Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
5. అతడు మహాబలశాలి. పెరుగుచున్న దాస శత్రువులకు భయంకరుడు అగుచున్నాడు. సమస్త విశ్వము అతనియందు లీనమగుచున్నది. ఉత్సవములందు జనులు అతనిని స్తుతించుచున్నారు.
6. ద్విజన్ములు యజ్ఞాదులు చేసి త్రిజన్ములు అగుచున్నారు. వారు యజ్ఞములందు నిన్ను దర్శించుచున్నారు. నీవు స్వాదును స్వాదుతరము చేయువాడవు. నీవు యోద్ధలందు మధురవై నిలిచి వారిని మధురతములను చేయుము.
7. నీవు రణరణమున ధనమును జయించువాడవు. నిన్ను బ్రాహ్మణులు స్తుతించుచున్నారు. వారియందు నీవు శక్తి రూపమున ప్రవేశించుము. సుఖములందును దుఃఖించువారు నిన్ను చేరకుందురుగాక.
8. మా కంటి ముందే నీచే శత్రు పక్షమును సంహరింపచేయుచున్నాము. మా మాటలచే నీ ఆయుధములకు ప్రేరణ కలిగించుచున్నాము. మా మంత్రములచే నీ బాణములను తీక్ష్ణము చేయుచున్నాము.
9. ఎవనిని సాధారణ, అసాధారణ ప్రజా ఆశ్రయించుచున్నదో, ఎవని ఇంట అన్నము కలుగుచున్నదో, అచటి కదలిక గల తల్లిని చేర్చండి. ఆమెకు చిత్ర, విచిత్ర పదార్ధములను అర్పించండి.
10. ఇంద్రుడు వర్షి. బహుమార్గవర్తి. సర్వ ప్రభువు. విశ్వ తేజస్వి. ఆప్తులకు ఆప్తుడు. పృథివికి ప్రతిరూపుడు. మహాబలశాలి. అతడు యజ్ఞమును దర్శించుచు యజ్ఞమున సంపన్నుడగుచున్నాడు.
11. ఇతడు స్వర్గకామి. స్వర్గాధిపతి. ఇంద్రుని స్తుతించుచు సుఖములు కలిగించుచున్నాడు. స్వర్గస్వామి, శీఘ్రతముడు, తపస్వియగు ఇంద్రుడు వర్షము కలిగించి భువిని జలపూర్ణను చేయుచున్నాడు.
12. తనను ఇంద్రునిగ భావించు, పరమ ప్రకాశవంత అథ్వర్యుడు ఇట్లన్నాడు.
పాపరహితులగు 'మాతరింభరి' భగినులు అతనిని ప్రసన్నుని చేయుచున్నారు. బలమును వర్ధిల్ల చేయుచున్నారు.
13. పూజ్యుడు, కిరణకేతనుడు, జ్యోతిష్మంతుడగు సూర్యుడు దిశలందు ఉదయించినాడు. అతడు దివాకరుడు, తమధ్వంసియై సమస్త దురితములను నివారించుచున్నాడు.
14. పూజ్యుడు, కిరణకేతనుడగు సూర్యుడు ఉదయించుచున్నాడు. అతడు మిత్ర, వరుణ, అగ్నులకు నేత్రము అగుచున్నాడు. అతడు సమస్త జగములకు ఆత్మయగుచున్నాడు. ద్యావాపృథివ్యంతరిక్షములందు నిండుచున్నాడు.
15. మగవాడు ఆడుదాని వెంట పడినట్లు సూర్యుడు ఉషస్సు వెంటపడుచున్నాడు. అప్పుడు జనులు దినములను దేవతలను ఆశ్రయించుచున్నారు. సూర్యుని కొరకని భద్రకార్యములు నిర్వర్తించుచున్నారు.
పన్నెండవ సూక్తము - 104
1. ద్రష్ట, శతక్రతు ఇంద్రా! మా యందు ధనమును, బలమును ప్రవేశపెట్టుము. శత్రు సేనను జయించగల వీర పుత్రుని ప్రసాదించుము.
