Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
2. ద్యావాపృథ్వులారా! మీరు సకల ధనములందున్నారు. సకల ప్రాణులందున్నారు. ముత్యాలదండలో దారము వలె సమస్త జగములందున్నారు. మీరు సుగుణ సంయుక్తులు, సౌభాగ్య సంపన్నులు, సర్వ వ్యాపకులు. "ద్యావాపృథివీ భవతం మే స్యోనే తేనో ముంచతమం హసః" ద్యావాపృథ్వులు మాకు సుఖములు కలిగింతురు గాక. అవి మాకు పాపవిముక్తి కలిగించును గాక.
3. మీరు సంతాపాములు తీర్చువారు. స్వయముగ సంతాపరహితులు. గంభీరులు. పరిచ్చేద రహితులు. మహర్షులు నమస్కారములు అందుకొనువారు. మా రక్షణకు మిమ్ము ఆహ్వానించుచున్నాము. "ద్యావాపృథివీ భవతం మే స్యోనే తేనో ముంచతమం హసః"
4. మీరు అమృతము ధరించి ఉన్నారు. హవిస్సులను, నదులను ధరించి యున్నారు. మానవులను పోషించుచున్నారు.
"ద్యావాపృథివీ భవతం మే స్యోనే తేనో ముంచతమం హసః"
5. మీరు గోవులను పోషించుచున్నారు. వనస్పతులను పోషించుచున్నారు. మీ యందే అనంత విశ్వములు నిలిచి ఉన్నవి.
"ద్యావాపృథివీ భవతం మే స్యోనే తేనో ముంచతమం హసః"
6. మీరు అన్నము పెట్టి లోకములను పోషించుచున్నారు. నీరు పోసి లోకమును పోషించుచున్నారు. మీరు లేక ఏ కార్యమును జరుగకున్నది.
"ద్యావాపృథివీ భవతం మే స్యోనే తేనో ముంచతమం హసః"
7. మానవకృత, దైవకృత దోషముల వలన మరియు నెఉ చేసిన పాపముల వలనను దుఃఖములు నన్ను పీడించుచున్నవి. వానిని దూరము చేయుమని ద్యావాపృథ్వులను ప్రార్ధించుచున్నాను. "తేనో ముంచతమం హసః"
రెండవ సూక్తము -27
అన్య వినియోగము :-
1) బలము కోరువాడు ఈ సూక్తముచే మరుద్గణములకు శాంతి చేయునది.
2) ఏడవ ఋక్కుచే సాకమేధ పర్వమున గృహమేధ యాగమందు అనుమంత్రణ చేయునది.
1. నాకు మరుత్తుల మహత్తు తెలియును. వారు నన్ను తమ వానిగా భావింతురు గాక. వారు నాకు ప్రేమ, అన్నము, యుద్దములందు బలము ఇచ్చెదరు గాక. కళ్ళెము వలె సేవనీయులైన మరుత్తులను నన్ను రక్షించుమని ఆహ్వానించుచున్నాను. "తేనో ముంచతమం హసః"
2. మరుత్తులు వర్షధారలు కలిగించు మేఘములను అక్షయముగ అంతరిక్షమున నిలుపుచున్నారు. వారు ఆ వాన నీటి సారమును ఓషధులందు చేర్చుచున్నారు. అట్టి పృశ్నిమాతృక మరుత్తులను తొలుత కొలుచుచున్నాను. "తేనో ముంచతమం హసః"
3. మరుత్తులారా! కవులు - క్రాంత దర్సనులు గోవులందు దుగ్ధములను, ఓషధులందు రసమును, అశ్వములందు వేగమును చేర్చిన సర్వ సమర్దులగు మీరు మాకు సుఖశాంతులు ప్రసాదించండి. "తేనో ముంచత్వం హసః"
4. మరుత్తులు సముద్ర జలమును ఆకసమున కంపుచున్నారు. తదుపరి జలమును భూమి మీదకు విడుచుచున్నారు. అట్లు జలములకు అధిపతులై మరుత్తులు సంచరించుచున్నారు. "తేనో ముంచతమం హసః"
