Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
2. ఇంద్రాగ్నులారా! మీ అశ్వములు అనేకులకు ప్రియములు. హవిర్దాతల కొరకు పుట్టినవి. వాని మీద మా వద్దకు విచ్చేయండి.
3. ప్రేరణ కలిగించు ఇంద్రాగ్నులారా! రండి. ఈ అభిషుత సోమము సేవించుటకు ఆ అశ్వముల మీద విచ్చేయండి.
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - భృగువు.
1. సోమమా! నీవు దీప్తిమంతవు. అరణ్యములు నీకు తావరములు. అటనుండి వెడలుము. శబ్దించుచు ద్రోణ కలశమున చేరుము.
2. జలములందు చేరు సోమమా! ఇంద్ర, వాయు, వరుణ, మరుత్, విష్ణు దేవతల కొరకు ద్రోణ కలశమున చేరుము.
3. సోమమా! మాకు పుత్రుల నిమ్ము. అన్నములు ప్రసాదించుము. సకల దిశల నుండి వేల కొలది ధనములను కలిగించుము.
రెండవ తృచ : ఋషి - గోతముడు.
1. స్తోతలు సోమమును అభిషవింతురు. అది అశ్వవేగమున పాత్రలందు చేరును. తదుపరి హరిత వర్ణ మాదక ధారలు ద్రోణ కలశమున చేరును.
2. గోమంతమగు సోమము ఘ్రుతాదులతో కలసి ద్రోణ కలశమున చుక్కలు చుక్కలుగ రాలును. పాలతో కలసి సముద్రమునకు జలము వలె ద్రోణ కలశమున చేరును. మాదక సోమము మత్తు కలిగించుటకు దంచబడును.
మూడవ తృచ : ఋషి - అసితుడు.
1. సోమమా! విచిత్రము, స్తుత్యము, దివ్యము, పార్ధివమునగు ధనమును మాకు తెచ్చి ఇమ్ము. మమ్ము పావనులను చేయుము.
2. సోమమా! ఆయువులను పెంచుము. పావనులను చేయుము. కోరికలను తీర్చుము. హరిత వర్ణవాగుము. నీకు స్థానమగు పరచిన దర్భాసనమున ఆసీనవగుము.
3. ఇంద్ర, సోములారా! నిశ్చయముగా మీరు సమస్తమునకు ప్రభువులు, మీరు గోవులను పాలించండి. సకల ఐశ్వర్యములకు అధిపతులు కండి. మా యజ్ఞములకు పుష్టి కలిగించండి.
అయిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - గోతముడు.
1. ఇంద్రుడు శత్రునాశకుడు. నరులు అతనిని స్తుతింతురు. మాదకుని, బలవంతుని చేయుదురు. అట్టి ఇంద్రుని పెద్ద, చిన్న యుద్దములందు రక్షించుమని ఆక్రందింతుము. అతడు మాకు యుద్దములందు పరిపూర్ణ రక్షణ కలిగించును గాత.
2. ఇంద్రా! నీవు వీరుడవు. శత్రుహనన కుశలుడవు. శత్రువు నుండి భూరి ధనమును గుంజుకొన గలవాడవు. స్తోత కొద్ది వాడైనను అతనికి ధనము నిచ్చి వర్ధిల్ల చేయుదువు. సోమాభిషవ కర్తకు, యజమానికి ధనము నిత్తువు. భూరి తే వసు - నీ ధనము అపారము కదా!
3. యుద్దము కలిగినపుడు శత్రువును జయించుటకు ధనము సముకూర్చుకొనవలసి ఉండును. ఇంద్రా! మదస్రావి అశ్వములను నీ రథమునాకు కూర్చుము. నిన్ను ఆరాధించని వానిని వధించుము. ఆరాధించు వానికి ధనము ప్రసాదించుము. 'అస్మాఇంద్రవసౌదధః' - ఇంద్రా! మమ్ము ధనములందు నిలుపుము.
రెండవ తృచ : ఋషి - గోతముడు.
1. ఈ సోమము రుచికరము. మధురము సకల యజ్ఞవ్యాపకము. దీనిని గౌరవర్ణ గోవులు త్రావును. గోవులు ఇంద్రుని చేరి శోభిల్లును. వరదుడగు ఇంద్రుని వెంట సాగి ప్రసన్నలగును. ఏలననగా అవి ఇంద్రుడు పానము చేయగా మిగిలిన సోమమును త్రాగును. పాలిచ్చు నట్టి ఆ పాడి యావులు ఇంద్రుని స్వరాజ్యమున వసించును.
