Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
రెండవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. ద్యులోక పుత్రి ఉష అంధకారములను అందమొందించుచు దర్శనమిచ్చినది. మహా తపస్సును తన కంటి చూపుతో కరగించు ఉష ప్రాణులకు ప్రేరణ కలిగించును. కాంతులు విరజిమ్మును.
2. సూర్యుడు తన కిరణములతో ఒకేసారి ప్రకాశించును. ఉదయించును. ఆకాశమునందలి నక్షత్రాదులకు కాంతిని ప్రసాదించును.
ఉషోదేవీ! నీ ప్రకాశము, సూర్యుని ప్రకాశము కలిగినంత మాకు అన్నము లభించుచున్నది.
మూడవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. అశ్వినులారా! స్వర్గమును ఆశించు జనులు, ఋత్విజులు మిమ్ము ఆహ్వానించుచున్నారు. ఖర్మధనులగు స్తోతలు కూడి వ్యాపకులగు మిమ్ము ఆహ్వానించుచున్నారు. మమ్ము రక్షించుడని మిమ్ము ఆహ్వానించుచున్నాను. స్తుతులు, స్తుతులు గల చోట్లకు తప్పక వెళ్ళండి. "విశం విశం హిగచ్చథః"
2. అశ్వినులారా! మీరు విచిత్ర అన్నవంతులు. విచిత్ర ధనవంతులు. వానిని మా స్తోతలమై నడిపించండి. అందుకొరకు ఏక మనస్కులై మీ రథమును మావైపు సాగించండి. మధుర సోమరస పానము చేయండి. "పిబతం సోమ్యం మధు".
అయిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - అవత్సరుడు.
1. సోమము పురాతనము. దీప్తము. శుక్రము. సహస్రఫలప్రద. ఋషి దానిని పానయోగ్యము చేసినాడు. కవి సోమమును సిద్దము చేసినాడు.
2. సోమము సూర్యుని వంటిది. సూర్యుని వలె సకల కర్మద్రష్ట యగును. సోమము ముప్పది రోజులకు లభించును. అది సప్త ధారలుగా స్వర్గమునకు చేరుచున్నది. "సప్త ప్రవత్ ఆదివమ్"
3. పవిత్రము చేయబడిన సోమము సూర్యుడు దివియందు వలె సకల భువనముల పైన విరాజిల్లుచున్నది.
రెండవ తృచ : ఋషి - శునశ్శేపుడు.
1. ఈ సోమము హరితము. దీప్తము. జన్మచేత సనాతనము. అది దేవతల కొరకు అభిషవించబడి దశా పవిత్రమున వెలుగుచున్నది. "పవిత్రే అర్షతి"
2. పురాతన, స్తోత్రయుక్త, దీప్త సోమము దేవతలకు కవి - మేధావి - అగుచున్నది. విప్రులచే వర్ధిల్ల చేయబడుచున్నది. "కవిర్విప్రేణ వావృధే"
3. సోమమా! నీవు ప్రాచీన రసమును పాత్రలందు నింపుచున్నావు. దశాపవిత్రమున బిందువులుగా రాలుచున్నావు. నీవు చేయు శబ్దమునకు దేవతలు నీ వద్దకు చేరుదురు.
(సోమము సంస్కరించబడు చోట దేవతలు ఉందురని.)
మూడవ తృచ : ఋషి - అసిత దేవలుడు.
1. సోమమా! మేము కోరిన వానిని మావద్దకు చేర్చుము. మా శత్రువులకు భయము కలిగించుము. శత్రువుల ధనమును మాకు అందించుము. "పవమాన విదారయిమ్".
2. సోమము మంచి జన్మకలది. జలముల ప్రేరణ కలది. శత్రువులను భంగపరచునది. గోక్షీరమున శుద్ది చేయబడినది. దానిని దేవతలు సేవింతురు.
3. నరులు దేవతలను పూజించ కోరుదురు. వారు పవమాన సోమస్తుతులను గానము చేయుదురు గాక. "ఉపాస్మై గాయతా నరః".
ఆరవ ఖండము
మొదటి తృచ : ఋషి - ఆప్త్యుడు లేక త్రితుడు.
1. మేధావులచే పెంచబడిన సోమములు - మృగములు అడవులందు వలె - జలములందు ప్రవేశించుచున్నవి.
2. బభ్రువర్ణ, శుక్రవర్ణ సోమములు అమృత ధారల వలె ద్రోణ కలశమున - గోవులు అన్నము అందించిన రీతి క్షరించుచున్నవి. "వాజం గోమన్తమా క్షరన్".
3. అభిషుత సోమము ఇంద్రాయ వాయవే మరుద్బ్యః విష్ణవే క్షరించును గాత.
రెండవ తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
1. సోమమా! నీవు దేవతల పానమవు. సముద్రము వలె నీటితో నిండుము. నీవు మాదకమవు. అప్రమత్తవు. తీవల తుంపలచే మధుర రసమును స్రవింప చేయుదువు. ద్రోణ కలశమున చేరుము 'అచ్చాకోశం'.
2. పుత్రుని వలె కోరదగినదియు, సంస్కారయోగ్యమునగు శ్వేతసోమము దర్శనీయమై అదిగో వ్యాపించుచున్నది. దీనిని అంగుళులు జలమునకు - శూరుడు రథమును యుద్దమునకు వలె - పంపుచున్నవి.
మూడవ తృచ : ఋషి - శ్వానాశ్వుడు.
1. సోమము ఆనంద సాగరము. అది అభిషుత మైనది. హవివంతులమగు మా యజ్ఞమునకు మాకు అన్నము, కీర్తి కలిగించుటకు - చేరుచున్నది.
2. హంస తన నడకచే జనుల మనములను ఆకర్షించినట్లు సోమము సమస్త స్తోతల మనసులను జయించును. ఆసోమమును - అశ్వమును వలె - నేతితో మెరిపింతురు.
3. ఈ సోమము హరితము. త్రితర్షి అంగుళులు "ఇంద్రాయ పీతయే" ఇంద్రుని పానము కొరకు శిలలచే మర్దించబడుచున్నవి.
నాలుగవ తృచ : ఋషి - అగ్ని.
1. సోమమా! నీవు దేవకామివి. ధారగా పడుము. తదుపరి శబ్దించుచు దశాపవిత్రము వైపు సాగుము. అప్పుడు నీ మాదకధారలు ఏర్పడును. "మధోర్దారా అసృక్షత"
2. సోమము హరితము. స్తోతలకు పుత్రులను కీర్తిని ప్రసాదించునది. అది సుందర వేగమున వంకరటింకర పవిత్రముల నుండి సాగి జల్లించబడును.
3. అభిషవించబడు సోమ శబ్దమును యజ్ఞ విఘ్నకారులు వినకుందురు గాత. స్తోతలారా! భ్రుగువులు దోషపూరిత యజ్ఞమును దూరము చేసినట్లు కర్మరహిత శునకమును దూరము చేయండి.
దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన సామవేద
సంహిత ఉత్తరార్చిక యందలి
రెండవ అధ్యాయము సమాప్తము.





