Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
4) తోక చుక్కను చూచినపుడు పంచ పశుయాగపు ప్రాజాపత్య పురోడాశ స్థానమునపదకొండవ ఋక్కుచే ఆహుతులు ఇచ్చునది.
5) ప్రాజాపత్యాం ప్రజా పశ్వన్నకామస్య ప్రజాక్షయేచ.
1. తూర్పు మున్నగు దిశలందలి గాలితో కూడి మేఘములు ఉదయించును గాక. జలధరములు వాయు ప్రేరితములై ఏకత్రితమగును గాక. అవి వృషభము వలె గర్జించుచు, వాయు ప్రేరితములై "పృథివీం తర్పయంతు" భూమికి తృప్తి కలిగించును గాక.
2. చక్కని దానములు చేయు మరుత్తులు వర్ష దర్శనము కలుగ చేయుదురు గాక. వాననీరు విత్తిన గింజలను చేరును గాక. వర్షధారలు పృథివిని పూజించును గాక. భూమియందు అనేక పంటలు పండును గాక.
3. మరుత్తులారా! మిమ్ము స్తుతించుచున్నాము. మీరు మాకు నీరు నిండిన మబ్బుల దర్శనము చేయించండి. జల ప్రవాహములు వేరువేరుగా ప్రవాహించును గాక. వర్ష ధారలు పృథివిని పూజించును గాక. భూమి మీద సమస్త సస్యములు ఫలించును గాక.
4. పర్జన్య దేవా! గర్జించు మరుత్తులు నిన్ను స్తుతించును గాక. వర్షము అనేక రూపములతో వర్షించును గాక. జల బిందువులు నేలను తడుపును గాక.
5. మరుత్తులారా! సముద్రమును వర్షజలముగా పైకి పంపండి. పూజా సాధనమగు జలయుక్త మేఘమును పైకి పంపించండి. మహా వృషభము వలె గర్జించు మేఘము నీటితో "పృథివీం తర్పయస్తు"
6. పర్జన్యా! నలువైపుల నినదించుము. మేఘములందు చేరి ఘోషించుము. నీటిని లాగి సముద్రమును పీడించుము. నీ ప్రేరణతో మేఘము జలపూర్ణమై రావలెను. ధారా సంపాతము కోరు సూర్యదేవత కిరణములు సన్నగిల్లి అతడు అంతర్హితుడు అగును గాక.
7. మానవులారా! మంచి దానముల మరుత్తులు మిమ్ము సంత్రుప్తులను చేయుదురు గాక. కొండచిలువ అంతటి ప్రవాహములు కలుగును గాక. వాయు ప్రేరిత మేఘము నేలమీద వానపడ వేయును గాక.
8. ఒక ప్రక్క మెరుపు మెరయును గాక. ఒక ప్రక్క మబ్బులను తెచ్చు గాలి వీచును గాక. వాయు ప్రేరిత మేఘము నేల వాలుటకు కూడును గాక.
9. మంచి దాతలగు మరుత్తులారా! మేఘ జలము, మెరుపు, జలధరము, వాననీరు, మహా జలప్రవాహము జగములకు తృప్తి కలిగించును గాక. వాయు ప్రేరిత మేఘము పృథివి పై వర్షము కలిగించును గాక.
10. మేఘ స్వరూపమగు వైద్యుతాగ్ని పెంపొందు పంటలకు అధిపతి అగుచున్నాడు. పుట్టి పెరుగు వానిని ఎరుగనట్టి అగ్ని మా ప్రాణులకు జీవనమును, స్వర్గమున అమృతము కలిగించు వర్షము కలిగించును గాక.
11. సూర్యుడు ప్రజాపతి. జలదాత. అతడు సముద్ర జలమును వర్షించుటకు ప్రేరణ కలిగించి సముద్రుని బాధించును గాక. మేఘము అశ్వము వంటి వేగవంతము. దాని వర్షించు శక్తి వర్ధిల్లును గాక. పర్జన్యా! ఉరుముచు, మెరయుచు వర్షాభ్రుకముల సహితుడవై ప్రత్యక్షమగుము.
