Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    చూడమ్మ అమ్మమ్మ విన్నది. "ఎవతో నిన్ను తీసుకు లేచిపోతుందిలే" అని గల గల నవ్వి పాన్ తిన్నది.

 

    నాకు ఏమీ అర్థం కాలేదు. ఇంటికి చేరుకున్నాను. పాపం, పంతులుగారు అంత దుఃఖంలో ఉన్నారు. నాయన కెందుకు వారిమీద కోపం?

 

    మనిషిని ఆదుకోలేని పాండిత్యం పనికిరాదు అనిపించింది. ఇవ్వాళ చెబుతున్నంత స్పష్టంగా కాకపోవచ్చు. కాని నా చిన్న మనసులో అలాంటి భావమే కలిగింది.

 

    తెల్లవారి ఇంట్లో దెబ్బలు కొడ్తారని తెలిసీ పంతులుగారింటికి వెళ్లాను. తాళం వేసి ఉంది. ఎందుకో ఎంతో బాధ అనిపించింది. పంతులుగారు వెళ్లిపోయారు. వసారాలలో కాసేపు కూలబడ్డాను. లేచి గుంటి మల్లన్న మర్రికిందికి వెళ్లాను. గుడిలో చూచాను. సత్రంలో చూచాను. కనిపించలేదు. బడి పిల్లవాడు రాములు కనిపించాడు. అడిగాను. "ముఖం చూపించలేక పారిపోయాడు" అన్నాడు. అట్లా అని వాళ్ళ అమ్మ చెప్పిందట. వాడికి అంతే తెలుసు.

 

    మళ్లీ పంతులుగారు కనిపించలేదు!

 

    1943లో బెంగాల్లో భయంకరం అయిన క్షామం వచ్చింది. 50 లక్షల మంది తిండి దొరక్క మలమల మాడి చచ్చారు. మొత్తం భారతదేశం కదిలింది. కరువు బాధితుల కోసం జోలెలు కట్టుకుని భిక్షాటనకు బయల్దేరిన వాళ్లలో నేనూ ఉన్నాను.

 

    అర్వపల్లివారి సత్రపు అరుగుల మీద జనం మూగి ఉన్నారు. వెళ్లి చూచాను. ఆ శవం ఉమామహేశ్వరరావు పంతులుగారిది! నామీద గుట్టలు కూలాయి. శవం మీద పడి ఏడ్చాను. బెంగాలు కరువు కోసం వసూలయిన డబ్బుతో కొంత దహన సంస్కారానికి ఇమ్మన్నాను. అలా వీలుపడదన్నారు. నా జోలె వారికి ఇచ్చేశాను.

 

    కనిపిస్తున్న శవసంస్కారానికి సాయం చేయలేని వారు బెంగాలు బాధితులను ఆదుకుంటామనడం నాకు విడ్డూరం అనిపించింది.

 

    అక్కడ ఉన్న కొందరితో కలిసి చందాలు వసూలు చేశాం. ఉమామహేశ్వరరావుగారి దహన సంస్కారం మునేరు వడ్డున చేశాం.

 

    ఎక్కడ పుట్టినవాడో ఇక్కడ బూడిద అయినాడు! విధి ఎంత బలీయం అయింది! కాహో2యం దురతిక్రమః అన్నాడు వాల్మీకి కాలాన్ని అతిక్రమించడం అసాధ్యం!

 

    బెంగాలు కరువును గురించి భవానీ భట్టాచార్య ఇంగ్లీషులో రెండు మహత్తరం అయిన నవలలు వ్రాశారు. 'so Many Hungers' అనే నవలను మానేపల్లి తాతాచార్యులవారు తెనిగించారు. అది గోలకొండ పత్రికలో సీరియల్ గా వచ్చింది. ఆ పత్రికవారే పుస్తకంగా ప్రచురించారు.  

