Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha
2. స్వర్గనివాసియు, చక్కని దాతయు, బలసంపన్నుడును, అనేకులచే హవి అర్పించబడువాడగు ఇంద్రుని పిల్లల సందడి గలదియు, వందల వేల ధనముతో కూడినదియు, గోవులు కలదియునగు గృహమును యాచించుచున్నాము.
నాలుగవ తృచ : ఋషి - కలి.
1. ఇంద్రుడు జవనాశ్వముల వాడు. ధనదాత. ఋత్విజులారా! పిల్లలు తమ తండ్రిని పిలిచినట్లు మమ్ము రక్షించుమని శ్రమించి మీరు ఇంద్రుని మహా గానముల స్తుతించండి.
2. ఇంద్రుడు సుందర చుబుకము, నాసిక కలవాడు. అతనిని మహా అసురులు నివారించలేరు. దేవతలు నివారించలేరు. నరులు నివారించజాలరు.
ఇంద్రుడు సోమప్రియుడు. తనకు సోమము సమర్పించువారికి, తనను స్తుతించు వారికి అతడు, ధనదాత యగుచున్నాడు. మేము అట్టి ఇంద్రుని అర్ధించుచున్నాము.
అయిదవ ఖండము
మొదటి తృచ : ఋషి - వైశ్వామిత్ర మధుచ్చందుడు.
1. సోమమా! నీవు సంస్కరింపబడినదానవు. రుచికరమవు. ఆనందదాయినివి. 'ఇంద్రాయపాతవే" ఇంద్రుని పానమునకు క్షరితవగుము.
2. రాక్షసనాశని, విశ్వద్రష్టయగు సోమము సహస్థానమగు ద్రోణకలశమున నిలుచుచున్నది.
3. సోమమా! నీవు ధనమునిచ్చుదానవు. ఇతరములను ఇచ్చుదానవు. శత్రుహంతవు. "పర్షిరాధోమఘోవామ్"
ధనవంతులగు శత్రువుల ధనము మాకు ఇమ్ము.
రెండవ తృచ : ఋషి - గౌరివీతి.
1. సోమమా! నీవు మధుమత్తమవు. కర్మఫలప్రదవు. పూజనీయవు. దీప్తవు. ఆనందదాయినివి. ఇంద్రుని కొరకు మాదకమవై స్రవించుము.
2. సోమమా! వరదుడగు ఇంద్రుడు నిన్ను త్రాగును. వృషభసముడు అగును. నిన్ను త్రాగును. సర్వజ్ఞుడు అగును. నిన్ను త్రాగును. ప్రజ్ఞావంతుడగును. అశ్వము యుద్దభూమిని ఆక్రమించినట్లు ఇంద్రుడు శత్రువుల అన్నములను వశపరచుకొనును.
మూడవ తృచ : ఋషి - అగ్ని.
1. శీఘ్రముగ ఉత్పన్నమగునదియు, పాత్రలందు పడునదియు, సర్వజ్ఞయు, హరితవర్ణ, సంస్కరించబడిన సోమము ఇంద్రుని చేరును గాత.
2. సోమము సంగ్రామములందు సేవించదగినది. సంస్కరించబడినది. అది ఇంద్రుని కొరకు క్షరితమగుచున్నది. లోకములు సోమమును ఎరింగినట్లు అది ఇంద్రుని ఎరుంగును.
3. సోమపు ఆనందము కలిగినంత జనులు ధనుర్దారులగుదురు. అట్లే జలముల విజేత, వరదుడగు ఇంద్రుడు తన వజ్రమును ధరించుచున్నాడు.
నాలుగవ తృచ : ఋషి - శ్యావాశ్వుడు.
1. సోమము పురోజిత. గెలుపు తనముందు గలది. పానయోగ్య. సంస్కృత మాదకారి. మిత్రులారా! పొడవు నాలుక కుక్కను దానికి దూరముగా తరుమండి.
2. సంస్కరించబడినదియు, కర్మసాధకమును అగు సోమము పావక ధారగా గుర్రము వంటి వేగమున నలుదిశలకు ప్రవహించుచున్నది.
3. దాహము కలిగించని సోమము విషయమున ఋత్విజులారా! సకల కర్మలను సాధించగల మీ బుద్దితో యజ్ఞమున ఆదరము కనబరచండి.
అయిదవ తృచ : ఋషి - 'కవి'.
1. సోమము హితకారి భోజనము. జగత్తునకు తృప్తి కలిగించునది. ఏ జలములందు అది వర్ధిల్లునో ఆ జలములను పావనము చేయునది. తదుపరి మహా సూర్యుని సర్వత్ర సంచరించురథము మీద అందరకు దర్శనమిచ్చును అధిరోహించును.
