Home » Dr Dasaradhi Rangacharya » Sama Vedha


   

                  యస్య నిః శ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్|
                   నిర్మమే తమహం వన్దే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||

                                           ఉత్తరార్చిక
                                    మొదటి ప్రపాఠకము
                                   మొదటి అధ్యాయము
                                    మొదటి ఖండము

                    మొదటి తృచ : ఋషి-అసిత దేవలుడు.
   
1.    నరులారా! దేవతలకు అభిముఖులై యజించదలచిన వారలారా! ఈ పవమాన సోమమును స్తుతించండి.
   
2.    సోమమా! నీవు ప్రశంసనీయవు. అభిషుతమైన నీ రసమునందు ఇంద్రుని కొరకని ఋత్విజులు పాలు కలుపుచున్నారు.
   
3.    సోమమా! మా గోవులకు, పుత్రులకు, అశ్వములకు, ఓషధులకు సుఖములు కలిగించుచు స్రవించుము.
   
                                   రెండవ తృచ : ఋషి - కశ్యపుడు.
   

1.    సోమములు దీప్తములు, కాంతిమంతములు. నలువైపుల నుండి ధ్వనించుచు శుద్దములగు సోమములు ధారలుగ పడుచున్నవి. వానిలో ఆవుపాలు కలియుచున్నవి.
   
2.    సోమము బలవంతము. స్తోతలచే స్తుతించబడునది. హితకారి. యుద్దమును శూరులు ఆక్రమించినట్లు సోమము యజ్ఞమును ఆక్రమించును.
   
3.    సోమమా! కవీ! నీవు సూర్యుడవు. పైకి చేరుము. సంయుక్తుడవగుము. మాకు శుభములు కూర్చుచు దర్శనమిచ్చుచు అంతరిక్షము నుండి వర్షించుము.
   
                                    మూడవ తృచ : ఋషి-వైఖానసుడు.
   

1.    సోమమా! నీవు కవివి. అన్నవంతవు. అన్నము అందించగోరు నీ ధారలు దశా పవిత్రము నుండి - అశ్వశాల నుండి అశ్వములు వలె - వెడలుచున్నవి.
   
2.    సోమము మధుర రసయుక్తము. ఋత్విజులు దానిని ఉన్ని గల దశాపవిత్రము నుండి ద్రోణ కలశమునకు పంపుదురు. వారి అంగుళులు తేపతేప సోమమును శుద్దము చేయగోరును.
   
3.    బిందువులుగా రాలు సోమము - పాలిచ్చిన ఆవు గోశాఆకూ చేరినట్లు - దశా పవిత్రమునకు చేరును. అది సత్యయోని యగు యజ్ఞము వైపు సాగును.
   
                                             రెండవ ఖండము
                              మొదటి తృచ : ఋషి - భరద్వాజుడు.

   

1.    అగ్నిదేవా! మా స్తుతులు వినుము. చరు, పురోడాశాదులు ఆరగించుటకును, దేవతలకు హవి చేర్చు హవి చేర్చుటకును విచ్చేయుము. దేవతలను ఆహ్వానించుచు కుశాసనమున ఆసీనుడవు అగుము.        
   
2.    అంగిరస పుత్ర అగ్నీ! నిన్ను సమిధలతోను, నేతితోను ప్రజ్వరిల్ల చేయుచున్నాము. తరుణ తమ అగ్నీ! నీవు దీప్తుడవై వెలుగుము.
   
3.    అగ్ని దేవా! శ్రవణ యోగ్యమును, శౌర్య యుక్తమును అగు ఎంతో ధనమును మాకు అందించుము.
   
            రెండవ తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
   
1.    సుకృతులగు మిత్రావరుణులారా! మా గోశాలాల చుట్టు పాలు, నేయి పారించండి. శ్రేష్ఠ రసములతో పరలోక మార్గమును తడుపండి.   
   
2.    శుచివ్రత మిత్రావరుణులారా! మీరు స్తవనీయులు. హవిరూప అన్న వర్దకులు. మహాస్తుతి యుతులు. ధనము, బలము, మహత్వమున విరాజిల్లుచున్నారు.
   
3.    మిత్రావరుణులారా! మీరు జమదగ్నిచే ప్రజ్వలించబడిన అగ్నిచే స్తుతించబడువారు. దేవయజన స్థానమున విరాజిల్లండి. సోమపానము చేయండి.
   
                                         మూడవ తృచ : ఋషి - ఇరిమిఠి
   

1.    ఇంద్రదేవా! విచ్చేయుము. కుశాసనమున కూర్చుండుము. నీ కొరకు సోమము సిద్దము చేసినాము. పానము చేయుము.
   
2.    ఇంద్రా! మంత్రయుక్తములును, జాలు గలవియునగు హర్యశ్వములు నిన్ను ఇచటికి చేర్చునుగాత. బ్రహ్మాణివః శృణు మా స్తుతులను ఆలకించుము.
   
3.    ఇంద్రా! మేము బ్రాహ్మణులము. సోమవంతులము. సోమము సిద్దము చేసినాము. నీవు సోమపాయివి. నిన్ను స్తుతించుచున్నాము. హవామహే ఆహ్వానించుచున్నాము.
   
                                       నాలుగవ తృచ : ఋషి - విశ్వామిత్రుడు.
   
1.    ఇంద్రాగ్నులారా! సోమము సంస్కరించబడినది. మేము మంచి స్తుతులచే కీర్తించుచున్నాము. స్వర్గము నుండి విచ్చేయండి. మేము సమర్పించిన సోమమును పాతమ్-పానము చేయండి.
   
