Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
తొమ్మిదవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - ప్రతర్దనుడు
శిశుం జజ్ఞానం హర్యతం మృజన్తి శుమ్భన్తి విప్రం మరుతో గణేన |
కవిర్గీర్భిః కావ్యే కవిః తన్త్సో పవిత్రమత్యేతి రేభన్ ||
1. సోమము అప్పుడు పుట్టిన శిశువు వంటిది. అందరు అభిలషించు సోమమును మరుత్తులు శుద్ది చేయుదురు. బుద్దివర్ధక సోమమును సప్త మరుద్గుణము శోభిల్లచేయును. సోమమును విద్వాంసులు శబ్దములచే స్తుతింతురు. సోమము స్తుతి సహితమై కలశమున ప్రవేశించును.
2. సోమము సర్వద్రష్ట. ప్రకాశకారకము. సూర్యుని సేవించునది. బహుస్తుతివంక. కవుల చెదరిన పదములను కూర్చునది. అట్టి మహా పూజనీయ సోమము మూడవ ధామమగు ద్యులోకమునకు చేరదలచినది. అది స్తుతించబడినది. దీప్యమానమైనది. ఇంద్రుని ప్రకాశింపచేయుచున్నది.
3. సోమము చమస పాత్రలందు నిలిచినది. ప్రశంసణీయ. శక్తి కలిగించునది. పాత్రలందు విహరించునది. యజమానులకు గోవులు ప్రసాదించునది. వారిని పోషించునది. జనములకు ప్రేరణ కలిగించునది. అట్టి సోమము అంతరిక్షమును సేవించి నాలుగవ ధామమగు చంద్ర లోకమును సేవించుచున్నది.
రెండవ తృచ : ఋషులు - అసిత, దేవలులు.
1. ఈ సోమములు ఇతని - ఇంద్రుని బలమును పెంచుచున్నవి. ఇంద్రునకు ఇష్టమైనదియు, ఆనందము కలిగించునదియు నాగు రసమును వర్షించును.
2. సోమమా! నీవు అభిషుతవైనావు. పాత్రలందు నిలిచినావు. వాయువును అశ్వినులను చేరుకొన్నావు. మాకు సుబలమును ప్రసాదించుము.
3. పవిత్ర సోమమా! దేవతలకు మూలమగు యజ్ఞ స్థానమును చేరుకొన్నాను. ఇంద్రుని అర్చించదలచినాను. నా హృదయమునకు ప్రేరణ కలిగించుము.
4. సోమమా! పది అంగుళులు నిన్ను శుద్ది చేయుచున్నవి. సప్తహోతలు నీకు తృప్తి కలిగించుచున్నారు. విప్రులు నిన్ను మాదకము చేయుచున్నారు.
5. సోమమా! నీవు దశాపవిత్రమున ఉన్ని యందు ఉన్నదానవు. సుఖ స్వరూపమవు. దేవతలకు ఆనందము కలిగించుటకు నిన్ను గోఘ్రుతాదులందు చేర్చుచున్నాను.
6. సోమము పవిత్రము. కలశములందు పిండబడినది. ప్రకాశించు హరిత వర్ణ సోమము ఆవు పాల వస్త్రమును ఆచ్చాదించుకొనుచున్నది.
7. సోమమా! ధనవంతులమగు మా ముందు వర్షింపుము. మమ్ము ద్వేషించు వారినందరను హతమార్చుము. మాకు మిత్రుడగు ఇంద్రుని చేరికొనుము.
8. సోమమా! నీవు మానవ ద్రష్టవు. సర్వజ్ఞవు. ఇంద్రపీతవు. అట్టి నిన్ను సేవించు మాకు అన్నము, సంతానము కలుగును గాత.
9. సోమమా! దివి నుండి వర్షము కలిగించుము. భువి మీద అన్నము మొలిపించుము. యుద్దములందు మా బలమును స్థిరపరచుము.
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషులు - అసిత దేవలలు.
1. సోమము వేల ధారలది. దశా పవిత్రమున శుద్దమైనది. పావనము చేయునది. అది ఇంద్ర వాయువుల కొరకు పవిత్రము చేయబడి పాత్రలకు చేరుచున్నది.
2. సోమము పవమానము. పరితృప్తము. దేవతలు పానము చేయునది. ప్రసిద్దము. రక్షణలు కోరు ఉద్గాతలారా! ఆ సోమాపు ఎదుట నిలచి స్తోత్రగానము చేయండి.
3. అన్నప్రాప్తి కలిగించునదియు, దేవయగ్న సిద్ది కొరకు స్తుతించుబడునదియు, మానవులకు అనేక బలములు కలిగించునదియునగు సోమము వర్షించుచున్నది.
4. సోమమా! దీప్తులను, శక్తులను వర్షించుము. మా యుద్దములందు మరింత అన్నము కురిపించుము.
5. యుద్దములకు ప్రేరణ కలిగించు సోమము వేగగామి వలె ఋత్విజులచే ఉన్నిగల పాత్రలందు రాల్చబడును.
6. స్తుతించబడునవియు, దీవించునవియునగు సోమములు మాకు వేలకొలది ధనములు మంచి బలములు ప్రసాదించునుగాక.
