Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

2.    నేను ఈ సకల దృశ్యమాన ప్రపంచమునకు సామ్రాజ్ఞిని. నేనే ధనములను ఇచ్చుచున్నాను. యజ్ఞదేవతలందు ప్రథమను. అట్టి నన్ను దేవతలు అనేక స్థానములందు స్థాపించినరు. అందువలన దేవతలు చేసిన కార్యములన్నియు నన్ను గూర్చి చేసినట్లగుచున్నవి.
   
3.    దేవతలు, మానవులు వినునట్లుగా ఈ మాట నేను చెప్పుచున్నాను :-
   
    నేను కరుణించిన వానిని ఉగ్రుని చేయుచున్నాను. వేదవిదుని చేయుచున్నాను. ఋషిని, మేధావిని చేయుచున్నాను.
   
4.    తినుట, చూచుట, ఊపిరి పీల్చుట, వినుట అన్నియు నా వలననే జుర్గుచున్నవి. అంతర్యామినగు నన్ను తెలియని వారు నశించుచున్నారు. వినండి వినదగు మాట చెప్పుచున్నాను,
   
5.    బ్రహ్మద్వేషులను వధించుటకు రుద్రుని చేతి ధనుస్సును నేనే ఎక్కుపెట్టించినాను. నేను స్తోతల పక్షమున యుద్దములు చేయుదును. నేను ద్యావాపృథ్వులందు వ్యాపించి ఉన్నాను.
   
6.    నేనే అభిషుత సోమమును, త్వష్టను, పూషను, భాగుని పోషించుచున్నాను. దేవతలకు హవిస్సులు అర్పించు యజమానులకు యజ్ఞఫల రూపమగు ధనమును నేనే ఇచ్చుచున్నాను.
   
7.    ఈ సకల ప్రపంచ సృష్టికర్తను నేనే సృజించుచున్నాను. నా జన్మస్థానము సముద్ర మధ్యమున కలదు. నేనే తేజస్సును. సకలమును ప్రకాశింపచేయుచున్నాను. ఈ ద్యావాపృథ్వులను నా దేహముచే స్పృశించుచున్నాను.   

8.    వాయువు అన్యుల ప్రేరణ లేకనే వీచినట్లు అన్యుల సహాయము లేకుండ సకల భువనములందు నేనే ప్రవర్తిల్లుచున్నాను. నేను నా స్వమహిమ వలన ద్యావాపృథ్వులను మించినాను.
   
    (సర్వజగత్క ల్పనాస్పదం సచ్చిత్సుఖాత్మకం  పరం బ్రహ్మ స్వాత్మ త్వేన విదుషీ అభ్రుణాఖ్యస్య మహర్షే ర్దుహితా వాంగ్నామ్నీ బ్రహ్మవాదినీ స్వాత్మానం సర్వాత్మ భావేన తుష్టావ ఇతి సాయణాచార్యః.
   
    సర్వజగత్కల్పనాస్పదుడును, సచ్చిత్సుఖాత్మకుడును అగు పరబ్రహ్మమును తానుగా భావించి విదుషీమణియు, అభ్రమహర్షి పుత్రియునగు 'వాక్' అను పేరుగల బ్రహ్మ వాదిని తనను సర్వాత్మగా భావించి స్తుతించినది.
   
    నరుడు స్వశక్తిచే పరమాత్మ స్వరూపుడు కావచ్చునని. "అహం బ్రహ్మాస్మి" నేనే బ్రహ్మను అనగలడు.)
   
                                             ఏడవ అనువాకము
                                            మొదటి సూక్తము - 31

   
వినియోగము :-

   
      1) 1 - 2 సూక్తములు తన మరియు శత్రుసేనల మధ్య నిలిచి చదువునది. భాంగ పాశములను, మౌంజపాశములను, పచ్చికుండను అభిమంత్రణ, సంపాతనములు చేసి శత్రుసేన సంచరించువైపు  విసరివేయునది.
    జయాపజయములు తెలిసికొనుటకు శరతృణములను రెండు సేనల నడుమ పెట్టి ఈ రెండు సూక్తములచే  అభిమంత్రణ, సంపాతన చేసి అంగిరస అగ్నిలో కాల్చునది. పొగపోయిన వైపు పరాజయమని  తెలియునది.
   