12. సూర్యుడు మాకు పిత్రుసముడు. అతడు వర్షమును వంకరగా కురిపించును గాక. వర్షజలము ధ్వనించుచు నేల మీద ప్రవహించును గాక. తెల్లని కాళ్ళ కప్పలు పెద్దగా చప్పుడు చేయును గాక.
13. సంవత్సరమంతయు వ్రత నియమములు పాటించు బ్రాహ్మణుని వలె పర్జన్యుడు వర్షించును గాక. కప్పల బెకబెకలు ధ్వనించును గాక.
14. మండుకీ! శబ్దము చేయుము. తాదురీ! వానరాకను సూచించు ధ్వనులు చేయుము. వర్షమునకు సరస్సు నిండగా నాలుగు కాళ్ళతో ఆనందమున విహరింపుము.
15. ఖణ్వఖ, షైనుఖ, తాదురులారా! నిండు సరస్సులో చేరి వానరాకను ఘోషించండి. పోషించు మండుకములారా! మరుత్తులను వర్షించునట్లు చేయండి.
16. పర్జన్యా! సాగరము నుండి మహా మేఘమును తెమ్ము. నేల నాలుగు చెరగులను తడుపుము. గాలి మెరుపులతో కూడి వీచును గాక. యజ్ఞము బహుముఖమై వర్ధిల్లును గాక. పంటలు, దోష రహితములై ఫలించును గాక.
నాలుగవ అనువాకము
మొదటి సూక్తము - 16
వినియోగము :-
అభిచార కర్మమున శత్రువును ఏడిపించుట. ధూమకేతు ఉత్పాత శాంతికి వారుణ పశు ప్రయోగమున మూడవ ఋక్కు వినియోగము.
1. వరుణదేవుడు మహామహుడు. నియంత. అతడు సకల దుష్టశక్తులను దగ్గర నుండి వలె చూచును. అతడు చరాచరమగు సమస్త సృష్టి జ్ఞాత అగుచున్నాడు.
2. నిలుచునట్టి, చరించునట్టి, వంచించునట్టి, గుప్తచరుడగునట్టి, నికృష్టుడగునట్టి, ఉభయులు గుసగుసలాడునట్టి శత్రువులను మూడవవాడగు వరుణుడు తెలిసికొనుచున్నాడు. నిరోధించుచున్నాడు.
3. వరుణరాజు దుష్టులను శిక్షించువాడు అగుచున్నాడు. భూమి, విశాల అంతరిక్షము, సుదూర దేశము, ఉభయసాగరములు వరుణుని అధీనమున ఉన్నవి. అంతటి వరుణుడు చిన్నచిన్న నీటి గుంటలందును ఉన్నాడు.
4. వరుణుని దూతము భూమి మీద వేల చూపులతో సంచరించుచున్నారు. అందువలన నియమములను వ్యతిరేకించి కుమార్గములను అనుసరించువాడు వరుణ పాశబంధములను తప్పుకొనజాలరు.
5. వరుణ రాజు సమస్తము నెరిగినవాడు. అతడు ద్యావాపృథ్వుల మధ్య ఉన్నవారిని తనముందున్న వారిని కనురెప్పపాటులో చూడగలుగుచున్నాడు. దోషులను అతడు జూదరి పాచికను వలె విసరి వేయుచున్నాడు.
6. వరుణదేవా! పాపములను మూడుగా విభజించినావు. వాటిని శిక్షించుటకు ఏడేడు పాశముల వలలు సర్వత్ర పరచినావు. అవి అబద్దమాడు వారిని చీల్చును గాక. సత్యవాదులను తాకకుండును గాక.
7. వరుణదేవా! నీవు, విచక్షణ గలవాడవు. నీ పాశముల వందలు. అవి అసత్య వాదిని విడువకుండును గాక. వానికి జలోదరము కలిగించి ఒరయందు కరవాలమును వలె అవనిని కదలక పట్టి ఉంచెదవు గాక.
8. సమాన రూపమున రోగము కలిగించు వరుణపాశము "సమామ్యము" అనబడును. అనేక వ్యాధులది 'వ్యామ్యము' అనబడును. దేశమందలి వరుణపాశము "సందేశ్యము" విదేశమందలిది 'విదేశ్య'మగును. దేవతల మీద ప్రభావము చూపునది 'దైవము' మనిషి మీద ప్రభావము చూపునది 'మానుషము' అగును.
