Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్|
నిర్మమే తమహం వన్డే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||
శ్రీ మదాంధ్ర వచన అథర్వవేద సంహిత
అయిదవ కాండ
మొదటి అనువాకము
మొదటి సూక్తము - 1
ఋధజ్ మంత్రోయోనిం య ఆబభూవామృతా సుర్వర్దమానః సుజన్మా |
ఆదబ్దాసుర్భాసమానో2హేవ త్రీతో ధర్తా దాధార త్రీణి ||
1. పగటివలె ప్రకాశించువాడు, ముల్లోక రక్షకుడు, పాలకుడు, అహింసిత, అమృతమయ, సుందర జన్ముడగుటకు వర్ధమాన, సమృద్ద ఆత్మగల యోనియందు వ్యక్తుడు అగుచున్నాడు.
2. ప్రథమ ధర్మములు నిర్వర్తించినవాడు అనేక దేహములందు ప్రవేశించుచున్నాడు. అస్పష్ట వాక్కులచే నిర్వర్తించువాడు అన్నస్వభావ దేహమున ప్రవేశించుచున్నాడు.
3. ధర్మనిర్వహణకు శ్రమించువాడు, ధర్మప్రకాశమునకు బంగారము వంటి కాంతి కలిగించువాడు జన్మించినపుడు అతనికి అమృత నామము కలుగుచున్నది. జనులు వస్త్రదానములు చేయుచున్నారు.
4. విశేషములగు ధర్మసభలందు ఆసీనులయినవారు జరా రహితులై శ్రేష్ఠజన్ములు అగుచున్నారు. అతడు విద్వాంసుడై, బలసంపన్నుడై భగిని కొరకు శక్తి వంతుడగు భర్త కొరకు ప్రార్ధించుచున్నాడు.
5. ఈ ధరిత్రిని పాలించుటకు ఇద్దరురాజులు రధచక్రములవలె వర్ధిల్లుచున్నారు. వారికి విద్వత్తు కలిగించి సత్పురుషులను చేయుచున్నాను. భూమికి అన్నాది హవిస్సులు అందించుచున్నాను.
6. ఋషులు ఏడు నిషేధములను విధించినారు. వానిలో ఏ ఒక్క దానిని ఉల్లంఘించినను పాపి అగుచున్నాడు. అన్ని నియమములను సక్రమముగ పాటించినవాడు సూర్య లోకమునకు చేరుచున్నాడు.
(1. దొంగతనము 2. గురుపత్నీ గమనము 3. బ్రహ్మహత్యా, 4. భ్రూణహత్యా 5. సురాపానము 6. మరల మరల దుష్కార్యములు చేయుట. 7. అబద్దమాడుట - ఇవి నిషేధములు.)
7. నేను స్వయం ప్రకాశుడను. అమృతుడను. సువ్రతుడను. బలశాలినై యుద్దమున దూకుచున్నాను. బలశాలియై హవి అర్పించువానికి ఇంద్రుడు 'రత్నం దధాతి' - రత్నములు ఇచ్చుచున్నాడు.
8. పుత్రుడు తన క్షాతరమున క్షత్రియ పితను పూజించును గాక. శుభములు కలుగుటకు పెద్దలు ధర్మమును ఆచరింతురు గాక.
వరుణదేవా! నీ స్థానములు అనేకములు. వానిని చూపించుచు ప్రవర్తమాన ప్రపంచమున ప్రాణులను కల్పించుచున్నావు.
9. వరుణుడు అదితి పుత్రుడు. గమనశీలి సుఖపాత్రుడు అతనిని మేము వర్ధిల్ల చేయుచున్నాము.
వరుణదేవా! నీవు సేనలను సగము పాలతోనూ, సగము నీటితోను పెంచుచున్నావు.
ద్యావా పృథ్వులారా! ఈ దేహములచే ఋషులు చెప్పిన రీతి మిమ్ము స్తుతించుచున్నాము.
