Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
రెండవ సూక్తము - 22
వినియోగము :-
1) యుద్దమున జయము కలుగుటకు ఈ సూక్తముచే ఘ్రుతహోమ, సక్తుహోమ, ధనురింధన ఆధానము, బాణ సమిధనుంచుట, రాజునకు అభిమంత్రిత ధనుస్సును అందించుట మున్నగునవి చేయునది.
2) అభిషిక్తుడైన రాజును దీనిచే నిత్యము అభిమంత్రించునది. జలపూర్ణ పాత్ర యందలి నీరు చల్లునది.
3) క్రవ్యాచ్చమున కర్మమున దీనిచే వృషభమును అభిమంత్రించునది.
1. ఇంద్రదేవా! ఈ క్షత్రియ ప్రభువును వర్ధిల్లచేయుము. ఇతనిని శూర వీరుని చేయుము. ఇతని శత్రువులను బలహీన పరచుము. శత్రు రాజులను ఇతని వశమున ఉంచుము. నేను ఇతనిని లోకపాలుర వంటి వానిని చేయుచున్నాను.
2. ఇతనిని ప్రజలు భజింతురు గాక. ఇతడు గోవులు, అశ్వములు కలవాడు అగును గాక. ఇతని శత్రువునకు ఆవులు, గుర్రములు కలుగకుండును గాక. ఇతడు క్షత్రియులందరకు రాజేంద్రుడు అగును గాక. సకల శత్రువులు ఇతని వశవర్తులు అగుదురు గాక.
3. ఈ రాజు ధనపతి అగును గాక. ప్రజాపాలకుడు అగును గాక.
ఇంద్రా! ఈ రాజు నందు శత్రువులను ఓడించు తేజోబలములను చేర్చుము.
4. పాడియావు పాలిచ్చు రీతి ద్యావాపృథ్వులు ఈ రాజునకు సంపదలనిచ్చును గాక. ఇతడు ఇంద్రునకు, గోవులకు, పశువులకు, ఓషధులకు ప్రియ మిత్రుడు అగును గాక.
5. రాజా! నిన్ను పరమశక్తి వంతుడగు ఇంద్రునకు మిత్రునిగా చేయుచున్నాను. అతడు నిన్ను విజయుని చేయును. పరాజితుని చేయడు. ఇంద్రుడు నిన్ను శూరులందు వృషభసముని, రాజులందు వృషభుని వంటి వానిని, మనవులందు ఉత్తముని చేయుచున్నాడు.
6. రాజా! నీవు సర్వశ్రేష్ఠుడవు ఆగుము. నీకు ప్రతికూలురగు శత్రువులు అధములు అగుదురు గాక. ఇంద్రుని స్నేహము వలన నీవు వృషభుడవగుము. నీకు శత్రుసములగు వారి భోగ భాగ్యములు హరించుము.
7. రాజా! నీవు సింహ పరాక్రమశాలివి. ఆజ్ఞా మాత్రమున ప్రజను పాలింపుము. వ్యాఘ్రము వంటి వాడవై శత్రువులను పీడించుము. ఇంద్రసఖుడవగు నీవు శత్రుసములగు వారి భోగభాగ్యములు హరింపుము.
మూడవ సూక్తము - 23
వినియోగము :-
దీనితో ఏడు సూక్తములు బృహద్గణ పాఠములు. కావున శాంత్యుదకాదులందు వినియోగము. సర్వరోగి చికిత్స యందు కూడ నీవి వినియోగము.
1. ఎవడు ప్రథముడో, ఎవడు ప్రకృష్ణజ్ఞానవంతుడో, ఎవనిని పాంచజనులు బహుధా యజింతురో అట్టి అగ్నిని నేను తెలియుచున్నాను. ఎవడు సమస్త ప్రాణులందు జఠరాగ్ని రూపమున నిలిచి ఉన్నాడో అట్టి అగ్నిని మమ్ము పాపముల నుండి విముక్తులను చేయుమని అర్ధించుచున్నాము.
