Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
2. పర్వతములందు పడిన దధీచి యొక్క అశ్వశిరమును ఇంద్రుడు కనుగొనదలచినాడు. శర్యణావతి సరస్సునందు దానిని కనుగొన్నాడు. (దానితో అసురులను, వృత్రులను హతమార్చినాడు.)
3. గమనము గల చంద్రమండలమున రాత్రిళ్ళు ఆదిత్యుని కాంతియే ప్రకాశించుచున్నది అను విషయము ఇంద్రునకు తెలియును.
నాలుగవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. ఇంద్రాగ్నులారా! ఈ స్తుతి అతి ప్రధానము. దీనిని స్తోతలు మీ కొరకు మేఘము నుండి వర్షము వలె సృష్టించినారు.
2. ఇంద్రాగ్నులారా! స్తోతల స్తోత్రములను ఆలకించండి. వానిని స్వీకరించండి. ప్రభువులగు మీరు కర్మ ఫలమును ప్రసాదించండి.
3. కర్మ ప్రేరకులగు ఇంద్రాగ్నులారా! మమ్ము పాపకార్యములకు నియమించకండి. శత్రుహింసలకు నియమించకండి. నిందలకు నియమించకండి.
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - దృఢచ్యుతుడు.
1. సోమమా! నీవు పాపములు హరించు దానవు. బలసాధనమవు. మాదకమవు. దేవతలు, మరుత్తులు వాయువులు పానము చేయుటకు పాత్రలందు నిండుము.
2. వృష, కవి, స్థిర, సర్వప్రియ, హింసించరాని సోమము దేవతలందు చేరి శోభిల్లుచున్నది.
3. పవమానమా! మా కార్యమునకు హితము కూర్చుము. శబ్దించుము. ద్రోణ కలశమున ప్రవేశించుము. వాయుదేవత కొరకు పాత్రయందు రాలుము.
రెండవ తృచ : ఋషి - మైత్రావరుణ వసిష్ఠుడు.
1. బిందువులుగా రాలు సోమమా! నేను నిత్యము నీ సేవ చేయుచున్నాను. చాలమంది రాక్షసులు నన్ను బాధించుచున్నారు. వారిని నష్టపరచుము.
2. బభ్రువర్ణ సోమమా! నేను రాత్రింబవళ్ళు నిన్ను సేవించుచున్నాను. నీవు ప్రజ్వలితుడవై పరమస్థానమున ఉన్న సూర్యుని వంటిదానవు. పక్షివలె దిగిరమ్ము. మమ్ము చేరుము.
మూడవ తృచ : ఋషి - బృహన్మతి.
1. సోమము పావనమైనది. విశిష్ట ద్రష్ట. సకల శత్రువులను అతిక్రమించునది. అట్టి సోమమును విప్రులు దీపింప చేయుదురు.
2. అరుణ సోమము ద్రోణ కలశమునకు చేరును. తదుపరి ధృవస్థానమున ఉండునట్టి వరదుడగు ఇంద్రుడు ఆ సోమమును సేవించును.
3. బిందువులుగా రాలు సోమమా! మాకు మరింత ధనము నిమ్ము. సకల దిశల నుండి వేలకొలది ధనమును తెచ్చి ఇమ్ము - 'ఆ పవస్వ సహాస్రిణమ్'
అయిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - మైత్రావరుణ వసిష్ఠుడు.
1. పిబా సోమమిన్ద్ర ఇంద్రా! సోమపానము చేయుము. అభిషవము చేయువారి బాహువులు అభిషవ శిలలను - కళ్ళెము గుర్రమును లాగినట్లు - లాగుచున్నవి. హర్యశ్వ ఇంద్రా! ఆ సోమము నీకు ఆనందము కలిగించును గాక.
2. హర్యశ్వ ఇంద్రా! ఈ సోమము నీకు తగినది. రుచిరము. మాదకము. దానిని సేవించి నీవు రాక్షసులను వధింతువు. మహా ధనిక ఇంద్రా! ఆ సోమము నీకు ఆనందకరము అగును గాత.
3. మఘవా! వసిష్ఠుడు నిన్ను ఈ స్తుతులతో అర్చించుచున్నాడు. వానిని స్వీకరింపుము. యజ్ఞశాలయందు హవిస్సులను ఆరగించుము.
