Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    రంతి దేవుడు తనకు ఉన్నది సాంతం ఇచ్చి - తనకు తిండిలేకున్నా సకల ప్రాణిజాలపు దుఃఖాలన్నీ తనకే కలిగించమనీ - ప్రాణిజాలం సాంతం సుఖంగా వర్థిల్లాలనీ ప్రార్థిస్తాడు. రంతి దేవుని ప్రార్థన మానవుల విషయంలో మాత్రం కాదు. చెట్టు, చేమ, పక్షులు, పశువులు అన్నింటికీ వర్తింప చేసి "అహం బ్రహ్మస్మి" నేనే బ్రహ్మను అన్న దశకు ఎదిగాడు.

 

    శిబి తనను శరణు కోరిన పావురం కోసం తన శరీరం మాంసం కోసి ఇచ్చి ప్రేమ పూర్ణుడు - త్యాగ ధనుడు - మహా మహిమాన్వితుడు అయినాడు.

 

    గౌతముడు, క్రీస్తు, ప్రేమవేదం ప్రవచించినారు.

 

    నేటి సమాజానికి లక్ష్యం లేదు. అది సరంగులేని ఓడవలె దిక్కు లేకున్నది. దీనికి భయము, విధేయత లేవు. ప్రేమ, అభిమానము లేవు. ఈ సమాజానికి ఉన్నవి దురాశ - డబ్బుమాత్రమే. ఈ రెండూ మానవుని మనసును తొలగించి రక్కసిగా మార్చాయి.

 

    రక్కసుల రాజ్యం కలకాలం కొనసాగడానికి వీళ్ళేదు!  

 

    మా పంతులు గారు ఉమామహేశ్వర రావుగారికి మిరపకాయలు ఎక్కువగా ఉన్న పులిహోర ఇష్టం. మా అమ్మ వేంకటమ్మగారు అన్నపూర్ణ. ఆమెకు పెట్టటంలో మహదానందం! గిన్నెనిండా పోపు మిరపకాయలు ఎక్కువగా ఉండే పులిహోర అదిమిపెట్టి - దానిమీద మోదుగాకుల విస్తరి మూతవేసి నా తలమీద పెట్టేది. నేను మోసుకొని పోయి పంతులుగారికి ఇచ్చేవాణ్ణి. ఆ పులిహోరను పంతులుగారు మెచ్చుకుంటునే ఉండేవాళ్లు.

 

    పిల్లలు ఎవరింట ఉన్నవి వారు - కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యం తెచ్చి ఇచ్చేవారు. ప్రతినెల పంతులు గారికి ఇచ్చేది పావలా. నెల అంటే ఒకటవ తేదీ కాదు. అమావాస్య.

 

    దసరా - విజయదశమిల - రాక పంతుళ్ళకు పిల్లలకు పెద్ద సంబరం. పిల్లలు మంచి బట్టలు వేసుకొని కాగితపు జండాలు పట్టుకుని 'జయీభవ విజయీభవ', 'దిగ్విజయీభవ' అని పంతులుగారి వెంట ఊరేగింపుగా వెళ్తారు. ప్రతి పిల్లవాడి ఇంటికి వెళ్తారు.

 

    "రేపురా, మాపురా మళ్లి రమ్మనక
    పావలా పరకయితె పట్టేది లేదు.
    అయ్యవారికి చాలు అయిదు వరహాలు
    పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు."

 

    అని దసరా పద్యాలు చదువుతారు. తరువాత ఆ పిల్లవాడితో ముఖ్యంగా పద్యాలు వగైరా చదివిస్తారు. ఇంటివాళ్లందరూ కూడి ఆనందం పంచుకుంటారు.

 

    అదంతా జరిగింతరువాత పంతులుగారిని - తమ తమ అంతస్తును బట్టి - బట్టలు వగైరాలతో సత్కరిస్తారు. పిల్లలకు పంచదార చిలకలు, బత్తీసాలు, నువ్వుండలు, పప్పు బెల్లాలు, ఒక్కొక్కరు ఒక్కొక్కతీరు పంచి పెడ్తారు.

 

    తతంగం ముగుస్తుంది. పిల్లలు మహదానందంతో "జయాభి జయీభవ - దిగ్విజయీభవ" అని ముక్త కంఠంగా నినాదం చేస్తూ బయల్దేరుతారు. అలా అందరి పిల్లల ఇండ్లకూ వెళ్తారు.

