Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
పదవఅధ్యాయము
మొదటి ఖండము
తొలి తృచ : ఋషి - పరాశరుడు.
అక్రాంత్సముద్రః ప్రథమే విధర్మన్ జనయత్ప్రజా భువనస్య గోపాః |
వృషా పవిత్రే అధిసానౌ అవ్యే బృహత్సోమో వా పృధే స్వానో అద్రిః ||
1. సోమము జలమును వర్షించునది. అందరిని రక్షించునది. అంతరిక్షమున ప్రజలను పుట్టించునది. ఎంతో గొప్పది. కోరికలు పూరించునది. అట్టి అభిషుతమై, ఆదరించబడు సోమము ఎత్తున ఉన్న ఉన్నిగల పవిత్ర పాత్రమున అధికముగా వర్ధిల్లుచున్నది.
2. సోమదేవీ! మాకు ధనము, అన్నము కలిగించుటకు వాయువును ప్రసన్నుని చేయుము. అభిషుతమగుచు మిత్రావరుణులను ప్రసన్నులను చేయుము. మరుత్తుల బలములను ప్రసన్నము చేయుము. దేవతలను ప్రసన్నులను చేయుము. ద్యావాపృథ్వులను ప్రసన్నులను చేయుము.
3. మహా సోమము మహత్కార్యములు చేసినది. అది జల గర్భ స్వరూపమై దేవతలను సేవించినది. పవమాన సోమము ఇంద్రునకు బలము సమకూర్చినది. దీప్త సోమము సూర్యుని యందు తేజస్సు పుట్టించినది - "అజనయత్సూర్యే జ్యోతిరిన్ధుహుః"
రెండవ తృచ : రిషి - శునశ్శేపుడు.
1. ఈ సోమము వెలుగొందునది. మరణరహిత. ఇది పక్షి వలె వేగముగ ద్రోణ కలశము వైపు సాగుచున్నది.
2. స్తోతలచే కీర్తించబడు ద్యోతమాన సోమము యజమానులకు వివిధ ధనముల నిచ్చుదు జలములందు విహరించుచున్నది.
3. పవమాన శూర సోమము కోరదగిన సకల ధనములను స్వబలమున జయించి మాకు ఇవ్వగోరుచున్నది.
4. ఈ సోమము దివ్యము. అది రథము కోరుచున్నది. మేము కోరినవి ఇవ్వదలచుచున్నది. అదిగో నినదించుచున్నది.
5. ఈ సోమము దివ్యము. స్తోతలు దీనిని స్తుతించుచున్నారు. అశ్వమును వలె యుద్దము కొరకు దానిని స్తుతులచే అలంకరించుచున్నారు.
6. ఈ సోమము దివ్యము. అంగుళులచే అభిషుతము. అపరాజిత. అది శత్రు సంహారమునకు వెడలుచున్నది.
7. ఈ సోమము ధారగా పారుచున్నది. కేకలు పెట్టుచున్నది. లోకములను లెక్క చేయకున్నది. స్వర్గగమునకు సాగుచున్నది.
8. ఈ సోమము యజ్ఞవంత. హింసింపజాలనిది. లోకములను లెక్క చేయకున్నది. స్వర్గమునకు సాగుచున్నది.
9. ఈ సోమము హరిత వర్ష. ఆది యందే పుట్టినది. దేవతలు కొరకు శుద్ది చేయబడినది. దశా పవిత్రమునకు సాగుచున్నది.
10. ఈ సోమము బహు కర్మయుత. అన్నములు పుట్టించునది. ఇది అభిషుతమై ధారగా పారుచున్నది.
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషులు -అసిత దేవలులు.
1. సోమము శూర. పిండినది. వడిగల రథముల మీద ఇంద్రుని స్థానమునకు సాగుచున్నది. స్వబలమున అచటికి చేరుచున్నది.
2. ఈ సోమము మహా యజ్ఞము కొరకు బృహత్ కర్మల నిచ్చగించుచు దేవతలు చేరు యజ్ఞమునకు చేరుచున్నది.
3. సోమము అనేక రసరూప అన్నములను వర్షించునది. శోధనయోగ్య. ఋత్విజులు అట్టి సోమమును ద్రోణ కలశమున పరిశుద్దముగా పిండుదురు.
4. సోమమును హవిర్దానమునకు చేర్చెదరు. ఆ రెంటి మధ్య నున్న పరిశుద్ద మార్గమున అధ్వర్యులు దానిని దేవతలకు అర్పింతురు.
5. సోమము వేగవంతము. శ్వేత కిరణయుతము. రసవాహినులకు ప్రభువు. అది అధ్వర్యుల వెంట సాగును.
