Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

1.    తాను సమృద్దుడై ప్రజలకు సమృద్ది కలిగించు వాడు "భూతానామధిపతిర్భభూవ" ప్రజలకు ప్రభువు అగుచున్నాడు. ధర్మాధర్మ విభజన చేసి దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించువాడు రాజసూయము చేయుచున్నాడు. రాజసూయము వలన రాజునకు రాజ్యము చేయు అనుమతి లభించుచున్నది.
   
2.    రాజా! సింహాసనాదులు అధిష్టించుము. కాదనకుము. ఉగ్రుడవు, శత్రుహంతవు ఆగుము. రమ్ము సింహాసనము అధిష్టించుము. మిత్రులను వర్ధిల్ల చేయుము. దేవతలు నిన్ను అనుగ్రహింతురు గాక.
   
3.    రాజు సింహాసనము ఎక్కినంత ప్రజలు అతనిని సేవింతురు గాక. రాజు అయిన తేజస్సు చే అతడు పరిపాలనా తత్పరుడు అగును గాక. ఆ తేజస్సుతోనే అతడు శత్రుహంత అగును గాక. అట్టి నామాంకితుడగు రాజు శత్రు, మిత్ర, స్త్రీల విషయమున వివిధముగ వ్యవహరించును గాక. అతడు అమృతత్వము ప్రాప్తించు యుద్ద యజ్ఞాదులు చేయును గాక.
   
4.    రాజా! వ్యాఘ్ర చర్మముపై ఆసీనుడవై అజేయుడవై దశ దిశలను జయించుము. ప్రజా నిన్ను రాజుగా వాంచించును గాక. నీ రాజ్యమున అనావృష్టి కలుగకుండును గాక.
   
5.    తమ సారవంత రసముచే ప్రజలను ఆనందపరచునట్టి దివి యందలి, అంతరిక్షము నందలి, భూమి యందలి జలముచే నిన్ను అభిషేకించుచున్నాను.
   
6.    సారవంతమగు దివ్యజలము తమ వర్చస్సుచే నిన్ను అభిషిక్తుని చేయును గాక. సవితా దేవత నిన్ను మిత్రులను వర్ధిల్లచేయు వానిని చేయును గాక.
   
7.    నదులు సముద్రుని ప్రసన్నుని చేయు రీతి పూర్వోక్త జలము ఈ రాజును వ్యాఘ్రమంతటి పరాక్రమశాలిని, తల్లివలె ప్రసన్నులను చేయువానిని, సింహము వంటి సౌభాగ్య ప్రదుని చేయును గాక.
   
                                          నాలుగవ సూక్తము - 9
   
వినియోగము :-
   

    ఉపనయనము తరువాత ఆయుష్కామి బాలకునకు అంజన మణిని ఈ సూక్తముచే సంపాతిత అభిమంత్రణము         చేసి కట్టునది. ఐరావతీ నామ మహాశాంతి యందును ఈ సూక్తము వినియోగము.
   
1.    అంజనమణీ! నీవు పర్వతపు నేత్రమవు. ప్రాణులను కాపాడుటకు విచ్చేయుము. మేము రోగ రహితులమై చిరంజీవుల మగుటకు విశ్వేదేవతలు నిన్ను మాకు ప్రసాదించినారు.
   
2.    నీవు నరులను రక్షించుదానవు. గోవులను రక్షించుదానవు. ఆడ, మగ గుర్రములను రక్షించుటకై ఏర్పడినావు.
   
3.    అంజనమా! నీవు రాక్షస పిశాచాదులు కలిగించు బాధలను నివారించుదానవు. స్వర్గము నందలి అమృతమును ఎరింగిన దానవు. ప్రాణుల అనిష్టములను హరించుదానవు. రోగహారి భేషజమవు.
   
4.    నీవు ఎవని సర్వాంగములందు సర్వ సంధులందు ప్రవేశించుచున్నావో వాని వ్యాధులను ప్రచండ వాయువు మేఘమును వలె అదృశ్యము చేయుచున్నావు.
   
5.    అంజనమా! నిన్ను ధరించిన వానికి పరుల శాపము తాకదు. ఇతరుల అభిచార, కృత్యాదులు అంటవు. దుఃఖములు, విఘ్నములు కలుగవు.
   
6.    అంజనమా! అపన్మంత్రముల వలన కలుగు దుఃఖముల నుండి, దుస్స్వప్నముల దుఃఖము నుండి, జన్మాంతర పాపముల దుఃఖముల నుండి, ఇతర పాపముల దుఃఖము నుండి, దూషితమన దుఃఖము నుండి, భ్రష్టుకంటి చూపునుండి నన్ను రక్షించుము.
   
