్మమున ఈ సూక్తముచే చక్కెర కలిపిన యవల పేలాలను ఒకసారి హోమించునది.
   
      2) ధనము తీయునపుడు విఘ్నశాంతి కర్మమున.
   
      3) అగ్ని చయనమున 'వనీవాహన' సమయమున యజమానిచే ఈ సూక్తము అనిపించునది.
   
    (ఋత్విజులకు దక్షిణ ఇచ్చు మాట వనీ వాహనమగును.)
   
1.    అదాతా! మమ్ము ధనములతో నింపుము. మా చుట్టు నిలువకుము. మేమిచ్చు దక్షిణల మీద నీ ప్రభావము పడనీయకుము.
   
    అనభ్యుదయమునకు దండము. అసమృద్దికి దండము. అదాతకు దండము.
   
2.    అదాతృదేవీ! కేవలము మాటల వానిని నీ ముందు ఉంచుకొందువు. అట్టి వానికి దూరము నుండియే నమస్కరించుచున్నాము. నీవు మా భక్తిని బాధించకుము.
   
3.    దేవతల విషయమున భక్తి రాత్రింబవళ్ళు వర్ధిల్లును గాక. నీవు మాత్రము మమ్ము అనుగ్రహించకుము. "నమో అస్త్యరాతయే"




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.