Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
రెండవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. సూర్యుడు ఉదయించినాడు. మిత్రావరుణులను ఉభయులను శత్రువును మ్రింగు ఆర్యమను స్తుతించుచున్నాము.
2. ఈ స్తుతి హితకారి, రమణీయము, ధనసహితము, నిరాటంకము, సర్వప్రాప్యము అగునుగాత. 'ఇయం విప్రా మేధసాతయే' విప్రులారా! ఈ స్తుతి మాకు యజ్ఞప్రాప్తి కలిగించునుగాత.
3. వరుణదేవా! మాకు సత్సాంగత్యము కలుగును గాక. మిత్రదేవా! మాకు సత్సాంగత్యము కలుగునుగాత. మాకు అన్నము కలుగునుగాత. స్వర్గము కలుగును గాక.
మూడవ తృచ : ఋషి - త్రిశోకుడు.
1. ఇంద్రా! సకల శత్రు సేనలను విదీర్ణము చేయుము. హింసక యుద్దముల తలలు వంచుము. లొంగదీయుము.
'వసు స్పార్హం తదాభర' శత్రువులు ఆశపడు ధనమును మాకు తెచ్చి ఇమ్ము.
2. ఇంద్రా! నీ వద్ద భూరి ధనము ఉన్నది. ఈ విషయము మానవులకు తెలియును. 'వసుస్పార్హః తదాభర'
3. ఇంద్రా! నీవు అన్యులకు చలించనివారికి, నిశ్చలురగు వారికి, ఆలోచనాపరులకు ధనము అందించినావు. వసుస్పార్హం తదాభర'
నాలుగవ తృచ : ఋషి - శ్యావాశ్యుడు.
1. ఇంద్రాగ్నులారా! మీరు యజించ తగినవారు. యుద్దములందును, యజ్ఞములందును పరిశుద్దులు అగుచున్నారు.
"ఇంద్రాగ్నీ తస్య బోధతమ్" ఇంద్రాగ్నులారా! అట్టి స్తుతులను గ్రహించండి.
2. ఇంద్రాగ్నులారా! శత్రువును పరిమార్చగల రథమున పయనించు వృత్రుని మీరు వధించినారు. మీఉర్ ఎంతటివానికిని పరాజితులు కానివారు. "ఇంద్రాగ్నీ! తస్య బోధతమ్"
3. ఇంద్రాగ్నులారా! ఋత్విజులు రాళ్ళతో దంచి సోమము తీసినారు. సోమాపు మదకారి అమృత రసమును మీ కొరకు పాత్రలందు నింపినారు. "ఇంద్రాగ్నీ తస్య బోధతమ్"
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - కశ్యపుడు.
1. సోమమా! మాధుర్యము సంతరించుకొనుము. ఈ పవిత్ర యజ్ఞమున మరుత్సహిత ఇంద్రుడు ఆసీనుడగుచున్నాడు. అతని కొరకు వర్షించుము.
2. సోమమా! నీవు ధారణ కలదానవు. విద్వాంసులు నిన్ను అలంకరింతురు. నరులు నిన్ను శోధింతురు.
3. కవివగు సోమమా! నీవు అభిషుతవైనావు. నీ యొక్క రసమును మిత్రుడు, ఆర్యమ, వరుణుడు, మరుత్తులు పానము చేయుదురు గాక.
రెండవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. సోమమా! నీవు అంగుళులచే అమర్చబడినావు. శుద్దిచేయబడినావు. కలశమున శబ్దమునకు ప్రేరణ కలిగించుచున్నావు.
పవమానమా! నీవు స్తోతలకు పచ్చని బంగారముతో కూడిన బహుళ ధనమును ప్రసాదించుచున్నావు.
2. నీవు వరములిచ్చు దానవు. శుద్ది చేయుదానవు. ఉన్నిగల దశా పవిత్రమున జల్లించబడుదువు. నీట చేరి చప్పుడు చేయుదువు.
పవమానమా! నీవు గోదుగ్ధఘ్రుతాదులతో కలిసి దేవతల సమున్నత స్టానమునకు చేరుచున్నావు.
మూడవ తృచ : ఋషి - అమహీయుడు.
1. సోమమునకు తొమ్మిది సముద్రములు తల్లులగును. పది అంగుళులు దానిని శుద్దిచేయుము. ఆ సోమము ఆదిత్యులతో కలిసిపోవును.
2. అభిషుతమగు సోమము కలశమున ఇంద్రునితో కలిసిపోవును. వాయువుతో కలిసిపోవును. సూర్య కిరణములతో కలిసిపోవును.
3. సోమమా! నీవు మధుర రసవంతవు. కళ్యాణ రూపవు. మా యజ్ఞమున భగుని కొరకు, వాయువు కొరకు, పూష కొరకు, వరుణుని కొరకు వర్షించుము.
అయిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - శునశ్సేపుడు.