వినియోగము :-
1) 1, 2 సూక్తములచే ఏనుగ మీద గాని, నరుని తల మీద గాని రాగి పాత్రనుంచి దానిలో మూడు పిడకలు వేసి ముట్టించి, ఆజ్యాహుతుకిచ్చుచు శత్రువు మీద దాడి చేయునది.
ఈ కర్మమునందే రాజులూ వరాహము త్రవ్విన మట్టితో వేదిక నిర్మింతురు. పురోహితుడు సూక్తములచే ఘ్రుత సక్తు ఆహుతులిచ్చి సంపాతిత ధనుస్సును మార్జన, అభిమంత్రణలు చేసి రాజునకు ఇచ్చునది.
ఈ కర్మముననే యుద్దమున ఒకే బాణముచే కూలిన వాణి ఇంధనము మీద చక్రము పెట్టి ఈ రెండు సూక్తములను చదువుచు పొడవైన దండపు స్రవముచే చక్రరంద్రమున అగ్నికి ఘ్రుతాహుతులు ఇచ్చునది. లెమ్ము, సిద్దమగుము, దంచుము అను పొలికేకలతో యుద్దమున కంపుంది.
రెండవ సూక్తపు నాలుగవ మంత్రమును శత్రువుల మీద ప్రయోగించవలెను.
2) పుష్టి కర్మమున మిశ్రధాన్యము. ఉడికిన పిండి, అజాలోహిత మిశ్రితము, రసమిశ్రిత సత్తులను ఈ రెండు సూక్తములచే సంపాతన, అభిమంత్రణ చేసి భుజించునది.
ఈ కర్మమునందే ఉదుంబర లేక సక్ష చమసములందు మిశ్రధాన్య రసముల నుంచి ఈ రెండు సూక్తములచే సంపాతిత, అభిమంత్రణలు చేసి భుజించునది. సూత్రమున చెప్పిన మంత్రములతో ఉదయ, మధ్యాహ్న, అపరాహ్నములందు ఒక్కొక్క చమసమంత తినునది.
ఋతుమతి యగు స్త్రీ రక్తముచే సత్తులు కలిపి సంపాతన, అభిమంత్రణలు చేసి చూపుడు, మధ్య వేళ్ళతో నాకునది.
3) క్షేత్రము కోరువాడు అనుకున్న క్షేత్రమున పెరుగు, తేనె కలిపిన అన్నమును సంపాతన, అభిమంత్రణ చేసి భుజించునది.
4) సప్త గ్రామ కర్మలందు కూడ వీని వినియోగము ఉన్నది.
5) సమృద్ది కర్మయందు కూడ వీని వినియోగము.
6) గర్భమును దృఢపరచుటకు మొదటి సూక్తపు ప్రథమ ఋక్కు వినియోగము.
రెండవ సూక్తము - 2
వినియోగము - మొదటి సూక్తమున చెప్పబడినది.
సర్వ ఫలితములను ఆశించువాడు ఈ సూక్తముచే ఇంద్రాగ్నులను యజించునది.
1. ఇంద్రుడు బలవంతుడు, ధనవంతుడు. అందువలన లోకములందు ఉన్నతుడు. ఇంద్రుడు కనిపించుట శత్రువు మరణించుట ఒకేసారి జరుగుచున్నది. కావుననే ఇంద్రుడు కనిపించినంతనే అతని సేన ఆనంద భరితము అగుచున్నది.
2. మహా బలశాలురు తమ బలముచే శత్రుదాసులను భయ కంపితులను చేయుచున్నారు. వారిని చూచి స్థావర జంగమాములు కదలకున్నవి. కావున భ్రుతి పొందుసేవ ఆనందాతి రేకమున స్తుతించు యుద్దమున దూకుచున్నది.
