Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
ఆరవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - సికతా నివావరి పృశ్నయోజుడు.
గోవిత్పవస్వ వసువిద్ధిరణ్య విద్రేతోధా ఇందో భువనేష్వర్పితః |
త్వం సువీరో అసి సోమ విశ్వవిత్తం త్వా నర ఉపగిరేమ ఆసతే ||
1. సోమమా! నీవు గోవులను ఇచ్చుదానవు. దానములను ఇచ్చుదానవు. హిరణ్యమును ఇచ్చుదానవు. ఉత్పాదక శక్తిని ఇచ్చుదానవు. పాత్రలోనికి చేరుము.
సోమమా! నీవు సువీర్యవు. విశ్వవిదవు. నిన్ను ఋత్విజులు స్తుతించుచున్నారు. ఉపాసించుచున్నారు.
2. సోమమా! నీవు అభిషవించ బడిన దానవు. కోరికలు తీర్చుదానవు. నరులకు సాక్షీభూతవు. వారియందు అనేక రూపములుగ ప్రవేశించుదానవు. నీవు మా కొరకు క్షరించుము. మేము ధనవంతులము, హిరణ్య వంతులము అగుదుము గాక. లోకములందు జీవించుటకు సమర్దులము అగుదుము గాత - "వసుమద్దిరణ్య వద్వియం స్యామ భువనేషు జీవసే."
3. సోమమా! నీవు సంస్థమునకు స్వామివి. హరిత వర్ణవు. చక్కని నడకల హర్యశ్వము లను రథమునకు పూన్చుచున్నావు. సమస్త భువనములందు ప్రవేశించుచున్నావు. నీవు మధువతివి. దీప్తివతివి. జలవర్షము కలిగించుము. నరులు నీ కర్మమునకు పూనుకొందురు గాత.
రెండవ తృచ : ఋషి - కశ్యపుడు.
1. అభిషుత సోమమా! నీవు విశ్వవిదవు. నీ దారాలు సూర్య కిరణములు వలె ప్రకాశించుచున్నవి.
2. సోమమా! నీవు రస వాహినివి. నీవు చైతన్యము కలిగించుచున్నావు. విశ్వరూపవు అగుచున్నావు. అంతరిక్షము నుండి మమ్ము పావనులను చేయుచున్నావు. మాకు బహువిధ ధనములను ప్రసాదించుచున్నావు.
3. పవమానమా! నీవు సూర్యుని వలె ప్రకాశించుచున్నావు. దశాపవిత్రమున ధ్వని చేయుచున్నావు. శబ్దమునకు ప్రేరణ కలిగించుచున్నావు.
మూడవ తృచ : ఋషి - అసితుడు లేక దేవలుడు.
1. పవమాన దీప్తమాన సోమమా! నీవు మాకు లభించుచున్నావు. ఆవు పాలతో కలియుచున్నావు. జలములందు ప్రవేశించుచున్నావు.
2. సోమము గమనశీలము. అది ప్రవహించును. జలమువలె దశాపవిత్రమున చేరును. అభిషుత సోమము ఇంద్రునకు తృప్తి కలిగించుటకు సాగును.
3. పవమాన సోమమా! నీవు ఇంద్రునకు ఆనందము కలిగించుచున్నావు. దశా పవిత్రమున చేరుచున్నావు. ఋత్విజులు నిన్ను హవిర్దానమునకు చేర్చుచున్నారు.
4. సోమమా! నీవు రాళ్లచే దంచబడుచున్నావు. దశాపవిత్రమునకు చేరుకొనుచున్నావు. తదుపరి ఇంద్రుని ఉదరమున ప్రవేశించుచున్నావు.
5. సోమమా! నీవు నరులకు ఆనందదాయినివి. ప్రజలచే గ్రహించబడుదానవు. స్తుతి యోగ్యవు. మాకు ప్రత్యక్షమగుము.
6. సోమమా! నీవు మంత్రములచే స్తుతింపదగిన దానవు. శుచివంతవు. పావకమవు శత్రు నాశకమవు. మాకు ప్రత్యక్షమగుము.
7. అభిషుత సోమము మధురము. శుచి మంతము. పావకము. దేవతలకు తృప్తినిచ్చునది. పాప కర్ములను నాశము చేయునది. అట్లని చెప్పబడుచున్నది.
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషి -అసితుడు - దేవలుడు.
1. సోమము కవి. దేవతల పానయోగ్య ఉన్ని ఉన్న దశాపవిత్రము నుండి సాగును. శత్రువును సహించును. యుద్దములు గెలుచును.
2. పవమాన సోమము స్తోతలను సహస్ర గోమంతులను, అన్నవంతులను చేయుచున్నది. ఇది నిశ్చయము.
3. సోమమా! నీవు మాచే స్తుతించబడుచున్నావు. దశాపవిత్రమున సంస్కరించబడు చున్నావు. అట్టి నీవు మనస్ఫూర్తిగా మాకు సకల ధనములను, అన్నములను ఇచ్చెదవు గాత.
4. సోమమా! మేము హవి అర్పించువారలము. మాకు బృహద్యశస్సును, స్థిరమగు ధనమును కలిగింపుము. మమ్ము అన్నమున నిలుపుము.
5. సోమమా! నీవు కర్మ నిర్వాహకమవు. గొప్పదానవు. సుప్రతవు. సంస్కృతవు. మహా రాజు వలె మా స్తుతులను ఆమోదింపుము.