 

    భవానీ భట్టాచార్య రెండవ నవల He Who Rides A Tiger. దాన్ని నేను తెనిగించాను. 1960లో వట్టికోట ఆళ్వార్ స్వామిగారు వారి దేశోద్ధారక గ్రంథమాలలో ప్రచురించారు.

 

    మా అన్నయ్య హైస్కూలులో మొదటి ఫారం అంటే 5వ తరగతిలో చేరారు. అప్పటికి అది పెద్ద తరగతే. అన్నయ్య కోసం కొత్త బట్టలూ - కొత్త పుస్తకాల అడావుడీ.

 

    ఉమామహేశ్వరరావుగారి బడి మూతపడటంతో నా చదువు మళ్ళీ సమస్య అయింది. మా తాతయ్య నాకు అమరం ప్రారంభించారు. మా నాయన ఇంట్లో ఉంచుకొని, భోజనం పెట్టి, ద్రావిడ వేదం బోధించే శిష్యులు ఉండేవారు. వారికి తీరిక దొరకదు. కుంటుతూ నా చదువు సాగుతున్నది.

 

    లంకా వెంకట నరసయ్యగారు రికాబ్ బజారు తహతాన్యా సదర్ ముద్రిస్ - అంటే హెడ్ మాష్టరు - మా నాయనకు శిష్యులు. వారు పండితులు. యోగ్యులు. కొత్త విషయాలలో ఆసక్తి కలవారు. "ప్రాథమిక హితచర్య" అనే తెలుగు పుస్తకం రచించారు.

 

    వెంకట నరసయ్యగారి భార్య అప్సరస. ముట్టుకుంటే మాసిపోతుంది అన్నట్టు ఉండేది. ఆమె రోజూ వడ్లపూడి నారింజ రసం తాగేది. నేను వెళ్తే నాకూ తొనలు వలిచి పెట్టేది.

 

    ఒకనాడు వారిని అడిగాను. "నారింజ రసం తాగితే అంతా మీవలె అవుతారా?"

 

    "నేను అంత బాగున్నానా?"

 

    "అవును. సింగరమ్మత్తయ్యకంటే బావున్నారు?"

 

    "వెర్ర్రివెధవ" అని చేతితో నా చెంపను తాకి తన చేతిని ముద్దు పెట్టుకుంది. నారింజ పండు వలిచి పెట్టింది. ఆమె నన్ను దగ్గర కూర్చుండపెట్టుకొని మంచి మంచి కథలు చెప్పేది.

 

    వారికి పిల్లలు లేరు!

 

    లంకా వెంకట నరసయ్య గారు రిటైరు అయింతరువాత మామిళ్ల గూడెంలో మొదట ఇల్లు కట్టారు. అలా చాల ఇళ్లు కట్టి అమ్మారు.

 

    లంకా వెంకట నరసయ్య గారు - ముట్టుపల్లి సర్వయ్య గారు నా చదువును గురించి మా నాయనగారితో మాట్లాడారు. సర్కారీ మదర్సలో చేర్పించవలసిందని నచ్చచెప్పారు. వప్పించారు. కాని, మళ్లీ ఒక సమస్య. ఉర్దూ మొదటి క్లాసు - ఆవృత్ జమా అత్ లో చేర్పిస్తే మూడో తరగతికి మూడేళ్లకుగాని చేరను. సువ్వమ్ జమాలిత్ లో చేరాలంటే త్వరత్వరగా ఉర్దూ నేర్చుకోవాలి. నాకు ఉర్దూ నేర్పే బాధ్యత సర్వయ్యగారు తీసుకున్నారు.