1. మేము అన్నవంతులము. గోవుల వలన ఆనందముగా ఉన్నాము. ఇంద్రుడు కూడ మాతో కూడి ఆనందించును గాత. అప్పుడు మా గోవులు బలము గలవై మరిన్ని పాలిచ్చునవి అగును.
2. ఇంద్రదేవా! నీవంటి మహిమాన్వితుడు మమ్ము అనుగ్రహించునుగాత. స్తోతలమగు మేము యాచించుచున్నాము. రథ చక్రమునకు ఇరుసుకూర్చినట్లు మేము కోరినవానిని తెచ్చి ఇమ్ము.
3. ఇంద్రదేవా! స్తోతలు తమ కోరికలు తీర్చుమని నిన్ను అర్ధించుచున్నారు. వారిని అనుగ్రహింపుము. రథములు వర్తకులు తగిన అక్షమును సమకూర్చినట్లు - వారు కోరిన పదార్ధములు తెచ్చి ఇమ్ము.
రెండవ తృచ : ఋషి - మధుచ్చందుడు.
1. ఇంద్రుడు సత్కర్మకర్త. పొదుగు చేపుగోవులు పితుకు వాని కొరకు అరచినట్లు మమ్ము రక్షించుమని ఇంద్రుని ప్రతి దినము ఆహ్వానించుచున్నాము.
2. సోమపాయి ఇంద్రా! సోమపానమునకు మా మూడు సవనములకు విచ్చేయుము. ధనశాలివగు నీ ప్రసన్నత మమ్ము గోవులు కలవారిని చేయుచున్నది.
3. తదుపరి నీకు అంతరంగికులగు బుద్దిమంతుల కూడి నిన్ను గురించి తెలిసికొందును. ఇంద్రా! రమ్ము మాకు తప్ప ఇతరులకు నీ విషయము వివరింపకుము.
మూడవ తృచ : ఋషి - మాంధాత.
1. ఇంద్రా! ఉషస్సు తన కాంతులచే జగములను పూరించినట్లు నీవు ద్యావాపృథ్వులను పూరించుచున్నావు. నీవు మహామహులకు మహామహుడవు. మానవ జాతికి సామ్రాట్టువు. నీకు అదితి జన్మనిచ్చునది. అందువలన ఆమె భద్రనారి. మహామాత అయినది.
2. జ్ఞానవంత ఇంద్రా! నీవు మహా అంకుశము వంటి 'శక్తి' ఆయుధమును ధరించినవాడవు. ధనవంత ఇంద్రా! మేక తన ముని కాళ్ళతో కొమ్మును గుంజినట్లు నీవు శత్రువులను గుంజుచున్నావు. అదితి దేవి నీకు జన్మనిచ్చినది. అందువలన ఆమె భద్ర మహిళ, మహామాత అయినది.
3. దేవా! మానవులకు దుఃఖము కలిగించు వారు ఉన్నారు. హరించు వారున్నారు. మానవతకు శత్రువులు ఉన్నారు. వారి బలమును క్షీణింపచేయుము. మమ్ము దెబ్బతీయదలచిన శత్రువును నీ కాళ్ళ క్రింద నలిపి వేయుము. నీకు అదితి తల్లి జన్మనిచ్చినది. అందువలననే ఆమె శుభంకరి, మహామాత అయినది.
ఆరవ ఖండము
తొలి తృచ : ఋషి - అసితుడు లేక దేవలుడు.
1. రాళ్ళమధ్య నలిగి శబ్దము చేయు సోమము దశాపవిత్రమున నలువైపుల నుండి పడుచున్నది.
"మదేషు సర్వధా అసి" సోమమా! నీవు స్తోతలకు సర్వము ఇచ్చుదానవు అగుచున్నావు.
2. సోమమా! త్వం విప్రః త్వం కవిః అందువలన అన్నమున పుట్టిన మధుర రసమును ఇచ్చుచున్నావు. "మదేషు సర్వధా అసి".
3. సోమమా! నీవు సమస్త దేవతలకు ప్రీతికరమవు. వారందరు నిన్ను సేవించగోరుచున్నారు. "మదేషు సర్వధా అసి".
రెండవ తృచ : ఋషి - ఋణవుడు.
1. సోమము ధనము లిచ్చునది. పాడియావుల నిచ్చునది. అన్నముల నిచ్చునది. సుపుత్రుల నిచ్చునది. అట్టి సోమమును ఋత్విజులు అభిషవించుచున్నారు.
2. సోమమా! నిన్ను ఇంద్రుడు పానము చేయుచున్నాడు. మరుత్తులు పానము చేయుచున్నారు. ఆర్యమతో కూడిన భగదేవత పానము చేయుచున్నాడు. సోమము వలననే మహా రక్షణలు గల మిత్రావరుణులు ప్రత్యక్షమగుచున్నారు. ఇంద్రుడు ప్రత్యక్షమగుచున్నాడు.