5. మరుత్తులు వర్షము వలన అన్నము కలిగించి నరులకు తృప్తి కలిగించుచున్నారు. పక్షులను మేదముచే తృప్తి చెందించుచున్నారు. వారు జలములకు అధిపతులై వర్షము కలిగించుచున్నారు. "తేనో ముంచతమం హసః"
6. నాకు కలిగిన ఈ దుఃఖము దేవతలకు చేసిన అపరాధము వలన కలిగినను, మరుత్తులకు చేసిన అపరాధము వలన కలిగినను దానిని నివారించుటకు మరుత్తులు సమర్ధులు. "తేనో ముంచతమం హసః"
7. మరుత్తులు ఉగ్రులు సేనలు గలవారు. బలమునందు ప్రసిద్దులు. యుద్దములందు దుస్సహులు. అట్టి మరుత్తులను వేడుకొనుచున్నాను. తేప తేప ఆహ్వానించుచున్నాను. "తేనో ముంచతమం హసః"
మూడవ సూక్తము - 28
వినియోగము :-
సర్వ వ్యాధి భైషజ్య కర్మమందు ఏడు కాంపీల్య పుటములను సంపాతన అభిమంత్రణ చేసి ఆ జలమును రోగిపైన చల్లునది.
1. భవ, శర్వులారా! నేను మీ మహత్తును తెలిసినాను. మీ ఆజ్ఞమీదనే ఈ సమస్త లోకములు ప్రకాశించుచున్నవి. "యావస్యేశాథే ద్విపదో యౌచతుష్పదస్తౌనో ముంచతమం హసః" ద్విపాత్తులకు చతుష్పాత్తులకు ఈశానులగు మీరు మమ్ము పాప విముక్తులను చేయండి.
2. ఎవరు దగ్గరి, దూర దేశములను శాసించుచున్నారో, ఎవరు ధనుస్సులు ఎక్కుపెట్టి బాణములు విడుచుచున్నారో "యావస్యేశాథే ద్విపదో యౌచతుష్పదస్తౌనో ముంచతమం హసః"
3. సహస్రాక్షులు, వృత్రహంతలు, గోసంచార భూమి దూరమున ఉండునట్టి భవ, శర్వులను ఆహ్వానించుచు, స్తుతించుచున్నాను.
"యావస్యేశాథే ద్విపదో యౌచతుష్పదస్తౌనో ముంచతమం హసః"
4. భవ శర్వులారా! సృష్ట్యాదిన మీరే సకల ప్రాణులను సృష్టించినారు. వారిలో ప్రదీప్తమగు శత్రు లక్షణములను మీరే కల్పించినారు.
"యావస్యేశాథే ద్విపదో యౌచతుష్పదస్తౌనో ముంచతమం హసః"
5. ఎవరి మారణాయుధము వ్రేటును దేవతలు, మానవులు తప్పించుకొనజాలరో
"యావస్యేశాథే ద్విపదో యౌచతుష్పదస్తౌనో ముంచతమం హసః"
6. ఒక శత్రువు కృత్యాదులచే ఛేదించుచున్నాడు. మరొకడు రాక్షసులచే మా వంశమూలమును నష్ట పరచుచున్నాడు. ఉగ్రమగు మీ వజ్రము ఆ ఉభయ విధ శత్రువుల మీద పడును గాక.
"యావస్యేశాథే ద్విపదో యౌచతుష్పదస్తౌనో ముంచతమం హసః"
7. భవ, శర్వులారా! మీరు మా విషయమున పక్షపాతులాగుడు. మీ ఉగ్ర వజ్రమున శత్రువులను రక్షసులను సంహరించండి. మిమ్ము స్తుతించుచున్నాము. మరల మరల పిలుచుచున్నాము. "తౌనౌ ముంచతమం హసః"
(భవుడు సృష్టికర్త. శర్వుడు సంహారకర్త. ఇచట ఉభయులను ఒకేసారి నుతించుట విశేషము. లోక స్థితికి సృష్టి సంహారములు రెండును అవసరమగుచున్నవి. ఒక దానిని మరొకటి ఆశ్రయించి ఉన్నవి.)
