Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
ఇరువది మూడవ సూక్తము - 115
1. నేను ప్రాచీన, మానవీయ స్తోత్రములచే ఇంద్రుని స్తుతించినాను. ఋత్విజులారా! ప్రాచీన మహా స్తుతులచే ఇంద్రుని అర్చించండి. మనసు స్తుతులందు ఉంచండి.
2. తొందర గల విప్రులు మధుమంత, ఘ్రుత శ్రుత స్తోత్రములను ప్రశంసించుచున్నారు. ఇతని ధనము పెరుగుచున్నది. బలము కలుగుచున్నది. ఇంద్రుని కొరకు సోమము అభిషుతమగుచున్నది.
ఇరువది నాలుగవ సూక్తము - 116
1. ఇంద్రా! నీవు శత్రుసంహారకుడవు. నరులు నిన్ను పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ ఏదిశ నుంచి పిలిచినను విచ్చేయుము.
2. ఇంద్రా! నీవు 'రుమ' 'రుశ్మ' 'శ్యావక' సహితుడవై ఉల్లాసవంతుడవు అగుచున్నావు. కణ్వ గోత్రజులు, స్తోమధారి ఋషులు నీకు హవి అందించుచున్నారు. రమ్ము.
ఇరువది అయిదవ సూక్తము - 117
1. పాలు పితుకని ధేనువును వలె మేము ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. ఇంద్రా! నీవు స్థావర, జంగమ జగత్తునకు ఈశ్వరుడవు. స్వర్గద్రష్టవు.
2. నీవంటి వాడు మానవులందును, దేవతలందునుపుట్టలేదు. పుట్టబోడు. ఇంద్రా! మేము గోమంత, అశ్వవంత, అన్నవంతులమగుటకు నిన్ను ఆహ్వానించుచున్నాము.
ఇరువది ఆరవ సూక్తము - 118
1. ఇంద్రుడు మా యజ్ఞమునకు వచ్చినంత మాకు యజ్ఞాన్నము, సాధారణ అన్నము, ధన ద్రవ్యములు కలుగునుగాక. ఇంద్ర సహితులమై హర్షింతుముగాక.
2. ఇంద్రా! స్తోతల కృపవలన నీ అనుగ్రహ పాత్రుడైనవాడు రథపు రెండు చక్రముల అక్షము వంటి వాడు అగుచున్నాడు.
3. ఇంద్రా! నిన్ను సేవించు వాడు నీ శక్తులు కలవాడై, స్తోతల వలన కోరికలు తీరినవాడై రథపు రెండు చక్రముల అక్షము వంటివాడు అగుచున్నాడు.
ఇరువది ఏడవ సూక్తము - 119
1. సూర్యుని దేవత్వము, మహత్త్వము ఏమనగా అతనిలో కిరణములు చేరగనే కార్యములు జరుగుచున్నవి. అప్పుడు పృథివి తనను ఆవరించిన అంధకారమును బట్టను వలె మడిచి పెట్టుచున్నది.
2. నేను మిత్రావరుణుల మహత్త్వమును వర్ణించుచున్నాను. ద్యులోకమున సూర్యుడు తన రూపమును వ్యక్త పరచుచున్నాడు. అతని దీప్తి అనంతము. వరుణునిధి కృష్ణ తేజమగుచున్నది.
ఇరువది ఎనిమిదవ సూక్తము - 120
1. వర్ధిల్ల చేయు మిత్రుడు ఏ రక్షణ శక్తిచే మమ్ము రక్షించుచున్నాడు? ఆ రక్షణ ఏ శక్తి వలన కలుగుచున్నది?
2. ఇంద్రా! మాదక సోమహవి యందలి ఏ అంశము నిన్ను ప్రసన్నుని చేయుచున్నది? ఏ విధముగ నీ భక్తులకు ధనము పంచి ఇచ్చుచున్నావు.
3. ఇంద్రా! మేము నీ మిత్రులమగు స్తోతలము. మమ్ము రక్షించుటకు వందలమారులు ప్రత్యక్షమగుచున్నావు.
4. ఈ యజ్ఞమునకు ఋత్విజులు, ఇంద్రుడు, సమస్త దేవతలు సిద్ది కలిగింతురుగాక. ఆదిత్య సహితుడగు ఇంద్రుడు మా యజ్ఞమును, తనువులను, ప్రజలను సమర్దులను చేయునుగాక.
