Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

4.    అప్సరసలారా! తలలు వాల్చుకొని అశ్వత్ధన్యగ్రోధ వృక్షములు, నెమళ్ళు గల మీ స్థావరములకు చేరుకొనండి. అచట అచేతనులై పడి ఉండండి.
   
5.    అప్సరసలారా! మా వద్దనుంచి తలలు వాల్చుకొని బయలు దేరండి. శ్యామల, అర్జున వృక్షములుండి ఊగుటకు ఊయలలుండి, ఆడుటకు 'కకరి' వాద్యము ఉన్న చోటునకు చేరి అచేతనులై పడి ఉండండి.
       
6.    అజ శృంగి ఘాటు వాసన గలది. కొమ్ముల వంటి ఫలములు గలది. అది ఓషధులందు గొప్పది. లతలందు శక్తివంతము. అదిగో అజశృంగి వచ్చినది. పిశాచాదులను పారద్రోలినది.
   
7.    నెమలి వలె నాట్యమాడు అప్సర, గంధర్వ అధిపతి అండకోశమును పిండి చేయుచున్నాము. అతనిని నిర్వీర్యుని చేయుచున్నాము.
   
8.    ఇంద్రుని ఆయుధము భయంకరము. శతధారలు కల ఇనుపది. ఇంద్రుడు అట్టి ఆయుధముచే నీటి యందలి శైవలమును తినునట్టి గందర్వులను హతమార్చును గాక.
   
9.    ఇంద్రుని ఆయుధము భయంకరము. అది శతధారల స్వర్ణ నిర్మితము. ఇంద్రుడు అట్టి ఆయుధముచే నీటియందలి శైవలమును భక్షించు గంధర్వులను హతమార్చును గాక.
   
10.    అజశృంగమా! అవక భక్షకులు, మెరుపులు గలిగి, ఏడిపించు గంధర్వులను నీటియందే ప్రకాశింప చేయును. ఉపద్రవములు కలిగించు పిశాచములను నలు దిక్కుల హతమార్చుము. అణచి పెట్టుము.
   
11.    గంధర్వులు మాయల వారు. ఒకరు కుక్క వలె మరొకరు కోతి వలె, ఇంకొకరు వంటి నిండ వెంట్రుకలున్న బాలుని రూపము దాల్చి గ్రహరూపులై, సుందరులై స్త్రీలను చేరుచున్నారు. బలమైన మంత్ర ప్రభావమున ఆ గంధర్వులను నాశము చేయుచున్నాను.
   
12.    గంధర్వులారా! అప్సరసలు మీకు భార్యలు. మీరు వారి భర్తలు. ఇరువురు కలిసి జంటలుగా పారిపొండి. మీరు మరణము లేనివారు. మర్త్యులగు వ్యక్తులను కలిసి కొనకండి.
   
                                              మూడవ సూక్తము - 38
   
వినియోగము :-

   
      1) జూదపు గెలుపునకు పాచికలను ఈ సూక్తముచే అభిమంత్రించి ఆడునది.
   
      2) 5 - 7 మంత్రములచే గోపుష్టి కర్మయందు 12 పురుల త్రాటిని హోమ ఘ్రుతమున సంస్కరించునది. "అయం ఘాసః" అను పాదముచే గోవులకు గడ్డి అందించునది. 'ఇహ వత్సాన్' పాదముచే 12 పురుల త్రాటితో దూడను కట్టివేయునది.
   
   3) తథా 'సూర్యస్య రశ్మిన్' ఇతి తిస్రుభిః కర్కీసవం దద్యాత్.
   
1.    ఈ అప్సర ముడి విప్పి ధనమిచ్చునది. గెలుపు కలిగించునది. సాధువు. దేవి. ఆమెను స్తుతించుచున్నాను. జూదమున గెలుపు కలిగించు అప్సరను ఆహ్వానించుచున్నాను.
   
2.    అప్సర సాధుదేవి. పాచికలను ఒకచోట చేర్చు, విజయమునకు వేరు వేరు చేయు అప్సరసను స్తుతించుచున్నాను. జూదమున గెలుపు కలిగించు అప్సరసను ఆహ్వానించుచున్నాను.
   
3.    'కృత' యను అక్షసంఖ్య వలన గెలిపించి అప్సర ఆనందమున నృత్యము చేయుచున్నది. ఆమె నా పాచికలందు 'కృత' యై నన్ను గెలిపించుటకు తమ మాయచే నా పాచికలందు ప్రవేశించును గాక. ఆమె నాకు పాడి కలిగించును గాక. నా జూద ధనమును ఎదుటి వాడు గెలువకుండును గాక.
   
