Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


                       

                                 నాలుగవ సూక్తము - 4
   
వినియోగము :-

   
    పురుషుని వీర్య సంపన్నుని చేయుటకు ఈ సూక్తముచే 'కైథకీ' వేరును త్రవ్వి పాలలో ముంచి ఎక్కుపెట్టిన         బాణమును వడిలో పెట్టుకొని త్రాగవలెను. అట్లే రోకటి మీద కూర్చొని త్రాగునది.
   
1.    వరుణునాకు వీర్యనష్టము కలిగినపుడు తిరిగి అతనిని వీర్యవంతుని చేయుటకు గాను గంధర్వులు దేనిని త్రవ్వి తీసినారో అట్టి ఓషధివగు నిన్ను మేము త్రవ్వి తీయుచున్నాము. మాకు వీర్యము కలిగించుము.
   
2.    సూర్యపత్ని ఉష సూర్యుడు మమ్ము ఉత్క్సుష్ట వీర్య సంపన్నులను చేయును గాక. నా ఈ మంత్ర వాక్కు వీర్య సంపన్నమగును గాక. లోకములకు వర్షము కలిగించు ప్రజాపతి మమ్ము వీర్య సంపన్నులను చేయును గాక.
   
3.    వీర్యము కోరువాడా! నీ పుత్ర పౌత్రులను రక్షించుటకు నీ మగటిమి పాము పాడగా వంటి దగును గాక. ఈ ఓషధి నిన్ను పరమ వీర్యుని చేయును గాక.
   
4.    వీర్యము నిచ్చు ఓషధులందు ఇది తలమానికమై ఉన్నది. ఉత్పత్తి చేయగల ఆబోతు వీర్యమున కన్నా సారవంతమైనది.
   
    ఇంద్రదేవా! పోషక ఓషధులందున్న వీర్యము నంతటిని ఇతని శరీరమున చేర్చుము. నీవు ధరించుము.
   
5.    ఓషధీ! నీవు జలమంధనమున తొలుత పుట్టినావు. వనస్పతులందు శ్రేష్ఠమవు. అమృతమయ సోమమునకు సోదరివి. అంగిరాధి ఋషుల మంత్ర ప్రభావమున వీర్యప్రదవై పుట్టిన దానవు.
   
6.    అగ్నిదేవా! ఇతడు వీర్యము కోరుచున్నాడు. ఇతనికి వీర్యము ప్రసాదించి ఎక్కుపెట్టిన ధనుస్సును చేయుము. సూర్యదేవా! దేవీ సరస్వతీ! బ్రాహ్మణస్పతీ! ఇతనికి వీర్యము ప్రసాదించి ఎక్కుపెట్టిన ధనుస్సు వంటి వానిని చేయుము.
   
7.    వీర్యాభిలాషీ! నా మంత్ర ప్రభావమున ఈ వీర్యమును ఎక్కుపెట్టిన బాణము వలె చేయుచున్నాను. ఆబోతు వలె ఆడుచు, పాడుచు వీర్యవంతుడవై నీ భార్యను కూడుము.
   
8.    ఓషధీ! గుర్రము, కంచర గాడిద, మేక, పొట్టేలు, ఆబోతులందున్న వీర్యమును ఈ పురుషుని యందు ప్రవేశపెట్టుము. అతని అధీనము చేయుము.
   
                                              ఐదవ సూక్తము - 5
   
వినియోగము :-
   

    స్త్రీ వద్దకు పోవునపుడు ఆమెను, ఆమె పరిజనులను నిద్రింప చేయుటకు ఈ సూక్తముచే జలపూర్ణ పాత్రను         సంపాతన, అభిమంత్రణలు చేసి ఆ నీటిని పడక గదిలో చల్లునది. మిగిలిన వానిని లోపలి ద్వారమునకు         చేర్చవలెను. దిగంబరుడై దీనిచే రాలును అభిమంత్రించునది. ఇంటి ఉత్తర హద్దు, స్త్రీ యొక్క మంచపు         కుడికాళ్ళను, త్రాతిని అభిమంత్రించునది.
   
1.    సూర్యుడు వేల కిరణముల వాడు. వర్షము కలిగించువాడు. కోరికలు తీర్చువాడు. ఆకసమున అవతరించినాడు. అతడు శత్రుదమనుడు. అతని ప్రభావమున ఇచటి జనులను నిద్రావశులను చేయుచున్నాము.
   