3. జన్మ, సంస్కారము, యుద్దదీక్ష వలన మూడు జన్మల వారలగు చున్నారు. వారు మహా యజ్ఞసంపన్నులు అగుచున్నారు. రుచిని రుచివంతము చేయు మీరు రుచివంతమును మరింత రుచి వంతము చేయండి. ఇంద్రదేవా! "మధునాభి యోధి" మధురముగా యుద్దము చేయుము.
4. రాజా! నీవు ప్రతి యుద్దమున ధనమును జయించువాడవని విప్రులు నిన్ను స్తుతించుచున్నారు. నీవు వారికి స్థిరత్వము కలిగించుము. సుఖమున దుఃఖించు దుర్గతులు నీ దరికి చేరకుందురు గాక.
5. భూరి యుద్దములందు మేము చూచుచుండగానే శత్రుపక్షపు అనేకులను సంహరించుచున్నావు. నా వాక్కుచే నీ ఆయుధములకు ప్రేరణ కలిగించుచున్నాను. మంత్రములచే బాణములను తీక్ష్ణము చేయుచున్నాను.
6. ఉన్నతులు సాధారణులు ఉన్నట్టియు, అన్న రక్షణ గల ఇంట జగన్మాతను స్థాపించండి. తదుపరి ఆ ఇంటిని విచిత్ర పదార్ధములతో నింపండి.
7. బహుమార్గవర్తి, పరమ తేజస్వి, శ్రేష్ఠ ప్రభువు, గుణవంతుడగు రాజును స్తుతించండి. అతడు మహా బలశాలి. భూమికి ప్రతిరూపము. అదిగో అతడు యుద్దభూమిలో దర్శనమిచ్చుచున్నాడు!
8. ఈ రాజు ఉత్తముడు. స్వర్గకామి. ఇతడు ఇంద్రుని గొప్ప గొప్ప స్తుతులచే నుతించుచున్నాడు. ఇంద్రుడు తపస్వి. స్వర్గరాజు. లోకమున అక్షయ జలమును కురిపించుచున్నాడు.
9. తన దేహమునే ఇంద్రునిగా భావించిన మహా ప్రకాశవంత అథర్వ ఋషి ఇట్లు అన్నాడు పాపమేరుగని 'మాతరింభరి' దీనిని ప్రసన్నము చేయుచున్నది. బలముచే వర్ధిల్ల చేయుచున్నది.
మూడవ సూక్తము - 3
వినియోగము :-
దర్శపూర్ణమాస సమిధా ధ్యానమున, వర్చస్య కర్మమున, పుష్టి కర్మమున.
2) విభాగ కర్మమందు కలహా నివారణార్ధము దీనిచే 'తైలక' త్రాడును అభిమంత్రించి తండ్రి తన చేతికి కట్టుకొనునది.
3) అభిచారక కర్మమందు బృహస్పతి శిరశోదనమును 'పృషాతకము' తో తడుపునది.
4) ధనము కోరువానికి ధన క్షయమున కౌబరి మహాశాంతి చేయునది.
5) హస్త్యశ్వ దీక్షకర్మమందు ఈ సూక్తముచే ఆహుతి ఇచ్చునది.
1. యుద్దములందు మా తేజస్సు వ్యక్తమగును గాక. అగ్నిని ప్రదీప్తము చేయుట వలన మా దేహమునకు పుష్టి కలుగును గాక. నలు దిశలు మాకు ప్రణమిల్లును గాక. అగ్నియే అధ్యక్షుడుగా మేము ఈ సేనను జయింతుము గాక.
2. అగ్నిదేవా! శత్రువుల క్రోధము మానిపించుము. మమ్ము నలుదిశలందు రక్షింపుము. దుఃఖము కలిగించు బాణము వేయగోరిన వానిని వినమ్రుని చేసి దూరము చేయుము. యుద్దకాముల చిత్తములను అమావాస్య నష్టపరచును గాక.