4.    అప్సర గెలుపు కలిగించనపుడు ఏడిపించును. మరల గెలుచుటకు క్రోధము కలిగించును. జూదమందలి ఆ అప్సర పాచికలందు ప్రసన్నమగుచున్నది. ఆ ఆనందిని, ప్రమోధిని అప్సరసను నేను ఇచ్చటికి ఆహ్వానించుచున్నాను.
   
5.    అప్సరసలు సూర్యకిరణ వ్యాపించు చోట సంచరింతురు. వారి భర్తలు సుదూరపు అంతరిక్షమున తిరుగుచు, ఉషావంతులై, సకల లోకములను రక్షించుచు ఒక ప్రత్యేక దిశయందు సంచరింతురు. సూర్యదేవుడు అంతరిక్షము నందలి అప్సరసల సహితుడై మేము సమర్పించు హవిని అందుకొనుటకు విచ్చేయును గాక.
   
6.    అప్సర అహిత ఉషోవంత సూర్యదేవా! నీవు తెల్లని దూడలను రక్షింపుము. వానిని పెంచి పెద్దచేయుము. మీరు అందించిన క్షీరాదులు సమృద్దములై మాకు చెందును గాక. శుభ్రవర్ణపు మీ గోవు గోష్టము నందున్నది. మీరు మాకు ప్రత్యక్షము కండి. మా నమస్సులు అందుకొనండి.
   
7.    అప్సరసహిత ఉషోవంత సూర్యదేవా! నీవు తెల్లని దూడలను రక్షించుము. వానిని పెంచి పెద్దచేయుము. ఇదిగో గడ్డి. ఇది పుష్టి కరమగును గాక. మా గోష్ఠము గోపుష్టి కలిగించును గాక. ఈ త్రాటితో దూడను కట్టుచున్నాము. మేము దానికి యజమానులము అగుదుము గాక స్వాహా.
   
                                                నాలుగవ సూక్తము - 39
   
వినియోగము :-

   
      1) సర్వసంపదలు కోరువాడు. ఈ సూక్తముచే మంత్రాధిష్టాన దేవతలను యజించునది. ఉపాసించునది.
   
      2) పాక యజ్ఞ తంత్రములందు దీనిచే ప్రధాన హోమము తరువాత సంనితి హోమ ఆహుతులిచ్చునది. ఈ కర్మమందే 9 - 10 మంత్రములచే పురుస్తాద్దోమములు చేయునది.
   
      3) చాతుర్మాస్యపు వైశ్వదేవ పర్వమున 9వ ఋక్కుచే మంథ్యాభి హోమ అనుమంత్రణము చేయునది.
   
1.    భూమిలోని అగ్ని వలననే సకల ప్రాణులు నిలుచుచున్నవి. ఆ ప్రాణుల వలననే అగ్ని సమ్రుద్దుడు అగుచున్నాడు. అట్లే నాకు కోరిన ఫలము లభించును గాక.
   
2.    పృథివి ధేనువు, అగ్ని వత్సము అగుచున్నవి. ఆ పృథివి, అగ్నుల వలన మా కోరికలు తీరుచున్నవి. మాకు మొదట ఆయువు, సంతానము, పుష్టి, ధనము కలుగును గాక. స్వాహా.
   
3.    అంతరిక్షము నందలి వాయువు వలననే గంధర్వాదులు నిలుచుచున్నారు. గంధర్వాదుల వలననే వాయువు సమృద్ద మగుచున్నాడు. అట్లే నాకు కోరిన ఫలములు లభించును గాక.
   
4.    అంతరిక్షము ధేనువు, వాయువు వత్సము అగుచున్నవి. ఆ వాయురగ్నుల వలన మా కోరికలు తీరుచున్నవి. మాకు తొలుత ఆయువు, సంతానము, పుష్టి, ధనము కలుగును గాక. స్వాహా.
   
5.    ద్యులోకము నందలి సూర్యుని వలననే ఆ లోకవాసులు నిలుచుచున్నారు. వారి వలననే సూర్యుడు సమృద్దుడు అగుచున్నాడు. అట్లే నా కోరికలు తీరును గాక.
   
6.    ద్యులోకము ధేనువు, వాయువు వత్సము అగుచున్నవి. ద్యులోక, సూర్యుల వలన మా కోరికలు తీరుచున్నవి. మాకు తొలుత ఆయువు, సంతానము, పుష్టి, ధనము కలుగును గాక. స్వాహా.
   
7.    దిశలందున్న చంద్రుని వలన సకల ప్రజ జీవించుచున్నారు. ఆ ప్రజ వలన చంద్రుడు సమృద్దుడు అగుచున్నాడు. అట్లే మా కోరికలు ఫలించును గాక.
   
