Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    "తామరపూలు చూడటానికి" అన్నాను. అమ్మ ముందు తల బాదుకుంది. తరువాత దగ్గరికి తీసుకుంది.

 

    "మళ్లీ అట్లుపోకు నాయనా!" అన్నది.

 

    తెల్లవారి నాకు జ్వరం వచ్చింది. మా తాతయ్యా నాయనమ్మా నా మంచం దగ్గరినుంచి కదల్లేదు. మా అమ్మ మడికట్టుకొని వంటింట్లో దూరిందంటే బయటికి వెళ్లలేదు.

 

    మా తాతయ్య మూలపడేసిన మందుల సంచీ తీశారు. సానమీద కుప్పె అరగదీశాడు. కైచిప్పలో ఎత్తి తేనె కలిపి నాకించాడు.

 

    సర్వయ్యసార్ వచ్చి చూచారు. ఒక పాఠం. నన్ను అంత కదిలించినందుకు వారు నన్ను మెచ్చుకున్నారు. షేఖ్ మీరాఁ కూడా మెచ్చుకోనడమే కాదు, పొంగి పోయారట. మా నాయన ఇంట్లోకి రానివ్వరని రాలేదట!

 

    నేను స్కూలుకు వెళ్ళినాను. జనాబ్ షేఖ్ మీరాఁ  సాహెబ్ నన్ను ఎంతో మెచ్చుకున్నాడు. జమాఅత్ లో పిల్లలందరికీ నన్ను గురించి మెచ్చుకోలుగా చెప్పారు.

 

    ఇది జరిగింతరువాత నన్ను హేళన చేయడం చాల వరకు తగ్గింది.

 

    అలాంటి ముద్రవేసిన మరొక పాఠం "సుదామాకీ కహానీ" కుచేలుని కథ. కుచేలుడు - శ్రీకృష్ణుడు కలుసుకోవడం - వారి బాల్యాన్ని తోడిపోసుకోవడం అద్భుత కథనం! ఉర్దూలోనే అయినా రచించినవాడు అందులో లీనమై వ్రాశాడు.      

 

    ఆ కథను నాటకంగా ఇతర మిత్రులతో కలిసి గుంటిమల్లన్న సత్రంలో వేశాం.

 

    అలాంటి ప్రభావం వేసినవే నీమ్ కాపేడ్ - వేపచెట్టు, దాల్ కీ ఫర్యాద్ -  పప్పుమొర్ర, బేగరజ్ దోస్తే - నిర్వ్యాజస్నేహం.

 

    ఇవన్నీ మూడు, నాలుగు తరగతుల ఉర్దూ పాఠ్యాంశాల్లోనివి.

 

    1936లో నేను నాలుగవ తరగతిలో ఉన్నాను. నిజాం నవాబు గద్దె ఎక్కి పాతిక సంవత్సరాలు అయినాయి. సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు రాజ్యమంతటా ఘనంగా చేశారు. జూబ్లీహాలు అప్పటి నిర్మాణం. జూబ్లీహిల్స్, జూబ్లీక్లబ్, జూబ్లీబజార్ అన్నీ అప్పటి నామకరణాలే.

 

    నిజాం కిరీటపు చిన్న ప్రతిరూపం చేసి స్కూళ్ల లో అణాకు ఒకటి చొప్పున బడి పిల్లలకు అమ్మారు. ప్రతి విద్యార్థి అది కొనడం తప్పనిసరి చేశారు. మా నాయనను అడుగుతే, తురక కిరీటం ఇంటికి రావడానికి వీల్లేదు అన్నాడు. అణా ఇవ్వలేదు.

 

    అబ్దుల్ అలీం మా క్లాసు టీచరు. వారికి నేనంటే అభిమానం. పరిస్థితి గ్రహించారు. ఒక ఉపాయం చెప్పారు.

 

    ఉర్దూకు వ్రాత అంటే దస్తూరి ప్రాణం. ఉర్దూకు అచ్చుములకులు లేవు. బండమీద చేతితో వ్రాసి అచ్చువేయాలి. అందుకోసం విద్యార్థులతో 'ఖత్తాతి' వ్రాయించేవారు. అచ్చు అక్షరాల మీద ఉల్లిపొర కాగితం వేసి ఉంటుంది. అక్షరాల ప్రకారం నల్లసిరాతో వ్రాయాలి. అది కాస్త శ్రద్ధతో చేయవలసిన పని. పిల్లలందరూ చేయగలిగేవారు కాదు.