2.    ఇంద్రాగ్నులారా! మీరు స్తోతలకు స్వర్గము అందించువారు. యజ్ఞ సాధనమును, పుష్టికరమగు సోమము మీకు చెందును. మేము స్తుతించి మిమ్ము ఆహ్వానించుచున్నాము. విచ్చేయండి. 'పాతమిమంసుతం' ఈ సంస్కరించిన సోమమును సేవించండి.
   
3.    నేను స్తోతను. యజ్ఞసాధక సోమపు ప్రేరణ కలవాడను. స్తుతియోగ్యులు, ఫలప్రదులగు ఇంద్రాగ్నులను భజించుచున్నాను. 'తా సోమస్యేహ తృమ్పతామ్' వారు ఈ సోమమున తృప్తులు అగుదురుగాక.
   
            మూడవ ఖండము
              మొదటి తృచ : ఋషి - అమహీయుడు.
   
1.    సోమమా! నీ యొక్క రసముది శ్రేష్ఠ జన్మము. నీవు ద్యులోకపు బలవంతవు. నీవద్ద నున్న మహా సుఖవంత అన్నము భూమికి చేరుచున్నది.
   
2.    ధనము కలిగించు సోమమా! నీవు మేము పూజించు ఇంద్రుని కొరకు, వరుణుని కొరకు, మరుత్తుల పరిస్రవ చక్కగా స్రవించుము.
   
3.    సోమమా! నీవు అనుగ్రహించినావు. ఈ సమస్త ధనములు మాకు లభించినవి. మేము నీ ముందు నిలిచి సేవించుచున్నాము. 'వనామహే' ఉపాసించుచున్నాము.
   
                                  రెండవ తృచ : ఋషి - కశ్యపుడు.
   
1.    సోమమా! నీవు పవిత్రము చేయబడుదానవు. నీట నిలుచుదానవు. ధారగా పాత్రలో పడుదానవు. నీవు రత్నదాతవు. వెలుగులు చిమ్ముచు ప్రవహించుము. హిరణ్మయమగు ఋతయోనికి విచ్చేయుము.
   
2.    మధురము, ప్రియము, దివ్యమగు రసములను రాల్చు సోమము పురాతనమగు అంతరిక్షమునకు చేరుచున్నది. తదుపరి అన్నవంతులగు ఋత్విజులచే కడుగబడి, ద్రష్టయై, కర్మలు చేయు యజమానులకు అన్నము అందించుటకు దిగుచున్నది.
   
                                     మూడవ తృచ : ఋషి - ఉశనుడు.
   
1.    సోమమా! త్వరత్వరగా పరుగులిడి రమ్ము. వచ్చి ద్రోణ కలశమున నిలువుము. హోతలు నిన్ను శుద్ది చేయుదురు. నీవు హవి రూపము దాల్చుము. బలశాలియగు అశ్వమునకు స్నానము చేయించినట్లు బలశాలివగు నిన్ను శుద్దిచేసిన ఋత్విజులు తమ పొడవైన వ్రేళ్ళతో నిన్ను యజ్ఞస్థానమునకు చేర్చెదరు.
   
2.    సోమదేవత మంచి ఆయుధములు గలది. రాక్షస నాశక. ఉపద్రవహర్త. రక్షక పాలక 'దేవానాం జనితా' దేవతల జన్మకారక, సుదక్ష. మంచి బలము కలది ద్యులోకమును నిలువరించగలది. భూమిని ధరించగలది. అట్టి సోమము అవతరించుచున్నది.
   
3.    ఉశన ఋషి విప్రుడు. కర్మలందు అగ్రణి. జనులందు ప్రకాశమానుడు. అతడు గోవులందు దాగియున్న దుగ్ధములను స్తోత్రములచే సాధించినాడు.
   
                                           నాలుగవ ఖండము
                                    మొదటి తృచ : ఋషి - వసిష్ఠుడు.

   
1. శూర ఇంద్రా! పాలు పితుకని ధేనువులు దూడలను చూచి అంబారావము చేసినట్లు స్థావర జంగమములకు స్వామివి, సర్వజ్ఞుడవు అయిన నీకు "అభినోనుమః" ప్రణమిల్లుచున్నాము.
   
2.    మఘవ ఇంద్రా! నీకు సముడగు స్వర్గవాసి మరొకడు లేడు. నీకు సముడగు భూలోకవాసి మరొకడు లేడు. అట్టివాడు పుట్టలేదు. పుట్టబోడు.
   
                                రెండవ తృచ : ఋషి - వామదేవుడు.
   
1.    ఇంద్రుడు నిత్యవర్ధనుడు. విచిత్రుడు. మిత్రుడు అతడు ఏ తృప్తి కారక పదార్ధమునకు; ఏ ప్రజ్ఞాయుత వ్రతములకు మాకు ప్రత్యక్షమగును?
   
2.    ఇంద్రా! పూజనీయము, సత్యవంతము, ఆనందదాయకమగు పదార్ధము ఏది? సోమము దృఢము, సకల దిశల నుండి శత్రు ధనాపహారకము అగును. అది నీకు మత్తు కలిగించునుగాక.
   
3.    ఇంద్రా! మిత్రుడగు, స్తోతల రక్షకుడవగు నీవు వందల రక్షణల సహితుడవై మాకు ప్రత్యక్షమగుము.
   
                                       మూడవ తృచ : ఋషి - నోధ.
   
1.    ఇంద్రుడు  దర్శనీయుడు. శత్రుహంత. దుఃఖ నివారకుడు. ఋత్విజులారా! గోష్టమునందలి గోవులు దూడలను చూచి అరచినట్లు ఇంద్రుని "గీర్భిర్నవామహే" గీతములచే స్తుతించండి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.