      2) గ్రహయజ్ఞమున ఈ రెండు సూక్తములచే అంగారక హవి, ఘ్రుత సమిధా దానము, ఉపస్థానము చేయునది.
   
1.    క్రోధాధిదేవత మన్యూ! నీవే సాధనముగ రథయుక్త శత్రువులను పీడించుచు, కేకలు పెట్టుచు, క్రోధభరితులై, ఆయుధములను పదను పెట్టుచు మా యోధులు మరుత్తుల వలె వేగావంతులు, అగ్ని వలె దుర్దర్షులై శత్రుసేన మీదకు పోవుదురు గాక.
   
2.    మన్యుదేవా! నీవు అగ్ని వలె మండి పడుము. శత్రుసేనను దహించుము. నీవే మా సేనాపతివి అగుదువు గాక. మేము నిన్ను సంగ్రామములకు ఆహ్వానింతుము గాక. మా శత్రువును వధించుము. వారి ధనము మాకు పంచి పెట్టుము. అట్లయినను బలప్రయోగమున శత్రువును నష్టపరచుము.
   
3.    మన్యూ! నీవు ఉగ్రబలుడవు. నిన్ను అడ్డగించువారు లేరు. సర్వతంత్ర స్వతంత్రుడవగు నీవు సకల జనులను నీ అదుపునందు ఉంచుచున్నావు.
   
    నీవు శత్రుసేనను సంహరింపుము. లెక్క చేయకుము. దునుమాడుము. సేనను తిప్పికొట్టుము.
   
4.    మన్యూ! మేము స్తుతించుచున్నాము. అప్పుడు నీవు ఒక్కడవు అనేకులవలె శత్రుదమనుడవు అగుచున్నావు. మా జనులందు చేరుము. వారిని వీరులను, శూరులను చేయుము. అచ్చిన్న కాంతివంతా! నీ సాయమున మేము దీప్తివంతులమై సింహనాదములు చేయుచు విజయఘోష పెట్టుదుము గాక.
   
5.    మన్యూ! నీవు విజయప్రదుడవు ఇంద్రుని వంటి వాడవు. ప్రాచీన ఉపాయములను ఉపదేశించువాడవు. కావున ఈ యుద్దమున మమ్ము పాలించుము.
   
    సహనశీలా! నీ నామమును మేము కీర్తించుచున్నాము. నీవు ఆవిర్భవించిన అమృతస్థానము మాకు తెలియును.
   
    (క్రోధమునకు చావులేదు. కావున అది అమృతము.)
   
6.    అపరాజితులు, వజ్రసములు, అకుంఠిత శక్తివంతులగు శత్రువులను తుడిచిపెట్టు మన్యూ! నీవు ప్రచండ బలవంతుడవగుము. సహభూతే! నీవు పురుహోతుడవు. మహా మహా ధనములు లభించు మహా మహా సంగ్రామములను గెలిచి మాతో పాలు పంచుకొనుము.
   
    (క్రోధము సహభూతము - తనలో పుట్టినది. క్రోధము పురుహూతము - అనేక మందిచే పిలువబడునది. అందరు దానినే కదా పిలుతురు!.)
   
7.    వరుణుడు, మన్యుడు తెచ్చిన ధనములను కలిపి మాకు ఇచ్చెదరు గాక. మా శత్రువు మనసులందు భయము చేరి పరాజితులు అగుదురు గాక. వారు తోక ముడిచి నక్కినక్కి బ్రతుకుదురు గాక.
   
                                                రెండవ సూక్తము - 32
   
1.    వజ్రసాయక మన్యూ! నిన్ను అర్చించువాడు శక్తిమంతుడై నిరంతరము శత్రుంజయ కార్యములందు నిమగ్నుడు అగుచున్నాడు. నీవు బలమున పుట్టినవాడవు. అణచి పెట్టగల వాడవు. నీ సాయమున వీరులము, శూరులమై ఆర్య, దస్యు శత్రువులను అణచిపెట్ట గలుగుచున్నాము.
   
2.    మన్యువే ఇంద్రుడు. సమస్త దేవతలు, హోత, వరుణుడు, జాతవేద అగుచున్నాడు. మానవులు మన్యునే స్తుతించుచున్నారు. మన్యువు మా సంతాపమును పంచుకొనును గాక - రక్షించును గాక.
   