నాలుగవ సూక్తము - 29
వినియోగము :- 23 - 29 వ్యాధి నివారక సూక్తములు.
1. మిత్రావరుణులారా! మీరు ఋతమును వర్ధిల్లచేయువారు. మేము మీ మహత్తును ఎరుంగుదుము. మీరు ద్రోహులను తొలగించుచున్నారు. సత్య వాదులను సంగ్రామమున రక్షించుచున్నారు. "తౌనౌ ముంచతమం హసః"
"ఋతస్య సత్యస్య ఉదకస్య, యజ్ఞస్యవావర్ధయితారౌ" అని సాయణాచార్యుడు. ఋతము సత్యము, జలము, యజ్ఞము అగుచున్నది.
2. ద్రోహులను తొలగించి సత్య వాదులను సంగ్రామమున రక్షించు మిత్రావరుణులారా! మీరు కర్మసాక్షులు. మీ రథము పీత వర్ణము. మీరు అభిషుత సోమమును అందుకొనువారు. "తౌనో ముంచతమం హసః"
3. మిత్రావరుణులారా! అంగిరసుని, అగస్త్యుని, జమదగ్నిని, అత్రిని, కశ్యపుని, వసిష్టుని రక్షించునట్టి "తౌనో ముంచతమం హసః"
4. మిత్రావరుణులారా! శ్యావాశ్వుని, వద్రశ్వుని, పురుమీఢుని, అత్రిని, విమదుని, సప్తర్షులను రక్షించునట్టి "తౌనో ముంచతమం హసః"
5. మిత్రావరుణులారా! భరద్వాజుని, గనిష్టరుని, విశ్వామిత్రుని, కుత్సుని, కక్షీవంతుని, కణ్వుని రక్షించునట్టి "తౌనో ముంచతమం హసః"
6. యౌ మేధాతిథిమనధో యౌ త్రిశోకం మిత్రా వరుణా వుశనాం కావ్యం యౌ |
యౌగోతమమవథః ప్రోతముద్గలం "తౌనో ముంచతమం హసః"
7. మిత్రావరుణుల రథము సత్యమార్గవర్తి. దాని పగ్గములు న్యాయమార్గవర్తినులు. అది - ఆ రథము దుర్మార్గులను శిక్షించుచున్నది. అట్టి రథము గల మిత్రావరుణులను స్తుతించుచున్నాను. మరల మరల ఆహ్వానించుచున్నాము. "తౌనో ముంచతమం హసః"
ఐదవ సూక్తము - 30
వినియోగము :-
1) జాతకర్మ యందు సంఖపుష్పి, గంధ పుష్పిలను నూరి ఈ సూక్తముచే అభిమంత్రించి దానిని బంగారు ముక్కచే నాకించునది. శంఖనాభి, రావిని నూరి అభిమంత్రించి బంగారు తునకచే నాకించునది. తెలివి కొరకు శిశువును తల్లి వడిలో కూర్చుండపెట్టి ఈ సూక్తముచే ఘ్రుతాహుతులిచ్చి తాలువును సంపాతించునది. పెరుగు తేనె కలిపి దీనిచే అభిమంత్రించి శిశువునాకు నాకించునది.
2) ఉపనయనమున దండ ప్రదానానంతరము బాలునిచే ఈ సూక్తము చెప్పించునది.
3) ఆయుష్కామి శంఖపుష్పి, గంధపుష్పిని భక్షించి పుర్వోక్త పంచకర్మలు చేయునది.
4) ఉపనయనమున దీనిచే ఘ్రుతహోమము చేయునది.
5) "తథా అధ్యాయోత్సర్జని కర్మణి అనేనా సూక్తేన ఆజ్యం హుత్వారసేషు సంపాతాన్ ఆనయేత్"
1. నేను రుద్రులు, వసువులతో సంచరించుచున్నాను. ఆదిత్యులు విశ్వేదేవతలతో సంచరించుచున్నాను.
మిత్రావరుణులు, ఇంద్రాగ్నులు, అశ్వినులు నాయందు ఉన్నారు.





