Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


        

                     భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
                      భద్రా ఉత ప్రశస్తయః ||

                                            ఎనిమిదవ అధ్యాయము
                                                మొదటి ఖండము
                                  మొదటి తృచ : ఋషి - అసిత దేవలులు.

   
    ప్రకావ్యముశనేవ బృవాణో దేవో దేవానాం జనిమా వివక్తి |
    మహివ్రతః శుచిబన్దుః పావకః పదా వరాహో అభ్యేతి రేభన్ ||

   
1.    స్తోత ఉశన ఋషివలె స్తోత్రమును ఉచ్చరించుచున్నాడు. దేవతలు ప్రకటమగునట్లు చదువుచున్నాడు.
   
    సోమము మహా పరాక్రమాశాలి. దీప్త. తేజోవంత. పాపనాశక. అభిషుత. అది శబ్దించుచు పాత్రలకు చేరుచున్నది.
   
2.    వేటకాడు హంసను బాధించినట్లు 'వృషగణము' అను ఋషులు శత్రువులచే బాధించబడినారు. వారు రక్షింప బడుదురుగాక. వారు వేగమున, అభిషవ శబ్దమును బట్టి, యజ్ఞశాలకు చేరుకుందురు గాక. స్తోత్రయోగ్యము, శత్రువులు సహించలేనిదియునగు సోమమును బాణవాద్యము వాయించుచు స్తోతలు స్తుతింతురు గాక.
   
3.    సోమము అనేకులచే స్తుతించబడునది. దాని వేగము అంతరిక్షము వైపు సాగును. అనాయాసముగ సాగు సోమపు వేగమును ఎంతటివాడును కొలత వేయజాలడు. తీక్షణతేజము గల అంతరిక్షచరి సోమము అనేక రీతులుగా వెలుగులు వ్యాపింపచేయును. సోమము పగలు హరితముగను, రాత్రి ప్రకాశవంతముగను దర్శనమిచ్చును.
   
4.    అభిషవ సమయమున పాత్రలందు సోమము చేయు శబ్దము రథపు చప్పుడు వలెను, గుర్రపు సకిలింపు వలెను ఉండును. సోమము శత్రువు అన్నము గుంజుకొనదలచి యజమానులకు ధనము ఇచ్చుటకు పరాక్రమించుచున్నది.
   
5.    యుద్దమున విజయము సాధించిన రథము వలె సోమము యజ్ఞము వైపు సాగునపుడు ఋత్విజులు భారవాహుల వలె దానిని తమ భుజములకు ఎత్తుకొందురు.

6.    కీర్తనలచే రాజులను వలె సప్తహోతలచే యజ్ఞమును వలె సోమమును గోఘ్రుతాదులచే సంస్కరించుచున్నారు.
   
7.    అభిషుతమగు సోమము బృహత్ స్తుతి యుక్తమై మధుర మధురసధారలను నలు దిశల నుండి వర్షించుచున్నాది.
   
8.    సోమము ఇంద్రుని పానయోగ్య. ఉషస్సు వలె శోభలు వ్యాపింప చేయునది. అట్టి సోమము అభిషవ సమయమున ధ్వని చేయును.
   
9.    స్తుతి కర్తలును, సనాతనులును, సోమమును తెచ్చునట్టి మానవ ఋత్విజులు యజ్ఞద్వారములను తెరచుచున్నారు.
   
10.    మంచిజన్మము గల సప్త హోతలు సోమపు స్థానమును పూరించి కర్మానుష్టానమునకు ఉపక్రమించుచున్నారు.
   
11.    కనులతో సూర్యుని దర్శించుటకు యజ్ఞపు నాభి రూపియగు సోమమును నా నాభియందు చేర్చుచున్నాను. సోమ కిరణములను వ్యాపింపచేయుచున్నాను.
   