 

    అబ్దుల్ అలీం సాహెబ్ నలుగురు పిల్లల ఖత్తాతి పని నాతో చేయించి అణా ఇప్పించారు. ఆ అణాతో కిరీటం కొన్నాను.

 

    అప్పుడు అణా అంటే సామాన్యం కాదు - శేరు జొన్నలు వచ్చేవి.

 

    చెప్పడంలో మరిచిందేమంటే - నిజాం రాజ్యంలో స్కూలు చదువు ఉచితం. ఫీజులు ఉండేవి కావు.

 

    ముద్రిసుల వేతనం గౌరవ ప్రదంగా ఉండేవి. వారి వేతన స్కేలు గుమాస్తా కంటె పది రూపాయలు ఎక్కువగా మొదలయ్యేది.

 

    పాఠశాల - ప్రభువును సంరక్షించమనే ప్రార్ధనతో మొదలయ్యేది. తొలుత "ఇలాహీ తా జహాఁ బాసత్" అనే పార్సీ ప్రార్ధన ఉండేది. తరువాత ఉర్దూకు మార్చారు.

 

    "తాబద్ ఖాలిఖ్ ఆలమ్ యహ్ రియాసత్ రఖే
    తుఘ్ కో ఉస్మాన్ బసద్ -ఎ - ఇజ్లాల్ సలామత్ రఖే
    జైసెతూ ఫక్రెసలాతీఁ హై బాఫజలె యజ్దాఁ
    యూఁ హి ముమ్తాజ్ తేరె దౌరె హుకూమత్ రఖే"  

 

    ఆచంద్రతారార్కం ఈ రాజ్యం ఉండాలి.
    ఉస్మాన్! భగవంతుని అనంతకాంతులు నిన్ను రక్షించాలి.
    నీవు రాజవంశాలకే గర్వంగా విరాజిల్లుతున్నావు
    నీ శాసనయుగం సాంతం సగర్వంగా వర్ధిల్లాలి!

 

                                                 ఆరు

    తెలుగురవ్వ :

 

    ఈ సమస్త సృష్టి - సకల ప్రకృతి సాంతం సత్యం - శివం - సుందరం.

 

    సమస్త ప్రాణిజాలం - లెక్కలేనన్ని జీవరాసుల్లో మానవుడు ఉత్తముడు - మహత్తముడు- మహిమాన్వితుడు. మానవుని మించిన మరో ప్రాణి ఈ విశ్వంలో, విశ్వాంత రాళంలో ఎక్కడా లేడు.

 

    మానవునికి మేధస్సు ఉన్నది. అదే అతని పాలిట వరం. అదే అతని పాలిటి శాపం! మానవుడు సృష్టించుకున్న అత్యంత ప్రధానములు 1. రాజకీయము  2. సంపద. ఇవి అగ్నివంటివి. మానవుని అదుపులో ఉన్నంతవరకు ఉపకరిస్తాయి. అదుపు తప్పుతే దహనం చేస్తాయి! ఇప్పుడు అవి అదుపు తప్పుతున్నాయి.

 

    మానవునికి మాత్రమే మనసుంది! అతనికి ప్రేమాభిమానాలు - ఆత్మీయత - అనురాగం - అనుబంధం - రాగద్వేషాలు - పట్టుదలలు - ప్రతీకారాలు - రోషకావేశాలు ఇత్యాదులున్నాయి. ఇవి రాజకీయ హద్దులకు - మతాల సరిహద్దులకు - కులాల కూటాలకు - ప్రాంతాల పరిమాణాలకు అతీతంగా మానవులందరికీ ఉన్నాయి.

 

    రాజకీయ హద్దులు లేకుంటే సమస్త విశ్వంలోని మానవాళి సాంతం ఒకటి - ఒక్కటే! కొందరు స్వప్రయోజనపరులు దేశం పేర - మతం పేర - ప్రాంతం పేర - కులం పేర - ఇజంపేర మనుషులను విడకొట్టి కట్టి పడేశారు. అవిలేకుంటే విశ్వ మానవునిది ఒకే కుటుంబం.