6. తన బలమున మా కొరకు ధనము సాధించు సోమపు కిరణములు శృంగముల వంటివి. అభిషవ సమయమున యూధపతి వృషభము తన కొమ్ములను కదలించినట్లు సోమము తన కిరణములను కదలించును.
7.
సోమము కర్మలకు అడ్డుతగులు రాక్షసులను పీడించును. పెద్ద పెద్ద అంగలు వేసి చంపదగిన రాక్షసుల మధ్యకు దూకును.
8. సోమము ఆయుధవంత. హర్షదాయక. హరితవర్ణ. సోమమును దశాంగుళులు దశాపవిత్రమున కంపును.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - రాహూగణుడు.
1. వరములిచ్చునదియు, వేగవంతయునగు సోమము వేలమందికి అన్నము సమకూర్చదలచి అభిషుతమగుచు ఉన్నిగల పాత్రలందు జల్లించబడి, దశా పవిత్రమునకు చేరును.
2. ఇంద్రుని పానము కొరకు హరిత వర్ణ సోమమును త్రితర్షి అంగుళులు అభిషవ ఫలములకు పంపుచున్నవి.
3. ఈ సోమము నరుల వద్దకు డేగవలె వేగముగను, జారుడు వ్యభిచారిణి వద్దకు వెళ్ళినట్లు సంకేత పరముగను చేరును.
4. సోమము ద్యులోకమునకు బిడ్డ. అది దశా పవిత్రమున ప్రవేశించును. రసరూప మధ్యమై దర్శనమిచ్చును.
5. పానమునకు అభిషుతమగు హరిత వర్ణ సోమము అందరిని పోషించుచు తన ప్రియ స్థానమగు దశా పవిత్రమునకు కేక పెట్టుచు ప్రవేశించును.
6. ఈ సోమమును దశాంగుళులు కర్మకొరకని శుద్ది చేయును. అనే అంగుళులు ఇంద్రుని ప్రసన్నుని చేయుటకు శోధించును.
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - ప్రియమేథ.
1. సోమము వేగవంత. సర్వజ్ఞ. మనసః పతి. దానిని అధ్వర్యులు పాత్రలందు నింపగా అనేక ధారలుగా దశా పవిత్రమునకు చేరుచున్నది.
2. ఈ సోమము దేవతల కొరకు అభిషుతమైనది. పవిత్రమున వడకట్టబడినది. అది దేవతల దేహములందు చేరుచున్నది.
3. చావు లేనిది శత్రు నాశక దేవతలకు ప్రియతమ దివ్య సోమము కలశములందు శోభిల్లును.
4. కోరికలు తీర్చు సోమము నినదించుచు దశాంగుళుల ప్రేరణ కలిగి ద్రోణ కలశమునకు పరుగులిడుచున్నది.
5. పాత్రలందుండి, బలము ఆనందము కలిగించు అభిషుత సోమము ద్యులోకమునందలి సూర్యుని వెలిగించుచున్నది. "సూర్య మారోచయత్"
6. వాక్పతి - హింసింపబడజాలని సోమము దీప్తిమంతమై అన్నింటిని ఆచ్చాదించుచు సూర్యునిచే విడువబడి దశా పవిత్రమున చేరుచున్నది.
అయిదవ ఖండము
మొదటి తృచ : -ఋషి - నృమేథ.
1. కవి, స్తుత్య, పవిత్ర సోమము శత్రువులను తరుముచు కృష్ణ మృగ చర్మము మీద దంచబడును.
2. బలసాధక, సర్వజిత సోమము ఇంద్ర, వాయువుల కొరకు దశా పవిత్రమున చుక్కలుగా రాల్చబడును.
3. ద్యులోకపు శీర్షము, కోరికలు తీర్చునట్టి, సర్వజ్ఞ సోమము చెక్క పాత్రలలోనికి ఋత్విజులచే పంపబడుచున్నది.
4. సోమము గోవులు, హిరణ్యము ఇచ్చునది. దీప్త. శత్రుంజయ. అహింస్య అది నినదించుచున్నది.
5. వృష, హరితవర్ణ, పవిత్ర, దీప్తమాన, బలశాలి సోమము దశా పవిత్రమున రాలుచున్నది. ఇంద్రుని కూడ చేరుచున్నది.
6. సోమము దేవతల రక్షక. పాపుల శిక్షక. అహింసనీయ. శోధక అట్టి బలశాలి సోమము ద్రోణ కలశమున చేరుచున్నది.
ఆరవ ఖండము
తొలి తృచ : ఋషి - రాహూగణుడు.
1. దేవతలు అభిలషించు సోము ఇంద్రుని పానమునకు అభిషుతమైనది. వృషయై, రాక్షస నాశకమై దశా పవిత్రమునకు చేరుచున్నది.