5. ఏ దేవతలు దేవత్వమును రక్షించుటకు అసురులను వధించి దేవత్వమును అక్షయము చేసినారో అట్టి ఆదిత్య, మరుద్గణ సహిత ఇంద్రుడు మా తనువుల రక్షకుడు అగునుగాక.
6. దేవతలు సూర్యుని ప్రకాశవంతుని చేసినారు. భువి మీద అన్నమును ఏర్పరచినారు. ఆ మహిమ వలననే మాకు దేవహిత అన్నము లభించునుగాక. శూర సహితులమై శతశరత్తులు ఆనందింతుముగాక.
ఇరువది తొమ్మిదవ సూక్తము - 121
1. నీవు ప్రసాదించిన సుఖములు అనుభవించుటకు గాను తూర్పు, పడమర, ఉత్తర దక్షిణ దిశలందలి శత్రువులను ఇంద్రా! వధింపుము.
2. యవధాన్యమును యవలతో కలిపి కోసినట్లు అగ్నీ! కుశల మీద నీకు అర్పించిన హవిని భక్షించుము.
3. మాకు ఋతువును బట్టిన అన్నము, యుద్దము లందలి అన్నము లభించలేదు. కావున విద్వాంసుడగు ఇంద్రుని గోవులు, అశ్వములు, అన్నములు కోరుచు ప్రార్ధించుచున్నాము.
4. అశ్వినులారా! మీరు అలంకార దేవతలు. నముచితో అసుర యుద్దము జరిగినపుడు సోమపానము చేసి ఇంద్రునకు సాయపడండి.
5. అశ్వినులు, తల్లిదండ్రులు బిడ్డలను రక్షించినట్లు, చతురతతో ఇంద్రుని రక్షించినారు. ఇంద్రా! నీవు సోమపానము చేసినపుడు సరస్వతి నది నీకు స్నానము చేయించునుగాక.
6. ఇంద్రుడు ధనికుడు. రక్షకుడు అతడు మాకు సుఖములను ప్రసాదించునుగాక. శత్రువులను సంహరించునుగాక. అభయ ప్రదానము చేయునుగాక. వీరులకు అధిపతులము అగుదుముగాక.
7. రక్షకుడగు ఇంద్రుడు మా శత్రువులు దూరమునందుండగనే తరుమును గాక. వారిని చెల్లాచెదురు చేయునుగాక. యజ్ఞాభిమానులమగు మేము ఇంద్రుని సుమతులందు ఉందుముగాక. ఇంద్రుని కళ్యాణమయ అనుగ్రహమునందు ఉందుముగాక.
ముప్పదవ సూక్తము - 122
1. అభిషవకర్త కాని 'వృషాకపి' ఇంద్రుని దేవతగా అంగీకరించినాడు. 'పుష్పము'లకు స్వామియైన 'వృషాకపి' నాకు మిత్రుడగుచున్నాడు. అందువలన ఇంద్రుడు సర్వశ్రేష్ఠుడు అగుచున్నాడు.
2. ఇంద్రా! నీవు 'వృషాకపి' కన్న వేగముగ పరిగెత్తుచున్నావు. సోమపాన గోష్టిలో తప్ప నీవు ఇతరులతో కలవకున్నావు. ఇంద్రుడు సర్వశ్రేష్టుడు అగుచున్నాడు.
3. ఇంద్రా! నీవు ప్రభువులైన వారికి పుష్టి ప్రద ధనము ప్రసాదించిన తరువాత కూడ వృషాకపి నిన్ను హరిత మృగమును చేసినాడు? అందువలన ఇంద్రుడు సర్వశ్రేష్టుడు అగుచున్నాడు.
4. ఇంద్రా! నిన్ను రక్షించినాననుచున్న వృషాకపి కుక్క అప్పుడు మొరిగినదా? వరాహము చెవిరిక్కించినదా? అందువలన ఇంద్రుడు సర్వశ్రేష్ఠుడు అగుచున్నాడు.
5. కోతి మా వారలను వెక్కిరించినది. వ్యక్తి దూషితము చేసినాడు. నేను దీని శిరమును శబ్దము చేయించినాను. దుష్కృతము సుకృతము కాజాలదు. అందువలన ఇంద్రుడు సర్వశ్రేష్టుడు అగుచున్నాడు.
