Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
భద్రోనో అగ్ని రాహుతో భద్రారాతిః సుభగ భద్రో అధ్వరః |
భద్రా ఉత ప్రశస్తయః ||
సామవేదం 1-1-10-5
రెండవ అధ్యాయము
మొదటి ఖండము
మొదటి తృచ : ఋషి - శ్రుత కక్షుడు.
1. ఇంద్రుడు సర్వ శత్రుహంత. శతక్రతువు. నరులకు అధిక ధనము నిచ్చువాడు. మాన్యుడు. ఋత్విజులారా! ఇంద్రుడు ప్రత్యక్షముగా సోమపానము చేసినాడు! అతనిని ఎన్నో ఎన్నో స్తుతులచే నుతించండి.
2. ఇంద్రుడు అనేకులచే ఆహ్వానించబడు వాడు. అనేకులచే స్తుతించబడువాడు. సనాతనుడు. జనులారా! ఇంద్రుని నామము జపించండి - 'ఇంద్రఇతిబ్రవీతన'
3. ఇంద్రుడు స్తుత్యుడు. అతడే ధనములకు స్వామి. మహానుడగు ఇంద్రుడు మాకు అన్నదాత అగును గాక. ఇంద్రుడు మా ముందుకు వచ్చి ధనాదులు అందించును గాత.
రెండవ తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. మిత్రులారా! హర్యశ్వుడు, సోమపాయి అగు ఇంద్రునకు ఆనందము కలుగునట్లు గానము చేయండి.
2. స్తోతలారా! మంచిదాత, గొప్ప ధనవంతుడగు ఇంద్రుని స్తుతిమ్చంది. ఇతరులు స్తుతింతురు. మేము కూడ స్తుతింతుము.
3. ఇంద్రా! నీవు మా కొరకు అన్నము కోరుము. శతక్రతూ! మా కొరకు గోవులు కోరుము. ధనిక ఇంద్రా! మా కొరకు స్వర్గము కోరుము.
మూడవ తృచ : ఋషి - మేధాతిథి లేక ప్రియమేధ.
1. ఇంద్రా! నిన్ను తమ వారిని చేసికొన దలచిన వారు ఏ ప్రయోజనము ఆశించి నిన్ను స్తుతించుచున్నారో కణ్వవంశజులమగు మేము అట్లే స్తుతించుచున్నాము.
2. ఇంద్రా! నీవు వజ్రధారివి. కర్మలకు అధిష్టాతవు. యజ్ఞములు నూతనములు అయినప్పటికి అన్యము ఎరుగము. నీ స్తోత్రములను మాత్రమే ఎరుగుదుము.
3. సోమాభిషవము చేయు యజమానిని దేవతలు రక్షింతురు. అతనికి కలలు కలిగించరు. అప్రమత్తుని చేయుదురు. ఆలస్యమెరుగని దేవతలు ఆ సోమమును స్వీకరింతురు.
నాలుగవ తృచ : ఋషి - శ్రుతి కక్షుడు,
1. సోమాభిలాషి ఇంద్రుని కొరకు సోమమును సంస్కరించుచున్నాము. స్తుతించుచున్నాము. సోమము స్తుతియోగ్య. ఇతర స్తోతలు కూడ స్తుతింతురు గాత.
2. ఇంద్రుని యందు సంస్థ కాంతులు అధికములు అగును. సప్తహోతలు హవి అర్పించుచు మంత్రములు ఉచ్చరింతురు. అట్టి ఇంద్రుని సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
3. దేవతలు జ్యోతిని, గోవులను, ఆయువును కలిగించుచున్నారు. స్వర్గమును తెలియపరచుచున్నారు. అట్టి దేవతలను గురించిన యజ్ఞమును వ్యాపింప చేయుచున్నాము. మా వాణిచే యజ్ఞమును వర్దిల్ల చేయుచున్నాము.
రెండవ ఖండము
మొదటి తృచ : ఋషి - ఇరిమిఠి.
