Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


      

                   భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
                  భద్రా ఉత ప్రశస్తయః ||

                                          ఏడవ అధ్యాయము
                                         మొదటి ఖండము
                               మొదటి తృచ : ఋషి - సికతానివావరి.

   
    జ్యోతిర్యజ్ఞస్య పవతే మధుప్రియం పితా దేవానాం జనితా విభూవసుః |
    దధాతి రత్నం స్వధయోరపీచ్యం మదింతమో మత్సర ఇంద్రియో రవః ||

   
1.    సోమము యజ్ఞములకు జ్యోతి అగును. దేవతలకు ప్రియమగు రసము కురిపించును. సోమము తండ్రి అగును. తల్లి అగును. మహా ధనవంత అగును. అది బలకారకము, ఆనందదాయకము, ఇంద్ర సేవిత అగును.
   
    సోమరసము ద్యావాపృథ్వులందున్న ధనమును యజమానులకు చేర్చును.
   
2.    సోమము స్వర్గ ప్రభువు. శతధార. బుద్ది వర్ధక, బలశాలి, హరితవర్ణ. ఆ సోమము చప్పుడు చేయుచు కలశమునకు చేరును. బిందువులుగా రాల్చగల ఉన్నిగల దశా పవిత్రమున శుద్దమగును. కోరికలు తీర్చు సోమము మిత్రుని వలె హితకారి యగును. యజ్ఞ పాత్రలందు స్థిరపడును.
   
3.    సోమమా! నీవు జలముల కన్న ముందు పవిత్రమగుదువు. వాక్కు కన్న ముందు సాగుదువు. కిరణముల ముందు ఉందువు. అన్నము సాధించుటకు ఆయుధము పూని సంగ్రామమున దూకుదువు.
   
    సోమమా! అట్టి నిన్ను అధ్వర్యులు నలిచి రసము తీయుదురు.
   
                                         రెండవ తృచ : ఋషి - కశ్యపుడు
   
1.    సోమము బలశాలి. దీప్తివంత. వేగవంత. అది యజమానులకు గోవులను, అశ్వములను, పుత్రులను ఇవ్వదలచి మధురసమును రాల్చును.
   
2.    యజ్ఞకాములగు అధ్వర్యులు సోమమును అలంకరింతురు. చేతులతో శుద్ది చేయుదురు. ఉన్ని పాత్రల నుండి సాగింతురు.
   
3.    హవి అర్పించు యజమానుల కొరకు ఆ సోమము స్వర్గమందలి, అంతరిక్షమందలి, భూమి మీద సంపదలను వర్షించునుగాత.
   
                                         మూడవ తృచ : ఋషి - మేధాతిథి.

1.    సోమమా! నీవు దేవకామివి. వేగమున సాగుము. పవిత్రముగ కురియుము. కోరికలు తీర్చునట్టి నీవు ఇంద్రుని చేరుకొనుము.
   
2.    సోమమా! నీవు సేవకుల అభీష్టములు నెరవేర్చుదానవు. కీర్తిమంతవు. భరించుదానవు. మాకు అన్నము, నీరు పంపుము నీ ఆసనమున కూర్చుండుము.
   
3.    అభిషుతసోమధార అడిగిన వరములు ఇచ్చునది. ప్రియమధువును పాత్రలందు నింపును. సోమము సత్కర్మ సాధకము. అది జలమును ఆచ్చాదించుకొనును.
   
4.    సోమమా! నీలో ఆవుపాలు కలసినపుడు నీ గుణములు వర్ధిల్లును. నీ వలన మహా జలములు లభించును.
   
5.    సోమము రసవాహిని. స్వర్గమును నిలిపి ఉంచునది. భరించగలది. మా సోమము పవిత్రములందలి జలములలో మరల మరల శుద్ది చేయబడును.
   
6.    వరము లిచ్చు హరిత వర్ణ సోమపు మహత్తు మహనీయము. అది మిత్రుని వలె దర్శనీయ శబ్దించు సోమము సూర్య సమమై ప్రకాశించును.
   
7.    సోమమా! నిన్ను బలకారము చేయునట్టి మంత్రములు నీయొక్క బలమున కర్మ సంబంధులై పవిత్రములగుచున్నవి.
   
8.    సోమమా! లోకకర్తలు శత్రువును అణచివేయుటకు తగిన బలమునకు నిన్ను పానము చేయ ప్రార్దింతురు. అందువలన నీ ప్రశంసనీయ కీర్తియు వర్ధిల్లును.
   
9.    సోమమా! నీవు సనాతన యజ్ఞములకు ఆత్మవు. మాకు గోవులను, అశ్వములను, అన్నములను, నరులను ప్రసాదించుము.
   
10.    సోమమా! మేము ఇంద్రుని యజించదలచినాము. పర్జన్యుడు వర్షము కురిపించినట్లు నీవు మధుధారలు వర్షించుము.
   
                                                రెండవ ఖండము
                               మొదటి తృచ : ఋషి - హిరణ్యస్తూపుడు

   
1.    సోమమా! నీవు మహా అన్నవంతవు. అభిషుతవు మా యజ్ఞమున దేవతలను సేవింపుము. విఘ్నకారులను హతమార్చుము. తదుపరి మాకు శుభములు కలిగించుము. "అథానో వస్యసస్క్రృధి"
   
2.    సోమమా! మాకు జ్యోతిని ప్రసాదించుము. స్వర్గమును, సకల సౌభాగ్యములను ప్రసాదించుము. "అథానో వస్యసస్క్రృధి"
   
3.    సోమమా! మమ్ము దక్షులను చేయుము. మాకు యజ్ఞ ఫలమును ప్రసాదించుము. శత్రువులను వధించుము. "అథానో వస్యసస్క్రృధి"
   
