Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam


 


    ఆ భూత కల్పన కూడా అనిపించవచ్చు. కాని, ఇది వాస్తవ సత్యం. తెలుగుకు బానిసత్వం లేని విజయవాడను చూస్తే విముక్తదేశంలో - స్వేచ్ఛా ప్రదేశంగా అనిపించేది. కడుపు నిండా తెలుగు పత్రికలు చదివి - కంటి నిండా తెలుగు చూచి - మనసు నిండా తెలుగు నింపుకొని - కొవ్వవి నవలలు ఓ పది కొనుక్కుని ఖమ్మం చేరేవాణ్ణి.

 

    ఇది మూడో తరగతిలో ఉన్నప్పటి మాట కాదు. ఆ తరువాత కాలపు విషయం -

 

    సర్కారీ మదర్సలో చేరడం నాకు కొంత బాగనిపించింది. రికాముగా ఉన్నవాడికి ఒక క్రమజీవితం ఏర్పడింది.

 

    నేను చేరింది ఖస్బా బజార్ తహతాన్యా పేరుకే ఖస్బా బజారు. ఆ స్కూలు నయాబజార్ కొత్త బజారులో ఉండేది. హనుమదాలయం ఉన్న కలువ దగ్గర. అది తరువాత కాలంలో నయాబజార్ తహతాన్య అయింది.    

 

    1. స్కూలు ఉదయం తొమ్మిది నుంచి సాయంకాలం నాలుగు వరకు ఉండేది. మూడు పీరియడ్లు. డ్రిల్లు - డ్రాయింగు - దస్త్ కారీ (చేతిపనులు) తరగతులు ఉండేవి. అయిన తరువాత ఒక్కొక్క బృందానికి ఒక్కొక్క మండి కేటాయించేవారు. అవి ఆకుకూరలు - కూరగాయలు మళ్లు. నీళ్లు పోయడం పెంచడం ఆ బృందాల బాధ్యత. కూరగాయలు సాధారణంగా ముద్రిసులు ఉంటే టీచర్లు తీసికెళ్లేవారు.

 

    2. "దీన్యాత్" అంటే మత విద్య - ఖురాన్ పీరియడ్ ఒకటి ఉండేది. ముస్లిం విద్యార్థులు తప్పని సరిగా చదవాలి. ఇతరులకు ఐచ్ఛికం. వారికి అఖ్లాబియాత్, అంటే నీతివాచకం ఉండేది. అదీ ఉర్దూలోనే.

 

    3. ముస్లిముల నమాజు దినం అయిన శుక్రవారం వారాంతపు శలవు. ప్రధాన శలవు "హుజూర్ సాల్గిరా" అంటే ప్రభువు వారి జన్మదినం. ఆ రోజు పిల్లలందరూ ఊరేగింపుగా నరసింహస్వామి గుట్ట దగ్గరి ఖేల్ మైదాన్ , అంటే ప్లే గ్రౌండుకు చేరుకుంటారు. అన్ని మదర్సల తుల్బా, అంటే అన్ని స్కూళ్ల విద్యార్థులు చేర్తారు. ఆటలు పోటీలు జరుగుతాయి. ఒకే ఒక మార్వాడీ దుకాణం నుంచి తెప్పించిన నేతి మిఠాయీలు అందరికి ఇచ్చేవారు. అవి ఘుమ ఘుమ లాడేవి. అయితే మేము తినేవాళ్ళం కాదు. తినగూడదని మా నాయన శాసనం. శాసనం అని కాదు. మాకు కూడా నమ్మకమేమో! ఇతరులకు ఇచ్చేవాళ్లం.

 

    ఆ రోజుల్లో ఖమ్మంలో ఒకే ఒక మిఠాయి దుకాణం ఉండేది. ఖస్బా బజారులో అది మార్వాడీలది. దుకాణం ముందు పంజరంలో చిలక గ్రాహకులకు స్వాగతం చెప్పేది. యజమానురాలు గోమతీబాయి విధవరాలు. మా నాయన శిష్యురాలు. గంపలో జిలేబీలు పంపించేది. మేం తినేవాళ్లం కాదు. పంచిపెట్టేవాళ్లం.

 

    ఉర్దూ భాషలో సౌలభ్యం - అర్థం - అందం ఉన్నాయి. సాల్గిరా - జన్మదినం ఒక మంచి పదం. సాల్ అంటే సంవత్సరం, గిరాహ్ అంటే ఊడిపడింది.

 

    రాలిన సంవత్సరం అని అర్థం. సార్థక పదం కదా! ఎంత వాస్తవం! నాకు తెలిసిన భాషల్లో ఇలాంటి అర్థం జన్మదినానికి లేదు.

 

    మొహర్రం - పీర్ల పండుగకు 15రోజులు సెలవులు.

 

    రమ్జాన్ ఏ కాలంలో వచ్చినా ఉదయపు బడి మాత్రమే. అంటే, ఒంటి పూట బడి.

 

    రమ్జాన్ నెల ఏకాలంలో వస్తుందో స్థిరత్వం లేదు. ముస్లిములకు, ఆంధ్రులకు చాంద్రమాసమే కాలపు కొలత. "గోవధ చేయు తురకలకు దైవంబవ" అంటాడు అల్లసాని పెద్దన, చంద్రదూహణలో. చంద్రుని గతి ప్రకారం నెలకు సుమారు 27 రోజులవుతాయి - నక్షత్రాలు 27 కాబట్టి. ఆంధ్రులు అయిదు సంవత్సరాలకు రెండు చొప్పున అధిక మాసాలు లెక్కిస్తారు. ఆ ప్రకారం సూర్య సంవత్సరం 3651\4 రోజులను కలుపుతారు. అందువల్ల రుతువులు సరిగ్గా వస్తాయి. ముస్లిములకు అధికమాసం లేదు. కాబట్టి సౌర సంవత్సరానికి కలవదు. అందువల్ల రమ్జాన్ ఒకసారి వేసవిలో వస్తుంది. వర్షంలో వస్తుంది. చలిలో వస్తుంది.

