Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
రెండవ తృచ : ఋషి - మేధాతిథి.
1. వృత్రహంతా! మేము అభిషవ జలముల వలె వినమ్రులై నిన్ను సేవింతుము. సోమము క్షరించును. స్తోతలు కుశాసనములపై ఆసీనులగుదురు. నిన్ను భక్తితో ఉపాసింతురు.
2. వ్యాపక ఇంద్రా! అభిషుత సోమము వెడలినది. స్తోతలు బిగ్గరగా నిన్ను స్తుతించుచున్నారు. నీవు సోమతృష్ణ గలవాడవై, చక్కని నడకల సవ్వడితో ఎప్పుడు ఇచటికి విచ్చేతువు?
3. బెదిరించు ఇంద్రా! ప్రావీణ్యము గల స్తోతలకు వేలకొలది అన్నములు, బలములు, ధనములు ప్రసాదించుచున్నావు.
ధనవంత, విశేష ద్రష్ట ఇంద్రా! బంగరు రంగు గోవుల సహితముగా - మాకు త్వరగా ధనము నిమ్మని ప్రార్దించుచున్నాము.
మూడవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. యుద్దమందు దబ్బునదూరి తన తెలివిని ఉపయోగించు వాడు అన్నమును సాధించుచున్నాడు.
యజమానులారా! మీ కొరకు నేను స్తుతించుచున్నాను. వడ్రంగి కర్రను వశపరచుకున్నట్లు నేను ఇంద్రుని అభిముఖుని చేయుచున్నాను.
2. ధనదాత అనుచిత స్తుతులచే స్తుతించబడడు. ధనదాతను స్తుతించని వానికి ధనము లభించదు.
ధనిక ఇంద్రా! అభిషవము నాడు నేను నిన్ను స్తుతించుచున్నాను. దానయోగ్య ధనమును నాకు ప్రసాదించుము. స్తుతించు వారికే కదా నీవు ధనము నొసంగుచున్నావు!
అయిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - త్రితుడు లేక ఆప్త్యుడు.
1. త్రిసోవాచః - మూడు వాక్కులు ఉచ్చరించ బడుచున్నవి. పాడియావులు అంబారావములు చేయుచున్నవి. హరిత వర్ణసోమము నినదించుచున్నది. ద్రోణకలశమున చేరుచున్నది.
2. మంత్రములు ఋతమునకు తల్లులు. అవి దివియందు సోమమును శిశువును వలె మార్జించుచున్నవి. ప్రశంసించుచున్నవి.
3. సోమమా! చతుస్సముద్రముల వేల కొలది ధనమును మాకు తెచ్చి ఇమ్ము. "ఆపవస్వ సహస్రిణః"
రెండవ తృచ : ఋషి - యయాతి.
1. మధుమత్తమములు, మాదకములగు సోమములు పవిత్రములై ఇంద్రుని కొరకు క్షరించుచున్నవి. సోమములారా! మీ మత్తులు దేవతలను చేరును గాత. "దేవన్ గచ్చన్తు వోమదాః"
2. "ఇందురింద్రాయపవత" సోమమా! ఇంద్రుని కొరకు క్షరించుము అని స్తోతలు అనుచున్నారు.
వాచస్పతి - బలవంతము, జగత్పతియగు సోమము స్తుతులు, ఆరాధనలు కోరును.
3. సోమము రసరూపము. స్తుతి ప్రేరకము. ధనపతి. ఇంద్రునకు మిత్రుడు. సోమము దినదినము మిత్రుడగు ఇంద్రుని కొరకు సహస్ర ధారలుగా ప్రవహించును. "సహస్రధారః పవతే".
మూడవ తృచ : ఋషి - పవిత్రుడు.
1. "బ్రహ్మణస్పతే" మంత్రములకు ప్రభువా! సోమమా! నీ పావక గుణము సర్వత్ర వ్యాపించి ఉన్నది. ప్రభూ! నీవు దేహము నందలి సకల అవయవములకు వ్యాపింతువు. విశ్వవ్యాప్తమగు నీవు తనువునకు తాపము కలిగించక, పరిపక్వము కాకున్న వ్యాపింపజాలవు. పరిపక్వమైనంత యజ్ఞమును వహించుచు దశా పవిత్రమున వ్యాపించుచున్నావు.