2. ఆ గోవులు ఇంద్రుని స్పర్శను కోరుచుండును. అవి అనేక రంగులవి. ఇంద్రుడు పానము చేయు సోమమున తమ పాలు కలుపును. ఆ గోవులు ఇంద్రునకు ప్రియములు. అవి ఇంద్రుని వజ్రమునాకు శత్రునాశక ప్రేరణ కలిగించును. అట్టి ధేనువులు ఇంద్రుని స్వరాజ్యమున వసించును.
3. ఆ గోవులు జ్ఞానము గలవి. తమ పాలతో ఇంద్రుని బలమును వర్ధిల్లచేయునవి. ఇంద్రుని శత్రువులకు మీరు ఇది వరకే ఓడినారని చెప్పునవి. అందుకు ఇంద్రుని గాథలు వినిపించునవి. అట్టి ధేనువులు ఇంద్రుని స్వరాజ్యమున వసించుచున్నవి.
ఆరవ ఖండము
మొదటి తృచ : ఋషి - జమదగ్ని
1. సోమము పర్వతములందు పుట్టినది. బలకారము, మాదకమని ప్రసిద్ధికెక్కినది. ఇది జలములందు పెరుగునది. డేగ తన స్థానమునకు చేరినట్లు సోమము స్వస్థానమున స్థిరపడును.
2. సోమము దేవతలను అర్చించుటకు యోగ్యమైనది. శుద్దము. అన్నరూప. దానిని ఋత్విజులు అభిషవింతురు. అది జలమున శుభ్రము చేయబడును. దానిని గోవులు తమ పాలతో రుచికరమొనర్చును.
3. సోమము ప్రేరకము. మధురము. రసయుక్తము. యజ్ఞము చేసి అమృతత్వము సాధించదలచిన ఋత్విజులు సోమమును యుద్దమున కంపు అశ్వమును వలె అలంకరింతురు.
రెండవ తృచ : ఋషి - ఊర్ద్య సద్ముడు.
1. సోమమా! నీవు అన్నములకు స్వామివి. స్తుతి యోగ్యవు. ద్యోతమానవు. బృహదన్న స్వరూపవు. దేవతాప్రియవు. హవి రసరూపమున మా ముందు తేజరిల్లుము. ఆకసమందలి మేఘముతో వర్షము కలిగించుము.
2. సోమమా! నీవు సుదక్షవు. అధిషవణ పాత్రయందు అభిషవము చేయబడిన దానవు. రాజు వలె ప్రజలను పోషించుదానవు. అట్టి నీవు కలశమున చేరుము. యజ్ఞము కొరకు యజమానులకు ప్రేరణ కలిగించుము. ద్యులోకము నుండి జలవర్షము కలిగించుము.
మూడవ తృచ : ఋషులు - పర్వత, నారదులు.
1. సోమము చేతనత్వము కలిగించునది. యజ్ఞసాధకము. జలపుత్రి. సత్యప్రకాశకము, సర్వ ధారకము. రస ప్రేరకము, సమస్త హవిస్సులందు వ్యాప్తమైనది. ఆ సోమము పైన స్వర్గమందును, దిగువ పృథివి యందును ఉండును.
2. సోమము త్రితఋషి గుహయందు ఉండినది. అది అధిషవణ ఫలకముల మీదకు చేరినది. అప్పుడు ఋత్విజులు సోమమును కీర్తించ దలచినారు, వారు యజ్ఞసాధనములగు ఏడు చందస్సులతో సోమమును స్తుతించినారు.
3. సోమమా! ధారలుగా పారుము. నేను త్రితుడను. మూడు సవనములందు సామ గానము చేయువాడను. అందుకు ధనము ప్రసాదించుమని ఇంద్రునకు ప్రేరణ కలిగించుము. సుక్రుతులగు యజమానులు ఇంద్రుని స్తోత్రములనే కదా ఉచ్చరింతురు!
నాలుగవ తృచ : ఋషి - రేభుడు.
1. సోమమా! నీవు అభిషుతవు. ఇంద్రుడు, విష్ణువు, ఇతర దేవతల కొరకు మధురతర మగుము. అన్నప్రాప్తికి గాను దశా పవిత్రమున ధారగా పడుము.
2. పవమాన సోమమా! నీవు అనేక హవిస్సులకు కారణమవు. మా అంగుళులు ద్రోహమెరుగనివి. అవి నిన్ను పాత్రయందు పిండుచున్నవి. అప్పుడు పుట్టిన దూడ ఆవును నాకినట్లు మా అంగుళులు నిన్ను తాకుచున్నవి.
3. మహావ్రత సాధక సోమమా! నీవే ద్యావాపృథ్వులను ధరించుచున్నావు. అభిషుతవై మహత్వము కలిగి కవచమును కప్పుచున్నావు,
అయిదవ తృచ : ఋషి - మన్యువు.
