Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


                     

                                        నాలుగవ ఖండము
                        మొదటి తృచ : సికతానివావరి ఋషిగణము.

   
1.    సోమము ఇంద్రుని ఉదరమున ప్రవేశించును. మిత్రమగు సోమము ఇంద్రుని ఉదరమున పట్టకుండును.
   
    నరులు యువతులను కలసినట్లు సోమము జలమును కలసికొనును. అభిషుతమైనంత శతసాధక దశా పవిత్రము నుండి కలశమున ప్రవేశించును.
   
2.    సోమమా! నిన్ను ధ్యానించవారును, నీ మదకారక శబ్దమును వినగోరువారును అగు నీ స్తోతలు కర్మానుష్టాన మందున్నారు. యజ్ఞశాలలో స్తోతలు హరితవర్ణ, క్రీడనశీల సోమమును స్తుతింతురు. పాడియావులు సోమము కొరకు ఎక్కువ పాలను ఇచ్చును.
   
3.    పవమాన సోమమా! నీవు పవిత్రావు. మేము అన్నములను సమకూర్చినాము. నీవు నీ యొక్క రసమున దానిని పావనము చేయుము. మేము దినమున చేయు మూడు సవనములకు బాధ కలిగించకుము. మాకు ప్రసిద్దుడు, బలవంతుడు, సుందరుడు, మధురతముడు శక్తివంతుడగు పుత్రుని ప్రసాదించుము.
   
                                   రెండవ తృచ : ఋషి - పురుహన్మ.
   
1.    ఇంద్రుడు జ్ఞానదాత. ప్రశంసనీయుడు. తన బలమున శత్రువును తిరస్కరించువాడు. అపరాజితుడు. అట్టి ఇంద్రుని యజ్ఞమున ప్రసన్నము చేసిన వానికి ఎదురు ఉండదు. ఎంతటి వాడును అతనికి హాని కలిగించ జాలడు.
   
2.    ఇంద్రుడు ఇతరులను సహించని బలశాలి. శత్రుంజయుడు. అట్టి ఇంద్రుని నేను నుతించుచున్నాను. ఇంద్రుడు ప్రత్యక్షమైనంత మహిషములు, వేగము గలిగి హవిస్సులనిచ్చు గోవులు, మేకలు ప్రణమిల్లును. ద్యావాపృథ్వులు, సకల ప్రాణులు ప్రణమిల్లుదురు.
   
                                          నాలుగవ ఖండము
                                   తొలి తృచ : ఋషి - నారదుడు.

   
1.    మిత్రులారా! రండి కూర్చొనండి. సోమపు కీర్తిని గానము చేయండి. పవిత్ర సోమమును మరింత స్తుతించండి. తదుపరి శిశువును అలంకరించినట్లు సోమమును యజ్ఞములచే శోభిల్లునట్లుగా అలంకరించండి.
   
2.    సోమము గృహసాధనము. దేవరక్షకము. మదకరము. ద్యావాపృథ్వుల బలములను పెంచునది. ఋత్విజులారా! తల్లిని బిడ్డను కలిపినట్లు ఈ సోమమును వసతీవర జలముతో కలపండి.
   
3.    వేగము కొరకు, దేవతల పానము కొరకు, మిత్రావరుణులకు సుఖము కలుగునట్లు బలవర్ధక సోమమును పవిత్రము చేయండి.
   
                              రెండవ తృచ : ఋషి - ఐశ్వర్యుడు.

   
1.    సోమము బలశాలి. అనేక ధారలు కలది. ఉన్ని పాత్రలందు జల్లించపడును. అనేక ధారలుగా వర్షించును.
   
2.    సోమము బహు బలశాలి. నీట శుభ్రము చేయబడును. అందు గోఘృతాదులు కలియును. అట్టి సోమము వర్షించును.
   
3.    సోమము నరులచే నియంత్రితమై, రాళ్ళచే దంచబడి ఇంద్రుని ఉదరమను కలశమున ప్రవేశించును.
   
                             మూడవ తృచ : ఋషి - జమదగ్ని.
   