6. సోమము యజ్ఞాదుల నిర్వాహకము. అది జలములందు ప్రవేశించును. హస్తములచే సంస్కరించబడును. పాత్రలందు చేరును.
7. సోమమా! నీవు ఆటలాడు దానవు. యజ్ఞతుల్యవు. దాతవు. స్తోతలమగు మమ్ము వీరులను చేయుము. దశా పవిత్రమున చేరుము.
రెండవ తృచ : ఋషి - అవత్సారుడు.
1. సోమమా! మమ్ము అధికారికమగునట్టియు మాటి మాటికి కలుగునట్టియు నగు రసమున ప్రవహింపచేయుము. సమస్త సౌభాగ్యములు కలిగించుము.
2. సోమమా! నీవు అన్నరూపవు. తృప్తి కలిగించు దానవు. స్తోత్రములు నీ కొరకే ఎట్లు పలుకుచున్నవో అట్లే నీవు మా యజ్ఞమునందు ఆసీనవు అగుము.
3. సోమమా! ఇంకను మాకు గోవులనిమ్ము. అశ్వముల నిమ్ము. గబగబ సాగు దినము లందు అన్నమును ధారగా వర్షింపుము.
4. సోమమా! నీవు సహస్రజితవు. శత్రుంజయవు. అపరాజితవు. శత్రువును ధిక్కరించి వధించు దానవు. ధారగా వర్షించుము.
మూడవ తృచ : ఋషి - జమదగ్ని.
1. సోమమా! నీవు మధురసమును బలికించు దానవు. నీ మధుధారలు మమ్ము రక్షించును గాత. ఆ ధారలు దశాపవిత్రమున చేరును గావుత.
2. సోమమా! ఉన్నిని లక్ష్యపెట్టకుము. యజ్ఞమూలమగు దశా పవిత్రమున చేరుము. ఇంద్రుని పానమునకు అందుము.
3. సోమమా! నీవు స్వాధిష్ఠవు. ధనధాత్రివి. అంగిరుల కొరకు దీప్తములగు పాలవంటి రసధారలను వర్షించుము.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - అరుణుడు.
1. అగ్నిదేవా! నీవు ఓషధులను అరణ్యములను భస్మము చేయదదలతువు. అప్పుడు అవన్నియు అన్నము వలె నీ నోట పడును. అట్టి తరి నీ కాంతి వర్షకాల మేఘపు మెరుపు వలెను ఉష! కాలమున వ్యాపించు ప్రకాశము వలెను భాసిల్లును.
2. అగ్నిదేవా! నీవు వాయువుతో కూడినపుడు వేగవంతుడవగుదువు. వృక్షలతాదులందు వ్యాపింతువు. అప్పటి నీ ఉరుకులు జరారహితములు, భస్మీకృతములు అగును. అప్పటి నీ తేజస్సు రథికుల అద్భుత గమనము వలె ఉండును.
3. అగ్ని బుద్దిని కలిగించువాడు. యజ్ఞపు పరమ సాధనము. దేవతల ఆహ్వాత. శత్రు తిరస్కర్త మనసుకు ప్రేరణ కలిగించువాడు. అట్టి అగ్నిని ఋత్విజులు ఇట్లు ప్రార్దించుచున్నారు:-
మేము గుమిగూడి నిన్ను స్వల్ప హవిని భక్షించుమనియు మరింత హవిని భక్షించుమనియు ప్రార్దించుచున్నాము. వృణతె నాన్యం త్వత్ - నిన్ను కాక మరొకరిని ప్రార్దించము.
రెండవ తృచ : ఋషి - ఉరుచక్రి.
1. మిత్రావరుణులారా! మీరిద్దరు పటిష్ట రక్షణలు కలిగించు వారమట నిశ్చయము. మేము మీ అనుగ్రహమును ఆశించుచున్నాము.
2. మేము స్తోతలము. మీరు ద్రోహము ఎరుగని వారని ప్రసిద్దులు. మేము మిమ్ము స్తుతించుచున్నాము. మేము మీ వారలము అగుదుము గాక. అన్నము, గృహము కలవారలము అగుదుము గాక.
3. మిత్రావరుణులారా! మమ్ము గొప్ప గొప్ప ఆయుధములతో రక్షించండి. మాకు ఆయుధము లిచ్చి మమ్ము కాపాడండి. మేము పుత్రసహితులము, శత్రు రహితులము అగుదుము గాత.
మూడవ తృచ : ఋషి - కురుహూతి.
1. ఇంద్రా! త్రావుము పాత్రలంధాలి అభిషుత సోమమును. పెంచుకొనుము బలము లెమ్ము. గడ్డము కదలించుము.
2. ఇంద్రా! నీవు శత్రువు మీదకు దండెత్తు వాడవు. నీవు శత్రు నాశనము చేయునపుడు ద్యావాపృథ్వులు నీకు ప్రసన్నము అగును గాత.
3. ఇంద్రా! ఎనిమిది దిక్కులు, సూర్యసహితముగ తొమ్మిది స్థానములకు వ్యాపించిన స్తుతులచే నిన్ను కొలుచుచున్నాను. అట్లయినను నిన్ను కొలువతరమా?
నాలుగవ తృచ : ఋషి - భరద్వాజుడు.
1. ఇంద్రాగ్నులారా! మేము స్తోతలము. మీరు సుఖములను ఇచ్చువారలు. మేము మిమ్ము స్తుతించుచున్నాము. సేవించండి అభిషుత సోమమును.