 

    వేసవి సెలవులు నెలా పదిహేను రోజులు. లేక , నెలలో స్కూళ్ళు మూస్తారు. 'అమర్దాద్'లో తెరుస్తారు. నిజాం కేలండర్ ఇంగ్లీషు నెలలు జనవరి ఫిబ్రవరితో సాగదు. తురక నెలలు అజూర్ -దై - బహమన్ తో సాగుతాయి. సంవత్సరాల లెక్క క్రీస్తు శకం ప్రకారం కాదు - హిజ్రీ ప్రకారం ఉంటుంది. రెంటికీ సుమారు 500 సంవత్సరాల తేడా ఉంటుంది.

 

    హిజ్రీ అంటే మహమ్మద్ ప్రవక్త మక్కా వదలి మదీనా వెళ్లడం.

 

    నాజిర్ సాహెబ్ ము అయినా - డిప్యూటీ ఇన్ స్పెక్టరు ఇనస్పెక్షనంటే ఎక్కడ లేని హడావుడి. స్కూలును అలంకరించేవారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు మంచి దుస్తుల్లో వచ్చేవారు. నాజిర్ వచ్చిపోయేదాకా ముద్రిసల ప్రాణాలు బిక్కుబిక్కుమంటుండేవి.

 

    ముద్రిస్ లలో ముస్లిములే ఎక్కువ. చుడీదార్ పైజామా, షేర్వానీ, కుచ్చుటోపీ ధరించేవారు. హిందువులు ధోవతి, షేర్వానీ, బూరుటోపీ ధరించేవారు. అప్పటికి పిల్లలకు దుస్తుల నియమాలు లేవు. నేను అందరి మధ్య పరాచికాలవాడివలె ఉండేవాణ్ణి. ఒక చడ్డీ అంటే, నిక్కరు - ఒక కమీజు, అంటే షర్టు వేసుకునేవాణ్ణి. నాది బోడి గుండు, పిలక. ముఖాన ఊర్ధ్వ పుండ్రాలు! నన్ను అందరూ - ముఖ్యంగా తురక పిల్లలు 'ఏక్ సౌగ్యారా' అంటే నూటపదకొండు అని హేళన చేసేవారు.

 

    అలా అంటే తురక పిల్లలందరూ నన్ను ద్వేషించారని అర్థం కాదు. నాకు ఖాజూ, మహమ్మద్ అనే మంచి మిత్రులు ఉండేవారు.

 

    ఉపాధ్యాయులు చాల శ్రద్ధగా పాఠాలు చెప్పేవారు. విద్యార్థులు కూడా శ్రద్ధగా వినేవారు.

 

    ఉర్దూ మూడవ తరగతి పాఠ్య పుస్తకంలో "కమల్ కే ఫూల్" - తామర పూలు అని ఒక పాఠం ఉండేది. ఆ పాఠం షేఖ్ మీరాఁ అనే ముద్రిస్ ఎంత అందంగా బోధించాడంటే - గూడూరులో తామరపూలున్న "ముత్యాలమ్మ కుంట" నా మనసులో మసిలింది. అది నామీద ఎంత ప్రభావం వేసిందంటే, స్కూలు వదలగానే ఇంట్లో చెప్పకుండా కాలినడకన - వంటరిగా - రోడ్డుమీద పడిపోతూనే ఉన్నాను.

 

    చిన్నతనం కదా! గూడూరు దూరం తెలియదు. ఇలా నడిచిపోతే వస్తుందనీ - తామరపూలు చూడవచ్చనీ భ్రమ. వంటరి పిల్లవాణ్ణి మునేరు వంతెన దాటి నడిచిపోతున్నాను. అలా కొంతదూరం నడిచాను. ఒక ఎద్దుల బండ్ల వరస కనిపించింది.

 

    "ఏ ఊరుపోతవు?" ఒక బండివాడు అడిగాడు.

 

    "గూడూరు - చిన్నగూడురు" చెప్పాను.

 

    "అది ఇక్కడేడున్నది? ఇది తల్లంపాడు తోవ."

 

 

    "నన్ను తీసుకపోతరా?" అడిగాను.

 

    నన్ను బండెక్కించుకున్నారు. తల్లిపాడు చేర్చారు. శ్రీ వైష్ణవులకు అప్పగించారు. వారు మా బంధువులని నాకు తెలియదు. ఆ రాత్రి భోజనం పెట్టారు. పడుకోబెట్టారు. తెల్లవారి సైకిలు మీద తీసికెళ్తుంటే  మురిసిపోయాను. మా ఇంటికి చేర్తే మా నాయన అగ్గిమీద గుగ్గిలంగా ఉన్నారు. నన్ను చూడడమే లాక్కుపోయి విపరీతంగా కొట్టారు. నేను మొత్తుకుంటున్నాను. ఇంటి ముందు జనం కూడారు. మా అమ్మ సహితంగా సాక్షులయి నుంచున్నారు. ఒక్కడూ మా నాయనకు అడ్డుతగిలే ధైర్యం చేయలేదు. అలసిపోయి వారే వదిలేశారు.

 

    మా నాయన వదిలిం తరువాత మా అమ్మ నన్ను పట్టుకొని ఏడ్చింది. స్నానం పోసి అన్నం కలిపి ముద్దలు చేతిలో పెడ్తూ "ఎందుకుపోయినవురా?" అని అడిగింది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.