Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
రెండవ తృచ : ఋషి - ప్రస్కణ్వుడు.
1. ఇంద్రుడు సుసంపన్నుడు. ధనవంతుడు. స్తోతల మగు మాకు వేలకొలది ధనములు ప్రసాదించును. మా వలె మీరును ఎరుగండి. సురాధసం ఇంద్రమర్చ - సుందర ధనవంతుడగు ఇంద్రుని అర్చించండి.
2. యోధ విజిగీషువై శతానీకము మీదకు దండెత్తినట్లు ఇంద్రుడు యజమానియొక్క యజ్ఞ విఘ్నకార శత్రువుల మీద దండెత్తును. వారిని వధించును. బహుధనశాలి యగు ఇంద్రుని వద్ద యజమానులకు ఇచ్చు ధనము కొండల మీది నీటివలె తరుగకుండును.
మూడవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. వజ్రధారి ఇంద్రా! మేము హవి అర్పించువారలము తొలినాడే నీకు సోమము అర్పించినాము. ఇచట నా స్తుతులను ఆకర్షించుము. నీ ఇంటికి వెళ్ళుము. "స్వసరమాగహి"
2. ఇంద్రా! నీ శిరస్త్రాణము సుందరము. నీవు హర్యశ్వుడవు. స్తోతవ్యుడవు. నిన్ను సేవించు వారు వచ్చినారు. ప్రశంసనీయ సోమము అభిషుతమైనంత సేవింపుము. సంతృప్తుడవగుము. మాకు నీ వంటి ధనములభించును గాత.
అయిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - అమహీయుడు.
1. సోమమా! నిన్ను దేవతలు ఆశింతురు. నీవు రక్షస నాశకమవు. మాదకరసమవు. పానయోగ్యమవై పాత్రలందు ప్రవేశించుము. "పవస్వాన్దసా"
2. సోమమా! నీవు శత్రువగు వృత్రుని వధించినావు. నిత్యము యుద్దమున చేరుదువు. నిత్యము గోవులను ఇచ్చుచున్నావు. అశ్వములను ఇచ్చుచున్నావు. "దివే దివే గోషాతిరశ్వసా అసి"
3. సోమమా! నీవు చక్కని ఆవుల పాలతో కలుపబడినావు. గరుడుని వలె నీ స్థానమునకు చేరుము. వెలుగొందుము - "అరుషోభవ"
రెండవ తృచ : ఋషి - అమహేయుడు.
1. సోమము సర్వపోషక. ఆరాధనీయ ధనహేతువు. ఇది పరిశుద్దమై కలశమున చేరుచున్నది. పతిర్విశ్వస్య భూమనో - సర్వలోకములను పోషించు సోమము ద్యావాపృథ్వులను తన తేజమున వెలిగించుచున్నది.
2. సోమము ప్రియతమము. గాయకులూ పోటీలు పడి దాని మాదకమును స్తుతింతురు. శుద్దిచేయబడి, దీప్తములైన సోమములు తమ క్షరణ మార్గములను ఏర్పరచు కొనును. "సోమాసః కృష్వతే పథః"
3. సోమమా! నీ యొక్క రసము శక్తి దాయకము. పాలు కలుపదగిన ఆ రసమును మాకు అందించుము. పంచ జనులకు అందునట్టి నిన్ను ధనము కోరుచున్నాము.
మూడవ తృచ : ఋషి - భార్గవుడు.
1. సోమమా! నీవు నరులకు వృషవు. అధిక ద్రష్టవు. దినములను, ఉషస్సులను, ద్యులోక జలములను వర్ధిల్ల చేయుదానవు. నరులచే నుతించ బడుదానవు. నీవు ఇంద్రుని హృదిలో ప్రవేశించగోరి, శబ్దించుచు కలశమందు చేరుము.
2. సోమము సనాతన కవి. అధ్వర్యులు దానిని పవిత్రము చేయుదురు. నరులు దానిని నియంత్రింతురు. అది నలుదిశల నుండి కలశమున పడుచు ముల్లోకాములందు ఇంద్రుని జలములను సృష్టించును. మిత్రభావమున ఇంద్రుని కొరకు వాయువును పెంచి క్షరించును.
3. లోకకారక సోమము సంస్కరించబడుచు ఉషస్సును ప్రకాశవంతము చేసినది. నీటి నుండి సాగినది. సమృద్దమైనది. హృదయమునా చేరదలచినది. ఇరువది యొక్క గోవుల పాలు పిండుకొని, మదకరమై, రమణీయమై ప్రవాహించుచున్నది.
ఆరవ ఖండము
తొలి తృచ : ఋషి - అంగిరసుడు లేక శ్రుత కక్షి.
1. ఇంద్రా! నీవు శూరుడవు. శత్రుధమనుడవు. స్థిరుడవు. అందువలననే ఆరాధనీయుడవు.
2. మహాధనవంత ఇంద్రా! యజమానులు దేవతలకు హవి అర్పించినారు. వారికి నీవు ధనములు ప్రసాదించినావు. మాకు సహితము ధనమునిమ్ము. మమ్ము పాలించుము. "అధాచిదింద్ర నః సచా"
3. వాజావాంపతే - అన్నములకు స్వామివగు ఇంద్రా! తొందరపడు బ్రాహ్మణుని వంటివాడవు కాకుము. సోమము క్షీరమిశ్రితమై ఉన్నది. పూర్తిగా ఆనందించుము. "మత్స్యా సుతస్యగోమతః"
రెండవ తృచ : ఋషి - మధుచ్చందుడు.
1. ఇంద్రుడు సాగర విశాలుడు. రథికులకు రథికుడు. వాజానాంపతి. సత్పతి - మంచి సంరక్షకుడు. అతనిని మా సమస్త స్తుతులు వర్ధిల్లచేసినవి.
2. బలపతి ఇంద్రా! మేము నీ మిత్రులము. మేము అన్నవంతులము అగుదుము గాక. శత్రువులకు భయపడకుందుము గాక. మాకు అభయమునిమ్మని విజేతవు, అపరాజితుడ వగు నిన్ను ప్రార్దించుచున్నాము.
3. పూర్వీరిన్ద్రస్య రాతయః - ఇంద్రుని ధనములు పురాతనములు. యజమాని ఋత్విజులకు గోవులు, ధనము, అన్నము దక్షిణగా ఇచ్చును. అట్లయినను అతని విషయమున ఇంద్రుని రక్షణలు ఏ మాత్రము తగ్గవు. "న వి దస్యన్త్యూతయః"
దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన సామవేద
సంహిత ఉత్తరార్చిక యందలి.
మూడవఅధ్యాయము సమాప్తము.