రెండవ తృచ : ఋషి - త్రిశోకుడు.
1. ఇంద్రుడు సమస్త సంగ్రామములందు విజయుడు. నరులు ఒకచోట కూడి అతనిని స్తుతింతురు. అతని వడిని పెంచుదురు. అతనికి ప్రకాశము కలిగించుటకు సూర్యుని నుతింతురు.
ఇంద్రుడు విఘ్నకర్తల వినాశకుడు. శ్రేష్ఠుడు. స్థిరుడు. శత్రుహంత. ఉగ్రుడు. అనంత బలశాలి. అతనిని ధనము కొరకు స్తుతించుచున్నారు.
2. విప్రులు ఉచ్చైస్వరమున ఇంద్రుని స్తుతించుచున్నారు. మేషరూప, వ్యాపక ఇంద్రునకు నమస్కరించుచున్నారు.
స్తోతలారా! మీరు కీర్తిమంతులు. ద్రోహమెరుగని వారు. ఇంద్రుని స్తుతించుటకు తొందర పడండి. మీ స్తుతులను ఇంద్రుని చెవికి ఎక్కించండి.
3. స్తోతలు సోమపాయి ఇంద్రుని సుస్వరమున నుతింతురు. యజమానిని వర్ధిల్లచేయు ఇంద్రుడు ధృతవ్రతుడై, బలమైన రక్షణలతో వారిని కాపాడును.
మూడవ తృచ : ఋషి - పురుహన్మ.
1. ఇంద్రుడు నరులకు ప్రభువు. రథము మీద పయనించు వాడు. నిరాటంకుడు. సకల సేనలను తరింపచేయువాడు. వృత్రహంత. మహామహుడు. అట్టి వానిని ప్రశంసించుచున్నాను.
2. ఇంద్రుడు మహా రక్షకుడు. అతడు విరోధులకు ఉగ్రుడు. అనుకూలురకు అనుగ్రహుడు. దర్శనీయుడు. మహానుడు. వజ్రి. సూర్యసముడు. పురుహన్మ! అట్టి ఇంద్రుని రక్షించుమని స్తుతించుము.
(ఋషి తనను సంబోధించు కొనుచున్నాడు.)
ఆరవ ఖండము
మొదటి తృచ : ఋషి - అసితుడు.
1. సోమము కవి. కర్మసాధకము. అధిషవణ ఫలకములందు స్థాపించబడినది. ద్యులోకమునకు అత్యంత ప్రియము. అది శిలలచే శుద్దమైనది. అధ్వర్యులకు సిద్దమైనది.
2. అదిగో వెలువడినది! విశుద్ధ, మహిమాన్విత సోమము. అది ఒకరి బిడ్డ. ఋత వర్ధన. ఆ సోమము - జగత్కారకులు, దానికి పితరులు - ద్యావాపృథ్వులను ప్రకాశింప చేసినది!
3. సోమమా! స్తోతలు నీకు నివాస భూతులు. ద్రోహరహితులు. వారు నిన్ను జనులకు సరిపోవునంత లభించుమని ప్రార్దించుచున్నారు.
రెండవ తృచ : ఋషి - శక్తి
1. దేవతా సంబంధ సోమమా! దీప్తమానమగు నీవే ఘోషించుము. దేవతల మీద ధ్యాస ముంచుము. అమృతత్వము పొందుము.
2. సత్పురుషుడగు దధ్యంగ ఋషి సోమముచే యజ్ఞద్వారములను తెరచినాడు. విప్రులు సోమముతోనే అపహృత గోవులను సాధించినారు. యజమానులు సోమము తోనే ఇంద్రాదులను ప్రసన్నులను చేసినారు. అమృతాన్నమును పొందినారు.
మూడవ తృచ : ఋషి - అగ్ని
1. పావన సోమమా! ధారలుగా - అనేక దారులుగా ఉన్నిగల దశా పవిత్రమును చేరుచున్నావు. నీ ముందు పవిత్రస్తుతి నినదించుచు సాగుచున్నది.
2. బలశాలి సోమము జలములందు క్రీడించుచు, దశా పవిత్రము నుండి వెడలగా అంగుళులు దానిని శుద్ది చేయుచున్నవి. మూడు పాత్రలందు చేరు సోమమును స్తుతులు సకల దిశల నుండి ప్రశంసించుచున్నవి.