2.    భూమి మీద గాలి అతిగా వీచకుండును గాక. ఈ ప్రదేశమును అన్యులు చూడకుందురు గాక. స్త్రీలందరు నిద్రింతురు గాక. ఇంద్రసఖుడగు వాయుదేవత కుక్కలను కూడ నిద్రింప చేయును గాక.
   
    (ఇవి నిద్రా భంగము కలుగకుండు ఏర్పాట్లు - గాలి దుమారము, ఇతరులు లేపుట, కుక్కలు మొరుగుట ఇవి జరుగ రాదని.)
   
3.    మంచముల మీద పడుకున్న మదవతులను, అంగణమున శయనించిన అతివలను, పల్లకులు మోయు ప్రమదలను, పుణ్యగంధ పూబోడులను నిద్రింప చేయుచున్నాము.
   
4.    జంగమములను నిద్రింప చేసినాను. వారి కన్నులను, ప్రాణములను వశపరచుకున్నాను. వీరి సర్వావయములను అర్దరాత్రి వశపరచుకున్నాను.
   
    (ఇది శస్త్ర చికిత్సకు ముందు ప్రస్తుతము ఇచ్చుచున్న మత్తు మందు - ఎనస్తేసియా వంటిదేమో! ANAESTHESIA.)
   
5.    నిలిచిన వారిని, సంచరించు వారిని, కూర్చున్న వారిని, చూచుచున్న వారిని, ఇతరులను చూడలేని హర్మ్యమువలె చూడకుండ చేయుచున్నాను.
   
6.    తల్లి నిద్రించును గాక. తండ్రి నిద్రించును గాక. కుక్క నిద్రించును గాక. గృహయజమాని నిద్రించును గాక. జ్ఞాతులు నిద్రించును గాక. ఇంటిని కాపలా కాయువారు నిద్రింతురు గాక.
   
    (వశపరచు కొనదలచిన స్త్రీ సంబంధీకులు.)
   
7.    స్వప్నాధి దేవతా! పడకల మీద ఉన్న వారలనందరను సూర్యోదయము వరకు నిద్రలో ముంచుము. అప్పుడు నేను సుఖముగ, ఆనందముగ ఇంద్రుని వలె తెల్లవారు వరకు భోగింతును గాక.
   
                                        రెండవ అనువాకము
                                        మొదటి సూక్తము - 6
   

వినియోగము :-
   

    1, 2 సూక్తములందు 'కంద' విష చికిత్స చెప్పబడినది.
   
    ఈ సూక్తములచే నీటిని అభిమంత్రించి విషద్రష్టునకు త్రాగించునది. అతని మీద చల్లునది. పోక చెట్టు ముక్కను నీటిలో వేసి, అభిమంత్రించి త్రాగించునది. చల్లునది. పాత జింక చర్మమును కాల్చి దానితో  కాగిన నీటిని విషలిప్తుని మీద చల్లునది. కుండెడు నీటిని సంపాతన, అభిమంత్రణ చేసి స్నానము  చేయించవలెను. విషలిప్త ఊర్ధ్వ ఫలములచే సక్తు మంథమును మథించి, అభిమంత్రించి త్రాగించవలెను.  'మదన' ఫలములను అభిమంత్రించి తినిపించునది. ఘ్రుతము, పసుపును అభిమంత్రించి తినిపించునది.
   
1.    తక్షకుడు సర్పజాతికి బ్రాహ్మనుడై పది పడగలు, పది ముఖములతో తొలుత పుట్టినాడు. అతడు తొలుత సోమపానము చేసినాడు. కందమూలములను విషరహితములను చేసినాడు.
   
2.    ద్యావాపృథ్వులు వ్యాపించినంత వరకు, సప్త సముద్రములు వ్యాపించినంత వరకు గల కంద మూలముల విషమును తొలగించుటకు మంత్రములను తాలువులు మున్నగు వానిచే ఉచ్కరించుచున్నాము.
   
3.    విషమా! మంచి రెక్కలు గల గరుత్మంతుడు తొలుత నిన్ను పీల్చివేసినాడు. అట్లు నిర్వీర్యవైన నీవు ఈ వ్యక్తి తెలివి తప్పించకుము. నీవు దూరిన ఈ వ్యక్తి యందలి విషము అన్నము వలె జీర్ణమగును గాక.
   
