Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
4. వేల స్థానములందుండు సహదేవీ ఓషధీ! నెవెఉ మా శత్రువుల తలలు గొరిగి, మెదలు నరుకుము శత్రువునకు అనుకూలమగు కృత్యను వ్యతిరేకము చేయుము. దానిని మాకు హితము గూర్చు కృత్యతో కలిపి శత్రువు మీదికి త్రిప్పి పంపుము.
5. విత్తులు నాటుచోట పాతిన క్రుత్యను, ఆవుల మధ్యపాతిన క్రుత్యను, గాలి వీచుచోట చేర్చిన కృత్యను, కాలిబాట మీద పాతిన కృత్యను సహదేవీ ఓషధి ప్రభావమున నిర్వీర్యము చేయుచున్నాను.
6. కృత్యను ప్రయోగించి మా కాలికి, వేలుకు నష్టము కలిగించువాడు శక్తిహీనుడు అగును గాక. అతని ప్రయోగము మాకు శుభములు కలిగించును గాక. అది ప్రయోగించు వానిపై ఎదురు తిరిగి వానిని ధ్వంసము చేయును గాక.
7. అపామార్గ ఓషధి మమ్ము వంశ పారంపరిక వ్యాధుల నుండి విముక్తులను చేయును గాక. శత్రువు కల్పించు బాధలను తొలగించుము గాక. పిశాచములను దూరము చేయును గాక. దారిద్ర్యమును కట్టికట్టి విసిరి వేయును గాక.
8. అపామార్గమా! నీవు యక్ష, రాక్షస, పిశాచాదులను దూరము చేయుము. అలక్ష్మీ కారక దేవతలను మా దరికి చేరనీయకుము.
నాలుగవ సూక్తము - 19
1. సహదేవీ లేక అపామార్గమా! నీవు శత్రువును త్రుంచుదానవు. స్వాభావిక శత్రువును కూడ పరిమార్చ గల దానవు.. కృత్యను ప్రయోగించు వాని పుత్ర పౌత్రులను గడ్డిని నరికినట్లు నరుకుము.
2. బ్రాహ్మణుడు - నృషద పుత్రుడగు కణ్వుడు నిన్ను కనుగొన్నాడు. నీవు యజమానిని సేనవలె రక్షించుచున్నావు. నీవు ఉన్న చోట అభిచారాదుల భయము నిలువ జాలదు.
3. గ్రహములందు సూర్యుడు ప్రముఖుడు అయినట్లు నీవు ఓషధులలో ప్రముఖవు. నీవు దుర్భలులలను రక్షించుచున్నావు. రాక్షసులను సంహరించుచున్నావు.
4. అపామార్గమా! దేవతలు తొలుత నీ సాయముననే అసురులను సంహరించినారు. కావున నీవు ఓషధులన్నింటికి అధిపతివి అయి ఉన్నావు.
5. అపారమార్గమా! నీ శాఖలు అపరిమితములు. అందువలన నీకు 'విభిన్దతీ' అను పేరు కలిగినది. నీ తండ్రి విభిన్దనుడు. కావున మమ్ము క్షీణింపచేయ దలచిన వానిని విదీర్ణుని చేయుము.
(దుఃసహెత్యాహ విభిన్నన్నితి శాయణః.)
6. ఓషధీ! ప్రకాశవంతమగు నీ తేజము ఎచ్చట ప్రకాశించుని ఆ భూమియందు పాతిన కృత్య శక్తిహీన అగుచున్నది. శక్తిహీన కృత్య ప్రయోగించు వానివైపు మరలి శక్తివంతమై వానిని ధ్వంసము చేయును గాక.
7. అపారమార్గమా! నీవు ప్రతీచీన ఫలవుగా పుట్టినావు. కావున శత్రువు చేసిన ప్రయోగములన్నింటిని విఫలము చేయుము. శత్రువు సాధనములను శక్తి హీనులను చేయుము.