("పాంచజన్యస్య" అనుదానికి దేవ, పిత్రు, భూత, మనుష్య, బహ్మ యజ్ఞములు అయిదు, గంధర్వ, అప్సరస, దేవ, అసుర, రాక్షసులను అయిదుగురు చేయు యజ్ఞములనియు అర్ధము.)
2. జాతవేదాగ్నీ! నీవు ఎట్లు దేవతలకు హవిస్సులు చేర్చుచున్నావో, ఎట్లు యజ్ఞమును తెలిసి నిర్వహించుచున్నావో అట్లే మాకు దేవతల అనుగ్రహము కలిగించుము.
సనోముంచత్వంహసః = అట్టి నీవు మమ్ము పాపవిముక్తులను చేయుము.
3. అగ్ని సమస్త యజ్ఞఫలములు కలిగించుటకు హవి వహించువాడు. అగ్ని కర్మా కర్మము లెరిగిన వాడు. యజ్ఞవర్ధనుడు. ఘ్రుతాహుతి. రాక్షససంహారి. అట్టి అగ్నిని ఉపాసించుచున్నాను.
"సనోముంచత్వంహసః"
4. సుజాతం జాతవేదస మగ్నిం వైశ్వానరం విభుమ్ |
హవ్యవాహం వాహమహే సనోముంచత్వం హసః ||
5. ఎవని మాత్రి వలన ఋషులు జల సంపన్నులు అయినారో, ఎవని వలన అసురుల మాయలు ధ్వంసమైనవో ఏ అగ్ని వలన ఇంద్రుడు పణులను జయించినాడో
"సనోముంచత్వంహసః"
6. అగ్ని వలననే దేవతలకు అమృతత్వము కలిగినది. అగ్ని వలననే ఓషధులు మధుమతులు అయినవి. అగ్ని వలననే యజమానులు స్వర్గమునకు చేరుచున్నారు.
"సనోముంచత్వంహసః"
7. సమస్త లోకములు అగ్ని ఆజ్ఞయందు ప్రవర్తిల్లుచున్నవి. గ్రహ నక్షత్రాదులు అగ్ని వలననే ప్రకాశించుచున్నవి. ఉన్న, రానున్న ప్రాణులు అగ్ని అధీనమున ఉన్నవి. అట్టి అగ్నిని నేను యజించుచున్నాను.
"సనోముంచత్వంహసః"
నాలుగవ సూక్తము - 24
1. ఇంద్రుని మహత్వమును ఎరుంగుదుము. ఇంద్రుడు మాత్రమే మహత్తు కలవాడని ఎరుంగుదుము. వృత్రహంత ఇంద్రుని స్తుతించు స్తుతులు మాకు గోచరించుచున్నవి. ఇంద్రుడు సత్కర్మలు చేయువాడు. అతడు యజమానుల ఆహ్వానములను ఉపేక్షించడు.
"సనో ముంచత్వం హసః"
2. ఇంద్రుడు ఉగ్రబాహుడు. మహా మహా శత్రుసేనలను భేదించగలడు. దానవుల బలములను విరుచువాడు. అతడు జలములను గెలిచినాడు. గోవులను గెలిచినాడు. "సనోముంచత్వంహసః"
3. ఇంద్రుడు వరప్రదుడు. స్వర్గమునిచ్చువాడు. ఇంద్రునకు అభిషవణ శిలలు సోమమును అందించుచున్నవి. ఇంద్రుని సోమ యాగమున సప్తహోతలు హర్షించుచున్నారు. "సనోముంచత్వంహసః"
4. ఇంద్రుని యాగమున వంధ్యగోవు, వృషభాము వధించబడును. స్వర్గము కలిగించు ఇంద్రుని కొరకు అవటమున యూసము స్థాపించబడును. ఇంద్రుని కొరకు నిర్మల రసవంత సోమము దశాపవిత్రము నుండి పడుచుండును. "సనోముంచత్వంహసః"
5. సోమయాజులు ఇంద్రుని అనుగ్రహము కోరుచున్నారు. గోవులు పోయిన వారు ఇంద్రునే పిలుచుచున్నారు. ఇంద్రుని యందే మంత్రములు నిలిచి ఉన్నవి. ఇంద్రుని యందే అసాధారణ బలము నిలిచి ఉన్నది. "సనోముంచత్వంహసః"
6. ఏ ఇంద్రుడు యజ్ఞములందు ప్రథముడుగా చెప్పబడుచున్నాడో, ఎవరి వీరి కృత్యములు ప్రధానముగా చెప్పబడుచున్నావో, ఎవడు వజ్రము పట్టి వృత్రాదులను వధించినాడో "సనోముంచత్వంహసః"
7. ఎవడు స్వతంత్రుడై యోధులను ఎదిరించుటకు యుద్దములందు దూకుచున్నాడో, ఎవడు సృష్టి కార్యమునకు మిథునములను ఏర్పరచున్నాడో అట్టి ఇంద్రుని స్తుతించుచున్నాను. మరల మరల ఆహ్వానించుచున్నాను. "సనోముంచత్వంహసః"
ఐదవ సూక్తము - 25.