2. శతక్రతో! నీవు నాకు తల్లివి, తండ్రివి, నివాసమవు అగుచున్నావు. కావున నిన్ను సుఖములు యాచించుచున్నాము.
3. పురుహూత, వాజయంత, శతక్రతువును ధనము, వీరపుత్రులను అర్ధించుచున్నాము.
పదమూడవ సూక్తము - 105
1. విషువతపు స్వాధు మధువును ఆస్వాదించిన స్తుతులు అనుచున్నవి.
అవి ఇంద్ర సహితలై రాత్రులందు రమించుచున్నవి. అందువలన యజమానులు స్వరాజ్యమును అనుభవించుచున్నారు.
2. పృశ్నయువ పృశ్నులు ఇతని కొరకు సోమము వండుచున్నారు. ఇంద్రుని ధేనువులు అతని సాయక, వజ్రములకు ప్రేరణ కలిగించుచున్నవి. తదుపరి యజమానులు స్వరాజ్యము ననుభవించుచున్నారు.
3. ప్రజ్ఞావాణి ఇంద్రుని హవిచే అర్చించుచున్నది. యజమాని పూజలు పూర్వచిత్త ఇంద్రుని యందు లీనమగుచున్నవి. తదుపరి యజమాని స్వరాజ్యమును అనుభవించుచున్నాడు.
పదునాలుగవ సూక్తము - 106
1. ఈ యజ్ఞమున మా వాణులు అభిషుహ సోమమును స్తుతించునుగాక. స్తోతలు పూజనీయ ఇంద్రుని యజింతురుగాక.
2. సప్త సభలు ఇంద్రుని ఆశ్రయించు ఉన్నవి. సోమాభిషవము అయినంత అట్టి ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.
3. త్రికద్రుకుల చేతన యజ్ఞము ప్రారంభమైనది. మా వాణి దానిని వర్ధిల్ల చేయునుగాక.
పదిహేనవ సూక్తము - 107
1. ఇంద్రా! విష్ణవి, త్రిత, ఆప్త్వ, మరుత్సంబంధ యజ్ఞములందు సోమము సేవించి ఆనందించుచున్నావు.
2. ఇంద్రా! నీవు దూరపు సంద్రమున గాని మా యజ్ఞమునగాని హర్షించు సోమము జలమిశ్రితము అగుచున్నది.
3. ఇంద్రా! నీవు సోమాభిషవ కర్తను వర్ధిల్లచేయుచున్నావు. ఉక్ద్వములందలి ఉత్సాహము కూడ సోమము నందే ఉంటున్నది.
పదహారవ సూక్తము - 108
1. మేఘములను తొలగించి ఉదయించు సూర్యా! సర్వము ఇంద్రుని వశమున ఉన్నది.
2. సత్పతి ఇంద్రా! నీవు ఒకడు మరణించరాదు అన్నప్పుడు అది నిజమగుచున్నది.
3. దూరమునగాని, దగ్గరగాని సోమము అభిషుతమైనంత నీవు అచట ప్రత్యక్షమగుచున్నావు.
పదిహేడవ సూక్తము - 109
1. ఉభయలోకములకు హితకరమగు మా మాట ఇంద్రుడు అభిముఖుడై వినును గాక.
సత్యాత్మక బుద్దిచే బలశాలి యగు ఇంద్రుడు సోమపానమునకు విచ్చేయుచున్నాడు.
2. స్వప్రభా భాసుడు, వరదుడగు ఇంద్రుని ద్యావాపృథ్వులు బలము కొరకని ప్రార్దించుచున్నవి. ఇంద్రా! నీవు ఉపమానములందు ప్రథముడవు అగుచున్నావు. నీ మనసు సోమమున నిలుచుచున్నది.
