Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


       

                భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
                భద్రా ఉత ప్రశన్తయః ||

                                    మూడవ అధ్యాయము
                                     మొదటి ఖండము
                           మొదటి తృచ : ఋషి - జమదగ్ని.

   
1.    సోమమా! నీవు అగ్రిమవు "అగ్రియః". పూజనీయవు. రక్షణలు గల నీవు మా స్తుతులను అందుకొనుము. సమస్త స్తుతులు నిన్ను చేరునుగాత - "అభివిశ్వాని కావ్యా".
   
2.    సర్వ ద్రష్ట సోమమా! నీవు ప్రధాన వాక్కునకు ప్రేరణ కలిగించుచు అంతరిక్ష జలములందు ప్రవేశింపుము.

3.    విద్వాన్ సోమమా! నీ మహిమ వలననే ఈ భువనములు నిలిచి ఉన్నవి. ధేనువులు నీ కొరకే పరువు లిడుచున్నవి - "తుభ్యం ధావన్తి ధేవనః"
   
                                రెండవ తృచ : ఋషి - అమహీయుడు.
   
1.    అభిషుత సోమమా! నీవు కోరికలు తీర్చుదానవు. ధారగా పరుము. పవిత్రమగుము. మాకు జనులందు కీర్తి కలిగించుము - "కృధినో యశసే జనే". సమస్త శత్రువులను హతమార్చుము. "విశ్వా అపద్విషో జహి".
   

2.    సోమమా! ఈ యజ్ఞమున నీవు మాకు మిత్రమావు అయినావు. మేము అన్న తృప్తులము అయినాము. యుద్దము కోరువారిని త్రోసివేయుదుము గాత.
   
3.    సోమమా! భీమాన్యాయుధా - నీవు భయంకర ఆయుధములు కలదానవు. అవి పదునైనవి. శత్రునాశకములు. వానితో మమ్ము శత్రువుల నిందలనుండి కాపాడుము.
   
                                  మూడవ తృచ : ఋషి - కశ్యపుడు.
   
1.    సోమమా! నీవు కోరికలు తీర్చుదానవు. "వృషా దేవతలు "వృషవ్రతః" కోరికలు తీర్చు దీక్షగల వారు అగుదురు గాక. నీవు మానవులకు, దేవతలకు హితము కూర్చు దానవు.
   
2.    వృషన్! కోరికలు తీర్చుసోమమా! నీవు వర్షించుదానవు. నీ సేవ వర్షము కలిగించును. నీ అభిషవము వర్షము కలిగించును. వర్షించు నీవు వర్షవ్రతము కలదానవు. "సత్యం వృషన్స్యషేదసి"
   
3.    సోమమా! నీవు 'వృష' వు. అశ్వము వంటి శబ్దము చేయుదువు. మాకు గోవులను, అశ్వములను ఇచ్చెదవు. మా కొరకు ధనద్వారములను తెరువుము. "వినోరాయే దురో వృధి"
   
                               నాలుగవ తృచ : ఋషి - జమదగ్ని.
   
1.    సోమమా! నీవు నిశ్చయముగా 'వృష'వు. దేవతలు దర్శించ దగిన దానవు. తేజోవంతవు. నిన్ను యజ్ఞమునాకు ఆహ్వానించుచున్నాము.
   
2.    సోమమా! నీవు నరులచే శుద్దిచేయబడుదువు. జలమున చేర్చబడుదువు. ద్రోణ కలశమున చేరుదువు. చమసాది పాత్రలందు నిండుదువు.
   
3.    సోమమా! నీవుచేరు యజ్ఞమున యజ్ఞపరికరములు ఉన్నవి. ఆ యజ్ఞము నందు దేవతలకు ఆనందము కలిగించుము. మాకు పుత్రులను ప్రసాదించుము. మా యజ్ఞమునాకు శుభప్రదమగుచు విచ్చేయుము.
   
                                        అయిదవ తృచ : ఋషి - అమహీయుడు.
   
1.    దశాపవిత్రమున ఆర్ద్రవమగు సోమమా! నిన్ను మిత్రముగా వరించుచున్నాము. "సఖిత్వమా వృషీమహే"
   
2.    సోమమా! నీ తరంగములు ధారలుగా పవిత్రమున చేరుచున్నవి. ఆ తరంగములు మాకు సుఖములను ఇచ్చును గావుత - "తేభిర్నః సోమ మృడయ"
   
3.    "ఈశానః సోమ విశ్వతః" సోమమా! నీవు సమస్త విశ్వములకు ప్రభువువు. అభిషుతమవై పరిశుద్దవగుము. మమ్ము ధనవంతులను, పుత్రవంతులను, అన్నవంతులను చేయుము.
   
                                                రెండవ ఖండము
                                        మొదటి తృచ : ఋషి - మేధాతిథి.
   
1.    అగ్నిహోత. సమస్త సంపన్నుడు. యజ్ఞములందు శ్రేష్ఠ కర్మలవాడు. దూత. అట్టి అగ్నిని ఆరాధించుచున్నాము - "వృణీమహే".
   
2.    అగ్ని ప్రజాపాలకుడు. హవ్యవాహనుడు. దేవతలకు ఇష్టుడు. ఆహవనీయాది అనేక నామములవాడు. అతనిని ఆహ్వానమంత్రములతో సదా ఆహ్వానించుచున్నాము. "సదాహవన్త"
   
3.    అగ్నిదేవా! నీవు అరణులందు పుట్టినవాడవు. యజమాని దర్భలు కలవాడు. నీవు అతనిని అనుగ్రహించుము. దేవతలను ఆహ్వానించుము. నీవు హోతవు, స్తుతియోగ్యుడవు కదా!
   
