Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


     

                       భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
                       భద్రా ఉత ప్రశస్తయః ||

                                               అయిదవ అధ్యాయము
                                                 మొదటి ఖండము
                                       మొదటి తృచ : ఋషి - గణములు

   
          ప్ర త ఆశ్వినీః పవమాన ధేనవో దివ్యా అసృగ్రన్ పయసా ధరీమణి |
           ప్రాంతరిక్షాత్ద్సావిరీస్తే అసృక్షత యేత్వా మృజన్త్స్యషిపాణ వేధపః ||

   
1.    సోమమా! నీవు వ్యాప్తావు. తృప్తి కలిగించు దానవు. అంతరిక్షము నుండి ధారలుగా పడుదానవు. అట్టి నీ ధారలు పాలతో కలుపబడి ద్రోణకలశమున చేరుచున్నవి. నిన్ను ఋత్విజులు, ఋషులు శుద్దిచేయుచున్నారు. వారు నిన్ను ధారలుగా అంతరిక్షము నుండి పాత్రలోనికి చేర్చుచున్నారు.
   
2.    సోమము అభిషుతము. ధృవము. విరాజమానము. అట్టి సోమపు కిరణములు ఇటునటు పరుగులిడుచున్నవి. దశాపవిత్రము నందు శోధితమైన సోమము పాత్రలందు ప్రవేశించుచున్నది.
   
3.    సోమమా! నీవు విశ్వద్రష్టవు. ప్రభువవు. విరాజిల్లుదానవు. నీయొక్క మహాకిరణములు సకల ధామములను సకల దిశల నుండి ప్రకాశింప చేయుచున్నవి. వ్యాపకా స్వభావము గల నీవు రసము తీసినంత పరిశుద్దమగుదువు. నీవు సకల భువనములకు స్వామివై విరాజిల్లుచున్నావు. "పతిర్విశ్వస్య భువనస్య రాజసి."
   
                                     రెండవ తృచ : ఋషి - అమహీయుడు.
   
1.    పవమాన సోమమా! దివియందలి విచిత్ర అశ్వని వంటి బృహత్ వైశ్వానర జ్యోతిని కల్పించినావు.
   
2.    పవమాన సోమమా! నీ యొక్క రసము మాదకము. రక్షోవర్జితము. అది ఉన్నిగల దశా పవిత్రమును దాటును. పాత్రలందు ప్రవేశించును.
   
3.    పవమాన సోమమా! నీ యొక్క రసము దక్షము. ద్యుమంతము. ప్రకాశించునది. అది విశ్వవ్యాప్తములగు సకల జ్యోతులుగా దర్శనమిచ్చును.
   
                                      మూడవ తృచ : ఋషి - మేధాతిథి.
   
1.    సోమము జలము వంటిది. శీఘ్రగామి. దీప్త. స్రవంతి. అది కృష్ణచర్మమును నష్టపరచును. పాత్రలందు చేరును. అట్టి సోమమును మేము స్తుతించుచున్నాము.
   
2.    సోమము శుభములకు అందునది. వ్రతహీనులకు అందనిది. రాక్షసులను బంధించునది. అట్టి సోమమును స్తుతించుచున్నాము.
   
3.    అభిషుతమగుచున్న సోమపు ధ్వని వర్షధ్వని వలె వినిపించుచున్నది. బలశాలి సోమపు మెరుపులు ఆకసమున మెరయుచున్నవి.
   
4.    సోమ బిందువులారా! మీరు మరింత అన్నమును, గోవులను, అశ్వములను, పుత్రులను ప్రసాదించండి.
   
5.    సూర్యుడు తనకిరణములతో పగళ్ళను నింపినట్లు విశ్వద్రష్ట సోమమా! నీవు నీ యొక్క రసముతో ద్యావాపృథ్వులను నింపుము.
   
6.    సోమమా! మాకు సుఖములు కలిగించు దారాలతో భూలోకమున సకల దిశల నుండి జలము వలె వ్యాపింపుము.
   
                                               రెండవ ఖండము
                                     తొలి తృచ : ఋషి - బృహస్పతి
   

1.    బృహన్మతి సోమమా! నీవు దేవతలకు ప్రియతమవు. 'దేవతలెచ్చట?' అని అడుగుచు ధారలుగా త్వరత్వరగా రా రమ్ము.
   
