Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


      

                     భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
                     భద్రా ఉత ప్రశస్తయః ||

                                           నాలుగవఅధ్యాయము
                                             మొదటి ఖండము
                                      తొలి తృచ : ఋషి - జమదగ్ని.

   
1.    ఏత అసృగ్రమిన్దవస్తిరః పవిత్ర మాశవః |
    విశ్వాన్యభి సౌభగా ||

   
    సోమము వంకరల పవిత్రము వైపు వడివడిగా సాగును. సకల సౌభాగ్యములు కలిగించు దిశగా సాగును.
   
2.    సోమము మహా బలప్రదాత. దురిత విధ్వంసి. మా పుత్రుల సుఖమునకు ధనములను, అశ్వములను స్వయముగా ఇచ్చుచున్నది.
   
3.    సోమము మాకు, మా గోవులకు స్థిరమగు అన్నమును, ధనమును ప్రసాదించును గాక. మా సుందర స్తుతులను ప్రత్యక్షముగ స్వీకరించును గాత.
   
                                         రెండవ తృచ : ఋషి - జమదగ్ని.
   
1.    మానవుడు యజ్ఞము చేయును. ప్రభువగు సోమము స్తుతులు అందుకొనును. ఆకసము నుండి కలశమునకు చేరుటకు దిగును.
   
2.    సోమమా! నీవు దేవతల పానయోగ్యమవు. అభిషుతవైనావు. మాకు శత్రువును జయించు నట్టియు, సర్వత్ర వ్యాపించునట్టియు నగు బలమును, వర్చస్సును ప్రసాదించుము.
   
3.    సోమమా! వందల గోవుల సాహితమును గోవులకు పుష్టి కలిగించు అశ్వసమూహ సహితమును అగు సంపదలను రక్షణల కొరకు మా వద్దకు పంపుము.
   
                                          మూడవ తృచ : ఋషి - కవి.
   
1.    మహా ద్యులోక స్థానములందున్న ధనమును ధరించిన కళ్యాణమూర్తి సోమమును సుకృత్యములచే అర్ధించుచున్నాము. "చారుం సుకృత్య యేమహే"
   
2.    సోమము మహా శత్రువులను కూల్చినది. ప్రశంసణీయ మహత్కార్యములు చేసినది. మదకారి. శత్రుపుర ధ్వంసి. అట్టి సోమము నుండి ధనము అర్ధించుచున్నాము.
   
3.    సుకృత సోమమా! నీవు ధనము వద్దకు చేర్చుదానవు. ప్రదీప్తవు. నిన్ను ద్యులోకము నుండి శ్యేనము అవలీలగా తీసికొని వచ్చును. "సువర్ణో అవ్యథీభరత్"
   
4.    ఇంకను కర్మ ద్రష్టము, అభీష్ట ప్రదాతయు, ఫలప్రదయునగు సోమము తనయొక్క మహా మహిమలను వ్యాపింపచేయును. "జ్యాయే మహిత్వమానశే"
   
5.    సోమము జలప్రేరకము. యజ్ఞ రక్షకము. సమస్త దేవతలకు సమభావమున చేరునది. దానిని మంచి రక్కల శ్యేనము దివినుండి తెచ్చును.
   
                                       నాలుగవ తృచ : ఋషి - కశ్యపుడు.
   
1.    సోమమా! నిన్ను నరులు శుద్ది చేయుదురు. మాకు అన్నము కలుగుటకు నీవు ధారగా పారుదువు. అన్న రూపములగు గోవులందు చేరుము.
   
2.    సోమమా! నీవు స్తుత్యవు. హరిత వర్ణపు. పాలలో కలసి పవిత్రమగు దానవు. జనులకు అన్నము, ధనము కలిగించుము.
   