వినియోగము :-
1) తుఫాను వచ్చినపుడు ఈ సూక్తముచే శాంతి చేయునది.
2) ఇది వాయువు, సవితలను స్తుతించునది.
1. వాయువు జగదాధార భూతుడు సూర్యుడు సర్వప్రేరకుడు. వారి మహిమలను మేము ఎరుంగుదుము. సవితా, వాయువులారా! మీరు సర్వాత్మలందు చేరి ఉన్నారు. సర్వాత్మలను రక్షించుచున్నారు. మీరు విశ్వమును ధరించి ఉన్నారు. పోషించుచున్నారు. "తౌనో ముంచతమం హసః"
2. సవితా, వాయువుల మహత్కార్యములు భూలోక వాసులకు తెలియును. ఆ ఉభయ దేవతలే ఆకాశమునకు జలము చేర్చుచున్నారు. వారి వేగమును ఇతర దేవతలు అందుకొనజాలరు. "తౌనో ముంచతమం హసః"
3. చిత్రభానో! జనులు నిన్ను అర్చించుచున్నారు. నీవు ఉదయించినంత వారు తమ తమ పనులకు ఉపక్రమించున్నారు. వాయు, సూర్య దేవతలారా! మీరే సకల ప్రాణి జాలమును రక్షించుచున్నారు. "తౌనో ముంచతమం హసః"
4. సూర్య, వాయువులారా! మా దుష్క్రుత్యములను దూరము చేయండి. రాక్షసులను, కృత్యలను మానుండి తొలగించండి. మాకు అన్నము వలన కలుగు శక్తిని కలిగించండి. "తౌనో ముంచతమం హసః"
5. సవితా, వాయు దేవతలారా! మాకు ధనసమృద్ది కలిగించండి. సుఖ శాంతులు ప్రసాదించండి. ఆరోగ్యమును, తేజస్సును మాయందు ప్రవేశపెట్టండి. "తౌనో ముంచతమం హసః"
6. సూర్య, వాయువులారా! మా రక్షణకు మాకు సద్భుద్ది కలిగించండి. దీప్త వంతము, మాదకమగు సోమమును సేవించి ఆనందించండి. అనుభవించ దగిన మహా ధనమును మాకు ప్రసాదించండి. "తౌనో ముంచతమం హసః"
7. మా ప్రార్ధనలు సూర్య వాయులోకములకు చేరుచున్నవి. అట్టి సవితా వాయు దేవతలను స్తుతించుచున్నాము. "తౌనో ముంచతమం హసః"
ఆరవ అనువాకము
మొదటి సూక్తము - 26
వినియోగము :-
1) 23 - 29 సూక్తములు వ్యాధి చికిత్సకని చెప్పబడినది.
2) సోమ యాగమున ఈ సూక్తముచే ఔదుంబర్య ఘ్రుత హోమమున అనుమంత్రించునది.
1. చక్కని భోగములు కలిగి, సమాన మనస్కులగు ద్యావాపృథ్వులను స్తుతించుచున్నాము. మీ మహిమలను మేము ఎరింగి ఉన్నాము. మీకు అపరిమిత అధ్వరములు కలుగును గాక. మీరే దేవతలు, మానవుల సకల సంపదలకు కారకులు అగుచున్నారు. "తౌనో ముంచతమం హసః"





