Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
3. పవమాన సోమమా! నీవు ధనము నిచ్చుదానవు. నీవు ధనము ప్రసాదించ దలచినపుడు ఎంతటి శత్రువైనను నిన్ను ఆపజాలడు.
మూడవ తృచ : ఋషి - నిధృవి.
1. సోమమా! మానవులకు హితము కూర్చు జలమునకు ప్రేరణ కలిగించుదానవు. ఏధారచే సూర్యుని ప్రకాశింప చేసినావో అట్టి ధారగా వర్షించుము.
2. మానవులను అంతరిక్షమునకు చేర్చుటకు సోమము సూర్యునకు ఏతశనామక అశ్వమును కూర్చును - "అయుక్త సూర ఏతశం"
3. సోమమా! ఇంద్రుడు ఇంకను ఇట్లనుచు హరితవర్ణ అశ్వములను గమనమునకుగాను సూర్యునకు కూర్చును.
ఆరవ ఖండము
తొలి తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. అగ్ని దేవత. అట్లయ్యు మర్త్యులందుండు వాడు. యజ్ఞసంబంధి వేడి, వెలుగుల నిచ్చువాడు. ఘ్రుత భక్షకుడు. పావకుడు. దేవతలారా! అన్య అగ్నుల సహితుడగు పరమ పూజ్య అగ్నిదేవతను యజ్ఞములందు దూతను చేయండి.
2. గడ్డి మేయు అశ్వము సకిలించినట్లు అగ్ని నిర్నిరోధముగా వృక్షములకు వ్యాపించును. అప్పుడు అగ్ని జ్వాలలు వాయువు వెనుక వెనుక సాగును. అగ్నిదేవా! అప్పుడు నీ మార్గము నల్లనిది, మసిగలది అగును. "తే వ్రజనం కృష్ణమస్తి"
3. అగ్నిదేవా! నీవు వర్షము కలిగించువాడవు. నీవు పుట్టినంతనే జరారహితములగు నీ జ్వాలలు ప్రజ్వరిల్లును వెలుగులు కలిగించు నీ జ్వాలలు ధూమయుక్తములై అంతరిక్షమునకు చేరును. తదుపరి ఇంద్రాది దేవతలను చేరుకొనుచున్నావు.
రెండవ తృచ : ఋషి - శృతి కక్షి లేక షుకక్షి.
1. మహావృత్రుని వధించుటకు ఇంద్రునకు సోమము అర్పించి, స్తుతించి అతని బలమును పెంచుచున్నాము. వర్షము నిచ్చు నాతడు మాకు వరదుడు అగును గాత. "స వృషా వృషభో భవతు"
2. ఇంద్రుడు దాతయగుటకే సృష్టించ బడినాడు. బలశాలి యగుటకే సొమ్ము సృష్టించబడినది. అన్నవంతుడు, కీర్తి వంతుడగు ఇంద్రుడు సోమయోగ్యుడు అగుచున్నాడు.
3. స్తోతలు ఇంద్రుని స్తుతించుచున్నారు. ఆ స్తుతులచే ఇంద్రుని - వజ్రాయుధమునకు వలె- పదను కలిగించుచున్నారు. అందువలననే అతడు బలవంతుడు, అపరాజితుడు, మహానుడు, శత్రువునకు లొంగనివాడు, స్తోతలకు ధనదాత అగుచున్నాడు.
ఏడవ ఖండము
మొదటి తృచ : ఋషి - ఉచథ్యుడు.
1. అధ్వర్యులారా! రాళ్ళతో సోమమును పిండండి. దశాపవిత్రమునకు పంపండి. ఇంద్రుని పానము కొరకు పరిశుద్దము చేయండి.
2. సోమము మాదక, పవిత్ర అన్నరూప రసము. ఇంద్రాది దేవతలు, మరుత్తులు సోమమును సేవించుచున్నారు.