2.    సంస్కార రహిత స్థానములను సంస్కరించుచు జనులకు అన్నము కలిగించుటకు ఆకాశము నుండి వర్షము కలిగించుము.
   
3.    ద్యులోకము మీద మందగామి యగుచు దశాపవిత్రము నుండి సాగి జల తరంగము లందు సోమము క్షరితమగును.
   
4.    సోమము అభిషుత మగును. దీప్తమగును. సర్వద్రష్టయగును. దేవతలను ప్రకాశింప చేయును. బలోపేతమయి త్వరత్వరగా దశా పవిత్రమును చేరును.
   
5.    అభిషుత సోమము తన రసమును దూరపు, దగ్గరి దేవతలను సేవించును. ఇంద్రునాకు మధుమంతమై అందును.
   
6.    ఇంద్రుని పానము కొరకు హరితవర్ణ సోమము రాళ్ళతో నలిపి తీయబడును. స్తోతలు ఒకచో కూడి సోమమును స్తుతింతురు.
   
                                      రెండవ తృచ : ఋషి - జమదగ్ని.
   
1.    పనులు చేయుటకు పరస్పరము కలిసి యుండు అంగుళులు సోమమును అభిషవించుచు బలశాలి, స్వామి, పూజనీయ సోమమును పాత్రలకు పంపును.
   
2.    సోమమా! నీవు పరిపూర్ణ తేజస్కవు. దీప్యమానవు. పరిశుద్దవు. దేవతల కొరకు సంస్కరింపబడుదానవు. మాకు సకల దానములను ప్రసాదించుము - "విశ్వావసూన్యా విశ"
   
3.    పవమానమా! దేవతలను సేవించుటకు స్తుతుల వర్షము కలిగింపుము. మాకు అన్నము కలిగించుటకు వర్షము కలిగింపుము.
   
                                               మూడవ ఖండము   
                                     మొదటి తృచ : ఋషి - శతంభరుడు

   
1.    అగ్ని జనరక్షకుడు. అప్రమత్తుడు. మంచి బలశాలి. అతడు లోకములకు కొత్త కొత్త శుభములు కలిగించుటకు వెలువడినాడు.
   
    ఘ్రుతప్రతీకుడు. మహానుడు, ద్యులోకము నంటు తేజోవంతుడగు శుద్ద అగ్ని ఋత్విజుల కొరకు దీప్తివంతుడై ప్రకాశించుచున్నాడు.
   
2.    అగ్ని గుహలందుండెను చెట్టు చెట్టున ఉండెను. అంగిర ఋషి అట్టి అగ్నిని సాధించినాడు. బలముగా మథించిన అగ్ని ఆవిర్భవించునట్లు చేసినాడు.
   
    అంగిరులచే ప్రకటించ బడిన అగ్నీ! అందుకే నిన్ను బలపుత్రుడు అనుచున్నారు - 'త్వమాహుః సహాసస్సుతరవఙ్గరః'
   
3.    అగ్ని ఋత్విజుడు. యజ్ఞకేతనుడు. పురోహితుడు. దేవతలతో సమానమగు రథము కలవాడు. అతడు తొలుత మూడు స్థానములందు ప్రజ్వలితుడగును. తదుపరి సుక్రతువు, హోతయగు అగ్నిని కుశాసనమున యజ్ఞార్ధము ప్రతిష్టించెదరు.
   
    (మూడు స్థానములు మూడు లోకములు.)
   
                                     రెండవ తృచ : ఋషి - గృత్సమదుడు
   
1.    ఋతవర్దనులగు మిత్రావరుణులారా! మీ కొరకు సోమము అభిషుతమైనది. ఈ యజ్ఞమునాకు మిమ్ము ఆహ్వానించుచున్నాము. ఆలకించండి. "శృతం హవమ్"
   
2.    మిత్రావరుణులారా! మీరు రాజులు. ద్రోహము ఎరుగని వారు. స్థిరులు. శ్రేష్ఠమగు వేయిస్తంభముల సదనమునకు చేరండి.
   