7.    అంజనమా! నేను నీ మహత్తును తెలిసికొన్నాను. సత్యముగా చెప్పుచున్నాను. న అనృతమ్. నేను దాసుడనై గోవులను, అశ్వములను, సకల ప్రాణులను సేవించుచున్నాను.
   
8.    జ్వరము, సన్నిపాతము, సర్పవిషము ఈ మూడు అంజనమునకు దాసులు అగుచున్నవి. పర్వత రాజమగు త్రికకున్నామ పర్వతము అంజనమునకు తండ్రి అగుచున్నాడు.
   
9.    హిమాలయము మీద ఉండి 'త్రికకుద్ పర్వతము మీది అంజనము స్త్రీ పురుష పిశాచములను నాశనము చేయగలది. అందువలన మా వ్యాధులను నిర్మూలించును గాక.
   
10.    నిన్ను 'త్రైకకుద్' అనియు యామున మనియు అనుచున్నారు. ఆ ఉభయ నామములు శుభప్రధములు అగుచున్నవి. అవి మమ్ము రక్షించును గాక.
   
                                             ఐదవ సూక్తము - 10
   
వినియోగము :-

   
    ఉపనయనానంతరము ఆయుష్కామునకు శంఖమణిని ఈ సూక్తముచే అభిమంత్రించి కట్టునది. జలభయము కలిగినపుడు వారుణీ మహాశాంతియందు వినియోగము.
   
1.    ఈ శంఖము వాయువు నుండి, అంతరిక్షము నుండి, జ్యోతిర్మండలము నుండి, సువర్ణము నుండి పుట్టినది. శత్రువులను కృశింప చేయు శంఖము మమ్ము పాపముల నుండి రక్షించును గాక.
   
2.    శంఖమా! నీవు ప్రకాశమానములగు నక్షత్రాదుల ముందున్న సముద్రమున పుట్టిన దానవు. అట్టి జ్యోతిర్మయివగు నీ ప్రభావమున మేము రాక్షసులను హతమార్చి, పిశాచములను అణచి వేయుచున్నాము.
   
3.    శంఖముచే అజ్ఞానమును దూరము చేయుచున్నాము. శంఖముచే అలక్ష్మిని దూరము చేయుచున్నాము. శంఖము హిరణ్యజాతము సకల రోగములకు భేషజము. అది మమ్ము పాపముల నుండి రక్షించును గాక.
   
4.    శంఖము తొలుత శంఖమున పుట్టినది. తదుపరి సంద్రమున, నదినుండి తేబడిన హిరణ్య జాతము మాకు ఆయుష్పదము అగును గాక.
   
5.    శంఖము సముద్రమున పుట్టిన మణి వంటిది. మేఘము నుండి పుట్టిన సూర్యుని వలె ప్రకాశించునది. శంఖ రూపమగు మణి మమ్ము అసురుల ఉపద్రవముల నుండి రక్షించును గాక.
   
6.    శంఖమా! నీవు మెరిసిపోవు స్వర్ణాదులందు ప్రముఖుమవు. ఏలననగా నీవు అమృతమయ సోమము నుండి ఉద్భవించిన దానవు. యుద్దమున రథములందు నీవు దర్శనమిత్తువు. ఆయుధ పేటికలందు ప్రకాశించు నీవు మమ్ము ఆయుష్మంతులను చేయుము.
   
7.    దేవతలను రక్షించునట్టి శంఖము సువర్ణమున పుట్టి సంఖా రూపము దాల్చి నీటిలో ప్రాణి రూపమున ఉంటున్నది. అట్టి నిన్ను ఆయువు కొరకు. వర్చస్సు కొరకు, బలము కొరకు కట్టుచున్నాను. దీర్ఘాయుష్యము కొరకు, శత శరత్తుల కొరకు స్వర్ణసంబంధ మణి నిన్ను రక్షించును గాక.
   
                                             మూడవ అనువాకము
                                          మొదటి సూక్తము - 11

   
వినియోగము :-

   
    ఈ సూక్తముచే అనడుత్సవమున నిరుప్త హవి అభిమర్సన, సంపాతన, దాత్రువాచనము చేయునది.
   
1.    అనడ్వాన్ పృథివిని ధరించినది. ద్యులోకమును ధరించినది. విశాల అంతరిక్షమును ధరించినది. దిశలను ధరించినది. షడుర్విని ధరించినది. విశ్వమందు, భువనములందు ప్రవేశించినది.
   