3.    సోమమా! నీవు హవినిచ్చు వారితోటి దానవు. దీపించు దానవు. యజ్ఞముకొరకు పవిత్రమగు దానవు. హితకారివి. ఇంద్రుని స్థానమునకు చేరుము. 'ఇంద్రస్య యాహి నిష్క్రుతమ్"
   
                                                రెండవ ఖండము
                                      మొదటి తృచ : ఋషి - మేధాతిథి.

   
1.    అగ్ని కవి. గృహరక్షకుడు. యువకుడు. హవ్యవాహనుడు. జహ్వాస్యుడు.
    "అగ్నినాగ్నిః సమిధ్యతే" అగ్ని చేతనే అగ్ని ప్రజ్వరిల్లుచున్నాడు.
   
2.    అగ్నిదేవా! నీవు యజమాని హవిస్సులు దేవతలకు చేర్చువాడవు. అతడు నిన్ను ఆరాధించుచున్నాడు. అతనికి పరిపూర్ణ రక్షకుడవు అగుము. 'తస్యస్మ ప్రావితాభవ.'
   
3.    ఎవడు హవిష్మంతుడగునో, ఎవడు దేవయజనమునకు అగ్నిని దగ్గర నుండి అర్చించునో అట్టి వానికి అగ్నీ! సుఖములు కలిగించుము. "తస్మైపావకమృడయ".
   
                                  రెండవ తృచ : ఋషి - మధుచ్చందుడు.
   
1.    పవిత్ర బలముగల మిత్రుని ఆహ్వానించుచున్నాము. హింసకులను మ్రింగు వరుణుని ఆహ్వానించుచున్నాము. వారు ఉభయులు భూమికి జలమును పంపు కార్యమును సాధింతురు. "ధియం ఘృతాచీం సాధయంతా"
   
2.    మిత్రావరుణులు సత్యవర్దనులు. సత్యమునే తాకువారు. ఈ మహా క్రతువును సత్యఫల యుక్తను చేయుచున్నారు.
   
3.    మిత్రావరుణులు మేధావులు. ఉపకారకులు. నివాస ప్రదాతలు. వారు బలమును, కర్మమును పరిపుష్టము చేయుచున్నారు.
   
                                 మూడవ తృచ : ఋషి - మధుచ్చంధుడు.
   
1.    మరుద్గణములు నిత్య సంతోషులు. నిర్భయులు. ఇంద్రసహితులు. వారు ఎంతో సుందరముగా దర్శనము ఇచ్చుచున్నారు. "ఇంద్రేణ సంహిదృక్షసే"
   
2.    వర్షకాలము గడచిపోవును. అన్నము అందించవలసి ఉండును. అప్పుడు మరుత్తులు యజ్ఞనామము ధరింతురు. మరలక గర్భములు దాల్తురు. జలములకు ప్రేరణ కలిగింతురు.
   
    (పునర్గర్భత్వమేరిరే - మరల గర్భము దాల్చినారు. మబ్బులు నీరు నింపుకొనుట మరల మరల జరుగునది.)   
   
3.    మరుత్తులు దృఢ దుర్గములను నలువైపుల నుంచి బ్రద్దలు కొట్టగల వారు. వానిని దూర దూరములకు విసరివేయగల సమర్ధులు. ఇంద్రా! నీవు అట్టి మరుత్తుల సాయమున గుహలందుండిన గోవులను విడిపించినావు.
   
                                 నాలుగవ తృచ ప; ఋషి - భరద్వాజుడు.
   
