Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
(విశ్వామిత్రో జమదగ్ని ర్భరద్వాజోథ గౌతమః |
అత్రిర్వసిష్ఠః కశ్యప ఇత్యేతే సప్త ఋషయః ||.)
10. ఈ అనడ్వాన్ తన నాలుగు కాళ్ళతో దారిద్ర్యమును పడవేసి త్రొక్కి పెట్టును. భూమిని మోకాళ్ళతో పెళ్ళగించును. శ్రమించి పనిచేయు రైతుకు అన్నము పెట్టుచున్నాడు.
11. వృషభమునందున్న ప్రజాపతికి సంబంధించిన యజ్ఞము ద్వాదశరాత్రమనియు అందు బ్రహ్మ ఉన్నాడనియు ఎరింగిన వాడు అనడుత్సవము చేయు అధికారము కలవాడు అగుచున్నాడు. ఇది "అనడహోవ్రతమ్" అగుచున్నది.
12. వృషభపు ఫలములను సాయంత్రము పిండుచున్నాను. ఉదయము పిండుచున్నాను. మధ్యాహ్నము పిండుచున్నాను. నవ యజ్ఞము చేయువారి ఫలములను పితుకుచున్నాను. ఈ వృషభపు ఫలములు పొందువారికి అక్షయ ఫలములు కలుగుచున్నవి.
రెండవ సూక్తము - 12
వినియోగము :-
ఆయుధపు దెబ్బకు కలుగు రక్తప్రసరణమును కట్టించుటకు, విరిగిన ఎముకను అతికించుటకు లక్క నీటిని ఈ సూక్తముచే అభిమంత్రించి ప్రాతః కాలమున గాయము మీద చల్లునది. ఘ్రుత, దుగ్ధములను అభిమంత్రించి గాయపడిన వానికి త్రాగించునది. దానితోనే గాయమును శుభ్రపరచునది.
1. లక్కా! నీవు ఎర్రని దానవు. నీవు స్రవించు రక్తమును యథాస్థానమున నిలుపుదానవు. అరుంధతీ! ఈ రక్తమును వంటికి ఎక్కించుము.
(అరుంధతి అనగా అపరాజిత - నిరోధించునది.)
2. గాయపడిన వాడా! నీకు తగిలిన గాయము - గాయపు మంట - విరిగిన ఎముక, సమస్త దేవతల దీవనలున్న లక్క ప్రభావమున మానును, చల్లారును, అతుకును గాక.
3. నీ మూలుగు బాగుపడును గాక. విరిగిన ఎముక అతుకును గాక. ఊడిన కండ చేరును గాక.
4. మూలుగు నుంచి విడివడిన మూలుగు కలసి పోవును గాక. తెగిన చర్మము అతుకును గాక. ఎముక నుండి రాలు రక్తము మరల ఎముకలోనికి పోవును గాక.
5. ఓషధీ! లోమమును లోమముతోను, చర్మమును చర్మము తోను కలిపి వేయుము. ఎముక మీద రక్తమును కట్టించుము. విరిగిన ఇతర అవయవములను సరి చేయుము. అతనిని పని చేయగల సమర్ధుని చేయుము.
6. చికిత్స జరిగిన వాడా! నీవు బాగైనావు. మంచము నుంచి లెమ్ము. నిలువుము. నడువుము. ఉరుకుము. మంచి చక్రములు, మంచి ఇరుసు, మంచి నాభి గల రథము తన పనిని సమర్దవంతముగా చేయునట్లు సదృఢ అవయవములు గల నీవు సమర్దుడవై కార్యములు నిర్వహించుము.
కత్తి తగిలిన గాయమును గాని, రాయి తగిలిన గాయమును గాని "ఋభూ!' రథపు భాగములను వలె అతికించి బాగుచేయుము.
(ఋభువు సుధన్వుని పుత్రుడు. ఋషి.)
మూడవ సూక్తము - 13
వినియోగము :-
1) ఉపనయనము తరువాత బాలుని ఆయుష్యము కొరకు ఈ సూక్తముచే అభిమర్సన, అభిమంత్రణ చేయునది. ఋషిచేత బాలుని అనుమంత్రింప చేయుటకు కూడా దీని వినియోగము.