1. ఇంద్రా! ఈ సోమము దశా పవిత్రమున సంస్కరించబడినది. నీ కొరకు దర్భాసనము మీద ఉంచబడినది. విచ్చేయుము. ఈ ద్రవమును పానము చేయుము. "ఏహీ మస్య ద్రవాపిబ"
2. ఇంద్రుడు సమర్ధుడు. అనేక పూజలు కలవాడవు. అతనికి సుఖము కలుగుటకు ఈ సోమము అభిషుతమైనది. శత్రుమానహర్తమగు ఇంద్రా! నీవు పిలువా బడుచున్నావు. "ప్రహూయసే"
3. ఇంద్రా! నీవు శృంగ ఋషి పుత్రుడవు. "కుణ్డసాయి" యజ్ఞము నిన్ను రక్షించునది అగును. ఋషులు ఆ యజ్ఞమందు తమ మనములను లగ్నము చేయుచున్నారు.
రెండవ తృచ : ఋషి - కుసీదుడు.
1. ఇంద్రా! నీ చేతులు పెద్దవి. ద్యుమంతము, చిత్రము, గ్రహణయోగ్యమగు ధనమును మా ముందు నిలిచి కుడిచేతితో అందించుము.
2. ఇంద్రా! నీవు బహు పరాక్రమ వంతుడవు. గొప్పదాతవు. భూరి ధనవంతుడవు. అనేక ఆయుధములు కలవాడవు. అట్లని మేము ఎరుంగుదుము.
3. భీకర మగు గోవును గడ్డి మేయుచున్నపుడు లొంగదీయరాదు. అట్లే శూరుడు, దానములు చేయదలచు ఇంద్రుని దేవతలు, మానవులు ఎవరును ఎదిరించజాలరు.
మూడవ తృచ : ఋషి - త్రిశోకుడు.
1. వరదా! ఇంద్రా! సోమము సంస్కరించబడినది. సోమ పానమునకు నిన్ను ఆహ్వానించుచున్నాము. తృప్తుడవగుము. మాదక సోమము నీలో వ్యాపించును గాక.
2. ఇంద్రా! మానవులు మూర్ఖులు. తమను పోషించుమని నిన్ను తిప్పలు పెట్టకుందురు గాక. నవ్వుల పాలు చేయకుందురు గాక. బ్రహ్మద్వేషులను భజించకుము. "మా కీం బ్రహ్మద్విషం వనః"
3. ఇంద్రా! ఈ యజ్ఞమున నీ కొరకు ఆవుపాలు కలసిన సోమము సిద్దము చేసినాము. మాకు ధనము కలిగించుటకు గాను నీవు దీనిని గౌరమృగము నీరు త్రాగినట్లు త్రావుము.
నాలుగవ తృచ : ఋషి - మేధాతిథి లేక ప్రియమేధ.
1. ఇంద్రా! నీవు వ్యాపకుడవు. భయరహితుడవు. ఈ సోమము అభిషుతము. నీకు అర్పించుచున్నాము. త్రావుము. కడుపు నింపుము. "పిబాసుపూర్ణముదరమ్".
2. ఈ సోమము ఋత్విజులచే శుద్దము చేయబడినది. రాళ్ళచే దంచి రసము తీయబడినది. దశాపవిత్రమున జల్లించబడినది. అశ్వమును వలె నీటితో కడుగబడినది.
3. ఈ సోమమును యవల పురోడాశము వలె ఆవు పాలతో కలిపినాము. రుచికరము చేసినాము. ఇంద్రా! ఈ సోమమునకు నిన్ను ఆహ్వానించుచున్నాము.
మూడవ ఖండము
మొదటి తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
1. ధనపతి, స్తుతిపతి, బలపతి ఇంద్రా! ఇది సంస్కరించ బడిన సోమము. దీనిని సేవింపుము. "పిబాత్వా2స్య".