మూడవ తృచ : ఋషులు - పర్వత నారదులు.
1. మిత్రులారా! దేవతలకు మాదకమగు సోమాపు గుణములను గానము చేయండి. శిశువును పోషించినట్లు, సోమమునకు హవి అర్పించి స్తుతించి స్వాదు యుక్తము చేయండి.
2. సోమము దేవతల రక్షకము. ఆనంద దాయకము. స్తుతులచే శోభాయమానము. ప్రేరణ కారి. తల్లులు తమ బిడ్డలను వలె అట్టి సోమమును నీట ముంచి తీయుదురు.
3. ఈ సోమము బలవర్ధక సాధనము. దేవతలు పానము చేయునది. వారికి బలప్రదము. ఈ అభిషుత సోమము ఇంద్రాది దేవతలకు మధురతా యుక్తమగుచున్నది.
నాలుగవ తృచ : ఋషి - మనువు.
1. సోమము మిత్రము. అభిషుతము. పాపరహితము. ధ్యాసమున సుందరము. సర్వజ్ఞ స్వర్గ మార్గదర్శి. అట్టి సోమము మన కొరకు కలశమున చేరుచున్నది.
2. సోమము పవిత్రము బుద్దివర్ధకము. దధిమిశ్రితము. జలగామి. అది పాత్రయందు నిలిచినపుడు సూర్యుని వలె సర్వదర్శన యోగ్యమగును.
3. సోమము కాంతి మంతమగు ఆవుపాలలో కనిపించునది. వివిధ పాషాణములచే దంచబడునది. ధనము లిచ్చునది. అది మాకు నలుదిశల నుండి అన్నము నందించుచున్నది.
ఐదవ తృచ : ఋషి - కుత్సుడు.
1. సోమమా! నీ పావన ధారచే ధనము వర్షించుము. పవిత్రమగు సరస్సున ప్రవేశింపుము. నీవు అభిషుతమైనంత సర్వమునకు మూల భూతుడగు సూర్యుడు కూడ వాయు వేగవంతుడగును. ఎంతో మేధావియగు ఇంద్రుడు నిన్ను సేవించి మాకు యజ్ఞము చేయు పుత్రుని ప్రసాదించును గాక.
2. సోమమా! నీవు శ్రవణయోగ్యవు. మా యజ్ఞమందు నీ స్థానమును అలంకరించుము. ధారగా వర్షించుము. చెట్టు పండిన ఫలములను రాల్చినట్లు శత్రువులను గెలుచుటకు మాకు అరువది వేల ధనమును ప్రసాదించుము.
3. సోమమా! శరములు కురిపించుము. పగ వారిని పారద్రోలుము. ఇది నీకు అనాయాస కృత్యము. అశ్వయుద్దమున, బాహుయుద్దమున, శత్రునాశక సంగ్రామమున శత్రువులను హతమార్చుము. పారద్రోలుము. దూరము చేయుము. అగ్నిహోత్రము ఆచరించని వారిని మా దరికి చేరనీకుము.
ఏడవ ఖండము
మొదటి తృచ : ఋషి - బంధువు.
1. అగ్నిదేవా! నీవు ఆరాధనీయుడవు. మాకు దగ్గరివాడవు. రక్షకుడవు. సుఖకారివి అగుము 'శివోభవ'
2. నీవు వ్యాపకుడవు. బహు అన్నవంతుడవు. అందరకు ముందరివాడవు. మా ముందు పరివ్యాప్తుడ వగుము. నీవు దీప్తివంతుడవు కదా! మాకు ధనమునిమ్ము - "రయిం దాః"
3. అగ్నిదేవా! నీవు కాంతిమంతుడవు. వెలుగులు విరజిమ్ము వాడవు. మాకు సుఖములు, పుత్రమిత్రాదుల నిమ్మని నిన్ను ప్రార్దించుచున్నాము.
రెండవ తృచ : ఋషి - ఆప్త్యుడు.
1. ఈ సమస్త భువనములు మాకు సుఖములను ఇచ్చును గాత. ఇంద్రుడు, విశ్వేదేవతలు మా మనో రథములను నెరవేర్తురు గాక.
2. అదితి పుత్రులగు అన్య దేవతల సహితుడైన ఇంద్రుడు మా యజ్ఞ, దేహ, సంతానములను సఫల మనోరథులను చేయునుగాత.
3. అదితి పుత్రులగు మిత్రాది దేవతలు, మరుద్గుణ సహితుడైన ఇంద్రుడు మా కొరకు ఔషధములు సమకూర్తురు గాక.
మూడవ తృచ : సంపాత ఋషి
1. ప్రవో2ర్చోప
దరిచేరి ఇంద్రుని చక్కగా పూజించండి.
దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
ఉత్తరార్చిక యందలి ఏడవ అధ్యాయము సమాప్తము.