3. అన్నము కలిగించుటకు వర్షము నిచ్చు సోమము యుద్దమునకు అశ్వము వలె - కలశమునాకు పంపబడుచున్నది. తదుపరి సోమము ధ్వని చేయుచు పాత్రలందు చేరుచున్నది.
నాలుగవ తృచ : ఋషి - ప్రతర్దనుడు
1. సోమము బుద్దిని పుట్టించినది. ద్యులోక, స్వర్గ జనయిత. పృథివీ జనయిత. అగ్ని జనయిత. సూర్య జనయిత. ఇంద్ర, విష్ణువుల జనయిత. అట్టి సోమము పాత్రలందు పడుచున్నది.
2. స్తోతలందు బ్రహ్మ, మేధావులందు కవి, విప్రులందు ఋషి, పశువులందు మహిషము, పక్షులందు శ్యేనము, హింసకులందు స్వధితి అయిన సోమము దశా పవిత్రము నుండి వెడలుచున్నది.
3. ప్రవహించు నదీ తరంగములు శబ్దములు కలిగించినట్లు సోమము మనసుకు శ్రావ్యమగు శబ్దములు చేయును. సోమము కోరికలు తీర్చును. అంతః కరణములను దర్శించును. గోవులను తెలియును. దుర్భలులకు అందకుండును. అట్టి సోమము ఎన్నో బలములను సంతరించు కొనుచున్నది.
ఏడవ ఖండము
మొదటి తృచ : ఋషి - ప్రయాగుడు లేక అగ్ని.
1. అగ్ని బలవంతుల బంధువు. బలశాలి. జ్వాలారూపి. అత్యధికుడు. ఋత్విజులారా! అట్టి అగ్నిని చేరుకొనండి.
2. ఈ అగ్ని కర్రరూపమును దిద్దు వడ్రంగి వలె మమ్ము సరిదిద్దువాడు అగును గాక. ఈ అగ్ని మాకు జ్ఞానము, యశస్సు కలిగించును గాత.
3. అగ్ని దేవత అతడు మానవులకు సకల సంపదలు కలిగించును. అగ్ని అన్నసహితుడై మమ్ము చేరును గాత.
రెండవ తృచ : ఋషి - గోతముడు.
1. సోమము ప్రశస్తము. హర్షదాయకము. మాదకము. అభిషుతము. ఇనుమింద్ర సుతం పిబ ఇంద్రా! ఈ అభిషుత సోమ పానము చేయుము. యజ్ఞభూమి యందు దీప్తములగు సోమధారలు నిన్ను చేరుచున్నవి.
2. ఇంద్రా! నీవు హర్యశ్వములను రథమునాకు జోడింతువు. అందువలన నీకు సముడగు రథికుడు లేడు. బలములందు నీకు సములు లేరు. ఆశ్వవంతులందు కూడ నీకు సరి వచ్చువారు లేరు.
3. ఋత్విజులారా! త్వరపడండి. ఇంద్రుని అర్చించండి. ఇంద్రుని స్తుతులు ఉచ్చరించండి. అభిషుత సోమము సమర్పించండి. అది ఇంద్రునకు ఆనందకరము అగును గాక. తదుపరి ప్రశంసనీయుడు, బలశాలి యగు ఇంద్రునకు నమస్కరించండి.
మూడవ తృచ : 'ఋషి - సందిగ్ధః'.
1. హర్యశ్వవంత, శూర ఇంద్రా! రా రమ్ము. ఈ హవిస్సును స్వీకరించుము. నీవు అందగాడవు. ఆనందించుము. నిన్ను కోరునది, సంస్కరించబడినది, చైతన్య వంతమగు సోమ మధువును సేవింపుము.
2. ఇంద్రా! ఇది అభిషుత సోమము. మధురము. స్వర్గ స్తుతి యుక్తము. మాధకము. అది నీవద్దకు చేరినది. స్వర్గ సమమగు నీ ఉదరమును ఆ సోమముతో నింపుము.
3. సాహసి ఇంద్రుడు సోమపానము చేసి మిత్రుని వలె శత్రువులను వధించినాడు. బలాసురుని పరిమార్చినాడు. భ్రుగువును సహించినాడు.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
ఉత్తరార్చికయందలి అయిదవ అధ్యాయము సమాప్తము.





