Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
6. అగ్నీ! నీవు విశ్వతో ముఖుడవు. విశ్వవ్యాపివి "అపనః శోశుచదఘమ్".
7. విశ్వతో ముఖుడవగు అగ్నీ! నావ మీద సముద్రము వలె మమ్ము శత్రువుల నుండి దాటించుము. "అపనః శోశుచదఘమ్".
నాలుగవ సూక్తము - 34
వినియోగము :-
1) బ్రహ్మా స్యోదనసవము యొక్క నిరుప్తహవి అభిమర్సనాది కర్మలందు.
2) దీనిచే చెరువు చెలిమలు చేయునది. వాణిలో రసములు నింపి ఆండీకాది - 5వ ఋక్కు - మంత్రములందు చెప్పిన ద్రవ్యములు చేర్చునది.
1. ఈ ఓదనమునకు బ్రహ్మ - శీర్షము, బృహత్తు, పృష్ఠము, వామ దేవుడు - ఉదరము అగుచున్నారు. చందస్సులు రెక్కలు, సత్యము ముఖము అగుచున్నవి. ఇట్టి విశిష్ట తపము యజ్ఞములను మించుచున్నది.
2. అమృతమయులు పవిత్రులై, పవనము చేత పరిశుద్దులై శుచివంతమగు లోకమునకు చేరుచున్నారు. అగ్ని అచట వారి కామేచ్చను కాల్చడు. ఆ స్వర్గమున వీరి భాగమునకు అనేకమంది యువతులు ఉన్నారు.
(స్వర్గమున స్త్రీ సంభోగమున్నదని ఇది తొలిసారి.)
3. విశిష్ట ఒధానము వండిన వానికి ఎన్నటికిని దారిద్ర్యము సంభవించదు. అతడు అమృతుడై యముని చేరును. అచట దేవ, గంధర్వులతో కలసి సోమపానము చేసి ఆనందించును.
4. విశిష్ట ఓదనము వండిన వాని ప్రాణములను యముడు హరించడు. అతడు భూలోకమున రథము మీద తిరుగును. అతడు పక్షి వలె ఎగురుచు స్వర్గమునకు చేరును.
5. ఇది యజ్ఞ సారథి యగుచున్నది. విశిష్ట ఓదనము వండిన వాడు స్వర్గమునకు చేరుచున్నాడు.
అండము వంటి కొలనున పుట్టిన కుముదమును, పద్మ, ఉత్పల కందములను, గిట్ట వంటి గుంటలో పుట్టిన వానిని కమలినులను సరస్సులో చేర్చవలెను.
ఏతస్త్యా ధారా ఉపయన్తు సర్వాః స్వర్గలోకే మధుమత్ |
పిన్వమానా ఉపత్వా తిష్టన్తు పుష్కరిణీః నమన్తాః ||
స్వర్గమున మధువు వంటి ఈ సమస్త ధారలు నిన్ను చేరును గాక. సర్వ కాలములందు నిండుగా ఉండు పుష్కరిణులు నిన్ను చేరును గాక.
6. ఆ పుష్కరిణులు ఘ్రుతపూర్ణములు, మధు తటములు, క్షీర, ఉదకములతో పొంగి పొర్లునుగాక.
ఏతస్త్వా ధారా ఉపయన్తు సర్వాః స్వర్గలోకే మధుమత్ |
పిన్వమానా ఉపత్వా తిష్ఠన్తు పుష్కరిణీః సమన్తాః ||
7. పాలు నిండిన, నీరు పొంగిన నాలుగు కుంభములను నలుగ దిశలందు స్థాపించుచున్నాను.
ఏతాస్త్వా ధారా ఉపయున్తు సర్వాః స్వర్గలోకే మధుమత్ |
సిన్వమానా ఉపత్వా తిష్టన్తు పుష్కరిణీః సమన్తాః ||
8. ఈ విశిష్ట ఓదనమును బ్రాహ్మణులకు అర్పించుచున్నాను. అది ఈ లోకమును, స్వర్గమును జయించునట్టిది. ఇది స్వర్గమందలి స్వధచే ఎదిగినందున నా కొరకు అక్షయమగును గాక. ఇది నాకు విశ్వస్వరూపయగు కామధేనువు అగును గాక.