12.    ఇంద్రుడు పరాక్రమశాలి. అధ్వర్యులు అతనికి ప్రీతిపాత్రులు. ఇంద్రుడు తన కనులతో అధ్వర్యుల హృదయములందున్న సోమమును చూచుచున్నాడు.   
   
                                            రెండవ ఖండము
                          మొదటి తృచ : ఋషులు - అసిత దేవలులు.

   
1.    ఈ యజమాని కోరిన దేవతా సంబంధములను ఎరుంగుచు సోమము కర్మమున యజ్ఞమార్గమును అనుసరించును.
   
2.    సోమము హవిస్సులందు శ్రేష్టము. సోమము నీట చేరును. ప్రధానధారలుగా పడును.
   
3.    హవిస్సులందు ప్రధానమగు సోమము వాణిని ప్రకటించును. కోరికలు తీర్చును. సత్యరూపయగును. హింసారహితయై యజ్ఞశాల జలములందు ధ్వనించును.
   
4.    బలములను శోధించు సోమము స్తోత్రములందు ప్రవేశించినపుడు స్వర్గమునందలి అన్నవంత ఇంద్రుడు సోమమును సేవించ నిచ్చగించును.
   
5.    ఋత్విజులు సోమమును కర్మలకు ప్రేరణ కలిగింతురు. రాజు తనను ఎదిరించు వారిని హతమార్చినట్లు సోమము యజ్ఞవిఘ్నకారులను హతమార్చును.
   
6.    సోమము హరితవర్ణ. దేవతలకు ప్రియతమ. అది నీట చేరి ఉన్ని పాత్రల ద్వారా జల్లించబడును. అభిషవ సమయమున శబ్దము చేయును. స్తుతించబడును.
   
7.    సోమమును కొనుట, అభిషవించుట మున్నగు కర్మలందు క్రీడించు యజమాని ఇంద్ర, వాయు, అశ్వినీ దేవతలను ఆనందపరచినవాడు అగుచున్నాడు.
   
8.    ఏ యజమానియొక్క సోమధారలు మిత్రావరుణ, భగదేవతల కొరకు వర్షించుచున్నవో అతడు సోమమును గ్రహించినవాడై సుఖములు అనుభవించుచున్నాడు.
   
9.    ద్యావాపృథ్వులందున్న దేవతలారా! మీకు హర్షము కలిగించు సోమ హవిస్సును అర్పించుచున్నాము. మీరు మాకు ధన, అన్న, పశ్వాది సంపదను ప్రసాదించండి.
   
10.    సోమమా! మేము నీ ఎదుట నిలిచి నీ బలమును ఆరాధించుచున్నాము. నీ యొక్క బలము సుఖము కలిగించునది, ధనము నిచ్చునది, శత్రువుల నుండి రక్షించునది, కోరికలు తీర్చునది అగును గాక.
   
11.    సోమమా! నీవు మదకారివి. నిన్ను ఆరాధించుచున్నాము. నీవు సర్వసేవనీయవు. నిన్ను సేవించుచున్నాము. నీవు బుద్దిశాలివి. నిన్ను ఆరాధించుచున్నాము. నీవు స్తుతివంతవు. నిన్ను ఆరాధించుచున్నాము. నీవు అందరిని రక్షించుదానవు. అనేకులచే అర్ధించబడు దానవు. నిన్ను ఆరాధించుచున్నాము.
   
12.    సుక్రతు సోమమా! నిన్ను ధనము అర్ధించుచున్నాము. శ్రేష్ఠజ్ఞానము అర్ధించుచున్నాము. మా పుత్రుల కొరకు ధనము, జ్ఞానము అర్ధించుచున్నాము. నీవు అందరిని రక్షించుదానవు. అనేకులచే అర్ధించబడు దానవు. నిన్ను ఆరాధించుచున్నాము.
   
                                           మూడవ ఖండము
                            మొదటి తృచ : ఋషి - భరద్వాజుడు.