1. సోమమా! నీవు బలవంతవు. గమనశీలవు. రస సమూహమవు. ఇంద్రునకు బలకర రసమును అందించుము.
బలములకు రాజా సోమమా! స్తోతలకు ధనమును అందించుము. రాక్షసులను నాశము చేయుము. శత్రువులను నలుదిశలందు పీడించుము.
2. సోమము రాళ్ళచే దంచబడి పిండబడును. మదకారక ధారలచే దేవతలను తృప్తిపరచును. ఉన్ని పాత్రలనుండి జల్లించబడి వెడలును. ఇంద్రునకు మిత్రమగును. ప్రకాశించు మాదక సోమము ఇంద్రుని బలము కొరకు వర్షించును.
3. యజమానులు యజ్ఞములు నిర్వహింతురు. సోమము రుతువులననుసరించి వానియందు వ్యాపించును. పవిత్ర సోమము కలశమున బిందువులుగ రాలును. సోమదేవత తన రసప్రభావమున ఇంద్రాది దేవతలను కూర్చును. అట్టి సోమమును దశాంగుళులు దశా పవిత్రమున చేర్చుచున్నవి.
ఏడవ ఖండము
మొదటి తృచ : ఋషి - వసుశ్రుతి లేక వత్సుడు.
1. అగ్నిదేవా! నీవు ద్యుమంతుడవు. జరారహితుడవు. నిన్ను సకల దిశలందు వెలిగించుచున్నాము. నీ దీప్తి ప్రశంసణీయమగును. ద్యులోకమున పరివ్యాప్తమగును. అప్పుడు నీవు స్తోతలకు అన్నము ప్రసాదించుము.
2. అగ్నిదేవా! నీవు అన్నదాతవు. శత్రునాశకుడవు. ప్రజాపాలకుడవు. హవ్యవాహనుడవు. జ్యోతిషస్పతివి. దీప్తి మంతుడవగు నీ కొరకు మంత్రయుక్త హవి నీ ముందునకు చేరుచున్నది. మేము స్తోతలము. మాకు అన్నము ప్రసాదించుము.
3. అగ్నీ! నీవు బలముల స్వామివి. ప్రజలను పోషించు వాడవు. అన్నముల అందించువాడవు. ఇవి హవి నిండిన పాత్రలు. అవి నీ నోట పచనమగుచున్నవి. నీవు మాకు యజ్ఞ ఫలములు కలిగించుచున్నావు. స్తోతలమగు మాకు అన్నము ప్రసాదించుము.
రెండవ తృచ : ఋషి - నృమేధుడు.
1. ఇంద్రుడు విప్రుడు. మహానుడు. వర్షము కలిగించు వాడు. హవిస్సులకు కారకుడు. విద్వాంసుడు. స్తోత్రప్రియుడు.
ఉద్గాతలారా! అట్టి ఇంద్రుని కొరకు బృహత్ సామ గానములు చేయండి.
2. ఇంద్రా! నీవు శత్రుధ్వంసివి. నీవే సూర్యునకు తేజస్సు కలిగించుచున్నావు. నీవే విశ్వకర్తవు. విశ్వదేవతవు. మహామహుడవు.
3. ఇంద్రా! నీవే ఆదిత్యుని వెలిగించుచున్నావు. స్వర్గమును ప్రకాశింపచేయుచున్నావు. దేవతలందరు నీ మైత్రి కోరి వినమ్రులై ఉన్నారు. అట్టి నీవు ఆగచ్ఛ - విచ్చేయుము.
మూడవ తృచ : ఋషి - గోతముడు.
1. ఇంద్రా! నీవు అత్యంత బలశాలివి. శత్రుదమనుడవు. నీ కొరకు సోమము సిద్దమై ఉన్నది. యజ్ఞశాలకు విచ్చేయుము. సూర్యుడు ఆకాశమును తన కిరణములచే నింపినట్లు సోమరసము నిన్ను సర్వ శక్తులతో నింపును గాత.
2. వృత్రమంత ఇంద్రా! రమ్ము రథము నెక్కుము. నీ హర్యశ్వములు మంత్రములచే రథమున పూన్చబడినవి. సోమాభిషవ శబ్దము నీ మనుసును లాగుచున్నది. కావున మా ముందుకు రమ్ము.
3. ఇంద్రుడు అప్రతిహతుడు. అతనిని మానవులు ఋషులు స్తుతింతురు. యజింతురు. హర్యశ్వములు ఇంద్రుని అట్టి స్థలములకే చేర్చును.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
యందలి ఆరవ అధ్యాయము
సమాప్తము.