8. శతసాధనములతో రక్షించుకొనుము. సహస్ర సాధనములచే మమ్ము కృత్యాది దోషముల నుండి రక్షింపుము. లతారూప ఓషధులకు అధిపతీ! ఇంద్రుడు తన ప్రచండ తేజమును నాయందు ప్రవేశపెట్టును గాక.
ఐదవ సూక్తము - 20
వినియోగము :-
బ్రహ్మగ్రహాదుల వలన కలుగు భయ నివారణార్ధము త్రిసంధ్యామణిని ఈ సూక్తముచే సంపాతన.అభిమంత్రణములు చేసి కట్టునది.
"తథా చాతన గణేపి ఏతత్ సూక్తమ్"
1. దేవతా స్వరూప సాధం పుష్ప ఓషధీ! నీ తాయత్తు కట్టుకున్నవాడు రానున్న భయమును, వర్తమాన భయమును, సుదూరము నందలి భయమును తెలియుచున్నాడు. పృథివి, అంతరిక్ష, స్వర్గ సాధకుడు అగుచున్నాడు.
2. దివ్యౌషధే! నిన్ను మణిగా ధరించినందున మూడు స్వర్గములు, మూడు భూములు, క్రింది, మీది సహితముగ ఆరు దిశలందున్న సమస్త ప్రాణులను చూడగలుగుచున్నాను.
("తిస్రో భూమిర్దారయన్ త్రీంరుత్ ద్యాన్" మూడు భూములను, మూడు స్వర్గములను ధరించి అని ఋగ్వేదము. "త్రయోవా ఇమే త్రివృతోలోకాః" పృథివ్యాధి ముల్లోకము త్రయాత్మకము అని ఐతరేయ బ్రాహ్మణము.)
3. ఓషధీ! నీవు దేవతవు. చక్కని రెక్కల గరుడుని కంటి పాపవు. అలసిన అతివ విశ్రాంతి తీసుకున్నట్లు దివి నుండి భువికి దిగి వచ్చినావు, మమ్ము రక్షించుటకని.
4. అంతటి ప్రభావము గల నిన్ను దానగుణ సంపన్నుడగు ఇంద్రుడు నా కుడిచేతికి అందించినాడు. అందువలన నేను సర్వము చూడగలుగుచున్నాను. శూద్రుని ఆర్యుని అందరను చూచుచున్నాను.
5. ఓషధీ! నీవు అనేక రూపములతో దర్శన మిమ్ము నీ రూపములను దాచకుము. నీవు వేల కనుల దానవు. చాటున తిరుగు రక్కసులను కనిపెట్టుము.
6. ఓషధీ! నిన్ను నేను ధరించినాను. రక్షస, రాక్షసినులను, పిశాచాదులను నాకు చూపించుము.
7. ఓషధీ! నీవు కశ్యపూని నేత్రమవు. శునకము, చతురక్షి దేవతకు నీవే నేత్రమవు. వీఘ్ర అంతరిక్షమున సూర్యుని వలె వెలుగొందుచున్న నీవు పిశాచములను దాచకుము.
(పిశాచములు రాత్రించరములు.)
8. నీ రక్షణలందు 'ఇకనేమి' 'ఇకనేమి' అని సంచరించు రాక్షసులను వశపరచుకున్నాను. నీ ప్రభావముననే ఆర్య, శూద్ర సహితముగా సర్వం పశ్యామి - సకలము చూచుచున్నాను.
9. ఓషధీ! అంతరిక్షమున తిరుగు పిశాచములను, స్వర్గమున సంచరించువానిని, భూమి తమ అధీనమందున్నదని భావించు పిశాచములను "దర్శయ" - చూపుము.
నాలుగవ అనువాకము
మొదటి సూక్తము - 21
వినియోగము :-
ఇది మొదలు పది సూక్తములు మృగార సూక్తములు అనబడును.
1) గోశాంతి, గోపుష్టి, ప్రజనన కర్మములందు ఉప్పు కలిపినా లేక ఉప్పులేని నీటిని ఈ సూక్తముచే అభిమంత్రించి ఆవులకు త్రాగించునది.