   
1.    వైశ్వానరాగ్ని ద్యులోక శీర్షము. భూలోక స్వామి. యజ్ఞము కొరకు తొలుత పుట్టినవాడు. కవి. సామ్రాట్టు జనులకు అతిథిసముడు. దేవతలకు ముఖము వంటివాడు. మాకు రక్షకుడు. ఋత్విజులు అట్టి అగ్నిని యజ్ఞములందు అరణులలో కల్పింతురు.
   
2.    అమర అగ్నీ! నీవు అరణులందు వ్యక్తమగు వాడవు. సమస్త దేవతలు నిన్ను పసిపిల్లలను వలె బుజ్జగింతురు.
   
    వైశ్వానరా! నీవు పాలకుడవు. నీవు ద్యావాపృథ్వుల మధ్య ప్రకాశించినపుడు ఋత్విజులు యజ్ఞము చేసి అమృతత్వము నొందుదురు.
   
3.    వైశ్వానరాగ్ని యజ్ఞమునకు నాభిస్వరూపుడు. ధనముల సదనము. మహానుడు. ఆహుతులు అందుకొనువాడు. ఋత్విజులచే స్తుతించబడువాడు. మానవ యజ్ఞకర్తలు యజ్ఞకేతనుడగు అగ్నిని మంథనమున సృష్టింతురు.
   
                                  రెండవ తృచ : ఋషి - యజతుడు.
   
1.    ఋత్విజులారా! మిత్రావరుణలను ఉచ్చై స్వరమున కీర్తించండి. అధిక బలశాలురగు మిత్రావరుణలారా! యజ్ఞమందు బృహత్ స్తుతులకు విచ్చేయండి.
   
2.    మిత్రావరుణులు సమస్తమునకు ప్రభువులు. జలములకు కారకులు. ప్రకాశవంతులు. దేవతలందు ప్రశస్తులు - 'దేవేషు ప్రశస్తా"
   
3.    వారు మాకు ద్యావాపృథ్వులందున్న మహాధనము ఇవ్వగల శక్తిమంతులు. మిత్రావరుణులారా! మీ బలము దేవతలందు గొప్పది. మేము దానిని స్తుతించుచున్నాము.
   
                                మూడవ తృచ : ఋషి - మధుచ్చందుడు.
   
1.    ఇంద్రా! నీ ప్రకాశము విచిత్రము. ఋత్విజులు అభిషవించినారు సోమమును. అది నిత్య శుద్దము. విచ్చేయుము. సోమము సేవింపుము.
   
2.    ఇంద్రా! మేము నీ భక్తులము. ఋత్విజులు నీకు ప్రేరణ కలిగించుచున్నారు. సోమము అభిషుతమై ఉన్నది. వేదవాణిని స్వీకరించుటకు ఈ యజ్ఞమునకు విచ్చేయుము.
   
3.    ఇంద్రా! వడివడిగా రమ్ము. వేదస్తుతులను స్వీకరింపుము. నీకు అభిషుత సోమ హవిస్సు అర్పించుచున్నాము. అందుకొనుము.
   
                                నాలుగవ తృచ : ఋషి - భరద్వాజుడు.
   
1.    ఏ అగ్ని తన జ్వాలలతో సమస్త అరణ్యములను చుట్టుకొనునో, ఏ అగ్ని అడవులను కాల్చినల్లని మసిచేయునో అట్టి అగ్నిని స్తుతించండి.
   
2.    ఏ మానవుడు ఇంద్రుని కొరకు అగ్నియందు సుఖదాయక హవిస్సులు అర్పించునో అట్టి వానికి అన్నము కలిగించుటకు గాను ఇంద్రుడు వర్షము కలిగించును గాత.
   
3.    ఇంద్రాగ్నులారా! మీకు సకల దిశల నుంచి హవి అందించుటకు గాను మాకు బలకరమగు అన్నమును, వేగవంతములగు అశ్వములను ప్రసాదించండి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.