3.    ఆదేశ మాత్రమున పాలించువారు, ఘ్రుతమె అన్నముగా గలవారు. అదితి పుత్రులు, ధనస్వాములగు మిత్రావరుణులు కపటమెరుగని యజమాని సమర్పించు హవిస్సులు అందుకొనుటకు విచ్చేయుదురు.
   
         మూడవ తృచ : ఋషి - రహోగణ గోతముడు.
   
1.    తనకు ఎదురెరుగని ఇంద్రుడు దధీచి అస్తికలతో 810 మంది అసురులను హతమార్చినాడు.
   
    (దధీచి అథర్వణ పుత్రుడు. అతడు భూమి మీద అసురులు లేకుండ చేసినాడు. అతడు స్వర్గమునకు వెళ్ళినంత అసురులు భూమండలమును ఆక్రమించుకున్నారు. ఇంద్రుడు వారితో పోరలేక పోయినాడు. అప్పుడు ఇంద్రుడు దధీచి అవశేషము కొరకు వెదకినాడు. దధీచి యొక్క గుర్రపు తల కురుక్షేత్రము దగ్గరి శరణ్యావతి వద్ద ఉన్నదని మునులు చెప్పినారు. ఇంద్రుడు ఆ శిరస్సు అస్తికలతో అసురులను హతమార్చినాడను వృత్తాంతము శాఠ్యాయమున చెప్పబడినది.
   
    అశ్వినులు దథీచిని మధువిద్య ఉపదేశించుమని ఆశ్రయించినారు. దధీచి అందుకు అంగీకరించినాడు. అశ్వినులకు మధువిద్య తెలియుట ఇంద్రునకు ఇష్టము లేదు. అతడు దధీచిని తల నరుకుదునని బెదిరించినాడు. అశ్వినులు అది గ్రహించి దధీచి తలతీసి అతనికి గుర్రపు తల తగిలించినారు. ఆ గుర్రపు తలతోనే దధీచి అశ్వినులకు బ్రహ్మవిద్య ఉపదేశించినాడు. ఇంద్రుడు దధీచి గుర్రపు తలను నరికినాడు. అశ్వినులు దధీచి అసలు తలను తగిలించినారు. ఇది దధీచి గుర్రపు తలను గురించిన భాగవత కథ.
   
    వృత్రుని వధించుటకు దధీచి శరీరమును యాచించి, దానితో ఆయుధము చేసిన తాను అట్టి ఆయుధమున ప్రవేశింతుననియు దానితో వృత్రుడు చచ్చుననియు శ్రీమన్నారాయణుడు దేవతలకు ఉపదేశించినాడు. దేవతలు దధీచి దగ్గరికి వెళ్ళి అతని దేహమును యాచించినారు.
   
    "దేవతలారా! ఈ శరీరము నశించునది. ప్రాణికోటి యెడల దయచూసి ధర్మము, కీర్తి ఆర్జించని వాడు రాతిగుండె వాడనుటలో సందియము లేదు. ప్రాణుల దుఃఖమును చూచి దుఃఖించుట సుఖమును చూచి సుఖించుటయే అక్షయ ధర్మమగును. ప్రపంచమున ధనము, పుత్రులు, జ్ఞాతులు, శరీరము ఏవియు పనికి వచ్చునవి కావు. ఈ శరీరము చివరకు కుక్కలపాలో, నక్కలపాలో యగును. అట్టి శరీరము పరోపకారము కొరకు ఉపయోగపడిన అంతకు మించి కావలసినదేమి?" అని నిశ్చితాత్ముండై దధీచి తత్త్యావ లోకనంబుచేత నిరసిత బంధనుండై బుద్దీంద్రియ మానసంబులతో గూడిన క్షేత్రజ్ఞుని పరబ్రహ్మ స్వరూపంబైన భగవంతునందు నేకీ భూతంబు చేసి యోగజ్ఞానంబున శరీరంబు విడిచి, దధీచి ఎన్నడు ఎవడును చేయనట్టి దానము చేసినాడని భాగవత కథ. ఈ వచనము నేను రచించిన శ్రీమద్భాగవతమునందలిది.)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.