4.    విషమా! నీ చేత బాణమును ఎక్కుపెట్టి విషమును ఇతని దేహమున కొట్టినావు. నేను నీ చేతిని, ఆ వింటిని పొక చెట్టు ముక్కతోను, మంత్రముతోను నిర్వీర్యము చేయుచున్నాను.
   
   
5.    బాణపు విషమును తొలగించుచున్నాను. లేప్యములందు, విషపత్రములందు, వృక్షము లందు, వంగిన శ్రుంగములందున్న విషములను నిర్మూలించుచున్నాను.
   
6.    బాణమా! విషమున మునిగిన నీవు నిర్వీర్య వగుము. నీ విషము నిర్వీర్యమగును గాక. సారహీన వృక్షపు నీ ధనుస్సు పూర్తిగా నిర్వీర్యమగును గాక.
   
7.    రంగరించిన విషమును, లేపన విషమును, దూరము నుండి విసరు విషమును, అన్నము నీటిలో కలిపిన విషమును నిరర్ధకము చేయుచున్నాను. విషము పుట్టించు పర్వతములనే నిర్వీర్యము చేయుచున్నాను.
   
8.    విషము కొరకు కందమూలములను త్రవ్వువాడు నిర్వీర్యుడగును గాక. విషము నిర్వీర్యమగును గాక. విషము గల కందమూలముల పర్వతములు నిర్వీర్యములు అగును గాక.
   
                                                రెండవ సూక్తము - 7
   
1.    వారణావతి యందలి విషము విరుచు జలమిది. ఇది విషమును హరించును గాక. ఈ జలము అమృత తుల్యము. అది విషమును విరుచును గాక.
   
2.    తూర్పునందలి విషము నీరసించును గాక. ఉత్తర దిక్కు విషము నీరసించును గాక. భూమి మీది విషము నీరసించును గాక. సకల దిశలందలి విషము నీరసించును గాక.
   
3.    విషమా! మోసగించి తినిపించినది, జీర్ణశక్తి పెంపునకని తిన్నది, బాధలు కలిగించునది ఆకలికి తాళలేక తిన్నవారలను మూర్చిల్ల చేయకుము.
   
4.    మూర్చ కలిగించు ఔషధమా! నీవు దేహమున చేర్చిన విషమును - బాణముతో వలె బయటికి లాగుచున్నాను. గుప్తచరుల వలె చాటుగా అవయవములందు వ్యాపించిన నిన్ను మంత్ర ప్రభావమున బయటికి గెంటుచున్నాము.
   
5.    జనసమూహము వలె కూడిన విషమును మా వాక్ ప్రభావమున తొలగించుచున్నాము. త్రవ్వగా లభించునట్టి కందమూలమా! నీవు నీ చోటనే నిలువుము. వ్యాపించకుము. వ్యక్తులను మోహింప చేయకుము.
   
6.    విషపువేరా! పావనము చేయు సమ్మార్జన తృణము నిచ్చి మహర్షులు నిన్ను ఖరీదు చేసినారు. దుష్ట మృగముల చర్మములకు నీవు అమ్ముడు పోయినావు. అమ్ముడు పోయిన నీవు వెళ్ళి పొమ్ము. ఇచట నిలువకుము. వ్యక్తులను మోహింప చేయకుము.
   
7.    మానవులారా! మీకు వ్యతిరేకులైన శత్రువులు చేసిన యోగాదులు ఈ దేశమున మీ పుత్ర, పౌత్రులను దెబ్బ తీయకుండును గాక. ఈ చికిత్సను రక్షించు కొమ్మని మీ ముందు ఉంచుచున్నాను.
   
                                            మూడవ సూక్తము - 8
   
వినియోగము :-

   
    రాజ్యాభిషేకమున శాంత్యుదక కలశమును మరియు పూర్ణ కుంభమును ఈ సూక్త జపము చేయుచు అభిషేకము చేయవలెను. సంపాతిత స్థాలీపాక ప్రాశనము చేయించవలెను. అభిమంత్రిత అశ్వముపై అపరాజిత దిశవైపు నడిపించునది. రాజసూయమున ఆసనముపై కూర్చుండునపుడు - రాజ్యాభిషేకమున ఈ సూక్తము చదువునది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.