 

    మా ఇంటికి వచ్చినపుడు నేను బళ్లో చెప్పిన పద్యాలు మాత్రమే కాక ఇంట్లో నేర్చుకున్న శ్లోకాలు కూడా చదివేవాణ్ణి. పంతులువారి సహితంగా మా ఇంటి వాళ్లందరూ మురిసిపోయేవారు. మా అమ్మ నన్ను ఎత్తుకొని ముద్దాడేది. అది అవధుల్లేని ఆనందం.

 

    తల్లి ప్రేమను మించింది ఏ లోకంలోనూ లేదు.

 

    మా అమ్మ కష్టానికే పుట్టింది. 1960లో గార్లలో పరమపదించారు.

 

    మా నాయనగారు - తాతగారు మెచ్చుకునేవారు కారు. చిన్నలను పెద్దలు మెచ్చుకోరాదట. ఇందుకు సంబంధించిన మహాకవి - కిరాతార్జునీయ మహా కావ్య కర్తకు సంబంధించిన ఒక కథ ఉంది.

 

    భారవి మహాపండితుడయినా తండ్రి మెచ్చుకునేవాడు కాడు. భారవి కోపం పరాకాష్టకు వచ్చింది. అతడు తండ్రిని వధించడానికి సిద్ధం అయినాడు. "మన భారవి గొప్పదనం నాకంటె తెలిసినవాడు లేడు. పెద్దలు చిన్నలను మెచ్చుకొంటే చిన్నలకు ఆయుక్షీణం అవుతుంది. ప్రతిభ తగ్గుతుంది" అని తండ్రి తల్లితో చెప్పడం భారవి వింటాడు. తండ్రి కాళ్ళమీద పడ్తాడు. తనకు శిక్ష విధించమని మొండిపట్టు పడ్తాడు. గంజిపోసేవరకు అత్తవారింట్లో ఉండమని తండ్రి శిక్ష విధిస్తాడు.  

    

    అత్తవారింటి భారవి కథ రసవత్తరమయింది. కాని మనకు అప్రస్తుతం.  

 

    మా ఇంట్లో పిల్లలకు మాత్రం బత్తీసాలు దొరికేవి.ఉమామహేశ్వరరావు వారు మా తాతయ్యకు , నాయనమ్మకు పాదాభివందనం చేసేవారు. "ఆశీర్వచనం" చాలును అనేవారు. మా పితామహుల ఆశీస్సుల ముళ్ళెతో - అందరి ఇళ్లను మించి మురిసిపోతూ - పంతులుగారు మా ఇంటినుంచి బయటపడేవారు.

 

    మా తాతయ్య బహిర్భూమినుంచి వస్తూ, చెంబు బయట పెట్టి - సాయంకాలం కర్రతో బడిలో ప్రవేశించేవారు. ఉమామహేశ్వరరావు గారు సాదరంగా ఆహ్వానించేవారు. వారి స్థానం మా తాతగారికి ఇచ్చేవారు. వారికి అది పర్వం.

 

    మా తాతగారు కొన్ని విశేషాలు పంతులుగారికి మాకు మాంధాత మంచి నేటి వరకు అనేక కథలు చెప్పేవారు. ప్రతిరోజూ వచ్చేవారు కారు. అయినా తరచు వచ్చేవారు. నాతో పద్యాలు - శ్లోకాలు చదివించుకుని సంతోషించేవారు. మెచ్చుకునే వారు కాదు. మా పంతులు గారు మెచ్చుకుంటే వారించేవారు. అప్పుడే వారు భారవి కథ చెప్పారు.

 

    అలా ఒకసారి మా తాతగారు వచ్చారు. "రంగనికి బాల శిక్ష అయిపోయింది. మొదటి వాచకం కొనిపెట్టండి" అన్నారు ఉమామహేశ్వరరావుగారు. మా నాయన మొదటి వాచకం కొనలేదు. మూడో వాచకం అడిగి తెచ్చారు. నేను ఎంతో సుళువుగా మూడోవాచకం పూర్తిచేశాను.

 

    ఒకనాటి ఉదయం బడికి వెళ్లాను. అంతా బోసి బోసిగా ఉంది. పిల్లలు వచ్చినవాళ్లు వచ్చినట్లు వెళ్లిపోతున్నారు - పంతులుగారు ఖిన్నులయి ఉన్నారు. పంతులమ్మ తలబాదుకొని ఏడుస్తున్నది. పంతులమ్మ చిలిపి కూతురు కనిపించలేదు. నేను వెళ్ళిపోలేదు. పంతులుగారి పక్కన కూర్చున్నాను. అలా కొంతసేపు మౌనంగా కూర్చున్నాను. పంతులుగారు దుఃఖాతిశయంలో ఉన్నారు. వారి చెంపలమీంచి కన్నీరు పారుతున్నది. కాని, వారి ఏడుపు వినిపించడం లేదు. మౌనంగా విలపిస్తున్నారు.