                                    రెండవ తృచ : ఋషి - మేధాతిథి.
   
1.    మిత్రావరుణులు శుద్దబలయుతులు. యజ్ఞములందు ప్రత్యక్షమగు వారు. సోమపానము కొరకు వారిని మేము ఆహ్వానించుచున్నాము - "హవామహే"
   
2.    మిత్రావరుణులు సత్యవంతులు. సత్యవర్దనులు. వెలుగుల పాలకులు. వారిని ఆహ్వానించుచున్నాము - 'హువే'.
   
3.    వరుణుడు మాకు సకల రక్షకుడు అగును గాత. మిత్రుడు మాకు భద్రతర రక్షణలు కలిగించును గాత. వారిరువురు మమ్ము బహుధన యుక్తులను చేయుదురు గాత.    "కరతాం న స్సురా ధసః"
   
                                  మూడవ తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
   
1.    ఉద్గాతలు బృహత్సామమున ఇంద్రుని స్తుతించినారు. అర్కిణులు ఉక్దములతో స్తుతించినారు. అద్వర్యులు యజుస్సులతో స్తుతించినారు.
   
2.    ఇంద్రుడు వజ్రి సువర్ణ భూషణుడు. మాట మాత్రమున రథమునకు తగులు హర్యశ్వములు గలవాడు అగుచున్నాడు.
   
3.    ఇంద్రా! నీవు ఉగ్రుడవు. ఉగ్ర ఆయుధములు కలవాడవు. సహస్ర సంఖ్యాక సేనల యుద్దమున మమ్ము రక్షింపుము.
   
4.    ఇంద్రుడు నిరంతర దర్శనము కలిగించు సూర్యుని దివిలో నిలిపినాడు. ఆ సూర్యుడు తన కిరణములచే మేఘములకు ప్రేరణ కలిగించుచున్నాడు.
   
                                   నాలుగవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
   
1.    మేము రక్షణలు కోరువారలము. ఇంద్రునకు, అగ్నికి వర్ధమాన హవిస్సులు అర్పించుచున్నాము. స్తుతించుచున్నాము. స్తుతులను ఉచ్చరించుచున్నాము.
   
2.    విప్రులు ఆ ఇంద్రాగ్నులను తమ రక్షణ కొరకు ఎన్నో రీతుల స్తుతించుచున్నారు. ఎన్నో శ్రమలకు ఓర్చి అన్న ప్రాప్తికి గాను వారిని నుతించుచున్నారు.
   
3.    మేము స్తోతలము. హవియుక్తులము. ధనార్దులము. ఇంద్రాగ్నులారా! మిమ్ము స్తుతించుచున్నాము. యజ్ఞములకు గానములతో ఆహ్వానించుచున్నాము. "హవామహే"
   
                                            మూడవ ఖండము
                             మొదటి తృచ : ఋషి - వారుణి లేక భృగువు
   

1.    సోమమా! నీవు వృషవు. ధారగా పారుము. సర్వబాల సహితవై మరుద్వంత ఇంద్రునకు ఆనందము కలిగించుము.
   
2.    పవమాన సోమమా! నీవు ద్యావాపృథ్వులను భరించుదానవు. సర్వదర్శనీయవు. బలశాలివి. నిన్ను యుద్దములకు పంపుచున్నాను.
   
3.    సోమమా! నీవు నా అంగుళులతో శుద్దమైన దానవు. హరిత వర్ణవు. నిరంతరము ధారగా పారుము. మిత్రుడగు ఇంద్రుని యుద్దముల కంపుము. 'యుజంవాజేషు చోదయ'
   
                                    రెండవ తృచ : ఋషి - ఉపమన్యు.
   
1.    ఎర్రని ఆబోతు అరచుచు ఆవుల మీదికి ఉరుకునట్టి ధ్వని చేయు సోమమా! నీవు ద్యావాపృథ్వులను అందుకొనుచున్నావు. యుద్దములందు నీవు చేయు ఇంద్రుని వంటి గర్జన వినిపించుచున్నది. అమ్ధరను ఆనందపరచు ఈ స్తుతులు నిన్ను చేరును గాక.
   
2.    సోమమా! నీవు రుచిగల దానవు. పాలు కలిసినదానవు. మధురమవు. రసయుక్తవై అందుచున్నావు. పరిషిచ్యమానవై, పరిశుద్దవై, ధారగా పారి ఇంద్రుని చేరుకొనుము.
   
3.    సోమమా! నీవు మాదకమవు. వృత్రవధ వలన నీటిని గ్రహించిన మేఘమును వర్షింపచేయుము. మత్తు నిచ్చుటకు పాత్రలో పడుము. తెల్లని దానవై మాకు గోవులను ఇచ్చు నిమిత్తము చేరుకొనుము.
   
                                            నాలుగవ ఖండము   
                               మొదటి తృచ : ఋషి - భరద్వాజుడు.

   
1.    ఇంద్రదేవా! మేము స్తోతలము. మాకు అన్నము కలిగించుమని నిన్నే ఆహ్వానించుచున్నాము. 'హవామహే'. నీవు మంచి రక్షకుడవు. శత్రువులు గల అన్యులు సహితము నిన్ను ఆహ్వానింతురు. హువన్తే. యుద్దములకు కూడ నిన్ను పిలుతురు.
   
2.    ఇంద్రా! నీ పరాక్రమము విచిత్రము. నీచేత వజ్రము ఉన్నది. నీవు అరిభయంకరుడవు. మహా మహుడవు. మేము నిన్ను స్తుతించుచున్నాము. మాకు గోవులను, అశ్వములను రథములను ఇమ్ము. గెలిచిన వారికి ఇచ్చినట్లు మరిన్ని అశ్వములను ఇమ్ము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.