 

    "వసుధైక కుటుంబం!"

 

    ఇవి నా అభిప్రాయాలు - నా ఉహలు - నా స్వప్నాలు! మనిషికీ మనిషికీ మధ్య ఆత్మీయత ఉంది. ప్రేమ ఉంది. అభిమానం ఉంది. అనురాగం ఉంది. అనుబంధం ఉంది. కొన్ని స్వప్రయోజన వర్గాలు విషం చిలుకుతున్నాయి!

 

    ఆ స్వప్రయోజన వర్గాల మూలంగా ఒక మతాన్ని పేర్కొనవలసి వస్తున్నందుకు వ్యదగా ఉంది. బాధగా ఉంది అయితే వాస్తవాలు చెప్పడం విధి. చరిత్ర గతిని వివరించడం బాధ్యత. ఆ విధి - బాధ్యత నిర్వహించడానికే తప్ప నాకు మనిషి విషయంలో ప్రేమ తప్ప - ద్వేషం మచ్చుకయినా లేదని సవినయంగా మనవి చేస్తున్నాను. నా గుండెలోని ఈ బాధను గుర్తిస్తారని విశ్వసిస్తున్నాను.

 

    మీర్ ఉస్మాన్ అలీఖాన్ - హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్ - లెఫ్టినెంట్ జనరల్ - సిపహసాలార్ - అసఫ్జాహ్ ముజప్పరుల్ ముల్క్ వాల్ ముమాలిక్ - నిజాము ముల్క్ - నిజాముద్దౌలా - ఫతెహ్ జంగ్, జి.పి., ఎస్.ఐ., జిబిఇ సుల్తానుల్ ఉలూమ్ దుష్టుడు, దుర్మార్గుడు, దురాశాపరుడు, సమర్థుడు, రాజకీయ ప్రావీణ్యం, చాతుర్యంగలవాడు. పరిపాలనా సమర్థుడు. లోభి, స్వార్థపరుడు, సంకుచితుడు, మత దురహంకారి, స్వప్రయోజన పరుడు, మతాన్ని తన రాజకీయ స్వార్థానికి వాడుకున్న జన్మ జన్మాల బూజు.

 

    ఆసిఫ్జాహీవంశంలో మొదటివాడు ఇమ్రుద్దీన్ చివరివాడు ఉస్మాన్ తప్ప మిగిలిన అయిదుగురు అసమర్థులు, నిష్ప్రయోజకులు.

 

    ఖమ్రుద్దీన్ స్వార్థము - ద్రోహము అనే సామర్థ్యంతో సమస్త దక్షిణా పథపు సామ్రాజ్యం సాధించాడు.

 

    ఉస్మాన్ అదే స్వార్థము - ద్రోహంతో రాజ్యాన్ని, వంశాన్ని అంతమొందించాడు.

 

    తన రాజ్యాన్ని నిలపెట్టుకోవాలనే సాధారణ వాంఛకోసం మాత్రం కాక - ఒక జాతి వేషభాషలను, సాహిత్యసంస్కృతులను నిర్మూలించ పూనుకున్న ఉస్మాన్ మతాన్ని తన స్వార్థంకోసం, స్వప్రయోజనంకోసం వాడుకున్న రాక్షసుడు.

 

    ఈ రాక్షసత్వం పూర్తిగా అతని ఆలోచన అనుకోను. ఇంగ్లీషువారు దురాలోచనులు - దురాలోచనులు. తాము ఎప్పుడో ఒకసారి భారతదేశాన్ని వదులుకోవాలి. అలాంటి స్థితిలో భారతీయులను చిక్కుల్లో పెట్టాలి. అందుకు భారతదేశపు నడి బొడ్డున ఒక మతపిశాచ రాజ్యం నెలకొల్పదలుచుకున్నారు. తమ పథకం ఫలించడానికి ఉస్మాన్ను మించినవాడు దొరకలేదు.

 

    సామ్రాజ్య వాదుల సూత్రం; విభజించి పాలించడం. ఆ సూత్రాన్ని అనుసరించి ఉత్తరాన మహమ్మదలీ జిన్నాను - దక్షిణాన ఉస్మాన్ను ప్రతిష్టించారు ఆంగ్లేయ ముష్కరులు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.