2) లఘు గణము వినియోగమైన చోటనల్ల దీని వినియోగము.
3) యజ్ఞమున జబ్బు పడిన యజమాని చికిత్స యందు సహితము.
1. దేవతలారా!ధర్మ విషయమున ఈ వటువును లోపరహితుని చేయండి. జరిగిన లోపము నుండి ఉద్దరించండి. తెలియక చేసిన పాపము నుండి ఇతనిని రక్షించండి. ఆయుర్భంగము నుండి కాపాడి శతాయుష్కుని చేయండి.
2. ఇవి రెండు వాయువులు. అవి సముద్ర పర్యంతము అటుపైన కూడ వీచును గాక. వాయువు వటువునాకు బలము కలుగునట్లు వీచును గాక. మరొక వాయువు వటువు పాపములు హరించుచు వీచును గాక.
(1. పశ్చా ద్వాంతం 2. పురోవాతం అని రెండు వాయువులు. ప్రాణము, అపానము అనియు రెండు వాయువులు.)
3. వాయువా! రమ్ము. వీచుము, ఓషధివై వీచుము. పాపములు తొలగించుచు వీచుము. నీవు సకల వ్యాదులకు భేషజమవు. దేవతలకు దూతవు అయి ఉన్నావు.
4. ఈ వటువును దేవతలు రక్షింతురు గాక. మరుద్గణములు రక్షించును గాక. విశ్వాభూతములు రక్షించును గాక. వారు ఇతనిని పాపరహితుని చేయుదురు గాక.
5. వటువా! నేను వాయువును. నీకు సుఖములు కలిగించుటకు, బాధలు హరించుటకు వచ్చినాను. నీకు బలము కలిగించుటకు వచ్చినాను. నీ లోని వ్యాధులను అణగ ద్రొక్కుటకు వచ్చినాను.
6. నా హస్తము భాగ్యవంతము. పరమ భాగ్యవంతము. నా చేత సమస్త ఓషధులు ఉన్నవి. నా స్పర్శ ఆనంద దాయకము అగుచున్నది.
7. పది అంగుళులు గల రెండు చేతులు వాక్కు నుండి వెలువడు శబ్దమున కన్న మున్ను కదలుచున్నవి. ఈ హస్తములు ఆరోగ్య ప్రదములు. వటువా! అట్టి చేతులలో నిన్ను త్రాకుచున్నాను.
నాలుగవ సూక్తము - 14
వినియోగము :-
1) ఈ సూక్తముచే "అజౌదనసవము" న హవిని అభిమర్సనాదులు చేయునది.
2) క్రమధ్వమ్ అగ్నినా, మొదలు మూడు మంత్రములు అన్ని సవయజ్ఞములందు చదువునవి.
3) 'అగ్నే ప్రేహి' అను ఋక్కుచే అన్ని సవ యజ్ఞములందు ఘ్రుతాహుతులు ఇచ్చునది.
4) 'అజం అనజ్మి' అను మంత్రముచే అజౌదన సవమున కుశల మీద పెట్టిన పశు సంబంధ హవిని ఘ్రుతముచే శుద్ది చేయునది.
5) 7,8 ఋక్కులచే సవ యజ్ఞమున పశువు అవయవములను అయిదు భాగములు వేసి దిశలందు స్థాపించునది.
6) 9వ మంత్రముచే తల, కాళ్ళు మున్నగు వానిని చర్మ సహితముగా ఆహుతి ఇచ్చునది.
7) వాజపేయమున యజమాని యూపము మీద మూడవ మంత్రమును జపించునది.
8) బ్రహ్మ వరుణ ప్రఘాస కర్మయందు అగ్ని ప్రణయమున 5వ ఋక్కును చదువుచు సాగవలెను సోమయాగమున ఉత్తరవేది ప్రణయమున కూడా ఈ మంత్రమును జపించునది.
1. మేక అగ్ని తాపమున ఉద్భవించినది. పుట్టగనే తొలుత అగ్నిని దర్శించినది. దాని నుండియే దేవతలు దేవత్వమును పొందినారు. దాని వలననే అజమేధముననే స్వర్గమునకు చేరుచున్నారు.