6. నాపత్ని 'సుఖసత్తార' కాకున్నది. 'సుయాశుతర'కాకున్నది. 'ప్రతిచ్యవసి' కాకున్నది. సక్థులను లేపునది కాకున్నది. అందువలన ఇంద్రుడు సర్వశ్రేష్ఠుడు అగుచున్నాడు.
7. ఉవసులభిక అవయవమా! ఉన్నట్లు ఉండుము. అంబా! నా కటి, నా సక్థి, నా శిరము పక్షి వలె ప్రసన్నములు అగుచున్నవి.
8. శూరపత్నీ! నీ బాహువులు, అంగుళులు సుందరములు, నీ నడుము సన్నము. జఘనము పెద్దది. నీవు వృషాకపి ముందు హతమార్చుచున్నావా? అందువలన ఇంద్రుడు సర్వశ్రేష్ఠుడు అగుచున్నాడు.
9. నన్ను దుర్భలనుగ భావించి నాతలకు హానితల పెట్టుచున్నాడు. కాని నాపతి మరుత్తులకు మిత్రుడు అగుచున్నాడు. అతడు సర్వశ్రేష్ఠుడు అగుచున్నాడు.
10. స్త్రీ తొలుత హోత్ర రూప యగుచున్నది. యాగమున పురుష సహితయై కూర్చొనుచున్నది. ఆ రీతిగ ఆమె యజ్ఞమును నిర్వహించుచున్నది. ఇంద్రపత్ని ప్రశంసింపబడుచున్నది. విశ్వస్మాదింద్ర ఉత్తరః ఇంద్రుడు విశ్వ శ్రేష్ఠుడు అగుచున్నాడు.
11. నేను ఇంద్ర పత్నిని సౌభాగ్యవతిగా భావించుచున్నాను. ఎట్లనగా ఈమెపతి వృద్దుడు కాకున్నాడు. మరణించకున్నాడు. "విశ్వ స్మాదింద్ర ఉత్తరః"
12. ఇంద్రుడు ఇంద్రాణితో అనుచున్నాడు.
వృషాకపితో తప్ప మరొకరితో హర్షించజాలను. ఏలయన అతని హవి జల పరిశుద్దము. అతడు నాకు దేవతలందు ఇష్టుడు. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
13. వృషాకపి పత్నీ! నీవు ధనవతివి. సుపుత్రవతివి. ఇంద్రుడు ఈమె అందించిన సోమము సేవించునుగాక. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
14. నాకున్న పదిహేను స్థానముల సహితముగ ఇరువదింట పచనము జరుగుచున్నది. నేను వానిని భక్షించుచున్నాను. నా కుక్షులు నిండియున్నవి. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
15. చక్కని కొమ్ముల వృషభాము మందలో శబ్దము చేయురీతి ఇంద్రా! నీవు ఎవని హృదయమున నిలుచుచున్నావో అతడు సుఖించుచున్నాడు. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
16. ఎవని'సక్థియల' నడుమ 'కపృత్' వ్రేలాడుచుండునో అతడు ధనవంతుడు కాకున్నాడు. కూర్చొనదలచు 'రోమశుడు' ఆవలించినచో సమర్ధుడు అగుచున్నాడు. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"
17. ఆసనము వేసి కూర్చున్న వాని రోమశము విజ్రుంభణ చేసినచో అతడు సమర్ధుడు కాకున్నాడు. సక్థియల నడుమ 'కపృత్' వ్రేలాడిన వాడు సమర్దుడగుచున్నాడు. 'విశ్వస్మాదింద్ర ఉత్తరః'
18. ఇంద్రా! ఈ వృషాకపి తాను పోగొట్టుకున్న ధనమును శత్రువునుండి సాధించినాడు. 'ఏధుని' కరవాలమును 'సూన' ఆచిత నవీన చరును పొందినాడు. 'విశ్వస్మాదింద్ర ఉత్తరః'
19. నేను కర్మ కర్తయగు ఆర్యుని అన్వేషించుచు ప్రకాశించుచు వచ్చుచున్నాను. అభిషుత సోమాంశమును పానము చేయుచున్నాను. 'విశ్వస్మాదింద్ర ఉత్తరః'
20. మరుస్థలపు వైశాల్యము, అంతరిక్షపు వైశాల్యము ఎంత? వృషాకపీ! నీవు దగ్గరి దారిన ఇంటి దగ్గరకు, ఇంటికి విచ్చేయుము. "విశ్వస్మాదింద్ర ఉత్తరః"