2. సత్యజిహ్వము, శబ్దించునదియు, ప్రియమును గూర్చు, మదకారి యగు సోమము చుక్కలుగా రాలును. ఈ కార్యమును నిర్వహించు వానిని రాక్షసులు హింసించ జాలరు. బిడ్డకు నామకరణము చేయునపుడు తండ్రి ద్యులోకామును దీపింప చేయు సోమము పేరిట మూడవ పేరు పెట్టును.
(నక్షత్రనామము, వ్యవహార నామము కాక సోమయాజి అనునది మూడవ నామము.)
3. దీప్తిమంతులగు ఋత్విజులు సోమమును బంగారు కోశములందు చేర్తురు. తదుపరి అది ధ్వని చేయుచు ద్రోణ కలశమున పడును. తదుపరి వారు సోమమును స్తుతింతురు. యజ్ఞదినము లందు సోమము మూడు సవనములందును ప్రకాశించును.
ఆరవ ఖండము
మొదటి తృచ : ఋషి - తృణపాణి శంయుడు.
1. స్తోతలారా! యజ్ఞ యజ్ఞమున దక్షుడగు అగ్నిని మాటమాటలతో స్తుతించండి. మేము అమృతుడు, జాతవేది, మిత్రుడు అనుకూలుడగు అగ్నిని 'ప్రప్రశం సిషమ్' గొప్పగా ప్రశంసింతుము.
2. బలపుత్రుడగు అగ్నిని మేము కీర్తించుచున్నాము. అతడు సహితము మమ్ము గురించి ఆలోచించును. మేము హవ్యదాతయగు అగ్నికి హవిస్సులు అర్పించుచున్నాము. అగ్ని సంగ్రామము లందు మమ్ము రక్షించును గాక. మాకు వృద్ది కలిగించును గాత. మా సంతానమునాకు రక్షకుడు అగును గాత.
రెండవ తృచ : ఋషి - భరద్వాజుడు.
1. అగ్నిదేవా! విచ్చేయుము. నేను నీ కొరకు సుందర స్తుతులు ఉచ్చరించుచున్నాను. ఆలకింపుము. ఇతరుల స్తుతులను కూడా వినుము. "ఏభిర్వర్దసి ఇందుభిః" ఈ సోమములతో వర్ధిల్లుము.
2. నీవు అనుగ్రహించిన వానికి ఉత్తమ, బాలకార అన్నమును ఏర్పరతువు. చోటు సహితము చూపింతువు. "తత్రయోనిం కృణ్వసే".
3. అగ్నీ! నీ తేజస్సు మా నేత్రములకు హాని కలిగించకుండును గాత. నీవు నమస్కరించువారిని రక్షించు వాడవు. అందువలన మా సేనలను స్వీకరించుము.
మూడవ తృచ : ఋషి - సౌభరి.
1. ఇంద్రా! నీవు నవ్యుడవు. వజ్రివి. మేము నిన్ను సోమమున వర్ధిల్ల చేయుచున్నాము. పూజనీయుడవగు నిన్నే రక్షకునిగా వరించినాము. ఇంటిని అన్నముతో నింపు వానిని పిలిచినట్లు నిన్ను ఆహ్వానించుచున్నాము.
2. ఇంద్రదేవా! మా యజ్ఞములను రక్షించుమని నిన్ను శరణు వేడుచున్నాము. శత్రు తిరస్కర్త. తరుణ, ఉగ్ర ఇంద్రుడు మమ్ము చేరును గాత. మేము బంధువుల వలె సర్వరక్షకుడ వగు నిన్నే కదా ఆరాధించుచున్నాము.
నాలుగవ తృచ : ఋషి - నృమేధుడు.
1. స్తుతియోగ్య ఇంద్రా! మా కోరికలు తీర్చుమని ఇప్పుడే నిన్ను ప్రార్దించుచున్నాము. నీరు మోసుకుని పోవుచున్న వానిని వలె నిన్ను సమీపించుచున్నాము.
2. వజ్రధారి, శూర ఇంద్రా! నదులు సముద్రమును నింపినట్లు స్తోతలు మహా స్తుతులతో నీకు దినదినాభివృద్ధి కలిగింతురు.
3. ఇంద్రుడు గమనశీలుడు. అతనిది మహా రథము. మాట మాత్రమున హర్యశ్వములు రథమున తగులును. ఇంద్రుని స్వర్గమునకు వహించు హర్యశ్వములను స్తుతులు కీర్తించును.
దాశరథి రంగాచార్య విరచిత
శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత
ఉత్తరార్చిక యందలి మొదటి అధ్యాయము సమాప్తము.