2) గోపుష్టి కర్మయందు ఈ సూక్తముచే కొట్టమునకు వచ్చు ఆవుల ముందు నిలుచునది. దీనితోనే ఇంద్రునకు మూడు చరు ఆహుతులు ఇచ్చునది.
3) ఏడవ ఋక్కుచే అడవికి పోవు ఆవులను అభిమంత్రించునది. 7,8 ఋక్కులచే సంపాత, అభిమంత్రణలు చేసి జున్ను పాలు తినునది. సారూప్యమగు దూడగల ఆవు పల అన్నములో గుగ్గిలము, ఉప్పు, శకృత్పిండములను 'ప్రక్షిప్య' అగ్ని లో మూడు రాత్రులుంచి నాలుగవ నాడు ఈ మంత్రములతో భక్షించునది. ఈ రెండు మంత్రములచే అభిమంత్రించి గోవును దానము చేయునది. జలపూర్ణ పాత్రను అభిమంత్రించి కొట్టము నడుమ పెట్టునది.
4) సోమ యాగపు మధ్యాహ్న సవనమున దక్షిణ ఇచ్చు గోవుల ఎదురుగా యజమాని బంగారము చేతబట్టి లేచి నిలుచుండ వలెను.
1. గోవులు మా వైపు వచ్చును గాక. శుభములు కలిగించును గాక. గోష్ఠమున ఉండును గాక. పిల్లలు గల రంగురంగుల గోవులు యజమాని ఇంట వర్ధిల్లును గాక. అనేక ఉషస్సుల పర్యంతము ఇంద్రుని ఆహ్వానించుటకు గోవులు పాలిచ్చును గాక.
2. యజించు వారికి, స్తుతించు వారికి ఇంద్రుడు గోవులు కలుగు మార్గము ఉపదేశించును. ఉపదేశించి గోవులను ప్రధానము చేయును. ఇంద్రుడు వారి ధవములను గుంజుకొనడు. వారికి ధనసమృద్ది కలిగించును.
యజ్వను, స్తోతను సూర్యదేవుడు దుఃఖమెరుగని స్వర్గమునకు చేర్చును.
3. అట్టి గోవులు నష్టపడకుండును గాక. దొంగలచే వధించబడకుండును గాక. శత్రువుల ఆయుధములు వానిని బాధించకుండును గాక. దేవతలను గోవులచే పూజించునట్టియు, గోదానములు చేయునట్టి యజమాని చిరకాలము గోవులతో కూడి ఉండును గాక.
4. పరుగులు పెట్టి దుమ్ము లేపు వ్యాఘ్రాది మృగములు ఈ గోవుల వైపు రాకుండును గాక. గోవులు కసాయివాని దిక్కునకు పోకుండును గాక. వీని యజమాని నిర్భయముగా తిరుగగల భూములందు గోవులు స్వేచ్చగా విహరించును గాక.
5. "గావో భగో" - గోవులే సంపద యగుచున్నది. ఇంద్రుడు నాకు గోవులను ప్రసాదించును గాక. గోవులే సోమపు తొలి భోజనము అగుచున్నవి.
ఈ కనిపించు గోవులన్నియు ఇంద్రస్వరూపలు అగుచున్నవి. నా మనస్ఫూర్తిగా, హృదయ పూర్వకముగా గోవులను ఇంద్రునకు అర్పించ దలచుచున్నాను.
6. గోవులారా! మీరు కృశించిన వారికి బలము కలిగించండి. అపాంగుని, పూర్ణాంగుని చేయండి. అంబారావము చేయు గోవులారా! మా ఇంటిని శోభిల్లచేయండి. మీ పాడి ఉత్తమమైనదని జనులు చెప్పుకొను చున్నారు.
7. గోవులారా! మీరు సంతానవతులై వర్ధిల్లండి. పచ్చిక మైదానములందు గడ్డి మేయండి. అనాయాసముగా దిగగల జలాశయములందు నీరు త్రావండి. మిమ్ము దొంగలు దొంగిలించ కుందురు గాక. అడవి మృగములు మిమ్ము బాధించకుండును గాక. రుద్రుని ఆయుధము మీకు తాకకుండును గాక.