ఐదవ సూక్తము - 35
వినియోగము :-
1) హోమించని హవిస్పర్సము నందు
2) గోవునకు కవలదూడలు పుట్టినపుడు శాంతి కొరకు. ఈ సూక్తముచే గోవును అభ్యుక్షణ హోమము చేయునది.
1. సృష్ట్యాది యందు ఆవిర్భవించిన వాడు ప్రజాపతి. అతడు తపస్సు వలన బ్రహ్మ కొరకు ఓదనమును వండినాడు. అది లోకములు నిలుచుటకు నాభి వంటిది అయినది. అట్టి ఓదనము వలన మృత్యువును దాటుచున్నాను.
(అన్నము లేక కలుగు మృత్యువును అన్నము వలన జయించనగును. కడుపులోని బిడ్డకు నాభి మూలముననే ఆహారము అందుచున్నది. అన్నము లోకమునకు నాభి అగుచున్నది.)
2. ప్రాణులను సృష్టించువాడు ఓదనము వలన మృత్యువును దాటినాడు. దేవతలు తపించియు, శ్రమించియు ఓదనమును పొందినారు. పూర్వము బ్రహ్మ కొరకని ప్రజాపతి ఓదనమును వండినాడు.
"తేనౌదనేనాతి తరాణి మృత్యుమ్" - అట్టి ఓదనము వలన మృత్యువును దాటుచున్నాము.
3. ఏ ఓదనము సకల ప్రాణుల నియమమగు పృథివిని ధరించిఉన్నదో ఏది తన సారముచే అంతరిక్షమున వ్యాపించిఉన్నదో దేని మహిమ వలన ద్యులోకము స్తంభించి ఉన్నదో "తేనౌదనేనాతి తరాణి మృత్యుమ్"
4. దేని వలన ముప్పది దినముల మాసము పన్నెండు నెలల సంవత్సరము ఏర్పడినవో, రాత్రింబవళ్ళకు ఏది లభించుట లేదో "తేనౌదనేనాతి తరాణి మృత్యుమ్"
5. ఓదనము పరితపించు వారికి ప్రాణములు ఇచ్చుచున్నది. ఈ ఓదనము కొరకే సమస్త లోకములు వర్షము కురిపించుచున్నది. దీని వలననే సమస్త దిశలు ప్రకాశవంతములు అగుచున్నవి. "తేనౌదనేనాతి తరాణి మృత్యుమ్"
6. దేని పాకమున అమృతము సంభవించినదో, ఏది గాయత్రికి అధిపతియైనదో, దేనియందు విశ్వరూపలగు వేదములు నిక్షిప్తములై ఉన్నవో "తేనౌదనేనాతి తరాణి మృత్యుమ్"
7. ద్వేషించు శత్రువును పీడించుచున్నాను. దేవతలను బాధించు వారిని పీడించుచున్నాను. నా శత్రువులు నశింతురు గాక. అందులకే నేను విశ్వవిజేత అయిన బ్రాహ్మ ఓదనము వండు చున్నాను. శ్రద్దాళువునైన నా మాటలు దేవతలు విందురు గాక.
ఎనిమిదవ అనువాకము
మొదటి సూక్తము - 36
వినియోగము :-
చాతన గణమున 1 - 2 సూక్తముల పాఠము ఉన్నది. భూతగ్రహాదిఉచ్చాటన కర్మమున.
1. అగ్ని సత్యస్వరూపుడు. ఓజోవంతుడు. విశ్వానరుడు. వరదుడు. అట్టి అగ్ని మా మీద దోషారోహణ చేయునట్టి, మమ్ము హతమార్చ దలచినట్టి, వైర భావము గలట్టి శత్రువులను దహించును గాక.
2. బాధించక దెబ్బతీయదలచు, బాధించి దెబ్బతీయ దలచు ఉభయ శత్రువులను అగ్ని యొక్క కోరలందు పెట్టుచున్నాము.