3. ఋత్విజులారా! మధుమత్తమము, ద్యులోకమునకు అమృత స్వరూపమగు శ్రేష్ఠ సోమమును వజ్రధారి ఇంద్రుని కొరకు అభిషవించండి.
రెండవ తృచ : ఋషి - కవి.
1. సోమము శోధించునది. రసరూప. దేవతలకు బలదాయక భరించునది. అట్టి సోమము దివియందు ప్రవహించుచున్నది.
మాచే చేయబడిన హరితవర్ణ సోమము సుశిక్షిత అశ్వము వలె నదులందు తన బలమును కూర్చుకొనును.
2. సోమము శూరుని వలె హస్తములందు ఆయుధములు ధరించును. రథికుల గోవులకు ఇంద్రుని శక్తి కలిగించును. అధిఒ ఋత్విజుల ప్రేరణ వలన ఆవు పాలు మున్నగు వానిని కలసి కొనును.
3. పవమాన సోమమా! వ్యాకోచము నొందు ఇంద్రుని ఉదరమున ధారగా ప్రవేశింపుము. విద్యుత్తు మేఘమును వలె - మాకొరకు ద్యులోకమును వెలిగించుము. నీ మహిమచే అపార అన్నమును మా వద్దకు చేర్చుము.
మూడవ తృచ : ఋషి - దేవాతిథి.
1. ఇంద్రదేవా! నీవు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలందలి స్తోతలచే స్తుతించబడుచున్నావు. 'అన' పుత్రుని ఋత్విజులు నిన్ను విశేషముగ స్తుతించుచున్నారు. తూర్వశుని ఋత్విజులు కూడ నిన్ను స్తుతించుచున్నారు.
2. ఇంద్రా! నిన్ను రుమ, రుశ, శ్యావక, కృపులు ప్రసన్నుని చేయుచున్నారు. అట్లయినను స్తుతులకు ప్రేరణ కలిగించు కణ్వగోత్రజులు తమ స్తుతులచే నిన్ను వశపరచుకొనుచున్నారు. మా కర్మమునకు విచ్చేయుము.
నాలుగవ తృచ : ఋషి - భర్గుడు.
1. మేము వచించు స్తోత్రరూప, శాస్త్రరూప వాక్కును ఇంద్రుడు మా ముందుకు వచ్చి వినును గాత. ధనవంతుడగు ఇంద్రుడు మా సహితముగ యశోవంతుడు కాదలచినాడు. అందువలన అతడు బలశాలి అయినాడు. అతడు సోమపానమునాకు వచ్చును గాక.
2. ఇంద్రా! నీవు ఉభయలోక వాసివి. ప్రకాశించువాడవు. జగదుపకారకుడవు. నీవు నీ బలమునకే సాధ్యుడవు. ఇతర దేవతలు ఉపమాన భూతులే! నీవే ముఖ్యుడవు. నీ మనసు సోమము కాంక్షించుచున్నది - "సోమకామం హి తే మనః"
ఎనిమిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - నిధృవి.
1. సోమమా! దీప్తములగు ధారలచే పడుము. మదకారి యగు నీ యొక్క రసము ఇంద్రుని చేరును గాత. ధారణ కలిగి వాయువును చేరుము.
2. సోమమా! చెవులకు వినిపించు శత్రుధనమును పీడించు నీవు ద్రోణ కలశమున చేరుము.
3. అభిషుతమై మధువును స్రవించుచున్నది.
రెండవ తృచ : ఋషి - అంబరీషుడు లేక ఋజిశ్వుడు.
1. సోమమా! మాకు అన్నము ప్రసాదించుము.
2. సోమమా! నీవు అనేకమందిచే కోరబడు దానవు. ధన దాత్రివి. మేము నీ విచ్చిన ధనము వద్ద ఉందుము గాక. సోమమా! మాకు నీవు అందించిన అన్నపు సుఖములు కలుగును గాత.