పద్దెనిమిదవ సూక్తము - 110
1. ఇంద్రా! నీవు శత్రురహితుడవు. 'అన'వు. 'అనాపి'వి. నీవు అవతరించినంతనే పూజనీయుడవైనావు. యుద్దమున నీవు 'అపిత్వము'ను కోరుచున్నావు.
2. ఇంద్రా! నీవు ధనవంతుల స్నేహము కోరుచున్నావు. 'సురాశ్వః' నీకు పుష్టి కలిగించుచున్నవి. నీవు పరివార సహితుడనై గర్జించునపుడు జనులు నిన్ను తండ్రిని వలె పిలుచుచున్నారు.
పందొమ్మిదవ సూక్తము - 111
1. నేను నా తండ్రి మేధస్సు గలవాడను అయినాను. నేను సూర్యుని వలె తేజరిల్లుచున్నాను.
2. నేను ప్రాచీన స్తోత్రములను కణ్వుని వలె అలంకరించుచున్నాను. నేను ఇంద్రునకు బలము కలిగించుచున్నాను.
3. ఇంద్రా! నిన్ను కొందరు ఋషులు స్తుతించి ఉండవచ్చును. కొందరు స్తుతించకుండవచ్చును. కాని నీవు నా స్తుతులు వినుము. వర్ధిల్లుము.
ఇరువదవ సూక్తము - 112
1. మేము నీతో యుద్దము చేయనందున దుష్టులము కారాదు. మమ్ము కార్చిచ్చు తగిలిన అరణ్యము వంటి వారినిగ భావించుము.
2. వృత్ర హంతా! మేము నీ వలన అవినాశ్యులము. నీ అనుగ్రహపాత్రులము అనుకొనుచున్నాము. నీకు ఒక్కమారు సోమము సమర్పించి మేము ఆనందభరితులము అగుదుముగాక.
ఇరువది ఒకటవ సూక్తము - 113
1. ఇంద్రా! రాళ్లచే పిండబడిన సోమమును సేవించి ఆనందించుము. ఈ రాళ్లు అభిషవము చేయువారి చేతులందు సిద్దముగ ఉన్న అశ్వము వలె - ఉండినది.
2. హర్యశ్వా! ఏది నీకు స్వాదువు. మాదకము అగుచున్నదో, దేనివలన నీవు ఆవరక మేఘమును విదీర్ణము చేయుచున్నావో అది నీకు హర్షదాయకము అగునుగాక.
3. ధనవంత ఇంద్రా! నా ఈ వాణిని నీవు శ్రద్దగా గ్రహించుము.
ఏ ప్రశస్తిని వసిష్ఠుడు పూజించుచున్నాడో ఆ మంత్ర పుంజమును నీవు యజ్ఞమున సేవింపుము.
ఇరువది రెండవ సూక్తము - 114
1. ఇంద్రా! నీ వలన మాకు రక్షణలు కలుగవలెననియు నీ వలన భాగ్యము, యశస్సు కలుగవలెననియు, వసువిదుడవగు నిన్ను అనుసరించునట్లు చేయుమని ప్రార్ధించుచున్నాము.
2. ఇంద్రా! నీవు ధనవర్దకుడవు. జనుల నేతవు. గోవర్ధనుడవు. ఉత్సదేవుడను హిరణ్యుడవు నీవు చేయు దానమును బాధలు అంటకున్నవి. నేను నిన్ను అర్ధించిన వానిని నాకు అందించుము.
3. దేవ యజ్ఞమునకు, ప్రయత యజ్ఞమునకు ఇంద్రుని పిలుచుచున్నాము. ఇంద్రుని సేవించు మేము యుద్దము కలిగినపుడు ధనప్రాప్తి కొరకు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.
4. ఇంద్రుడు తన మహిమచే ద్యావాపృథ్వులను విస్తృతపరచినాడు. ఇంద్రుడు సూర్యుని ప్రకాశవంతుని చేసినాడు. సకల భువనములు ఇంద్రునే ఆశ్రయించిఉన్నది. ఇంద్రుని కొరకే సోమము అభిషుతమగుచున్నది.