4.    అధ్వర్యులారా! ఇంద్రుని పానము కొరకు సోమమును దశా పవిత్రమున శుద్ది చేయండి. "అథానో వస్యసస్క్రృధి"
   
5.    సోమమా! మాకు రక్షణలు కలిగించుము. మమ్ము సూర్యుని ఉపాసకులను చేయుము. "అథానో వస్యసస్క్రృధి"
   
6.    సోమమా! నీవు ప్రసాదించిన జ్ఞానము వలన నీవు కలిగించిన రక్షణలందు మేము చిరకాలము సూర్యుని దర్శింతుము గాత. "అథానో వస్యసస్క్రృధి"
   
7.    సోమమా! నీవు దిశ్య ఆయుధముల గలదానవు. మేము స్తోతలము. మాకు ద్యావాపృథ్వులందలి స్థిరధనమును ప్రసాదించుము. "అథానో వస్యసస్క్రృధి"
   
8.    సోమమా! నీవు బలశాలివి. సంగరమున పగతురకు లొంగనిదానవు. శత్రువును లెక్కచేయనిదానవు. ద్రోణ కలశమున చేరుము. "అథానో వస్యసస్క్రృధి"

9.    పవమాన సోమమా! యజ్ఞములు అనేక ఫలములను ఇచ్చునవి. ఆ యజ్ఞములందు యజమానులు నిన్ను స్తుతింతురు వర్ధిల్ల చేయుదురు. "అథానో వస్యసస్క్రృధి"
   
10.    సోమమా! మాకు విచిత్రమును, అశ్వయుక్తమును, స్వర్గమునకు చేర్చునదియునగు ధనమును ప్రసాదించుము. "అథానో వస్యసస్క్రృధి"
   
                                     రెండవ తృచ : ఋషి - ఉచథ్యుడు.
   
1.    సోమము దేవతలకు హర్షదాయకము. అది స్తోతలను తరింపచేయుచు, అభిషుతమై ధారగా దశా పవిత్రమునకు పరుగులిడును.
   
    'తరత్సమన్దీధావతి' - దేవతలకు హర్షదాయక సోమము స్తోతలను తరింపచేయుచు పరుగులిడును.
   
2.    సకల ప్రకార ధనములిచ్చుదియు, దేవియునగు సోమధార యజమానిని రక్షించుట ఎరుగును. 'తరత్సమందీధావతి'
   
3.    ధ్వస్ర, పురూహన్తికులనురాజుల వేలకొలది ధనమును మేము గ్రహించినాము. అది మాకు శుభప్రదము అగునుగాత. 'తరత్సమందీ ధావతి'
   
4.    వారివద్ద నుండి మూడు వందలును, కొన్ని వేలును ధనమును తీసికొన్నాము. అవి మాకు శుభప్రదములు అగును గాక. 'తరత్సమందీ ధావతి'
   
                                    మూడవ తృచ : ఋషి - జమదగ్ని.
   
1.    ఈ సోమరస ధారలు దేవతలకు పరమానంద దాయకములు. వానిని స్తుతించుచున్నాము. మాకు బలము కలిగించుటకు అవి ధారలుగా పాత్రలందుపడుచున్నవి.
   
2.    సోమమా! నిన్ను దేవతలు సేవించవలసి ఉన్నది. అతి ప్రియములగు ఆవుపాలు, నేతితో కూడుము. పరిశుద్దవై పాత్రలందు పడుము. అన్నదాత్రివగు నీవు దశా పవిత్రమున కురియుము.
   
3.    జమదగ్నిచే పూజింపబడిన సోమమా! మాకు గోవులను, సకల దిశలు స్తుతించు అన్నమును ప్రసాదించుము.
       
                                               మూడవ ఖండము
                                        మొదటి తృచ : ఋషి - కుత్సుడు.

   
1.    అగ్ని సర్వజ్ఞుడు ఆరాధనీయుడు. వడ్రంగి రథమును అందముగా తీర్చిదిద్దినట్లు. అగ్ని కొరకు మేము స్తుతి రూప స్తోత్రము రచించినాము. మా మనసు అగ్ని మీద నిలిచి ఉన్నది. మేము అగ్నిని శ్రద్దగా ఆరాధించుచున్నాము. ఇది నిశ్చయము.
   
    అగ్నిదేవా! మీకు మాకు మైత్రి ఏర్పడినది. ఇక మాకు ఎవరి వలనను భయము ఉండకుండును గాత.
   
2.    అగ్నిదేవా! నీ యొక్క యాగము కొరకని ఇరువది యొక్క పదార్ధములను సేకరించినాము. ప్రతి పూర్ణిమ, అమావాస్యకు దర్శపౌర్ణమాస యాగమున నిన్ను అర్చించుచున్నాము. నీ కొరకు హవిస్సులు సిద్దము చేసినాము. నా చిరంజీవిత్వమునకు గాను మేము చేయు ఈ కర్మకు సిద్ది కలిగించుము. మీకు మాకు మైత్రి ఏర్పడినది. ఇక మాకు ఎవరివలనను భయము ఉండకుండును గాత.
   
3.    అగ్నిదేవా! నిన్ను చక్కగా ప్రజ్వలింపచేయ కలుగుదుము గాత. నీవు మా దర్శపూర్ణమాసాది కర్మలకు సిద్ది కలిగించుము. నీలో అర్పించిన హవిస్సులను దేవతలు స్వీకరించుచున్నారు. మేము అదితి పుత్రులగు దేవతలను సేవించదలచినాము. నీవు వారిని మా యజ్ఞమునాకు కొనిరమ్ము. మీకు మాకు మైత్రి ఏర్పడినది. ఇక మాకు ఎవరి వలనను భయము ఉండకుండునుగాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.