3. ఇంద్ర, అగ్ని. మరుత్, విష్ణు సహితముగా సమస్త దేవతలు ఈ యుద్దమున మాకు అనుకూలురు అగుదురు గాక. అంతరిక్షము ప్రశంసించును గాక. నేను కోరినట్లు వాయువు వీచును గాక - "వాతః పవతాం కామాయాస్మై".
4. నా మనస్సంకల్పములు సత్యములు అగును గాక. నన్ను ఎటువంటి పాపము అంటకుండును గాక. విశ్వే దేవా "అభిరక్షన్తు మేహ" "సమస్త దేవతలు నన్ను పరిరక్షింతురు గాక".
5. దేవతలు నాకు ధనము కలిగింతురు గాక. మేము దేవతలను ఆహ్వానింతుము గాక. మాకు దేవతల ఆశీస్సులు లభించును గాక. మా దేహములు బాధారహితములు, సువీర్యములు అగును గాక.
6. ఆకాశము, పృథివి, జలము, ఓషధులు, రాత్రింబవళ్ళు ఈ ఆరు దివ్య ఉర్వులు మా కొరకు విశాలములు అగును గాక. సమస్త దేవతలు మా కర్మమున ప్రసన్నులు అగుదురు గాక. తిరస్కారము, అపకీర్తి మమ్ము చేరకుండును గాక. ద్వేషించదగిన పాపము మమ్ము అంటకుండును గాక.
7. ఇడ, భారతి, సరస్వతి దేవేరులారా! మీరు మాకు మహా శుభములు కలిగించండి. మాకు, మా ప్రజకు పుష్టి కలిగించండి.
సోమరాజన్! మా పశువులు, ప్రజలు క్షీణించకుందురు గాక. శత్రువు వలన మాకు దుఃఖము కలుగ కుండును గాక.
8. ఇంద్రదేవా! నీవు నది వంటి నడకకలవాడవు. మహత్వ గుణ సంపన్నుడవు. హర్యశ్వుడవు. ఈ యజ్ఞమున మాకు సుఖము కలిగించుము. మా సంతానమును నష్టపరచకుము. విడువకుము.
9. ధాత, విధాత, శత్రుదమన భువనపతి సూర్యుడు, ఆదిత్యులు, రుద్రులు, ఇద్దరు అశ్వినులు ఈ యజమానిని పాపముల నుండి రక్షింతురు గాక.
10. మా శత్రువులు నశింతురు గాక. ఇంద్రాగ్నుల ద్వారా మేము శత్రువులను హింసించుచున్నాము. ఆకాసమున ఉన్న ఆదిత్య రుద్రులు మాకు మహా వీరుడగు రాజును ప్రసాదించినారు.
11. భూమిని గెలిచిన అశ్వములను, గోవులను ధనములను గెలిచిన శత్రుదమన, హర్యశ్వ ఇంద్రుని పరలోకము నుంచి పిలుచుచున్నాము. అతడు యుద్దమందు మా పిలుపును వినును గాక.
ఇంద్రా! నీవు మావాడవు అగుము.
నాలుగవ సూక్తము - 4
వినియోగము :-
రాజయక్ష్మ, కుష్ఠు మున్నగు రోగ శాంతికి ఈ సూక్తముచే కుష్ఠ నామక ఔషధమును వెన్నలో కలిపి అభిమంత్రించి రోగికి ప్రతిలోమ రూపమున రాయునది.
1. కుష్ఠ ఓషధీ! నీవు పర్వతములందు పుట్టిన దానవు. ఓషధులందు బలవత్తమవు. బాధించు రోగనాశనివి. బాధించు వ్యాధులను నిర్మూలించుచు విచ్చేయుము.
2. హిమవంతమున, సుపర్ణుని ఉత్పత్తి స్థానమునపుట్టిన ఈ ఓషధి ఆరోగ్యసాధని అని విని వెళ్ళినవారు దీనిని కఠిన రోగములను నివారించునదియని తెలిసికొన్నారు.