3.    మన్యూ! ప్రత్యక్షమగుము. నీవు మహా మహుడవు. తపన యందు పుట్టినవాడవు. తాప సహాయమున మా శత్రువులను వధించుము. నీవు అమిత్రహంతవు. వృత్రహంతవు. దస్యుహంతవు. సకల సంపదలను మాకు తెచ్చి ఇమ్ము.
   
    (అమిత్రుడు స్నేహ రహితుడు. వృత్రుడు చుట్టుముట్టు వాడు. దస్యుడు క్షీణింప చేయువాడు. అట్టి పగతురు.)
   
4.    మన్యువా! నీవు అపరాజితవు. స్వయంభవుడవు. క్రోధనుడవు. శత్రుదమనుడవు. సర్వసాక్షివి. సహనశీలుడవు. మానవులకు నియంతవు. త్రొక్కిపెట్ట గలాడవు. నీవు యుద్దములందు మాలో బలమును చేర్చుము. బలము కలిగించుము.
   
5.    శ్రేష్ఠ జ్ఞానవంత మన్యుదేవా! మహా మహివగు నిన్ను పూజించక నేను యుద్దము నుండి తొలగి పోవుచున్నాను. నిన్ను సంతోషపరచు పనులు చేయక నీకు కోపము తెప్పించినాను. నా తనువు నందున్న నీవు నాకు బలము కలిగించుము.
   
6.    మన్యుదేవా! నేను నిన్ను అర్చించువాడను. నీవు మా దరిచేరి, మాకు ప్రత్యక్షమై మా శత్రువు మీదకు దండెత్తుము. సహన శీలా! సంపూర్ణ ఫలప్రదాతా! బలసంపన్నా! మనమిద్దరము శత్రువులను వధింతము గాక. నన్ను బంధువు వలె రక్షించుము.
   
7.    మన్యుదేవా! ప్రత్యక్షమగుము. మా కుడిప్రక్కన మంత్రిగా నిలువుము. అప్పుడు మేము శత్రు సమూహములను చావగొట్టెదము. నీకు మధుర రస సోమాహుతులు సమర్పించుచున్నాను. మనమిద్దరము ఇతరులెరుగకుండ తొలుత సోమపానము చేయుదుము గాక.
   
                                              మూడవ సూక్తము - 33
   
వినియోగము :-

   
      1) బృహద్గణమున దీని పాఠమున్నందున శాంత్యుదకము మున్నగు వానిలో.
   
      2) స్త్రీలకు పురుష ప్రేమ నివృత్తికిని పురుషులకు స్త్రీల రతి నివృత్తికిని ఇసుకను దీనిచే అభిమంత్రించి పురుష /     స్త్రీ గృహమున చల్లుచు తిరుగునది. లేక ఇసుకను చేతపట్టి దీనిని జపించవలెను.
   
      3) శవదహనానంతరము అటుచూడక బంధు సహితుడై దీనిని జపించునది. బ్రహ్మస్నానము తరువాత దీనిని     జపించునది. ఇంటికి వచ్చి దీనిచే శ్యామ సమిధలను ఉంచునది.
   
1.    అగ్నీ! నీవు, మా పాపములను పోగొట్టుము. మాకు ధనసమృద్ది కలిగించుము. "ఏడిపించు పాపమును దూరము చేయుము" - "అపనః శోశుచదఘమ్".
   
2.    అగ్నీ! నిన్ను సుక్షేత్రము, సన్మార్గము, సుసంపద కొరకు "యజామహే" "అపనః శోశుచదఘమ్"
   
3.    అగ్నీ! నీ స్తోతలందు నేను నిన్ను అధికముగా స్తుతించువాడను. మా వారలందరును అభిజ్ఞులగుచున్నారు. "అపనః శోశుచదఘమ్".
   

4.    అగ్నిదేవా! నిన్ను స్తుతించువారు సంతానవంతులు విద్వాంసులు అగుచున్నారు. మేము సహితము స్మతానవంతులము విద్వాంసులము అగుదుము గాక. "అపనః శోశుచదఘమ్".
   
5.    అగ్ని యొక్క శక్తివంతములగు వెలుగు కిరణములు విశ్వమంతటను వ్యాపించుచున్నవి "అపనః శోశుచదఘమ్".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.