2. తాపక సోమపు పావక గుణము ద్యులోకము పైన వ్యాపించి ఉన్నది. ఈ సోమపు కిరణకాంతులు స్థిరములై ఉన్నవి. ఈ సోమపు వడిగల రసము అభిషవకారుని రక్షించును. సోమములు తమ తేజస్సున ద్యులోకమును అధిరోహించుచున్నవి. "దివః పృష్ఠ మధిరోహంతి తేజసా"
3. ఉషస్సు గల సూర్యుడు ప్రధానముగా ప్రకాశింప చేయుచున్నాడు. అతడు వర్షము కలిగించుచున్నాడు. సకల భువనములకు అతడే జలములను ఇచ్చుచున్నాడు. అతడు సకల లోకములకు అన్నము అందించుచున్నాడు.
సృష్టించగల దేవతలు సోమ శక్తితోనే జగములను సృష్టించుచున్నారు.
మానవ ద్రష్టలగు పిత్రుదేవతలు కాంతిని గర్భమున దాల్చుచున్నారు.
ఆరవ ఖండము
మొదటి తృచ : ఋషి - సౌభరి.
1. అగ్ని పరమదాత. యజ్ఞవంతుడు. మహా తేజోవంతుడు. కూర్చుండి స్తుతించు స్తోతలారా! అట్టి అగ్నిని కీర్తించండి. ప్రగాయత.
2. ధనవంతుడు, అన్నవంతుడు, ప్రజ్వలితుడు, ఆహుతుడు అగు అగ్ని యజమానులకు పుత్రులను, యశస్సును కలిగించుచున్నాడు. ఈ అగ్ని మనవాడు కావలెను. అనుగ్రహించవలెను. అన్నములు అందుకొని మాటిమాటికి మా వద్దకు రావలెను. "వాజేభిరాగమత్"
రెండవ తృచ : ఋషి - గోయుక్తుడు.
1. వజ్రధారి ఇంద్రా! నీవు వరదుడవు. యుద్దములందు శత్రు తిరస్కర్తవు. లోకకర్తవు. హర్యశ్వవంతుడవు. సోమపానము చేసిన నిన్ను ప్రశంసించుచున్నాము.
2. ఇంద్రదేవా! నీవు నీ శక్తితో ఆయుష్మంతుడగు మనువు కొరకు సూర్యాది జ్యోతులను ప్రకాశింపచేసినావు. సోమపు మత్తున ప్రసన్నుడవు అయినావు. ఈ మహా యజ్ఞమున విరాజిల్లినావు.
3. నీ బలము ప్రసిద్దము. నిన్ను పూర్వము స్తుతించిన వారు నేడు కూడ నిన్ను స్తుతించుచున్నారు. ఇంద్రా! నీవు నిత్యము మేఘములను నీ అదీనమున ఉంచుకొనుము.
మూడవ తృచ : ఋషి - తిరశ్చి.
1. నేను తిరశ్చిని. హవిని అర్పించువాడను. ఆరాధించు వాడను. ఇంద్రా! నా ఆహ్వానము వినుము - 'శ్రుధీహవం' విన్నవాడవై నాకు పుత్రులను, గోవులను, ధనమును ప్రసాదించుము. నీవు మహా మహుడవు కదా! "మహాం అసి"
2. "ఇంద్రా! నవీనము, ఆనందదాయక మగు స్తుతిని నీ కొరకు రచించిన వానికి సనాతనము, సత్యవర్ధనము, అతీంద్రియ దృష్టిగల జ్ఞానమును ప్రసాదించుము.
3. ఆ ఇంద్రుని మేము స్తుతించుచున్నాము. మా స్తుతులు, ఉక్ష్దలు ఇంద్రుని వర్ధిల్ల చేయుచున్నవి. ఇంద్రుని యొక్క బహు పరాక్రమములను ప్రశంసించుచున్నాము. ఆరాధించుచున్నాము.
దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన
సామవేద సంహిత ఉత్తరార్చిక యందలి
నాలుగవఅధ్యాయము సమాప్తము.