7. ధ్వనించు సోమములు దూడ వద్దకు చేరు గోవు వలె పాత్రలకు చేరును. బాహువులచే ధరించబడును - "దధన్విరే గభస్త్యోః"
8. సోమము ఇంద్రునకు పర్యాప్తమగుచున్నది. తృప్తి కలిగించుచున్నది. అట్టి సోమము నినదించుచు మమ్ము ద్వేషించు వారలనందరను హతమార్చునుగాత. 'విశ్వా అప ద్విషో జహి"
9. పవమానమా! అదాతలను నష్టపరచుచు సకల ద్రష్టవగు నీవు యజ్ఞశాల యందు విరాజిల్లుము.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషులు - అసిత, దేవలలు.
1. యజ్ఞసిద్ది కలిగించునదియు, మధురతర రసవాహినియునగు సోమము ఇంద్రుని కొరకు ధారలగ ఏర్పరచబడుచున్నది.
2. పాడియావులు దూడల కొరకు అరచినట్లు ఋత్విజులు సోమపానము చేయునని ఇంద్రుని స్తుతింతురు.
3. మాదక రసమును కురిపించు సోమము యజ్ఞశాలయందు వసించును. నదీ తరంగము లందు దిట్టమైన సోమము మాధ్యమిక గంధర్వవాణిలో చేరును.
4. సుక్రతు, కవి, సర్వద్రష్ట యగు సోమము అంతరిక్షనాభి వంటి ఉన్ని గల పాత్రయందు సత్కరింపబడును.
5. సోమము కలశమలందున్నది. పవిత్ర మధ్యమున స్థాపించ బడినది. ఆ సోమాంశమున చంద్రుడు ప్రవేశించుచున్నాడు.
6. సోమము మధువును రాల్చుచు కలశమును నింపుచున్నది. అంతరిక్షపు ఆధార స్థానమునకు వాక్కును పంపుచున్నది.
7. సోమము నిత్యస్తుత. అరణ్యముల ప్రభువు. అది ఋత్విజులను జంటలుగా ప్రేరేపించును. అమృత తుల్య స్తుతులు చేయు ఋత్విజుల నడుమ స్తుతులను స్వీకరించును.
8. పవమాన సోమమా! మమ్ము సహస్ర వర్చస్సులందు సుందర భవనములందు, ధనము లందు నిలుపుము.
9. కవియు, అభిషుతము, శ్రేష్ఠస్థానమున ఉన్నదియు, తృప్తి కలిగించునదియునగు సోమము తన ధారలను ద్యులోకపు ప్రియ స్థానము వైపు మళ్ళించును.
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - ఉచథ్యుడు.
1. సోమమా! సముద్ర తరంగ స్వనము వలె నీవు వేగముగ పైకి ఎగిసెదవు. బాణ నామక వాద్య స్వనమును కలిగించుము.
2. సోమమా! నీ ప్రాదుర్భావమైనంత ఋగ్యజుస్తామ వాక్కులు వెలువడును. అప్పుడు నీవు శ్రేష్ఠ పవిత్ర పాత్రయందు ప్రవేశింతువు.
3. సోమము ప్రియతమము. హరిత వర్ణ. పాషాణ పీడిత. మధుచ్యుత. పవమాన. అట్టి సోమమును ఋత్విజులు ఉన్ని గల పాత్రలకు పంపుచున్నారు.
4. పరమానంద దాయక సోమమా! నీవు ఇంద్రుని ఉదరమునకు చేరవలసి ఉన్నది. పవిత్రమున జల్లించబడుము. ధారగా వర్షించుము.
5. పరమానంద దాయక సోమమా! ఆవుపాలు మున్నగు వానితో కలియును. ప్రశంస నీయవగుము. వర్షించుము. ఇంద్రుని జఠరమున ప్రవేశించుము - "ఏన్ధ్రస్య జఠరం విశ"
అయిదవ ఖండము.
మొదటి తృచ : ఋషి - అమహీయుడు.
1. సోమమా! నీ యొక్క రసమున ఇంద్రుని పానము కొరకని క్షరించుము. నీవు యుద్దములందు తొంబది తొమ్మిది పురములను ధ్వంసము చేయుదువు.
2. ఇంద్రుడు సోమపానము చేసి పురములను ధ్వంసము చేసినాడు. సత్యకర్మయగు దివోదాసను రాజుకు శత్రువులైన శంబరుని, యదువును, తుర్వసుని హతమార్చినాడు.
3. సోమమా! నీవు అశ్వములను ఇచ్చుదానవు మాకు గోవులను, సువర్ణ సహిత అశ్వములను అపార అన్నమును ప్రసాదించుము.
రెండవ తృచ : ఋషి - అమహీయుడు.
1. సోమమా! హింసక శత్రువులను వధించుము. అదాతలను నష్టపరచుము. ఇంద్రుని స్థానము నందు కొనుము. ధారగా వర్షించుము.
2. పవమాన సోమమా! మాకు మరింత ధనమును ప్రసాదించుము. శత్రువులను హతమార్చుము. వీర పుత్రులను యశస్సును ప్రసాదించుము.