 

    నేను పంతులుగారిని చూస్తున్నాను. వారిలోని దుఃఖం క్రమంగా నాలో ప్రవేశిస్తున్నది. ఉండి, ఉండి బోరుమని ఏడ్చాను. అప్పుడు పంతులుగారు నా ఉనికి గమనించారు. వారు నన్ను లాక్కొని వారి వడిలో వేసుకున్నారు.

 

    "రంగడూ! లేచిపోయిందిరా" అని పెద్దగా ఏడిచారు.

 

    వారి ఏడుపు విని నేను బిత్తరపోయాను. నాకేమీ అర్థం కాలేదు. లేచి నుంచొని నా చొక్కాతో వారి కన్నీరు తుడిచాను. వారి దుఃఖ సముద్రపు కట్టలు తెగాయి. నన్ను కావలించుకుని, పెద్దగా ఏడ్చారు. లోన ఏడుస్తూండిన పంతులమ్మ లేచి వచ్చి పంతులుగారి మీదపడి ఏడ్వసాగింది.

 

    వారి ఏడుపులు దిగ్దిగంతాల ప్రతిధ్వనించాయి.

 

    కాని ఒక్క నరమానవుడు తొంగి చూడలేదు

 

    ఏమీ ఎరగనట్లే సూర్యుడు ఉదయించాడు.

 

    వీధిలో బండ్లు గంటల చప్పుడుతో బీటుకు పోతున్నాయి.

 

    మా అన్నయ్య వచ్చి వాకిట్లో నుంచున్నాడు. నన్ను రావలసిందని సైగ చేస్తున్నాడు. పంతులుగారు నన్ను పట్టుకున్నారు. వదలడం లేదు.

 

    మా అన్నయ్య మాటి మాటికీ రమ్మని పిలుస్తున్నాడు. చాల సేపటికి పంతులుగారు మా అన్నయ్యను చూచారు. చప్పున ఏడుపు మానారు. నన్ను వదిలారు. పంచెతో కన్నీరు తుడుచుకున్నారు.

 

    నేను అయోమయంలో పడ్డాను. వెళ్ళాలా? వద్దా?

 

    అన్నయ్య పిలుస్తున్నాడు. పంతులుగారికి పాదాభివందనం చేశాను. ఎందుకో పంతులుగారు మళ్ళీ కనిపించరు అనిపించింది. బయటపడ్డాను. అన్నయ్య భుజంమీద చేయివేసి నడిపించాడు.

 

    "అన్నయ్యా! లేచిపోవటం అంటే ఏమిటి? రెక్కలొస్తాయా?"

 

    "నాకూ తెలియదు. నాయన నిన్ను తీసుకు రమ్మన్నారు. నడువు ఇంటికి" అన్నాడు.

 

    ఇల్లు చేరుకున్నాం. మా నాయన నిప్పులు చెరుగుతున్నారు. నన్ను చూసి మరీ మండిపడ్డారు. ఆరోజు నా వీపు బద్దలయ్యేదే. కాని, నన్ను వారు ముట్టుకోరాదు.

 

    "వెర్మాః కొడకా! బట్టలు విడిచి స్నానం చేయి" అన్నారు.

 

    "లేచిపోయింది అంటే ఏమిటి? లెక్కలొస్తాయా?" ఈ ప్రశ్న ఎందుకో ఇంట్లో ఎవరినీ అడిగే ధైర్యం లేకపోయింది. సింగరమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళాను. ఆమె అద్దం ముందు కూర్చుంది. తల దువ్వుకుంటున్నది. నేను ఆమె పక్కన కూర్చున్నాను. అద్దంలో కనిపిస్తున్నాను. అయినా మాట్లాడలేదు. నేనే అడిగాను.

 

    "అత్తయ్యా! లేచిపోయింది అంటే ఏమిటి? రెక్కలొస్తాయా?"

 

    అత్తయ్యలో చెప్పరాని ఆవేశం వచ్చింది. "నా పిచ్చి నాయన! వెర్రినాయన! ముద్దు నాయనా!" అని ముద్దులు కురిపించింది కాని అదేమిటో చెప్పలేదు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.