9. శత్రువు పేరు గోత్రము, తల్లి పేరు చెప్పి 'నిన్ను పూర్వ రుక్కున చెప్పిన సర్వ పాశములచే కట్టుచున్నాను. నిన్ను ఆ పాశములన్నింటి ఆధీనము చేయుచున్నాను'
అని అనవలెను.
రెండవ సూక్తము - 17
వినియోగము :-
స్త్రీ, శూద్ర, కపాలాదుల అభిచార దోష నివారణార్ధము దర్భాపమార్గసహదేవాది ఓషధులను శాంత్యుదాక కలశమున వేసి 1-3 సూక్తములు చదివి అభిమంత్రించునది.
ఈ మూడు సూక్తములు కృత్యా ప్రతిహరణమున వినియోగమగును.
1. సహదేవినామక ఓషధీ! నీవు భేషజములకు అధిపతివి. మా మీద ప్రయోగించిన అభిచార దోషనివారణార్ధము నిన్ను తాకుచున్నాను. నిన్ను అపరిమిత శక్తివంతను, ఓషధుల స్వామినిని చేయుచున్నాను.
2. అభిచారమును వాస్తవముగ నివారించు 'సత్యజిత్' ఇతరుల దుఃఖములను నష్టపరచు 'శపథయావని' అభిచారములను సహించు 'సహమాన్' మరల మరల వచ్చు వ్యాధులను నివారించి 'పునఃసర' వంటి ఇతర ఓషధులు అభిచార దోష నివారణార్ధము లభించుచున్నవి.
3. ఆక్రోశించి శపించు, మూర్చిల్లచేయు, రక్తము పీల్చుటకు బిడ్డలను పట్టుకోను పిశాచులు నా మీద అభిచారము చేయువాని పుత్రుని నమలి మ్రింగును గాక.
4. కృత్యా! నిన్ను పచ్చిమట్టి కుండలో అభిచారము చేయువారున్నారు. పొగ పారించి నీలలోహితుని చేయువారున్నారు. అపక్వమాంసమున ప్రవేశపెట్టువారున్నారు. అట్టి వారలనందరను హతమార్చుము.
5. దుస్స్వప్నమును, దుర్జీవితమును, రాక్షసులను, అభిచార మహాభీతిని, అలక్ష్మీని, దుష్ట వచనములను ఈ అభిచరితుని నుండి దూరము చేయుచున్నాను.
6. ఆకలి దప్పుల చావులను, గోహీన, సంతానహీనతలను 'అపామార్గ' మను దానిచే నష్టపరచుచున్నాము.
7. అపామార్గమా! దప్పికచావు, ఆకలిచావు, జూదమున ఓటమి వీటిని నీ వలన తొలగించుచున్నాము.
8. ఓషధులన్నియు అపామార్గపు వశవర్తినులు అయి ఉన్నవి. అభిచారగ్రస్తా! కృత్యాదుల ద్వారా నీలో ప్రవేశించిన వ్యాధులను 'అపామార్గము' చే తొలగించుచున్నాను. నీవు ఆరోగ్యముగా చిరంజీవివి అగుము.
మూడవ సూక్తము - 18
1. జ్యోతి సూర్యుని తోనే ఉండును. రాత్రింబవళ్ళు ఒకే తీరువి అగుచున్నవి. అంతసత్యముగ అభిచారితుని రక్షించు కర్మచేయుచున్నాడు. కృత్యాదులు శక్తిహీనులు అగుదురు గాక.
2. దేవతలారా! పీడించుటకని కృత్యను ఇంటిలో పాతుటకు వచ్చిన వానిని ఆ కృత్యయే ఎదురు తిరిగి దూడ తల్లి చన్నును పట్టినట్లు వదలక పట్టును గాక. విడువకుండును గాక.
3. అనుకూలముగా ఉండి ఇంట కృత్యను పాతుటకు వచ్చువాణి శక్తులు ఉడుగును గాక. అతని మంత్రములే వ్యతిరేకములై అతనిని నిరంతరము రాళ్ళతో కొట్టును గాక.