1.    ఇంద్రాగ్నులు పూర్వము ఈ సమస్త విశ్వమును నిర్మించినారు. ఆ విషయమును ఋషులు వర్ణించినారు - 'తాహువే' - వారిని మేము ఆహ్వానించుచున్నాము. తమను స్తుతించు వైర్ని ఇంద్రాగ్నులు బాధించరు. "ఇంద్రాగనీ న మర్ధతః"
   
2.    ఉగ్రులు, శత్రునాశకులగు ఇంద్రాగ్నులను "వాహమహే" - ఆహ్వానించుచున్నాము. వారు ఈ సంగ్రామమున మమ్ము సుఖింప చేయుదురు గాత. "తానోమృడయత ఈద్రుశే"
   
3.    ఇంద్రాగ్నులారా! ఆర్యుల శత్రువులను హతమార్చండి. సత్పురుషులను రక్షించుటకు దుష్టులను హతమార్చండి. విశ్వము నందలి విద్వేషులను నాశనము చేయండి. "హథో విశ్వా అపద్విషః"
   
                                                  మూడవ ఖండము   
                                 మొదటి తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
   

1.    సోమము గమనశీలి. మనసును నియంత్రించునది. మదకరి. మదస్రావి. అది కలశము పై నున్న పవిత్ర స్థానమును చేరి మద్యమై, మధుర రసమై అన్ని దిశల నుండి వెడలుచున్నది. "పవన్తే మద్యం మదమ్"
   
2.    పవిత్రము చేయబడిన, దీప్యమాన, బృహత్ సత్యమగు సోమరాజము తరంగములుగ కలశమున చేరుచున్నది. బృహత్ ఋత సోమము మిత్రావరుణుల సేవకు గాను విశేషముగా విచ్చేయుచున్నది.
   
3.    నరులచే నియంత్రించబడినదియు, అభిలషణీయము, మహాద్రష్టయు, దీప్యమానము, అంతరిక్షమున ఉత్పన్నమైన సోమము ఇంద్రుని కొరకు అభిషుతమైనది.
   
                                 రెండవ తృచ : ఋషి - పరాశరుడు.
   
1.    యజమాని - తిస్రోవాచః - త్రివచనములను ఉచ్చరించును. యజ్ఞధారి సోమమును మంగళ వచనములతో స్తుతించును. ఆవులు ఆబోతు వైపు పోవునట్లు అంబారావములు చేయుచు పాలిచ్చుటకు సోమము వద్దకు వచ్చును. కోరికలు గల స్తోతలు స్తుతించుటకు చేరుదురు. "సోమం యన్తి మతయో వావశానాః"
   
    (త్రిస్రోవాచః ఋగ్యజుః సామాత్మికాః స్తుతిః అని సాయణ వ్యాఖ్య.)
   
2.    పాడియవులు సోమమును కోరుచుండును. విప్రులు సోమమును స్తుతించుచుందురు. అభిషుత సోమము శుద్దిచేయబడి పాత్రయందు చేరును. మేము ఉచ్చరించు త్రిష్టుప్ మంత్రములు సోమమును చేరును - "సోమే ఆర్కాస్త్రిష్టుభః సం సవన్తే"
   
3.    సోమమా! పరిషచ్యమానవై మాకు శుభములు కలిగించరమ్ము. ఎంతో మత్తునిచ్చు దానవై ఇంద్రుని హృదయమున చేరుము. వాక్కును వర్ధిల్ల చేయుము. జ్ఞానము కలిగించుము.
   
                                            నాలుగవ ఖండము
                                  మొదటి తృచ : ఋషి - పురుహన్మ.

   
1.    ఇంద్రదేవా! నూరు ద్యులోకములు నీకు సరిరావు. వంద భూములు సహితము నీయంత కాజాలవు. వేయి సూర్యులు సహితము నీ ప్రకాశమంత కాలేరు. వేయేల సృష్టిలో ఏదియు నీకు సరి కాహ్డు. ద్యావాపృథ్వులు కూడ నిన్ను అందుకొన జాలవు.
   
2.    వరదఇంద్రా! నీవు కోరిన ఫలములు ఇచ్చు వాడవు. నీవు మహా బలవంతుడవు కదా! మాకు బలములు కలిగించుము. మహాబలి, ధనవంత, వజ్రధారి ఇంద్రా! మా గోష్ఠములను గోవులతో నింపుము. వివిధ, విచిత్ర ఆయుధములతో మమ్ము రక్షింపుము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.