1.    దూర దేశమున, సమీప ప్రాంతమున శుద్ది చేయబడినదియు, కురుక్షేత్రపు శరణ్యావతి సరస్సున శుద్ది చేయబడినదియు నగు సోమము మాకు కోరిన ఫలములను ప్రసాదించును గాత.
   
2.    ఎయ్యది దూర ఋజీక దేశమున - ఎయ్యది కృత్నానమను కర్మ ప్రధాన దేశమున ఎయ్యది సరస్వతీ నదీ తీరమున- ఎయ్యది పంచ జనులచే అభిషుతము చేయబడినదో అట్టి సోమము మాకు కోరిన ఫలములను ప్రసాదించును గాక.
   
3.    అభిషుతమును, దీప్త పాత్రలందు చేరినదియు నగు సోమము మాకు దివినుండి వర్షమును, వీరపుత్రులను ప్రసాదించును గాత.
   
                                                ఆరవ ఖండము
                                  మొదటి తృచ : ఋషి - వత్సుడు.

   
1.    అగ్నీ! నేను వత్సుడను. నీకు నచ్చిన, నీకు మనోహరమగు స్తుతులచే స్తుతించుచున్నాను. నిన్ను పరమోత్తమ ద్యులోకము నుండి ఇచ్చటికి ఆహ్వానించుచున్నాను.
   
2.    అగ్నీ! నీవు సమస్త దేశములందు సమదృష్టి కలవాడవు. అందుకే నీవు సకల దిశలకు స్వామివి. మా రక్షణలకు నిన్ను యుద్దములకు ఆహ్వానించుచున్నాము. "సమత్సు త్వా హవామహే"
   
3.    ఇది బలముల పోరు మేము బలము కోరువారము అగ్ని యుద్దములందు ధనము ప్రసాదించువాడు. మేము అగ్నిని ఆహ్వానించుచున్నాము - "అగ్నిం హవామహే"
   
                               రెండవ తృచ : ఋషి - నృమేధ.
   
1.    ఇంద్రా! నెవెఉ శతక్రతువవు. బహు కర్మవంతుడవు. విశేష జ్ఞాతవు. మాకు అన్నము నిమ్ము. బలము నిమ్ము. శత్రుతిరస్కర్తా! మాకు వీరపుత్రుని ప్రసాదించుము.
   
2.    శతక్రతో! త్వంహి నః సితా. త్వం మాతా. త్వం వసుః మేము నిన్ను సుఖములు యాచించుచున్నాము.
   
3.    ఇంద్రా! స్తోతలు నిన్ను స్తుతించుచున్నారు. బలశాలిని చేయుచున్నారు. బలశాలి ఇంద్రా! నిన్ను యజమానులు అనేకులు ఆహ్వానించుచుందురు. మేము బలము ఆశించి నిన్ను స్తుతించుచున్నాము. నీవు మాకు శ్రేష్ఠ ధనమును ప్రసాదించుము.
   
                              మూడవ తృచ : ఋషి - భౌమ అత్రి.
   
1.    ఇంద్రదేవా! నీవు వజ్రధారివి. విచిత్ర రూపివి. నీవు నాకు ఇవ్వవలసిన ధనము ఈ లోకమున లేదు. అట్టి ధనము నీ వద్ద ఉన్నది. దానిని నాకు రెండు చేతులతో ఇమ్ము 'ఉభాయా హస్త్యా భర'
   
2.    ఇంద్రా! నీవు ఏ అన్నమును పరమోత్తమము అనుకొచుచున్నావో అట్టి దానిని మాకు ప్రసాదించుము. మేము అపారమగు అన్నము కలవారలము అగుదుము గాక.
   
3.    ఇంద్రదేవా! నీ మనసు గొప్పది. సకల దిశలందు స్తుతించ బడునది. అట్టి నీ మనసు కన్న దృఢమగు అన్నమును మాకు కలిగించుము.
   
   

                    దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన సామవేద
                    సంహిత ఉత్తరార్చిక యందలి ఎనిమిదవ అధ్యాయము
                                                 సమాప్తము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.