2. అగ్ని యజ్ఞము కొరకు ఆవిర్భవించినాడు. జనులారా! మీ చేతులతో యజ్ఞయాగాదులు చేయండి. దుఃఖ రహితమగు స్వర్గమును చేరుకొనండి. అంతరిక్షపు పీఠము వంటి స్వర్గమునకు చేరి దేవతలతో కలసి పొండి.
3. నేను భూమి నుండి అంతరిక్షమునకు, అంతరిక్షము నుండి దుఃఖము ఎరుగని స్వర్గమునకు, స్వర్గమునుండి జ్యోతిర్మయ లోకమునకు ఆరోహించుచున్నాను.
(ఇది ఆరోహణ క్రమము. ఒక దానిని తప్పించి పై దానికి చేరుట జరుగదు.)
4. స్వర్గమును ఆపేక్షించువారు పుత్ర పశ్వాది అల్ప సుఖములను ఆపేక్షించరు. విశ్వాధారమగు యజ్ఞమును అర్ధము చేసికొని ఆచరించు వారు ముల్లోకములను జయించుచున్నారు.
5. అగ్నిదేవా! నీవు దేవతలందు ప్రథముడవు. ముఖ్యుడవు. విచ్చేయుము. నీవు దేవతలకును, మానవులకును నేత్రమగుచున్నావు. యజ్ఞములు చేయు యజమానులు భ్రుగువులతో సమానులై యజ్ఞ ఫలములను అనుభవించుచున్నారు.
6. అజరూప హవిని పాలవంటి రసము గల నేతితో తడుపుచున్నాను. ఈ అజము దివ్యము పక్షి రూపమున యజమానిని స్వర్గమునకు చేర్చగలది. అట్టి అజ ప్రభావమున మేము పుణ్యలోకములకు చేరుచున్నాము. అచటి నుండి జ్యోతిర్లోకమునకు ఎక్కుచున్నాము.
7. పాచకా! ఇది అయిదు భాగముల ఒధానము. దీనిని నీ ఐదు వ్రేళ్ళచే ఐదు భాగములు చేయుము. వండిన మేక తలను తూర్పు దిక్కున పెట్టుము. ఒధనపు మరొక భాగమును, మేక కుడి భాగపు మాంసమును దక్షిణమున పెట్టుము.
8. పశ్చిమమున తొంటి మాంసమును, ఉత్తరమున ఉత్తర భాగ మాంసమును, ఊర్ధ్వ దిశన వెన్ను మాంసమును, అధో దిశన ఉదర మాంసమును, మధ్య దిశన మధ్య భాగ మాంసమును ఉంచుము.
9. వండిన మేకను విభజించి చర్మము, పాదములు, శిరస్సు సహితముగా కప్పి ఉంచుము. ఈ మేక కాళ్ళు మున్నగు సర్వావయవములు కలిగి సర్వాకారయై ఉన్నది. సర్వాంగ అజమా! నీవు భూమి నుండి స్వర్గము లక్ష్యముగ సాగుము. నాలుగు కాళ్ళతో నలుదిశలందు నిలువుము.
ఐదవ సూక్తము - 15
వినియోగము :-
1) వర్షము కొరకు ఈ సూక్తముచే మరుత్తులకు ఇతర దేవతలకు ఘ్రుత హోమము చేయునది. 'కాశ' 'దివిధువక్' వేతసమను ఓషధులను ఒక పాత్రలో వేసి సంపాతన అభిమంత్రణము చేసి నీటిలో తలక్రిందుగా పెట్టి వాటిని అభిమంత్రిత కుక్కతలను నీటిలో పారవేయునది. మానవ కేశములు, పాత చెప్పులను వెదురు గడకు కట్టి పచ్చి కుండను అభిమంత్రిత జలముతో ప్రోక్షించి మూడు త్రాళ్ళ ఉట్టిలో పెట్టి నీళ్ళలో వదల వలెను.
2) ఉపతారకాద్భుత శాంతి యందు దీనిచే ఘ్రుతాహుతులిచ్చునది.
3) చాతుర్మాస్యపు అన్వారంభణి యష్టియందు ఆరవ మంత్రముచే పర్జన్య చరుయాగమును అభిమంత్రణము చేయునది.