3. ఎదుట తిరుగు వారు, క్రవ్యాదులు, ప్రతిపక్షులు, అమావాస్య అంధకారమున హతమార్చుటకు తిరుగు వారిని మా మంత్రబలమున దూరము చేయుచున్నాము.
4. పిశాచములను హతమార్చుచున్నాను. రాక్షసుల బలములను నష్టపరచుచున్నాను. నన్ను ద్వేషించు వారిని వధించుచున్నాను. నా యొక్క ఇష్టఫలప్రాప్తి సంకల్పము సఫలమగును గాక. సమృద్ద మగును గాక.
5. పిశాచములు కాంతివంతములై నవ్వించును. సూర్యుని వలె వ్యాపించి బాధించును. నదులందు, పర్వతములందు తిరుగుచుండును. నేను వానికి దూరముగా ఉండి పశువంతుడను అగుదును గాక.
6. గోపాలురను పిశాచములకు, దొంగలకు, బంది పోట్లకు దూరముగా ఉందును. నేను ప్రవేశించిన గ్రామము నుండి పిశాచాదులు పారిపోవుచున్నవి.
7. నేను పిశాచములకు, దొంగలకు, బంది పోట్లకు దూరముగా ఉందును. నేను ప్రవేశించిన గ్రామము నుండి పిశాచాదులు పారిపోవుచున్నవి.
8. నా వద్ద ఉన్న ఉగ్రబలము ఏ గ్రామమున ప్రవేశించునో అచట పిశాచాదుల బాధలు ఉండవు. ఉన్ననూ అవి నశించును. ఆ గ్రామస్థులు పిశాచాదుల బాధ తెలియకుందురు.
9. నా మీద క్రోధించువారు ఏనుగునకు దోమ వంటి వారు. పురుగులు కాళ్ళక్రింద నలిగినట్లు వారిని నలిపివేయుచున్నాను.
10. పగ్గముతో పొగరుబోతు గుర్రమును కట్టిపెట్టినట్లు నా శత్రువులను నిర్రుతి కట్టి పెట్టును గాక. నామీద కోపించు శత్రువు నిర్రుతి పాశముల నుండి విముక్తుడు కాకుండును గాక. కట్టుబడి ఉండును గాక.
రెండవ సూక్తము - 37
వినియోగము :-
గణప్రయుక్తమును గూర్చి మొదటి సూక్తమున చెప్పబడినది.
1) సకల భూతగ్రహ చికిత్సకు శమీపాత్ర చూర్ణమును శమీకాయలో పోసి ఈ సూక్తముచే అభిమంత్రించి గ్రహ బాధితునిచే తినిపించునది. దానిని అలంకారముగ కట్టునది. రోగి ఇంట చల్లునది.
2) అశ్వక్షయమునకు గంధర్వ మహాశాంతి యందు ఈ సూక్తముచే గుగ్గిలాది ద్రవ్యముల హోమము చేయునది.
1. ఓషధీ! తొలుత అథర్వాది ఋషులు నీవు సాధనగా రాక్షసులను వధించినారు. కశ్యపుడు, కణ్వుడు, అగస్త్యుడు గూడ నీ వలననే రాక్షసులను, పిశాచములను దూరము చేయుము.
2. అజశృంగి ఓషధీ! మాకు ఉపద్రవములు కలిగించు గంధర్వులను నీవు సాధనముగా నష్ట పరచుచున్నాము. నీ ఉగ్ర గంధము వలన రాక్షసులను. పిశాచములను దూరము చేయుము.
3. నది దాటుటకు నావికుని వద్దకు వెళ్ళినట్లు గుగ్గిలము, పీల, ఔక్షగంధి, నలద్యౌ, ప్రమంది అను ఐదు ద్రవ్యముల హవనముచే గంధర్వ స్త్రీలగు అప్సరలు వెనుదిరిగి నదులు మున్నగు తమ స్థానములకు చేరుదురు గాక.