3. ఆవు పాడి కోరు వాని నన్నింటిలో సోమము ముఖ్యము. అది దీప్తమై అంతరిక్షమునకు చేరునట్లే యజ్ఞములకు తన ధారలచే చేరికొనును. అభిషుత సోమము మధుచ్యుతమై ఉన్నిగల పవిత్రమున చేరును.
మూడవ తృచ : ఋషి - ఋణ లేక అసదస్యు.
1. సోమమా! నీవు గొప్ప దానవు. రసవాహినివి. పితృతుల్యవు. సకల దేవతా ధామముల వైపు సాగుము.
2. సోమమా! దీప్తమై దేవతల కొరకు స్రవించుము. దివికి, భువికి, ప్రజలకు సుఖశాంతులు కలిగించుము.
3. సోమమా! నీవు దీప్తవు, పానయోగ్యవు, ద్యులోక ధర్తవు అగుచున్నావు. బలశాలి వగు నీవు సత్యస్వరూప యజ్ఞమున వర్షించుము.
తొమ్మిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - ఉశనుడు.
1. అగ్నిదేవా! నీవు స్తోతలకు ధనదాతవు. ప్రీతి పాత్రుడవు. అతిథివి. మిత్రుడవు. రథము వలె ధనము తెచ్చువాడవు. అట్టి నిన్ను స్తుతించుచున్నాము.
2. ఇంద్రాదులు అగ్నిని విద్వాంసునిగా ప్రశంసించుచున్నారు. మానవులు అట్టి అగ్నిని గార్హపత్య, ఆహవనీయునిగా ప్రతిష్టించుచున్నారు.
3. నిత్య తరుణ ఇంద్రా! హవి సమర్పించు యజమానులను రక్షింపుము. వారి స్తుతి వాక్యములు వినుము. నీ సామర్ధ్యమున వారి పుత్రులను రక్షింపుము.
రెండవ తృచ : ఋషి - నృమేధ.
1. ప్రియములు కలిగించునట్టి, అపరాజితుడవగు, అన్యులకు లొంగని ఇంద్రా! నీవు పర్వతము వలె ఎటు నుంచి చూచినను మహానుడవు. స్వర్గస్వామివి. మా వద్దకు విచ్చేయుము.
2. సత్య స్వరూప సోమపాయివగు ఇంద్రా! నీవు ఉభయలోకముల మీద నీ ప్రభావము చూపుచున్నావు. సోమాభిషవకర్తలను వర్ధిల్ల చేయు స్వర్గాధి దేవతవు.
3. ఇంద్ర దేవా! నీవే శత్రుపుర ధ్వంసివి. రాక్షసాంతకుడవు. మానవులను వర్ధిల్ల చేయువాడవు. స్వర్గాధిపతివి.
మూడవ తృచ : ఋషి - జేత.
1. ఇంద్రుడు శత్రుపుర భంజునుడు. యువకుడు. విద్వాంసుడు. అమిత పరాక్రమశాలి. సకల కర్మపాలకుడు. వజ్రి, బహుస్తుతుడు. అదిగో అట్టి ఇంద్రుడు ప్రత్యక్షమైనాడు.
2. ఇంద్రా! నీవు వజ్రధారివి. దేవతల గోవులను దాచిన బలాసురుని గుహను తెరిచినావు కదా! అప్పుడు బలాసురుని అధీనమందలి దేవతలు భయము విడిచినారు. నీవద్దకు చేరినారు.
3. తన స్వంత బలముతో జగములను శాసించుచున్న ఇంద్రుని స్తుతించుచున్నాము. ఇంద్రుని ధనదానములు వేనవేలు. కాదు. అంతకు మించినవి "సహస్రం యస్యరాతయ ఉతవాసన్తి భూయసీః"
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర సామవేద సంహిత ఉత్తరార్చిక యందలి
తొమ్మిదవఅధ్యాయము సమాప్తము.