వ్యాఖ్య -    అనద్వాన్ శకట వహన సమర్దో వృషభః = బండిని లాగు ఎద్దు. ఎద్దు వలననే వ్యవసాయము జరుగుచున్నందున పృథ్విని పోషించినట్లైనది. వ్యవసాయ ఉత్పత్తులే దేవతలకు అందించు హవిస్సును అయినందున స్వర్గమును పోషించునట్లైనది. అంతరిక్షమున ధరించుట స్తుతి మాత్రము. వాహనములను చేర్చుట వలన దిశలను ధరించినట్లైనది.
   
    1.స్వర్గము 2. భూమి 3. రాత్రి 4. పగలు 5. జలము 6. ఓషధులు షడుర్వి అగుచున్నది.
   
2.    అనడ్వాన్ ఇంద్రుడు అగుచున్నాడు. పశువులందు ప్రత్యక్షమగుచున్నాడు. యజ్ఞము వలె పశువులను అవిచ్చిన్నముగా కొనసాగించుచున్నాడు. అతడే భూత భవిష్యద్వర్త మానములు అగుచున్నాడు. అతడే పదార్ధములను ఉత్పత్తి చేయుచున్నాడు. ఇంద్రుని, అన్య దేవతల కర్మములను అనుష్టింపచేయుచున్నాడు.
   
3.    అనడ్వాన్ - పూర్వోక్త రీతిగా మానవులకు ఇంద్రుడు అగుచున్నాడు. అతడు సూర్య రూపమున జగమును తపింపచేయుచు ఆకాశమున సంచరించుచున్నాడు. ఈ విషయములను గ్రహించినవాడై మేము ఇచ్చిన వృషభమును పరిగ్రహించి, అతని మహాత్మ్యమును ఎరిగి ఉపయోగించిన వానికి మంచి సంతానము కలుగును. దేహాంతమున మరల ఈ లోకమునకు తిరిగి రాదు. అతడు సూర్యాది లోకములకు చేరుచున్నాడు.
   
4.    అనడ్వాన్ యజ్ఞయాగాది ఫల రూపమగు అక్షయములను ఇచ్చుచున్నాడు. అంతకు ముందు అతనిని సోమరసము ప్రసన్నుని చేయుచున్నది. పర్జన్యుడు ధారా, మరుత్తులు నూపురము అగుచున్నారు. ఈ యగ్నమే దుగ్ధము, ఇచటి దక్షిణ అనడ్వాన్ యొక్క దోహ క్రియ అగుచున్నది.
   
5.    ఈ అనడ్వాన్ కు స్వామి లేడు. యజ్ఞము లేదు. సేవకుడు లేడు. దాత లేడు. గ్రహీత లేడు. ఈ చతుష్పాత్తు విశ్వజిత్, విశ్వభ్రుత్, విశ్వకర్మా అగుచున్నాడు. అతడే మనకు సమస్త ధర్మములు ఉపదేశించువాడు అగుచున్నాడు.
   
6.    దేని వలన దేవతలు తమ దేహములు వదలి అమృతత్వము పొంది స్వర్గమునకు చేరుచున్నారో ఆ అనడ్వానము వలననే సూర్య సంబంధ వ్రత, దీక్ష, తపసాదులు ఆచరించి పుణ్య లోకములకు చేరుచున్నాము.
   
7.    అనడ్వాన్ ఇంద్రుడు అగుచున్నాడు. అగ్ని అగుచున్నాడు. ప్రజాపతి అగుచున్నాడు. పరమేష్టి అగుచున్నాడు. విరాట్ స్వరూపుడు అగుచున్నాడు.
   
    విశ్వానరుడు స్వయముగా పుట్టినాడు. వైశ్వానరుడు స్వయముగా పుట్టినాడు. అనడ్వ స్వయముగా పుట్టినాడు. కావున అనడ్వ ప్రజాపథ్యాత్మకుడు అగుచున్నాడు.
   
8.    అనడ్వాన్ మధ్య భాగమున వీపున ప్రజాపతి ప్రవేశించి బరువులు మోయుటకు తగినట్లు గట్టి పరచినాడు. అందుకు తగినట్లే ముందు, వెనుక భాగములు ఏర్పరచబడినవి.
   
9.    అనడ్వాన్ కు సంబంధించిన ఏడు రకముల మేతలను ఎరిగిన వాడును, అతని యందున్న లోక, సముద్రాదులగు ఏడింటిని ఎరిగిన వాడును మంచి సంతానము పొంది స్వర్గలోకమునకు చేరుచున్నాడని సప్తర్షులు చెప్పుచున్నారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.