2. ఇంద్రా! ఇదిగో ఇది నీ నిమిత్తమైన సోమము శుద్ది చేయబడినది. దీనిని నీ దేహమందు చేర్చుము. అది నీకు మత్తు కలిగించును గాత. "సత్వా మమత్తు".
3. ఇంద్రా! ఆ సోమము నీ ఉభయ పార్శ్వములందు వ్యాపించును గాక. స్తుతి సహిత సోమము నీ శీర్షమును చేరును గాక. ధనము కొరకు నీ బాహువులందు చేరును గాక.
రెండవ తృచ : ఋషి - మధుచ్చందుడు.
1. స్తోమ వాహులగు మిత్రులారా! ఈ కర్మమునకు త్వరగా రండి. కూర్చోండి. ఇంద్రుని గీతములు చక్కగా గానము చేయండి. "ఇంద్రమభి ప్రగాయత".
2. ఋత్విజులారా! సోమాభిషవ సమయమున సమూహ గానము చేయండి. శత్రు సంహారకుడు, బహుధనములకు ప్రభువైన ఇంద్రుని స్తుతించండి.
3. ఇంద్రుడు మా పురుషార్దములకు సిద్ది కలిగించును గాక. మాకు ధనము కలిగించును గాత. సద్భుద్ది కలిగించును గాక. దానయోగ్య అన్నములతో మాకు ప్రత్యక్షమగును గాక.
మూడవ తృచ : ఋషి - శునశ్శేపుడు.
1. మిత్రుల వంటి మేము కర్మ కర్మకు, సంగ్రామ సంగ్రామమునకు మమ్ము రక్షింపుమని ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.
2. ఇంద్రుడు పురాతనుడు. యజమానుల కొరకు స్వర్గము నుండి దిగి వచ్చువాడు. ఆ ఇంద్రుని పూర్వము మా పితరులు ఆహ్వానించినట్లే మేము ఆహ్వానించుచున్నాము.
3. ఇంద్రుడు మా ఆహ్వానమును ఆలకించవలెను. వేల రక్షణలతోను, అన్నములతోను మా వద్దకు విచ్చేయవలెను.
నాలుగవ తృచ : ఋషి - నారదుడు.
1. ఇంద్రా! నీవు అభిషుత సోమమును పానము చేయువాడవు. వర్దిల్లువాడు, దక్షుడు, విష్ణువు, కర్మకర్త యగు స్తోతను పావనము చేయుదువు. అట్టి నీవే ఆరాధనీయుడు.
2. ఇంద్రుడు అతిముఖ్యుడు. రక్షకుడు. స్వర్గమునందుండువాడు. వర్ధిల్లచేయువాడు. పనులను పూర్తి చేయించువాడు. ఎంతో అన్నవంతుడు. జలములను గెలిచినవాడు.
3. అట్టి బలశాలి ఇంద్రుని అన్నము, యజ్ఞము నిమిత్తము ఆహ్వానించుచున్నాను. ఇంద్రా! మాకు సుఖములు కలిగించుటకు మా వద్దకు విచ్చేయుము. అభ్యుదయము కలిగించుటకు మిత్రసముడవు అగుము.
నాలుగవ ఖండము
మొదటి తృచ : ఋషి - వసిష్ఠుడు.
1. అగ్ని బలపుత్రుడు ప్రియంకరుడు. చైతన్యము కలిగించువాడు. స్వామి. శ్రేష్ఠయజ్ఞవంతుడు. విశ్వదూత అమృతుడు. అట్టి అగ్నిని ఋత్విజమానుల కొరకు స్తుతించి ఆహ్వానించుచున్నాను.
2. దీపించు అగ్ని విశ్వపోషక అశ్వములను తన రథమునకు కూర్చును గాక. పిదప - అన్నవంతుడు, యజనయోగ్యుడు, స్వాహుతుడగు అగ్ని దేవతలను పిలుచుటకు పరిగెత్తును గాక. యజమానుల హవిస్సులు అగ్నిని చేరును గాత.