 

    సర్వయ్యగారిని గురించి ఇంతకు ముందు ప్రస్తావించాను. వారి భార్య భద్రమ్మను నేను "అమ్మ" అని పిలిచేవాణ్ణి. సర్వయ్య గారు నాకు అలిఫ్ - బె మొదలుపెట్టారు. చదువు చెప్పేటప్పుడు వారు చాల కరకుగా ఉండేవారు. అర్థం చేసికోవడంలో ఆలస్యం అవుతే పేము బెత్తంతో కొట్టేవారు. సర్వయ్యగారు నన్ను కొట్టినప్పుడల్లా భద్రమ్మగారు తగాదా పడేది. చదువు చెప్పడం చేతకాక కొట్టడం ఏమిటి? అని విరుచుకుపడేది. ఇద్దరూ నాకోసం ఘర్షణ పడేవారు. నాకు ఒక అరటిపండు ఇవ్వడంతో వారు రాజీపడేవారు. వారు అపక్వాహారులు. వారింట్లో ఎప్పుడూ అరటిగెల ఉండేది.

 

    నేను ఉర్దూ బాగానే నేర్చుకుంటున్నానని సర్వయ్యగారు మా నాయనతో చెప్పేవాడు. తమకేమీ పట్టనట్లు - బాధ్యత సాంతం సర్వయ్య గారిదే అన్నట్లు మా నాయన మాట్లాడేవారు. సర్వయ్యగారు అందుకు నొచ్చుకునేవారుకారు.

 

    ఆరునెలల్లో నేను ఉర్దూ రెండవ తరగతి వరకు పూర్తి చేయగలిగాను. తారీఖ్ - చరిత్ర - జగ్రాఫియా - భూగోళం - జియాజియాత్ - లెక్కలు అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాను. అలా అనడంకంటే సర్వయ్యగారు ఎంతో శ్రద్ధగా నేర్పారనడం సమంజసం - సబబు - వాస్తవం.

 

    లంకా వెంకట నరసయ్యగారి పలుకుబడితో నేను నేరుగా సర్కారీ మదర్స్ లో తీస్రీ జమాలిత్ లో మూడవ తరగతిలో చేరాను. ఇది ఒక ఘన కార్యమే. ఎందుకంటే, ఒకటి నుంచి రావాలి తప్ప నేరుగా చేర్చుకోరు.

 

    ఇన్ని తిప్పలు పడితేగాని సర్కారీ బడికి పోవడం సాధ్యపడలేదు. అది సంధియుగం. చాలామంది విషయంలో ఇట్లాగే జరిగింది. అందువల్లనే ఎక్కువ మంది సర్కారీ చదువుకు ముందుకు వచ్చేవారు కారు.

 


                      

 

    విచిత్రం అయిన విషయం ఏమంటే - మా కుటుంబంలో తెలుగుకు ఆదరణ లేదు. సంస్కృతం - ద్రావిడం మాత్రమే భాషలు అనేవారు మా నాయన. తెలుగును ఒక భాషగా వారు అంగీకరించేవారు కాదు. స్కూల్లో తెలుగు విషయం ప్రస్తావించడమే దోషం. అలాంటి స్థితిలో మా అన్నదమ్ములకు తెలుగుమీద ఎనలేని అభిమానం!

 

    మా అమ్మగారు తెలుగులో మంచి విద్వత్తు గలవారు. మా అన్నయ్య - చాటుగా - మా అమ్మగారి దగ్గర తెలుగు పంచకావ్యాలు - అప్పకవీయంవగైరా నేర్చుకున్నారు. మాతృభాషను చాటుమాటుగా నేర్చుకోవలసిన దుర్గతి!

 

    తెలుగు అంటే ఒక తృష్ణ - ఒక పిపాస - ఒక దాహం! తెలుగు బోర్డులు - తెలుగు పత్రిక - తెలుగు దనం చూడడానికి మాత్రమే నేను బెజవాడ వెళ్లేవాణ్ణి అంటే మీకు అత్యంత ఆశ్చర్యం కలుగుతుంది.

 

                

 

    దాశరథి సోదరులు చదివిన ఖమ్మం హైస్కూలు. ప్రస్తుతం డి.ఇ.ఒ. ఆఫీసు




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.