8.    దిశలు ధేనువు, చంద్రుడు వత్సము అగుచున్నవి. ఆ దిశా చంద్రుల వలన మా కోరికలు ఫలించుచున్నవి. మాకు తొలుత ఆయువు, సంతానము, పుష్టి, ధనము కలుగును గాక. స్వాహా.
   
9.    అగ్నియందు అగ్ని ప్రవేశించి సంచరించుచున్నది. అతడు ఋషులకు పుత్రుడు అగుచున్నాడు. అతడు అపవాదుల నుండి కాపాడుచున్నాడు. అట్టి అగ్నికి నమస్కారయుక్త హవిని అర్పించుచున్నాము. దేవతలకు అర్పించు హవిర్భాగము వ్యర్ధము చేయబోము.
   
10.    అగ్నీ! నీవు జాతవేదివి. విశ్వజ్ఞాతవు. నీకు సప్తజిహ్వలున్నవి. హృదయ పూర్వకముగను, మనః పూర్వకముగను నీ సప్త ముఖములందు ఘ్రుతాహుతులు అర్పించుచున్నాను. హవిస్సులు ఆరగింపుము.
   
                                            ఐదవ సూక్తము - 40
   
వినియోగము :- కృత్యా ప్రతిహరణ గణమున పాఠ్యమైనందున కృత్యానిర్హారణ కర్మపు శాంత్యుదకాదులందు.
   
1.    జాతవేద అగ్నీ! తూర్పు దిక్కున అభిచారము చేసి మాకు హాని కలిగించ దలచు శత్రువు అగ్నిలో పడి భస్మమగును గాక. అభిచార హోమము చేయు వారికృత్యను వెనుకకు పంపి వారిని ధ్వంసము చేయుచున్నాను.
   
2.    జాతవేద అగ్నీ! దక్షిణ దిశన అభిచారము చేసి మాకు హాని కలిగించదలచు శత్రువు యముని వలన చచ్చును గాక. అభిచార హోమము చేయువారి కృత్యను త్రిప్పి పంపి వారిని ధ్వంసము చేయుచున్నాను.
   
3.    జాతవేద అగ్నీ! పశ్చిమ దిశన అభిచారము చేసి మాకు హాని కలిగించ దలచు శత్రువు వరుణ పాశములందు పడి చచ్చును గాక. అభిచార హోమము చేయువారి క్రుత్యను త్రిప్పిపంపి వారిని ధ్వంసము చేయుచున్నాను.
       
4.    జాతవేద అగ్నీ! ఉత్తర దిశన అభిచారము చేసి మాకు హాని తలపెట్టిన శత్రువులు సోముని వలన మరణింతురు గాక. అభిచారము చేయువారి కృత్యను వెనుకకు పంపి వారిని ధ్వంసము చేయుచున్నాను.
   
5.    జాతవేద అగ్నీ! అధోదిశన అభిచారము చేసి మాకు హాని తలపెట్టు శత్రువును భూమి మ్రింగును గాక. అభిచారము చేయువారి కృత్యను త్రిప్పి పంపి వారిని ధ్వంసము చేయుచున్నాను.
   
6.    జాతవేదాఅగ్నీ! అంతరిక్షమున అభిచారము చేసి మాకు హాని తలపెట్టు శత్రువు వాయువు వలన చచ్చును గాక. అభిచారము చేయు వారి కృత్యను త్రిప్పి పంపి వారిని ధ్వంసము చేయుచున్నాను.
   
7.    జాతవేదాగ్నీ! పైన నిలిచి అభిచారము చేసి మాకు హాని తలపెట్టు శత్రువు సూర్యుని చేత చచ్చును గాక. అభిచారము చేయువారి కృత్యను త్రిప్పి పంపి వారిని వధించుచున్నాను.
   
8.    జాతవేదాగ్నీ! దిశలు, అంతర్ధిశలందు, సకల దిశలందు అభిచారము చేసి మాకు హాని తలపెట్టిన వారు పరబ్రహ్మ వలన వ్యధితులగుదురు గాక. అభిచారము చేయువారి కృత్యను ప్రతిసరించి ధ్వంసము చేయుచున్నాను.




       విద్వాంసుడు, బహు భాషావేత్త, కవి, కథకుడు, నాటక కర్త, నవలా రచయిత, విమర్శకుడు, వ్యాస కర్త, అనువాదకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, వచన  శ్రీమద్రామాయణ, శ్రీమహా భారత, శ్రీమద్భాగవత రచయుత యగు దాశరథి రంగాచార్య  విరచిత శ్రీమదాంధ్ర వచన అథర్వవేద సంహిత యందలి నాలుగవ కాండ సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.